పునీత మదర్ థెరెసా (5 సెప్టెంబరు)
ఫా. ప్రవీణ్
గోపు OFM Cap.
అవుటపల్లి విచారణ
మాతృమూర్తి: “వినయం అన్ని సుగుణాలకు మాతృమూర్తి, సంరక్షకురాలు” అని పునీత అగస్తీను వారు చెప్పియున్నారు. దీనత్వము కలిగి ప్రవర్తించడం వినయం. వినయము గలవారు తమనుతాము తగ్గించుకొని అణుకువ కలిగి జీవిస్తారు. ఎప్పుడు తమ గొప్పను ఇతరుల యెదుట ప్రదర్శించాలని కోరుకోరు. గొప్ప వ్యక్తిత్వము గలవారు వినయం కలిగి జీవిస్తారు. వినయంగలవారు నిరాడంబరంగా జీవిస్తారు. ఇతరుల అభిప్రాయాలకు సముచిత స్థానాన్ని ఇస్తారు. వినమ్రులు గొప్ప ఆశయాలు కలిగి జీవిస్తారు. నిందకు, అవమానాలకు గురియైనా, వినయంగలవారు సమతుల్యాన్ని పాటించి ఆదర్శంగా జీవిస్తారు. ఇలాంటి విలువైన, గొప్పదైన వినయ సుగుణాన్ని తన జీవితంలో జీర్ణింప జేసుకొని జీవించి పేదసాదలను అక్కున చేర్చుకున్న అమృత వర్షిణి, దయార్ద్ర హృదయిణి, పునీత కలకత్తాపురి థెరెసాగారు. పునీత పేతురుగారి మాటలను గుర్తు చేసుకుందాం: ‘‘మీరు అందరును వినయము అను వస్త్రమును ధరింపవలెను. ఏయన, దేవుడు అహంకారులను ఎదిరించి, వినయశీలురను కటాక్షించును. శక్తివంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కండు. ముక్తిసమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును’’ (1 పేతు. 5:5-6).
సేవామూర్తి: థెరెసాగారి సేవాభావ జీవితాన్ని పరిశీలించుదాం. “దేవుని చేతిలో నేను ఒక చిన్న పెన్సిల్ లాంటి దానిని. మొద్దుబారి విరిగిన పెన్సిల్ నేను. కాని ఆయనే నన్ను తన సేవకు ఉపయోగించు కుంటాడు. తన అవసరం కొద్ది నన్ను పదును చేస్తాడు. అసలు నన్ను నడిపించేది, వ్రాసేది ఆయన హస్తమే. ఆయన చిత్తానికి తల దించుతాను. తన సేవలో నేను తరియించడమే నా భాగ్యం” అని పునీత థెరెసాగారు స్పష్టంగా చెప్పియున్నారు. యెషయ ప్రవక్త పలుకులను గుర్తుకు చేసుకుందాం: “ఇదిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాడ్యుని చేసితిని. ఇతడిని ఎన్నుకొంటిని. ఇతని వలన ప్రీతి చెందితిని. ఇతనిని నా ఆత్మతో నింపితిని” (యెషయ 42:1). ఈ సృష్టిలో మనిషి మహోన్నతుడు. స్వార్ధాన్ని త్యాగం చేసి, సేవాతత్పరతతో పరుల శ్రేయస్సు కోసం పరిశ్రమించినపుడు మనిషి మహోన్నతుడు అవుతాడు. జగాలు మారినా, యుగాలు గడచినా, నిస్వార్ధ సేవ అందరి నీరాజనాలు పొందుతుంది. సేవ చేయటంలో పొందు ఆనందం ఎంతో గొప్పది. అలుపెరుగక అందించే సేవలు ఆత్మతృప్తికి ఉత్తమ సాధనాలు. ఇతరుల మెప్పుకోసం లేదా ఆర్ధిక ప్రతిఫలం కోసం లేదా పేరు ప్రఖ్యాత కోసం ఒనర్చే సేవలు, స్వంత గొప్పలు చాటుకొనేందుకు స్వప్రయోజన సాధనాలు అవుతాయి. ఉత్తమమైన సేవలో పరమార్ధం ఉంటుంది. పరుల ప్రీతి కోసం గాక దేవుని ప్రసన్నత కోసం సేవలు చేయాలి. అటువంటి మంచి దృక్పధం కలిగి చరిత్రలో, ప్రజల గుండెల్లో జీవించిన స్త్రీ పునీత థెరెసాగారు.
ఈమె జీవించిన కాలం ప్రతిరోజును దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానంగా భావించి పేదలను, రోగులను, అనాధులను, పసిపిల్లలను ఆదరించి వారికి నిజమైన ప్రేమను, దయను, సేవను అందించిన గొప్ప తల్లి, ప్రేమమూర్తి, వినయమూర్తి, సేవామూర్తి పునీత థెరెసాగారు. మనంకూడా ఈమెవలె మన దైనందిన జీవితాల్లో ప్రేమ, దయ, సేవాభావంతో జీవిస్తూ, “మీలో గొప్ప వాడిగా ఉండదచిన వాడు, ముందుగా సేవకుడై ఉండవలయును” (మార్కు 10:43) అన్న క్రీస్తు పలుకులను పాటిస్తూ జీవించుదాం. తద్వారా, క్రీస్తు ప్రేమను, సేవను ఈలోకానికి అందించుదాం.
శాంతిదూత: పునీత థెరిస్సాగారు శాంతిదూతగా జీవించారు. తన జీవితము ద్వారా ఈలోకానికి గొప్ప సందేశాన్ని ఇచ్చియున్నారు. ఓసారి ఆమె ఇలా అన్నారు, ‘‘చీకటిని నిందించే బదులుగా ఓ క్రొవ్వొత్తిని వెలిగించు’’ అని. ఇదే ఆమె జీవితములో జీవితాంతం గుర్తుపెట్టుకొని ఆచరించారు. చీకటిలో బ్రతుకుతున్న జీవితాలకు, తన ప్రేమ, సేవ ద్వారా, వెలుగును నింపియున్నారు. ఇదే సందేశాన్ని ఈ నాటికి కూడా, ఆమె స్థాపించిన మఠకన్య సభద్వారా చాటి చెప్పుచున్నది.
ఈ ప్రయాణములో ఎన్నో ఇబ్బందులు, అవమానములు, తిస్కారములు, చీదరణలు, దూషణలు ఎదురయ్యాయి. అయిన వాటన్నింటిని ఆమె దేవుని సహాయముతో ధైర్యముగా ఎదుర్కొని యున్నది. “మత మార్పిడి” పేరుతో కొందరు ఆమెను నిందించారు. అందరూ మంచి మనుషులుగా, దేవుని బిడ్డలుగా సమాజములో గౌరవముగా జీవించాలని ఎల్లప్పుడూ ఆమె కోరుకున్నారు, దాని నిమిత్తమై ఎంతగానో కృషి చేసియున్నారు.
మనకు సందేశం: తల్లి తిరుసభకు కూడా గొప్ప సందేశాన్ని ఈ పునీతురాలు ఇచ్చియున్నారు. “నువ్వు, నేను కలిస్తేనే తిరుసభ! మన ప్రజలతో మనకున్నది పంచుకోవాలి. మనలో ఇచ్చేగుణం, పంచుకొనే గుణం లేకపోవడం వలననే ఈనాడు మనం చూస్తున్న కష్టాలకు కన్నీటికి కారణం”. ‘నీ జీవితములో ఇంత గొప్పగా సాధించడానికి కారణం ఏమిటి’ అని ఓ ఇంటర్వూలో అడిగినప్పుడు, “క్రీస్తు తనను తానుగా జీవముగల అప్పముగా మార్చుకొని మనకు జీవమును ఇచ్చియున్నారు. ఈ పరమ రహస్యాన్ని ప్రతీరోజు ఉదయం దివ్యపూజా బలితో ముగిస్తాము. ఇంతగొప్పగా దేవుని కార్యాలు చేయడానికి కారణం ప్రతీరోజు నాలుగు గంటలు ప్రార్థన చేయటం” అని ఆమె సమాధానము ఇచ్చియున్నది. దేవుడు నీకిచ్చిన గొప్పవరం ఏమిటి అని అడుగగా, ఆమె వెంటనే “పేద ప్రజలు” అని సమాధానం చెప్పియున్నది. వారి ద్వారా నేను 24 గం.లు యేసుతో ఉండే భాగ్యము పొందియున్నాను.
పునీతురాలు: 4 సెప్టెంబర్ 2016, ప్రపంచానికి, భారత దేశానికి, తిరుసభకు ఓ పర్వదినం. ఆ రోజు ‘అమ్మ’ థెరిస్సా, పునీత థెరిస్సాగా పోపు ఫాన్సిస్ వారు ప్రకటించి యున్నారు. ఆమె నిజంగా పునీతురాలు. పేదవారికోసం జీవించింది. సుఖదు:ఖాలతో రాజీపడుతూ జీవించే వారు. ప్రేమ బాటలో నడిచేవారు. ఎవరును ఇలాంటి మహోన్నత స్థాయిని పొందలేరు.
26 ఆగష్టు 1910వ సం.లో
అల్బీనియా, మాసిడోనియాలో
ఆగ్నేస్ జన్మించి ప్రపంచ వ్యాప్తముగా ‘మదర్‌థెరిస్సా’గా పిలువబడియున్నది. 1928వ సం.లో ఐర్లండు దేశములోని
లొరెటొ మఠకన్య సభలో చేరి మేరి థెరిస్సాగా పేరును మార్చు కొనియున్నది. 1929వ సం.లో
భారతదేశానికి వచ్చి 87
సం.లు సుదీర్ఘముగా తన సేవలను అందించి యున్నది. 7 అక్టోబర్ 1950వ సం.లో ‘మిషనరీస్ ఆఫ్
ఛారిటీ’, అను
నూతన మఠకన్య సభను స్థాపించియున్నది. ఇప్పుడు అది 133 దేశాలలో వ్యాపించి, వివిధ రకాలుగా
సేవలను అందిస్తూ, పునీత
మదర్ థెరిస్సా ఆశను సజీవముగా ఉంచుతున్నది!
No comments:
Post a Comment