అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం

 అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం

పూజ్య గురువు ప్రవీణ్ గోపు OFM Cap.
STL (Biblical Theology), M.A. Psychology



అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవమును ఆగష్టు నెలలోని మొదటి ఆదివారం జరుపుకుంటాం. ఆ రోజు మన స్నేహితులకు శుభాకాంక్షలు తెల్పుతూ వారిపైనున్న మన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటాం. నేడు ప్రసార మాధ్యమాలద్వారా కృత్రిమమైన స్నేహితులు (virtual friends) ఎక్కువ! ఇలాంటి ‘వందమంది స్నేహితులకన్న, వంద సమస్యలను తీర్చే ఒక్క మిత్రుడు ఉండటం గొప్ప’ అని మనం తెలుసుకోవాలి. ‘స్నేహం’ అంటే ఇలా ఉండాలని నిర్దేశించలేము. అయినప్పటికిని, ఈ సందర్భముగా, స్నేహం గురించి కొంతవరకు తెలుసుకొని, మంచి స్నేహితులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం!

స్నేహం చూపులతో ఆరంభమగును. కాని, హృదయపు కన్నులతో చూచినప్పుడే, నిజమైన స్నేహం ప్రారంభమవుతుంది. ఎదుటివారి మనస్తత్వం, భావం, పద్ధతి, అనుకరణలపై మన స్నేహం బలపడుతుంది. ఎదుటివారిని, చిత్తశుద్ధితో మనస్పూర్తిగా అర్ధంచేసుకున్న క్షణాన నిజస్నేహానికి పునాది వేయబడుతుంది. మనం వారి భావార్ధాలను, కదలికలను గమనిస్తూ అర్ధంచేసుకోవాలి. స్నేహం, ఒక శారీరక ఆకర్షణ కాకూడదు. స్నేహం కన్నుల కలయిక, హృదయాల ముడివడినవై యుండాలి. స్నేహం, స్నేహితుల అభివృద్ధికి తోడ్పడునదిగా యుండవలయును. అదేక్షణాన, మనలను మనం అర్ధంచేసుకొనుటకు ప్రయత్నించాలి. స్నేహం, ఫలితాన్ని ఆశించేదిగాకుండా, ఇరువురు ఫలవంతులుగా, విజయీభవులుగా మారుటకు సహకరించేదిగా యుండాలి.

స్నేహం ఒక జీవితానుభవం. అది జీవితాంతం కొనసాగునదై యుండవలయును. నా ఉద్దేశ్యం ప్రకారం, ఒకవేళ, స్నేహితులు, ఏకారణం చేతనైనను, దూరమైనను మనం వారిని, వారి స్నేహాన్ని మరువరాదు. స్నేహితులు స్నేహితులే! శతృవులు స్నేహితులుగా మారవచ్చుగాని, స్నేహితులు శతృవులుగా మారుటకు అవకాశం కల్పించకూడదు. ఎందుకనగా, మన స్నేహం, నిజమైనచో, స్వచ్చమైనచో, దృఢమైనచో, స్నేహితులు ఏ హాని తలపెట్టినను, మనం వారిని ప్రేమిస్తూ, మన స్నేహాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా తీయనైన మధురానుభూతిగా మార్చ సిద్ధించాలి.

స్నేహం బలపడుతున్నపుడు, స్నేహితులు మనతో మాట్లాడాలని, మనతో గడపాలని, అనే భావన వేదిస్తూ ఉంటుంది. కోరిక, వేదన కాకుండా, మనం స్వార్ధపరులుగ ఉండక, మన స్నేహితుల స్నేహితులను కూడా గౌరవించాలి. ఇవి సాధారణముగా, అమ్మాయిలు స్నేహితులైనప్పుడు కలుగుతూ ఉంటుంది. ఈ సమయములో ఆశాభంగం, నిరాశ కలుగుతూ ఉంటుంది. ఈ సమయములోనే మన స్నేహం మన పరిసరాల కనుగుణముగా నుండునట్లు చూసుకోవాలి. కాని, పరిసరాలచేత పరిమితం కాకూడదు.

స్నేహం పవిత్రమైనది. ఎందుకన, మన స్నేహితులు మనకు పవిత్రులు. స్నేహములో అప్పుడప్పుడు స్వార్ధం తొంగిచూస్తూ ఉంటుంది. స్వార్ధముతో కూడిన స్నేహం కీడు, చెడులను తలపెడుతుంది. నిజస్నేహం మంచి ఆలోచనలతో, మంచి మనసు, హృదయాలతో, ధైర్యముతో కూడినది. ధైర్యముతోనే దృఢమైన స్నేహాన్ని నిలబెట్టుకొనగలము. మంచికార్యసిద్ధికి ధైర్యం, నిశ్చలత్వం ఎంతో అవసరం. మంచి ఆలోచనలతో స్నేహితుల అభిప్రాయాలు, రుచులు, కదలికలు తెలిసికొనుటకు సులభతరమవుతుంది. ఇతరుల ఆలోచనలను మనోభావాలను పసిగట్టగలము. తద్వారా, సావధానముగా, సమయానుకూలముగా ప్రవర్తించగలము.

స్నేహములో త్యాగం ఎంతో ముఖ్యమైనది. స్నేహితుల కొరకు నీ సమయాన్ని వెచ్చించడం, ఆపదలో ఆదుకొని తోడుగ ఉండటం, అడగకుండానే అవసరాన్ని గుర్తించడం, ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధపడటం నిజమైన త్యాగం. మన స్నేహితులకు అధికముగా ఏ సాయము, కృషి చేసిననూ అది త్యాగమే. అయితే, ‘స్నేహం కోసం ప్రాణం ఇవ్వడం గొప్పకాదు, అంతటి త్యాగం చేసే స్నేహితున్ని పొందడమే కష్టం’.

స్నేహం ఒక బంధం. ‘కుటుంబ సభ్యులతో చెప్పుకోలేని వాటిని స్నేహితులతో చెప్పుకుంటాం’. స్నేహం బంధుత్వాన్ని కోరుతుంది. సాధారణముగా, స్నేహితులను సోదరి, సోదరునిగా భావిస్తాము. స్నేహం ఓ కుటుంబముగా మారుతుంది. స్నేహానికి ఆస్తులు, అంతస్తులు, కోటలు, మేడలు అవసరములేదు. స్నేహితులు ఎప్పుడైతే స్నేహములో సాధిస్తారో, సుఖ:శాంతులను పొందుతారో అదే వారి ఆస్తి, అంతస్తు, మేడ, కోట!

ఏ కార్యమైనను మనకు మనముగా చేయలేము. మన వెనుకనున్న గొప్ప శక్తియే మనలను నడిపిస్తూ ఉంటుంది. అదే దైవం, దైవాత్మిక శక్తి. “ఇకనుండి మిమ్ములను స్నేహితులని పిలచెదను” (యోహాను. 15:15) అని క్రీస్తు ప్రభువు తన శిష్యులతో పలికియున్నారు. “మీరును ఒకరినొకరు స్నేహభావముతో మెలగుడు” అని వారికి నేర్పించారు. స్నేహం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరం. ప్రభువు తన శిష్యులను (స్నేహితులను) ఎంచుకున్నట్లుగా, మన స్నేహితులను మనమే ఎంచుకొను భాగ్యాన్ని మనకు ఒసగారు. కనుక ప్రతి స్నేహములో, స్నేహితునిలో దైవం, ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. కావున, దైవాన్ని నమ్మి దేవయిష్ట ప్రకారం, మన స్నేహాన్ని కొనసాగించాలి.

బైబులులో స్నేహం గురించిన ఉదాహరణలు ఎన్నో చూడవచ్చు: అబ్రహాము-లోతు (ఆది. 14:14-16), రూతు-నవోమి (రూతు. 1:16-17), దావీదు-యోనాతాను (1 సమూ. 18:1-3), దావీదు-అబ్యాతారు (1 సమూ. 22:22-23), దావీదు-నాహాషు (2 సమూ. 10:2), ఏలియా-ఎలీషా (2 రాజు. 2:2), యోబు-అతని ముగ్గురు స్నేహితులు (యోబు. 2:11-13), దానియేలు-అతని ముగ్గురు మిత్రులు (దాని. 2:49), యేసు-మరియ, మార్త, లాజరు (లూకా. 10:38; యోహాను. 11:21-23), పౌలు-ప్రిస్కా, అక్విలా (రోమీ. 16:3-4), పౌలు-తిమోతి, ఎపఫ్రోదితు (ఫిలిప్పీ. 2:19-26).

స్నేహములో జడుకుతనం, భయం ఉండరాదు. అదేవిధముగా, దుడుకుతనం కూడా ఉండరాదు. ఇరు హృదయాలకనుగుణంగా సాగుటకు ప్రయత్నం చేయాలి. మానవమాత్రులమైన మనకు, నిజమైన, నమ్మకమైన స్నేహం చేయడం ఎల్లవేళలా సాధ్యపడక పోవచ్చు. గొడవలు, అర్ధంచేసుకోకపోవడం జరుగుతూ ఉంటాయి. ఇవి భూకంపముగా వచ్చి, స్నేహాన్ని చీల్చివేయక, స్నేహాన్ని దృఢపరచుటకు తోడ్పడాలి. స్నేహితులలో సరైన జ్ఞానం, తీర్పు, ఆలోచనలు, ఓపిక యున్నచో, ఇది తప్పక సాధ్యమవుతుంది. దారిలో ముళ్ళకంప ఉన్నదని వెనుదిరిగేకన్న, దాన్ని తీసివేసి గమ్యం చేరుకున్నప్పుడు, ఆ ఆనందం, సంతోషం చెప్పదగినది కాదు! అదేవిధముగా, స్నేహములో ముళ్ళవంటి వాటిని ఏరిపారవేసి, ఇరువురు ఏకమగుటకు పూనుకోవాలి. స్నేహబాట, పూలబాటగా, స్నేహం మధురమైన తేనెలాగా మారాలి, ఉండాలి.

స్నేహంలోని ప్రతి చిన్న అనుభవంనుండి, సంఘటననుండి ఎంతో పెద్ద మొత్తాన్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. జీవితం ఓ అనుభవం. ఆ అనుభవమే జీవితాన్ని సరిదిద్ది నడిపిస్తుంది.

స్నేహితులకు సలహాలు ఇవ్వడం, తద్వారా వారి అభివృద్ధిని ఆశిద్దాం! అలాగే, వారు ఇచ్చే సలహాలను సంతోషముతో స్వీకరిద్దాం! కష్టాలలో, బాధలలో, పరస్పర అభిప్రాయాలు, భావాలు పంచుకొని ఓదార్చుకుంటూ తోడుగా చేయూతగా నున్నప్పుడే అది నిజమైన స్నేహమవుతుంది. ‘కష్టసమయములో కలత చెందిన మనసుకి ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహం’. ‘గురువులా బోధించి, దారి చూపి, తప్పు చేసినప్పుడు మందలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు’.

స్నేహం ఆశించేది చనువు. స్నేహములో మౌనంకూడా చాలా అవసరం. నిదానము, మౌనము, సరియైన రీతిలో నున్నప్పుడు ఎంతో మార్పును తెస్తుంది. ఒక స్నేహితుడు ఎంత మౌనముగా ఉంటే, ఇతరులలో అంత మాట్లాడాలని ఆశ కలుగుతుంది. సాన్నిధ్యం మాటకన్న గొప్పది. స్నేహములో ఉత్సాహం ఉండాలి. స్నేహితులు చెప్పే ప్రతి మాటని శ్రద్ధగా ఆలకిస్తూ మన ముఖములో ఆ స్పందనని కనబరచాలి. తన మనసులోనున్న దానిని దాచుకోకుండా, దాపరికం లేకుండా చెప్పుకోవడం మంచి స్నేహ లక్షణం.

చూపు పరిచయమై, పరిచయం స్నేహమై, స్నేహం ప్రేమగా వెల్లివిరుస్తూ ఉంటుంది. ‘ప్రేమ’ అన్నింటిలో ఘనమైనది. ప్రేమిస్తూ, తమ స్నేహ జీవితాన్ని కొనసాగిస్తే, అంతకన్న ధన్యమైన జీవితం మరొకటి ఉండదు.

స్నేహం పంచుకోవడం. సంతోషాలను, బాధలనేగాక, పరస్పరం పంచుకునేవి చాలా ఉంటాయి. ముఖ్యముగా, ఏదీ దాచక మాట్లాడుటకు ప్రయత్నం చేయాలి. ‘స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండకూడదు’. స్నేహితులపై దృఢమైన నమ్మకము కలిగి యుండాలి. ‘నీ మీద నీకే నమ్మకంలేని సమయంలో నిన్ను నమ్మి నీ వెంట నడిచేవాడే నీ మిత్రుడు’. నేటి పరిస్థితులను బట్టి, ‘ప్రతీ రోజు మాట్లాడుకోకున్న, అవసరమైనప్పుడు మనకు ధైర్యం, ఓదార్పు చెప్పేవాడు మన నేస్తం’.

స్నేహం సముద్రం లాంటిది. సముద్రములో నీళ్ళు తరగవు. స్నేహములో మాటలు, భావనలు, ఆలోచనలు, ఆకర్షణలు తరగవు. స్నేహం ప్రేమగా మారితే, ‘తల్లిప్రేమ తర్వాత అంతటి గొప్పప్రేమ’గా అనిపించుకుంటుంది! నిజమైన స్నేహం, స్నేహితులను కాపాడుకుంటూ సంతోషాన్ని అందించడమే! స్నేహం పెరిగే కొలది, చనువు పెరుగుతూ ఉంటుంది. ఆ చనువే పక్కదార్లు పట్టకుండా ఒకరినొకరు సంపూర్ణముగా అర్ధంచేసుకొనుటకు ప్రయత్నం చేయాలి.

స్నేహం దృఢముగా ఉండాలంటే, స్థిరమైన సంభాషణ ఉండాలి. ‘ఏదో మాట్లాడాలి గనుక మాట్లాడతా” అనే తలంపు కీడును తెచ్చి పెడుతుంది. నిజమైన స్నేహితులు మాటలతోనేగాక, చూపులతో, ప్రతీ కదలికతోను మాట్లాడుకుంటారు.

నిరాశను ఆశగా మార్చునది స్నేహితులు. అశాంతిని శాంతిగా మార్చునది స్నేహితులు. అధైర్యాన్ని ధైర్యంగా మార్చునది స్నేహితులు. చీకటి ఛాయల స్నేహాన్ని చేధించి వెలుగునీడలు నింపునది స్నేహితులు. ‘కోపాన్ని, లోపాన్ని భరించేవారు స్నేహితులు’. అటువంటి స్నేహితులను ఎల్లప్పుడూ గౌరవించాలి. ‘స్నేహం’ ఆకర్షణ మాత్రమే కాదని మరోసారి విన్నవించుకుంటున్నాను. స్నేహం రెండు హృదయాల ఘోష. నిజమైన స్నేహానికి విలువ ఇవ్వండి. అది మిమ్ములను విలువగల వారినిగా చేస్తుంది.

No comments:

Post a Comment