దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు
శనివారం, ఆగమన కాల మొదటి వారము
యెషయా 30:19-21, 23-26; మత్తయి 9:35-10:1, 6-8
ధ్యానాంశము: క్రీస్తు కారుణ్య మూర్తి
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “మీరు ఉచితముగా పొందితిరి. ఉచితముగానే ఒసగుడు” (మత్తయి 10:8).
ధ్యానము: “గొఱ్ఱెల వలె చెదరియున్న జన సమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను” (మత్తయి 9:36). యేసు అన్ని పట్టణములను, గ్రామములను తిరిగి, ప్రార్ధనా మందిరములలో బోధించుచు, పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు, జనుల వ్యాధి బాధలనెల్ల పోగొట్టు చుండెను" (9:35). "ప్రభువు తన ప్రజల గాయములకు కట్టు కట్టును. వారి దెబ్బలను నయము చేయును" (యెషయా 30:26) అని ప్రవక్త ప్రవచనాలు క్రీస్తునందు నెరవేరాయి. క్రీస్తు కరుణామయుడు, దయామయుడు, కాపరి. శిష్యులను దేవునికి మనవి, ప్రార్ధన చేయమని కోరుతూ, అలాగే తన శిష్యులను ప్రజల మధ్యలోకి పంపుచు తన కరుణను వ్యక్త పరచారు.
దేవుడు సమస్తమును మనకు ఉచితముగా ఒసగును. ఆయన ఒసగువాడు, గొప్ప దాత. దేవుడు మనకు ఒసగిన వరములను ఇతరులతో పంచుకోవాలి. యేసు తన శిష్యులను వారు పొందిన దానిని ఇతరులకు ఒసగడానికి పంపుచున్నాడు. ఏమీ ఆశించకుండా దైవారాజ్యమును ప్రకటించాలి. "క్రీస్తు శిష్యులు విశ్వాసం కలిగి, దాన్ని జీవించడం మాత్రమేగాక దాన్ని ప్రకటించాలి. నిబ్బరతతో సాక్ష్యమివ్వాలి, వ్యాప్తి చేయాలి (సత్యోపదేశం, 1816).
యేసు ప్రేషిత కార్యములో మనం భాగస్థులం కావాలి. ఆయన కరుణను, దయను, ప్రేమను, క్షమాపణను ఇతరులకు పంచాలి. ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించాలి. రోగుల కొరకు ప్రార్ధన చేయాలి. వారికి వైద్య సహాయం అందించాలి. వారిలో మనోధైర్యాన్ని నింపాలి.
No comments:
Post a Comment