పోపు ఫ్రాన్సిస్
జనరల్ ఆడియన్స్
సాన్ దమాసొ కోర్ట్ యార్డ్
బుధవారం, 30 జూన్ 2021
పౌలు – నిజమైన అపోస్తలుడు (30 జూలై 2021)
మనం పౌలు గలతీయులకు వ్రాసిన లేఖను లోతుగా ధ్యానం చేయుచున్నాము. ఇప్పటివరకు, క్రైస్తవులు వారి విశ్వాస జీవితాన్ని జీవించడంలో ఎలాంటి సంఘర్షణలను ఎదుర్కొంటున్నారో ధ్యానించాం. అపోస్తలుడు పౌలు వారి గత బంధాన్ని, వారినుండి దూరముగా ఉండటంలోని అసౌకర్యాన్ని వారిలో ఒక్కొక్కరిపై తనకున్న మార్పులేని ప్రేమను గురించి గుర్తుచేస్తూ తన లేఖను ప్రారంభించారు. అయినప్పటికినీ, గలతీయులు సరియైన మార్గమును అనుసరించుటలో తనకున్న ఆందోలనను వ్యక్తపరచడంలో పౌలు విఫలం కాలేదు: విశ్వాసంలో సంఘాలను స్థాపించిన ఒక తండ్రి పడే ఆందోళన. పౌలు ఉద్దేశాన్ని స్పష్టం చేసారు: వారి ఉనికికి ఆధారమైన గుర్తింపును నిర్మించుటకు, తన పరిచర్య వలన గలతీయులు స్వీకరించిన సువార్తలలో నున్న నూతనత్వమును పునరుద్ఘాటించడం అవసరం ఉన్నది. కనుక, సువార్తలలో నున్న నూతనత్వమును పునరుద్ఘాటించడమే దీనికి మార్గము.
క్రీస్తు పరమ రహస్యముల పట్ల పౌలు లోతైన జ్ఞానాన్ని కలిగి యున్నారు. తన లేఖ ఆరంభము నుండి కూడా తన విరోధులవలె [తప్పుడు బోధకులు] నిస్సారమైన వాదనలను పౌలు అనుసరించలేదు. సంఘములో విభేదాలు తలెత్తినప్పుడు, మనం ఎలా ప్రవర్తించాలో పౌలు తెలియజేయు చున్నారు. వారిలో తప్పుడు ఆశను కలిగించే తక్షణ పరిష్కారాలను పౌలు సూచించక, రాజీ పడక యుండుటకు సువార్త సత్యము, క్రైస్తవుల స్వేచ్చ గురించి పౌలు లోతుగా ధ్యానిస్తున్నారు. యేసు కూడా రాజీ పడువారు కాదని పౌలు ఎరిగియున్నారు. కనుక, పౌలు మరింత సవాలుతో కూడిన మార్గాన్ని ఎన్నుకున్నారు. “నేను ఇపుడు మానవుల ఆమోదమును పొందుటకు ప్రయత్నించు చున్నానా? లేక దేవుని ఆమోదమునా? లేక నేను మానవులను సంతోష పెట్టుటకు ప్రయత్నించు చున్నానా? నేను ఇంకను మానవులను సంతోష పెట్టుటకే ప్రయత్నించు చున్నచో నేను క్రీస్తు సేవకుడనై ఉండను” (గలతీ. 1:10) అని పౌలు తన భావనను స్పష్టం చేసారు.
మొదటిగా, పౌలు తన యోగ్యతను బట్టిగాక, దేవుని పిలుపుతో తాను నిజమైన అపోస్తలుడనని గలతీయులకు గుర్తుచేయడం తన బాధ్యతగా భావించారు. దమస్కు మార్గములో ఉత్థాన క్రీస్తు దర్శనము వలన తన జీవితములో కలిగిన పిలుపు, మారుమనస్సు గురించి వివరించారు (అ.కా. 9:1-9). ఆ సంఘటనకు ముందుగా తన జీవితాన్ని ధృవీకరించిన విధానం ఆసక్తికరమైనది: “పూర్వము నేను యూద మతము నందున్న రోజులలో దేవుని సంఘమును ఎంతగ హింసించి, దానిని నాశనము చేయ ప్రయత్నించితినో మీరు వినియున్నారు గదా! యూదమతమును అవలంబించుటలో నా వయసుగల తోడి యూదులు అనేకులలో నేనే అగ్రగణ్యుడనై యుంటిని. మన పూర్వుల సంప్రదాయములపై ఎంతో ఆసక్తి కలిగి యుండెడి వాడను” (గలతీ. 1:13-14). యూద మతంలో ఇతరుల నందరినీ తాను అధిగమించానని, అత్యంతాసక్తిగల పరిసయ్యుడనని ధైర్యముగా ధ్రువీకరించారు; “ధర్మశాస్త్రమునకు విధేయుడై, మానవుడు నీతిమంతుడు అగుటకు ఎంత అవకాశము ఉన్నదో, అంత వరకు నేను నిర్దోషిని” (ఫిలిప్పీ. 3:6).
ఒకవైపు, “పూర్వము నేను ఆయనను దూషించి, హింసించి అవమానించాను” (1 తిమో. 1:13) అని క్రీస్తు సంఘమును తీవ్రముగా హింసించినది నొక్కి చెప్పారు. మరోవైపు, తనపట్ల దేవుని దయగురించి ప్రాముఖ్యముగా ప్రస్తావించారు. ఆ దయ అతనిని సంపూర్ణ మార్పునకు నడిపించినది. “అంత వరకును యూదయాలోని క్రీస్తు సంఘముల వారికి నాతో ముఖ పరిచయము లేకుండెను. ‘ఒకప్పుడు మనలను హింసించిన అతడే ఈనాడు తాను నిర్మూలనము చేయనెంచిన విశ్వాసమును బోధించు చున్నాడు’ అని మాత్రము వారు వినుచుండిరి” (గలతీ. 1:22-23). పౌలు హృదయపరివర్తన చెందారు. ఈవిధముగా, పౌలు దైవ పిలుపు సత్యమును ప్రస్తావించారు: ధర్మశాస్త్రమును, సంప్రదాయాలను పాటించడం లేదని క్రైస్తవులను హింసించే పౌలు, యేసు క్రీస్తు సువార్తను ప్రకటించడానికి అపోస్తలునిగా పిలువ బడినారు. పౌలు సువార్తను ప్రకటించడానికి, తన పాపాలను అంగీకరించడానికి స్వేచ్చాపరునిగా చూస్తున్నాము.
పౌలు తన గతమును తలంచుకొని ఆశ్చర్యముతోను, కృతజ్ఞతతోను నిండియున్నారు. “నా తల్లి గర్భము నందే దేవుడు దయతో నన్ను తన సేవకై ప్రత్యేకించి పిలిచెను. ఆయనను అన్యులకు బోధించుటకుగాను, దేవుడు తన కుమారుని నాకు ప్రత్యక్ష పరచుటకు ఉద్దేశించారు” (గలతీ. 1:15-16) అని పౌలు గలతీయులకు తన అపోస్తలత్వము గురించి తెలియజేయు చున్నారు.
ప్రభువు మార్గాలు ఎంత నిగూఢమైనవి! అనుదిన జీవితంలో, ముఖ్యముగా దేవుడు మనకొసగిన పిలుపును గురించి ఆలోచించినపుడు దీనిని మనం అనుభవించు చున్నాము. దేవుడు మన జీవితాలలోనికి ప్రవేశించిన సమయాన్ని, మార్గాన్ని మనం ఎన్నటికీ మరచి పోరాదు. దేవుడు మన ఉనికిని మార్చిన ఆ దయను మన హృదయములో, మనసులో స్థిరంగా పదిల పరచుకుందాం. ప్రభువు చేసే గొప్ప కార్యాలలో, తన చిత్తాన్ని నెరవేర్చుటకు పాపులను, బలహీనులను ఏవిధముగా ఉపయోగించు కొనుచున్నారు? అన్న ప్రశ్న మనలో ఎన్నిసార్లు కలిగినది. ఏదీ కూడా అనుకోకుండా జరగదు. ఎందుకన, ప్రతీది దేవుని ప్రణాళికలో సిద్ధంచేయ బడింది. దేవుడు మన చరిత్రను రాస్తాడు; ఆయన రక్షణ ప్రణాళికకు నమ్మకముతో అనుగుణంగా ఉన్నప్పడు దానిని గ్రహిస్తాము. ప్రతీ పిలుపు ఒక ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. దేవుడే మనలను స్వయముగా పంపుచున్నారు; తన దయతో మనకు మద్దతును ఇస్తున్నారు కనుక, మనం సిద్ధపడాలని కోరుచున్నారు. సహోదరీ సహోదరులారా, ఈ అవగాహన మనలను ముందుకు నడిపించునుగాక: దేవుని దయ మన ఉనికిని మారుస్తుంది; సువార్త సేవకు అర్హులను చేస్తుంది; పాపాలను క్షమిస్తుంది; హృదయాలను మారుస్తుంది; నూతన మార్గాలను గాంచేలా చేస్తుంది. ఈ విషయాన్ని మరచి పోకూడదు.
No comments:
Post a Comment