16వ సామాన్య ఆదివారము, Year B

 16వ సామాన్య ఆదివారము, Year B
యిర్మీ. 23:1-6; ఎఫెసీ. 2:13-18; మార్కు. 6:30-34

“విశ్రాంతి”



శిష్యులు వేదప్రచారమును ముగించుకొని (మార్కు. 6:7-13) యేసు వద్దకు వచ్చి, తమ ప్రేషిత కార్యములను, బోధనలను తెలియజేశారు. అప్పుడు యేసు వారితో, “మీరు ఏకాంత స్థలమునకు వచ్చి, కొంత తడవు విశ్రాంతి తీసికొనుడు” (6:31) అని చెప్పారు. అప్పుడు వారు నిర్జన ప్రదేశమునకు వెళ్ళిరి. “విశ్రాంతి” అనగా ఏమిటి? నేడు మన పనులలో బిజీబిజీగా ఉన్న తరుణములో, మన పనులకు బానిసలుగా జీవిస్తున్న తరుణములో ‘విశ్రాంతి’ గురించి ధ్యానిద్దాం.

దేవుడు మానవాళికి ఇచ్చిన గొప్ప బహుమతులలో ‘విశ్రాంతి’ ఒకటి. ‘విశ్రాంతి’కి పర్యాయపదం ‘శాంతి’. సహజముగానే, విశ్రాంతి అనగానే మనం నిద్ర అని భావిస్తాము. అలసిపోయినప్పుడు, నిద్రించి, విశ్రాంతి తీసుకుంటాము. విశ్రాంతి తరువాత శక్తిని తిరిగి పుంజుకుంటాము. సంతోషముగా, ఆనందముగా ఉంటాము. ఇలాంటి విశ్రాంతి గురించి కాదు నేను చెప్పదలచుకున్నది.

దేవుని ‘విశ్రాంతి’ చాలా లోతైనది. ‘విశ్రాంతి’కి హీబ్రూ పదం “nuach” అనగా విశ్రాంతి తీసుకోవడం, నిశ్శబ్దంగా ఉండటం. కొన్నిసార్లు ఇది “shabat”కు పర్యాయపదంగా ఉంటుంది. “shabat” (సబ్బాతు) అనగా నిలిపివేయడం, విశ్రాంతి తీసుకోవడం అని అర్ధం. ‘విశ్రాంతి’కి గ్రీకు పదం “anapausis” (అనాపౌసిస్) అనగా విరమణ, సేదతీరుట, విశ్రామం. అయితే, యేసు చెప్పిన “విశ్రాంతి” పనినుండి కాదు, పనిలో విశ్రాంతి.

సృష్టికర్తయైన (యావే) దేవుడు ఏడవ నాడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. సృష్టిని పూర్తిచేసి ఏడవ నాడు పనిని మానివేసెను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని ‘పవిత్ర రోజు’గా చేసెను” (ఆది. 2:2-3). తాను చేసిన పని మంచిగా యున్నదని ఎరిగి దేవుడు ఏడవ దినమున ధ్యానించెను. ఏడవ రోజు విశ్రాంతి దినమని నిర్గమ. 16:23, 25; 20:10; 23:12; 31:15లో చూడవచ్చు. అయితే, యెహోషు. 1:13-15లో “విశ్రాంతి” అనగా శాంతి అని చెప్పబడింది. వాగ్ధత్త భూమిని జయించి, ఇశ్రాయేలు ప్రజలు దేవుని విశ్రాంతిని పొందిరి. కానా లేదా వాగ్ధత్త భూమి “సంతోషముగా వసించు దేశము” అని పిలువబడినది (ద్వితీయ. 12:9). యుద్ధములు లేని కాలము శాంతి అని యెహోషు. 14:15, 21:44; న్యాయా. 3:11, 30లో చూస్తాం. తనవైపు చూసిన వారికి, తన ఒప్పందమును జీవించిన వారికి, దేవుడు విశ్రాంతి (శాంతి)ని ఒసగెను.

బైబులులో “విశ్రాంతి” గురించి వేదాంతపరముగా హెబ్రీ. 3:7-4:11లో చూడవచ్చు (తప్పక చదువుము). యేసు విశ్రాంతి నిలయము. దేవుని ప్రజలకు విశ్రాంతినొసగును. “భారముచే అలసి సొలసి యున్న సమస్త జనులారా! నా యొద్దకు రండు. మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడననియు, వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అపుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు” (మత్త. 11:28-29). ఇచ్చట ‘విశ్రాంతి’ అనగా, క్రీస్తునందు విధేయతద్వారా తండ్రి దేవునితో సరియైన సంబంధము నుండి ప్రవహించు భద్రత, శాంతి, దైవరాజ్యము. ఇది క్రీస్తునందు శాశ్వతమైన విశ్రాంతి. యెహోషువ ప్రజలను వాగ్ధత్త భూమికి నడిపించినప్పటికిని, సంపూర్ణ ‘విశ్రాంతి’, ‘సంతోషము’లోనికి నడిపించడానికి దేవుడు, తాను యిర్మియా ప్రవక్త ద్వారా వాగ్దానం చేసిన విధముగా తన కుమారుడైన యేసును ఈ లోకమునకు పంపారు: “నేను దావీదు వంశమునుండి నీతిగల రాజును ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి. రాజు విజ్ఞానముతో పరిపాలించును. దేశమందంతట నీతిన్యాయములు నెలకొల్పును. అతని పరిపాలనా కాలమున యూదా భద్రముగా జీవించును. యిస్రాయేలీయులు శాంతితో మనుదురు” (మొదటి పఠనము: యిర్మీ. 23:5-6). అటులనే, “క్రీస్తు మనకు సమాధానము అయ్యెను... శాంతి నెలకొల్పుటకై ధర్మశాస్త్రమును ఆయన తొలగించెను... సమాధానమును గూర్చిన సువార్తను బోధించెను... కనుక తండ్రి సముఖమునకు (దైవరాజ్యము) చేరగలుగుచున్నాము” (రెండవ పఠనము: ఎఫెసీ. 2:14-18).

క్రీస్తు ఒసగు విశ్రాంతి మన పనులనుండి విశ్రాంతి కాదు. ఆయన ఒసగు శాంతి. అది దేవుని ప్రేమించి, విధేయించు వారికి ఒసగబడును. ఈ శాంతి మనలను స్వస్థత పరచును, పరిపూర్ణం చేయును. మన భయాలను తొలగించి, భవిష్యత్తును ఆత్మవిశ్వాసముతో ఎదుర్కోవడానికి తోడ్పడును.

“లోపల ప్రవేశించి ఆయనతో విశ్రమింప వచ్చునని దేవుడు మనకు వాగ్ధాన మొనర్చి ఉన్నను, ఆ విశ్రాంతి యందు ప్రవేశింపక మీలో ఎవ్వరైన తప్పిపోవుదురేమో అని మనము జాగరూకులమై ఉందుము” (హెబ్రీ. 4:1). దేవుని విశ్రాంతి లోనికి ప్రవేశించాలంటే, దేవుని వాక్కునందు విశ్వసించాలి. ఇశ్రాయేలు ప్రజలు చాలామంది ఎడారిలోనే నశించారు, కారణం దేవుని మాటలను వారు ఆలకించలేదు, విశ్వసించలేదు.

మనము దేవుడు ఒసగు “విశ్రాంతి”ని పొందాలంటే, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనాలి. దివ్యపూజలో, ఆరాధనలో, ప్రార్ధనలలో పాల్గొనాలి. బైబులు చదవాలి, విశ్వసించాలి. దానికి తగిన సమయము, ఆదివారము. కేవలం శారీరక విశ్రాంతి దినముగా భావింపక, ఆధ్యాత్మిక విశ్రాంతి దినముగా భావించి, ఆరాధనలలో పాల్గొనాలి. అప్పుడే, యేసు చెప్పినట్లుగా మన ఆత్మలు విశ్రాంతి పొందును.

యేసు శిష్యులకు చెప్పిన వాక్యములో (మార్కు. 6:31) మూడు అంశాలను గమనించవచ్చు. మొదటిది శారీరక విశ్రాంతి, ఎందుకన, వారు వేదప్రచారము నుండి తిరిగి వచ్చియున్నారు, బహుశా, శారీరకముగా అలసిపోయి యుంటారు. రెండవది, మానసిక విశ్రాంతి. మనస్సుకు ప్రశాంతత ఎంతో అవసరం. బిజీ జీవితమునుండి కొంత విరామం ప్రతీ ఒక్కరికీ ఎంతో అవసరం! మనస్సు ప్రశాంతముగా ఉన్నప్పుడు, ఇతరులతో సంబంధాలు బలపడతాయి. మూడవది, ఆధ్యాత్మిక విశ్రాంతి. ఏకాంతము, ప్రార్ధన మన ఆత్మలను బలపరచును. ప్రేరణ పొందుతాము. దేవుని ప్రేమను అనుభూతి చెందుతాము.

“కొంత తడవు విశ్రాంతి తీసికొనుడు” అని ప్రభువు మనలనందరినీ ఆహ్వానిస్తున్నాడు. సంపాదన అవసరమే! కాని అన్నింటికన్నా మన కుటుంబ బాంధవ్యాలు ఎంతో ముఖ్యం. వాటికి సమయం ఇద్దాం. అంతకన్న ఎక్కువగా, దేవునితో మన బాంధవ్యం ఎంతో ముఖ్యం, కనుక దేవునికి తగిన సమయాన్ని ఇద్దాం. అది మన మేలు కొరకే! మన ‘విశ్రాంతి’ (శాంతి, మనశ్శాంతి) కొరకే!

“దేవుడు తన పనుల నుండి విశ్రాంతి పొందినట్లే దేవునితో విశ్రమించు ఏ వ్యక్తియైన తన పనుల నుండి విశ్రాంతిని పొందును. దేవునితో విశ్రమించుటకు మనము చేతనైనంతగ కృషి చేయుదము” (హెబ్రీ. 4:10-11).

3 comments: