10. పౌలు తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన రెండవ లేఖ

 10. పౌలు తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన రెండవ లేఖ
 10.1. ఉపోద్ఘాతము
10.2. లేఖ వ్రాయు సందర్భము
10.3. కృతజ్ఞత మరియు ప్రార్ధన (1:3-12)
10.4. ప్రధానాంశాలు
10.4.1. ప్రభువు దినము (2:1-17)
10.4.2. సూచనలు (3:1-15)
10.5. శుభాకాంక్షలు మరియు ఆశీర్వాదము (3: 16-18)

 10.1. ఉపోద్ఘాతము

ఈ లేఖను పౌలు వ్రాసాడని అనేకమంది విశ్వసించినను, చాలామంది ఆధునిక బైబులు పండితులు దీనితో ఏకీభవించడం లేదు. పౌలుగాక, పౌలు పేరిట వేరొకరెవరో వ్రాసారని వీరి అభిప్రాయం. పౌలుయే గ్రంథకర్తయని వాదించేవారు కూడా ఉన్నారు. తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన మొదటి లేఖకు సారూప్యతలున్నను, బేదాభిప్రాయాలున్నట్లు కూడా చూస్తాము. సారూప్యతలకు కారణం రచయిత మొదటి లేఖను ఆదర్శముగా తీసుకొని, పౌలు వ్రాయుచున్నట్లుగా వ్రాసెను.

రెండు లేఖలలో మనం గమనింపదగిన బేదాభిప్రాయాలు:

- ‘ప్రభువు రాకడ’ గురించిన బోధనలో రెండు లేఖలలో బేదాభిప్రాయాన్ని లేదా మార్పును గమనిస్తున్నాము. మొదటి లేఖలో, ‘ప్రభువు రాకడ’ త్వరితముగా వచ్చునని చూస్తున్నాము (1తెస్స. 5:1-3). కాని ఈ రెండవ లేఖ ‘ప్రభువు రాకడ’ త్వరగా రాదని వాదిస్తున్నది (1తెస్స. 2:1-8).
- ‘క్రీస్తు శాస్త్రము’ (క్రీస్తును గురించిన వేదాంత బోధన) కూడా ఈ లోఖలో మరింత అభివృద్ధి చెందినది. భాషా వ్యక్తీకరణ విషయములో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
- పౌలు తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన మొదటి లేఖ చాలా వ్యక్తిగతమైనది మరియు హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. కాని రెండవ లేఖ ఎక్కువగా వేదాంత పరమైన లేఖ.

లేఖ మాత్రం రచయిత పౌలు అని తెలియజేయు చున్నది మరియు తెస్సలోనిక సంఘమునకు  వ్రాసి యున్నాడు (1తెస్స. 1:1). పౌలు రచయిత కాదని చెప్పే వారి వాదనలు అంతగా ఒప్పించేవిగా లేవు, కనుక ఈ లేఖను ఖచ్చితముగా పౌలు వ్రాసాడని చెప్పుకోవచ్చు. పౌలు ఈ లేఖను క్రీ.శ. 51లో వ్రాసి ఉండవచ్చు.

పౌలు తనతో పాటు సిలాసు, తిమోతిల పేర్లను కూడా రచయితలుగా పేర్కొన్నాడు (1:1). వీరిరువురు రెండవ ప్రేషిత ప్రయాణములో పౌలు పరిచర్యలో పాలుపంచుకొన్నారు. మాసిడోనియా నుండి ఆర్ధిక సహాయమును తెచ్చి (చూడుము. 2 కొరి. 11:7-11, అ.కా. 18:5), అటుపిమ్మట, సువార్తా బోధనలో కొరింతులో పౌలుతో చేరిరి (చూడుము. 2 కొరి. 1:19).

10.2. లేఖ వ్రాయు సందర్భము

తిమోతి తెస్సలోనికను సందర్శించి ఈ క్రింది సమాచారమును పౌలు అందించాడు:

(అ). తెస్సలోనికలో హింసలు కొనసాగుచున్నాయి (1:4).
(ఆ). సంఘములో కొందరు ‘ప్రభువు దినము’ వచ్చెనని వాదించు చున్నారు (2:1-2).
(ఇ). కనుక, సంఘములో కొంతమంది సోమరిపోతులుగా ఉన్నారు (3:11).

ఈ సందర్భముగా పౌలు ఈ లేఖను తెస్సలోనిక ప్రజలకు వ్రాసాడు. ఈ లేఖ ద్వారా (అ). తెస్సలోనిక ప్రజలు విధేయత చూపుటలో, హింసలలో ఓర్పును, విశ్వాసమును కలిగియుండునట్లు, విశ్వాసములో దృఢముగా, స్థిరముగా ఉండునట్లు ప్రోత్సహించుటకు (1తెస్స. 1:4, 3:5), (ఆ). ‘ప్రభువు దినము’ వచ్చెనను తప్పుడు వాదనను సరిచేయుటకు (1తెస్స. 2:3), మరియు (ఇ). సోమరిపోతులను హెచ్చరించుటకు (1తెస్స. 2:11-12) పౌలు ఈ లేఖను వ్రాసి యున్నాడు.

10.3. కృతజ్ఞత మరియు ప్రార్ధన (1:3-12)

తెస్సలోనిక ప్రజల విశ్వాసమును బట్టి, వారి అన్యోన్యమగు ప్రేమను బట్టి, వారు అనుభవించుచున్న హింసలలోను, కష్టములలోను చూపుచున్న ఓర్పు మరియు విశ్వాసమును బట్టి పౌలు దేవునకు కృతజ్ఞతలు తెలియజేయు చున్నాడు (1:3-4). ఆ తరువాత దేవుని తీర్పు మరియు ప్రభువు రాకడ గురించి పౌలు ప్రస్తావిస్తున్నాడు (1:5-12). దేవుడు ఏది న్యాయమో దానినే చేయును. కష్టపెట్టు వారికి కష్టములు కలిగించును. శ్రమనొందుచున్న వారికి విశ్రాంతిని కలిగించును (1:5-7). ప్రభువు రాకడ సమయమున, యేసు ప్రభువు శక్తిమంతులగు దేవదూతలతో దివి నుండి ప్రత్యక్ష మగునపుడు, అగ్నిజ్వాలలతో ఆయన దివి నుండి దిగివచ్చునప్పుడు, దేవుని ఎరుగని వారిని శిక్షించును. సువార్తకు విధేయులు కాని వారిని దండించును మరియు తన పరిశుద్ధుల నుండి మహిమను పొందుటకును, విశ్వాసుల నుండి గౌరవము నందుటకును ఆ దినమున ఆయన వచ్చును (1:7-10). “దేవుడు పిలిచిన జీవితమునకు క్రైస్తవ విశ్వాసులు యోగ్యులను చేయవలెనని, తన శక్తి వలన ఆయన వారి కోరికలను నెరవేర్చి, వారి విశ్వాస కృత్యమును పరిపూర్ణ మొనర్చాలని, ప్రభువైన యేసు నామము వారియందును, వారు ఆయన యందును మహిమపరప బడవలెనని” ప్రార్ధిస్తూ పౌలు ఈ పరిచయ భాగాన్ని ముగిస్తున్నాడు (1:11-12).

10.4. ప్రధానాంశాలు
10.4.1. ప్రభువు దినము (2:1-17)

‘ప్రభువు దినము’ ఇప్పటికే వచ్చెనని కొందరు తెస్సలోనికలో ప్రచారం చేయుచుండిరి (1తెస్స. 2:1-2). దీనివలన, కొంతమంది భయభ్రాంతులైరి. మరికొందరు వారి జీవనోపాధిని వీడి సోమరిపోతులుగా జీవించు చుండిరి (1తెస్స. 2:6-13). మరికొందరు ‘ప్రభువు రాక’ కొరకై ఎదురు చూచుచు సంఘములో సందడి చేయు చుండిరి. కనుక, పౌలు ‘ప్రభువు దినము’ ఇంకను రాలేదని, ఆందోళన చెందుచున్న తోడి క్రైస్తవులకు స్పష్టముగా తెలియజేయు చున్నాడు (1తెస్స. 2:3).

‘ప్రభువు దినము’ వచ్చెనని నమ్ముటకు గల ముఖ్య కారణం: అప్పట్లో ఉన్న ఘోర హింసలు. చారిత్రాత్మకముగా, రెండు ఘోర హింసలు జరిగాయి. మొదటిది, రోమను చక్రవర్తి దొమిషియన్ కాలములో (క్రీ.శ. 81-96), రెండవదిగా, ట్రాజన్ కాలములో (క్రీ.శ. 98-117).

‘తుది తీర్పు’ లేదా ‘ప్రభువు రాకడ’కు ముందు కొన్ని సంఘటనలు జరుగుతాయని (1తెస్స. 2:3-4) గ్రంథకర్త తెలియజేయు చున్నాడు: తిరుగుబాటు రావలెను, వినాశ పుత్రుడు పాపకారకుడు వచ్చును, మానవుడు సమస్తమునకు అతీతునిగ, తనను భావించు కొనును, దేవుని ఆలయమున ప్రవేశించి కూర్చుండి, తానే దేవుడనని చెప్పు కొనును. కనుక, ‘ప్రభువు దినము’ ఇంకను రాలేదు (1తెస్స. 2:5-7). యేసు ప్రభువు దుష్టుడిని తన నోటి శ్వాసచే సంహరించును. తన మహిమోపేత దర్శనముతోను, రాకడ తోను దుష్టుని సర్వనాశనము చేయును (1తెస్స. 2:8). దుష్టుడు పైశాచిక శక్తితో అద్భుతములను, సూచక క్రియలను, మహత్కార్యములను చేయును. నశించు వారిని అతడు అన్నివిధములగు దౌష్ట్యముతో మోసగించును (1తెస్స. 2:9-10). సత్యమును విశ్వసింపక పాపములో ఆనందించిన వారు దండింప బడుదురు (1తెస్స. 2:12).

చివరిగా, 2:13-14లో ప్రార్ధనా పూర్వకమైన కృతజ్ఞతను తెస్సలోనిక విశ్వాసులకు పౌలు తెలియజేయు చున్నాడు, ఎందుకన, వారు రక్షింప బడుటకు దేవుడు వారిని మొదటనే ఎన్నుకొనెను. 2:15-17లో చిన్న సలహాతో పాటు తెస్సలోనిక ప్రజల కొరకు ప్రార్ధన చేయుచున్నాడు. “సోదరులారా! దృఢముగా నిలిచి, మేము మా బోధనలలోను, లేఖలలోను మీకు తెలిపిన పారంపర్య సత్యములనే అంటి పెట్టుకొని ఉండుడు” (2:15) అని తెస్సలోనిక ప్రజలకు సలహాను ఇస్తున్నాడు. అలాగే వారి కొరకు, “మనలను ప్రేమించి, అనుగ్రహముతో శాశ్వతమైన ఊరటను చక్కని నిరీక్షణను మనకు ప్రసాదించిన మన తండ్రి దేవుడును, మన ప్రభువగు యేసు క్రీస్తును మీ హృదయములను ఉత్సాహపరచి, మిమ్ము సమస్త సత్క్రియల యందును, సద్వాక్కుల యందును స్థిరపరుతురుగాక!” (2:16-17) అని ప్రార్దిస్తున్నాడు.

10.4.2. సూచనలు (3:1-15)

ఇచట ప్రార్ధన మరియు ప్రవర్తన గూర్చిన పౌలు సూచనలను, హితబోధను చూస్తున్నాము. మొదటగా, తన కొరకు తన తోటి సువార్తీకుల కొరకు, “ప్రభువు వాక్కు త్వరగ వ్యాపించి విజయమును పొందునట్లు” ప్రార్ధించమని కోరుచున్నాడు (చూడుము. 1 తెస్స. 5:25). ఆ తరువాత, “దుష్టుల నుండి, పాపుల నుండి దేవుడు మమ్ము కాపాడునట్లు కూడా” ప్రార్ధించమని కోరుచున్నాడు (3:1-5).

పౌలు ఇచట ప్రవర్తన, పనిచేయవలసిన బాధ్యత గురించి ముఖ్యమైన సలహాను తెస్సలోనిక ప్రజలకు ఇస్తున్నాడు. పౌలు మరియు అతని అనుచరులు తెస్సలోనికలో నున్నప్పుడు, సోమరులుగ ప్రవర్తింప లేదు. ఎవరి వద్ద ఉచితముగ ఆహారమును పుచ్చుకొనలేదు. కృషి చేసితిరి, శ్రమించితిరి. ఏ ఒక్కరికి బరువు కాకుండుటకై రేయింబవళ్ళు పనిచేసితిరి. కనుక వారిని ఆదర్శప్రాయముగా తీసుకొనమని పౌలు తెస్సలోనిక ప్రజలను పౌలు ఆజ్ఞాపించు చున్నాడు. “ప్రభువు రాకడ” ఇప్పటికే విచ్చేసినదని తప్పుడు బోధన నేపధ్యములో తెస్సలోనిక సంఘములో కొంతమంది పనిని మానేసి సోమరిపోతులుగా ఉన్నారు. క్రమబద్ధమైన జీవితమును గడప వలెనని జీవనోపాధికై కష్టపడి పని చేయ వలెనని యేసు క్రీస్తు ప్రభువు నామమున పౌలు శాసించి హెచ్చరిస్తున్నాడు (3: 6-15).

10.5. శుభాకాంక్షలు మరియు ఆశీర్వాదము (3: 16-18)

ఇవి పౌలు తుది పలుకులు. “శాంతికి మూలమగు ప్రభువు మీకు శాంతిని (యేసు క్రీస్తు) ఒసగునుగాక” అని పౌలు ఆకాంక్షిస్తున్నాడు. ఆ శాంతి వారిలో ఉండునట్లుగా, “ప్రభువు మీకు అందరకును తోడై ఉండును” మరియు “మన ప్రభువగు యేసు క్రీస్తు యొక్క కృప మీకు అందరకు తోడై ఉండును గాక!” అని వారిని ఆశీర్వదిస్తున్నాడు.

No comments:

Post a Comment