పోపు ఫ్రాన్సిస్
జనరల్ ఆడియన్స్
సాన్ దమాసొ కోర్ట్ యార్డ్
బుధవారం, 2 జూన్ 2021
ప్రార్ధన: యేసు మన ఆదర్శం
ప్రియ
సహోదరీ, సహోదరులారా! శుభోదయం!
యేసు-శిష్యుల
బాంధవ్యములో ప్రార్ధన ఎంతో ప్రాథమికమైనది సువార్తలు తెలియజేయు చున్నాయి. యేసు తన
పన్నిద్దరు శిష్యులను ఎంపిక చేసుకొనక ముందు రాత్రి అంతయు ప్రార్ధనలో గడిపెను. లూకా
సువార్తలో ఇలా చదువుచున్నాం: “ఆ రోజులలో యేసు ప్రార్ధన చేసికొనుటకై కొండకు
వెళ్ళెను. రాత్రి అంతయు దైవ ప్రార్ధనలో మునిగి యుండెను. ప్రాత:కాలమున తన శిష్యులను
పిలిచి, వారిలో పండ్రెండు మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తలులు అను పేరు పెట్టెను”
(6:12-13). యేసు రాత్రంతయు ప్రార్ధన చేసెను; తండ్రి దేవునితో సంభాషించెను. అపోస్తలుల
ఎన్నికలో, ప్రార్ధన తప్ప వేరే ప్రమాణం ఏదీ కనిపించుట లేదు. అపోస్తలుల జీవితం, ముఖ్యముగా,
ప్రభువు శ్రమల సమయములో వారు పారిపోవడం, యూదా ఇస్కారియోతు గురుద్రోహం... చూసినట్లయితే,
వారి ఎంపిక పరిపూర్ణమైనది కాదని అనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికిని, వారి పేర్లు
దేవుని ప్రణాళికలో లిఖింప బడినవి.
తన
అపోస్తలుల తరుపున యేసు ఎప్పుడుకూడా ప్రార్ధన చేసారు. వారివల్ల యేసు అనేకసార్లు
ఆందోళన చెందారు. అయితే ప్రార్ధన తరువాత, వారిని తండ్రినుండి స్వీకరించారు కనుక
వారి లోపాలలో, బలహీనతలలో కూడా వారిని తన హృదయానికి హత్తుకున్నారు. వీటన్నింటిలో,
యేసు ఒక గురువుగా, స్నేహితునిగా ఓపికగా వారి పరివర్తన కొరకు ఎదురుచూశారు. యేసు
ప్రేమ పేతురు విషయములో స్పష్టముగా చూడవచ్చు. కడరాభోజన సమయములో యేసు పేతురుతో, “సీమోను!
సీమోను! మిమ్ము గోధుమల వలె జల్లెడ పట్టుటకు సైతాను ఆశించెను. కాని నీ విశ్వాసము
చెదర కుండుటకు నేను నీకై ప్రార్ధించితిని. నీకు హృదయ పరివర్తన కలిగినపుడు, నీ
సోదరులను స్థిరపరపుము” (లూకా. 22:31-32) అని చెప్పెను. బలహీనతలోకూడా యేసు ప్రేమ
తరగదు. పాపం చేసినప్పుడు యేసు ప్రేమిస్తారా? అవును ప్రేమిస్తారు. ఘోరమైన పాపం
చేసినపుడు, అనేక పాపాలు చేసినపుడు యేసు ప్రేమిస్తారా? అవును ప్రేమిస్తారు. మనపై యేసు
ప్రేమ, మన కొరకు యేసు ప్రార్ధన ఎప్పటికీ ఆగిపోవు. మనం ఎల్లప్పుడూ ఆయన ప్రార్ధనలో
ఉంటాము. ఆయన మనకోసం తండ్రి వద్ద ఎప్పుడు ప్రార్ధన చేస్తూనే ఉంటారు. ఇది ఆయన
ప్రేమకు నిదర్శనం!
యేసు
ప్రార్ధన శిష్యులను విశ్వాసమునకు నడిపించును. “ఒక పర్యాయము యేసు ఒంటరిగా ప్రార్ధన
చేసికొను చుండగా, ఆయన శిష్యులు కూడ అచట ఉండిరి. అపుడు ఆయన వారిని ‘ప్రజలు నేను ఎవరినని
భావించుచున్నారు?’ అని అడిగెను. ‘బప్తిస్త యోహాను అని కొందరు; ఏలీయా అని
మరికొందరు; పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచి వచ్చెనని ఇంకను కొందరు అనుకొనుచున్నారు’
అని వారు సమాధానము ఇచ్చిరి. యేసు వారిని ‘మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు?’
అని తిరిగి ప్రశ్నించెను. అందుకు పేతురు ‘నీవు దేవుని క్రీస్తువు’ అని జవాబు
ఇచ్చెను. పిమ్మట యేసు వారిని ‘ఈ సంగతి ఎవరికిని తెలుపకుడు’ అని ఆజ్ఞాపించెను”
(లూకా. 9:18-21). యేసు తన ప్రేషిత కార్యములో ప్రతీ సంఘటనకు ముందు లోతైన, సుదీర్ఘ ప్రార్ధన
చేసారు. ప్రార్ధన వెలుగుకు, శక్తికి మూలం. కనుక, తీవ్రముగా ప్రార్ధించడం ఎంతైనా
అవసరం.
యెరూషలేములో
జరుగబోవు విషయములను అపోస్తలులకు వెల్లడి చేసిన తరువాత, యేసు దివ్యరూపధారణ చెందారు.
యేసు “పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని ఆయన ప్రార్ధన చేసికొనుటకై పర్వతము
పైకి వెళ్ళెను. ఆయన ప్రార్ధన చేసికొనుచుండగా యేసు ముఖరూపము మార్పు చెందెను. ఆయన
వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. అప్పుడు ఇరువురు పురుషులు ఆయనతో సంభాషించు
చుండిరి. వారు మోషే, ఏలీయా అనువారు. వారిద్దరు మహిమతో కనిపించి యేసు యెరూషలేములో
మరణింప వలసిన నిర్ణయమును గూర్చి [శ్రమలు] ఆయనతో మాట్లాడు చుండిరి” (లూకా.
9:28-31). ఈ అద్భుత సంఘటన, యేసు మహిమ ప్రదర్శన, ఆయన ప్రార్ధనలో, తండ్రి దేవునితో
సంభాషించు చుండగా జరిగెను. ఆ ప్రార్ధన నుండి ముగ్గురు శిష్యులకు స్పష్టమైన వాణి
విన్పించెను, “ఈయన నా కుమారుడు. నేను ఎన్నిక చేసికొనిన వాడు. ఈయనను ఆలకింపుడు”
(లూకా. 9:35). యేసును ఆలకించాలని ప్రార్ధననుండి ఆహ్వానం అందినది.
యేసు
మనలను ఎల్లప్పుడూ ప్రార్ధన చేయమని కోరడం మాత్రమేగాక, మన ప్రార్ధనలు ఫలించకపోయినను,
ఆయన ప్రార్ధనపై ఆధారపడవచ్చని అభయాన్ని ఇస్తున్నారు. యేసు మన కోసం
ప్రార్ధిస్తున్నారు అన్న సత్యాన్ని, వాస్తవాన్ని మనం గ్రహించాలి.
No comments:
Post a Comment