ఓ గొప్ప మానవతావాది జ్ఞాపకార్ధం

 ఓ గొప్ప మానవతావాది జ్ఞాపకార్ధం


‘ఫాదర్ స్టాన్ స్వామి’గా ప్రసిద్ధి చెందిన భారతీయ ‘యేసు సభ’ పూజ్య గురువులు స్టానిస్లావుస్, గొప్ప మానవతావాదికి వీడ్కోలు! ఆయన మరణం ఎంతోమందిని బాధించింది. ఆయన పట్ల ప్రవర్తించిన తీరు అమానుషం, హేయం, సిగ్గుచేటు అని అనేక ప్రసార మాధ్యమాలలో చూసాం. చాలా మందికి ఆయన మరణం కేవలం ఒక వార్త మాత్రమే! చివరి తొమ్మిది నెలలలో ఆయన జీవితంలో జరిగిన విషయాలు త్వరలోనే కనుమరుగై పోతాయి!

‘ఫాదర్ స్టాన్ స్వామి’ అరెస్ట్ అయి వార్తల్లోకి వచ్చేవరకు ఆయన గురించి మనం పెద్దగా వినలేదు. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు పేదవారు, దళితులు, ఆదిమవాసులు, అణగద్రొక్కబడినవారి పక్షాన నిలబడి, వారి హక్కులకోసం (కార్మిక హక్కులు, భూహక్కులు) పోరాటం చేసాడు. వారి సంరక్షణ, అభివృద్ధి కొరకు కృషి చేసారు. న్యాయం కోసం పోరాడాడు. వారికోసం తన జీవితాన్నే త్యాగం చేసాడు. దీనినే ఆయన పిలుపులో దైవకార్యంగా భావించాడు.

“చట్ట వ్యతిరేక కలాపాలు” అను ‘ప్రాథమిక ఉగ్రవాద వ్యతిరేక చట్టం’ క్రింద ఆయనను అధికారం “నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సి” (NIA) ఝార్కండ్ రాజధాని రాంచి నందు తన నివాసములో ఉండగా ఆయనను అక్టోబర్ 2020లో అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన మరుసటి రోజే ఆయనను జైలులో ఉంచారు. చట్టవిరుద్ధమైన మావోయిస్టులతో కలిసి పనిచేస్తున్నారని, ఇంకా అనేక తప్పుడు కేసులు ఆయనపై మోపారు. ఆయన చేసిన ఆ “ఉగ్రవాద’ కలాపం ఏమిటి? పేదవారి కోసం నిలబడటం ఉగ్రవాద కార్యమా లేదా చట్ట వ్యతిరేకమా? ఈ చట్టం క్రింద అరెస్ట్ చేసి బెయిల్ కూడా రాకుండా నిరాకరించారు! ఆరోగ్య కారణం వలన బెయిల్ కోసం మనవి చేసుకున్నను అనేకసార్లు నిరాకరించారు. ఎంత అమానుషం! ఓ మానవతావాదికి ఇంత అవమానమా!

ఎంతో పెద్ద పెద్ద కుంభకోణాలు చేసేవారికి, బ్యాంకు మోసాలు చేసేవారికి, మీడియా దుర్వినియోగం చేసేవారికి, పన్ను ఎగవేత చేసేవారికి బెయిల్ లభించిన సందర్భాలు కోకొల్లలు!

ఆయన వయసు రీత్యా, రద్దీగానున్న జైలులో కరోన భయము వలన చేసుకున్న విన్నపాన్ని ప్రాసిక్యూషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. మహమ్మారి కరోన పరిస్థితిని అవకాశంగా తీసుకొన ప్రయత్నం చేయుచున్నాడని ప్రాసిక్యూషన్ ఆయనను నిందించింది. ఆరోగ్యం క్షీణించి పోయినను, చట్టం, న్యాయవ్యవస్థ ఆయనకు బెయిల్ మంజూరు చేయడాన్ని అడ్డుకుంది. అందుకే దేవుడు తన ప్రమేయముతో ఆయనకు శాశ్వతముగా విముక్తిని కలిగించారు!

మన రాజ్యాంగములో పొందుపరచ బడిన ప్రాథమిక మానవ హక్కులు, చివరకు జీవించే హక్కుకూడా ఆయనకు నిరాకరించ బడ్డాయి. పిలాతువలె, మన వ్యవస్థ చేతులు కడిగేసుకొని, “ఈ నీతిమంతుని రక్తము విషయమున నేను నిరపరాధిని” (మత్త. 27:24) అని చాటిచెప్పవచ్చు! ఆయన ఒక మంచి క్రైస్తవునిగా, “తండ్రీ, వీరిని క్షమించు. వీరు చేయుచున్నదేమో వీరికి తెలియదు” అని ప్రార్ధించవచ్చు! పిరికిమందలు క్షమించ బడుటకు ఎంతవరకు అర్హులు?!

‘ఫాదర్ స్టాన్ స్వామి’ పేదవారికి, అవసరతలలో ఉన్నవారికి సేవా కార్యక్రమాలు మాత్రమే చేస్తే, ఆయనను ఒక సాధువుగా, పునీతునిగా భావించేవారు. కాని, సేవతో పాటు ఆయన న్యాయంకోసం ప్రశ్నించాడు: “ఎందుకు ఈ ప్రజలు పేదవారిగా ఉంటున్నారు? వారు ఎలా చైతన్యవంతులై, విద్యావంతులై పేదరికము, దోపిడీ కోరలనుండి బయటపడ గలరు?” గిరిజన ప్రజల భూముల అక్రమ ఆక్రమణను ఆయన ప్రశ్నించారు. ఈ ప్రశ్నలు వ్యవస్థకు అసౌకర్యాన్ని, అభద్రతను కలిగించాయి. దీనికారణముగా, ఆయనను అడ్డు తొలగించడానికి కుట్రలు పన్ని, మావోయిస్ట్ అని ముద్రవేసి జైలులో పెట్టింది మన వ్యవస్థ. ఆయన సేవలు నగరములో కొనసాగితే, “అర్బన్ నక్సల్”, “దేశ ద్రోహి”, “టెర్రరిస్ట్” అని ముద్రవేసేవారేమో!

‘ఫాదర్ స్టాన్ స్వామి’ విషయములో మాత్రమే కాదు, ఇలాంటి వారి ఎందరి విషయములోనో మన వ్యవస్థ ఇలాగే వ్యవహరిస్తున్నది. ‘ఫాదర్ స్టాన్ స్వామి’లా ధైర్యముగా ప్రశ్నించి, పేదవారి పక్షాన నిలబడలేని మన ఆసక్తకు మనం సిగ్గుపడాలి!

84 సం.ల ‘ఫాదర్ స్టాన్ స్వామి’ 5 జూలై జ్యుడిషియల్ కస్టడిలో (తాలోజ సెంట్రల్ జైలు) ముంబైలోని ‘హోలీ ఫ్యామిలి’ ఆసుపత్రిలో తన తుదిశ్వాసను విడిచారు. తప్పుడు కేసుపెట్టి ఆయనను జైలులో పెట్టినందులకు దేశమంతటా, బయటా ప్రభుత్వముపై విమర్శలు వెలువెత్తాయి. సానుభూతి నిరసన ప్రదర్శనలు జరిగాయి.

ఆయన మరణం ఆసియా క్రైస్తవులకు ఓ సవాలు!

‘ఫాదర్ స్టాన్ స్వామి’ చివరి మాటలు: నాకు జరుగుచున్నది ప్రత్యేకైమైనది ఏమీ కాదు; నాకు ఒక్కడికే ఇలా జరగడం లేదు. దేశమంతటా ఇలానే జరుగుతుంది. విద్యావంతులు, లాయర్లు, రచయితలు, కవులు, ఉద్యమకారులు, స్టూడెంట్ నాయకులు ఎంత ప్రముఖులో మనమందరికి తెలుసు.  వారు కేవలం తమ అసమ్మతిని వ్యక్తపరస్తున్నారనే నెపముతో వారిని జైలులో పెడుతున్నారు. ఏదేమైనను, నేను నా జీవితాన్ని వెచ్చించడానికి నేను సిద్ధముగా ఉన్నాను.

(Source: international.la-croix.com, ucanews.com)



No comments:

Post a Comment