యేసు తిరుహృదయ మహోత్సవం

 యేసు తిరుహృదయ మహోత్సవం


జూన్‌ మాసము యేసు తిరుహృదయానికి అంకితం చేయబడినది. 11వ శతాబ్దము నుండియే (పునీత బెర్నార్డు వారిద్వారా) తిరుహృదయము పట్ల భక్తియున్నప్పటికిని, ప్రత్యేకమైన భక్తి, ప్రార్ధనలు 17వ శతాబ్దములో, ఫ్రాన్సుదేశ మఠకన్య, యేసు తిరుహృదయ భక్తురాలు, పునీత మార్గరెట్ మేరి అలకోక్వే వారిద్వారా ప్రారంభమైనది. ప్రభువు ఆమెకు ఒసగిన దర్శనాలలో తన పవిత్ర హృదయంపట్ల భక్తిని వ్యాపింపజేయ, ఆమె ఒక సాధనముగా పనిచేయాలని కోరారు. ప్రేమాగ్ని కురిపించే తన హృదయంపట్ల గల నిందావమానాలు తొలగింప ఆదేశించారు. ఆమె మొదటిసారిగా, 1686వ సం.లో తన కాన్వెంటులో యేసు తిరుహృదయ పండుగను కొనియాడారు. 1765వ సం.లో 13వ క్లెమెంటు పరిశుద్ధ పోపుగారు యేసు తిరుహృదయ పండుగను గుర్తించి శ్రీసభ యంతట కొనియాడ ఆదేశించారు. ఈ పండుగ దైవార్చన కాలెండరులో, 9వ భక్తినాధ పోపుగారిచే, 1856వ సం.ములో చేర్చబడినది.

యేసు తిరుహృదయం దైవప్రేమకు నిదర్శనం, దేవుని దయకు వాస్తవిక చిహ్నం. సున్నితత్వానికి, ప్రేమకు, కరుణకు, సరళతకు తార్కాణం. యేసు తిరుహృదయం సాధువైనది, దయగలది, సున్నితమైనది, సకల మానవాళిని క్షమించగలిగి, దేవుని ప్రేమను పంచే హృదయము. “యేసు, మానవ హృదయముతో మనలను ప్రేమించాడు. ఈ కారణం వలన యేసు పవిత్ర హృదయం మనం చేసిన పాపాల వలన చీల్చబడినది. మన రక్షణకోసం తెరువబడినది. అందుకే అది ప్రేమకు గుర్తుగా, సంకేతముగా నిలచినది (కతోలిక శ్రీసభ సత్యోపదేశం, నం.478). నిస్సహాయులై బాధలలో మ్రగ్గుచు కాపరిలేని గొర్రెలవలె చెదరియున్న జనసమూహమును చూచి కడుపు తరుగుకొని పోయిన, ఆ కరుణామయుడైన ప్రభువు (మత్త. 9:36), “సాధుశీలుడనని, వినమ్ర హృదయుడనని మీరు నానుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మయందు విశ్రాంతి పొందుదురు” (మత్త. 11:29) అని పలికియున్నారు. ప్రభువుయొక్క సాధుశీలతను, వినమ్రతను అనుసరించినచో మనము శాంతి, ఆనందమును పొందెదము.

యేసు తిరుహృదయ సందేశము, చిన్న బిడ్డల మనస్తత్వమును కలిగియుండటము. సాధుశీలత యనగా నీతి, నిజాయితీగా, పారదర్శకతను కలిగియుండటము. పరిసయ్యులవలె కపటము కలిగియుండక, చిన్న బిడ్డల నిరాడంబరతను కలిగియుండుట. నిరాడంబరతయనగా పారదర్శకతను కలిగియుండటము. బయట ఒకటి లోపల ఒకటిగా యుండుటము కాదు. కపటం అనే ముసుగు వేసుకొని జీవించడం కాదు. ప్రభువు పరిసయ్యులను సున్నము కొట్టిన సమాధులవలె ఉన్నారుఅని అన్నాడు, అనగా బయటకు నీతిమంతులవలె కనిపించెదరు కాని, లోపల కపటముతో, కలుషముతో నిండియుంటారు (మత్త. 23:27-28). ఇలాంటి వారు కపటవేషధారులు. బయటకు కనిపించే వేషధారణ మాత్రమే కనిపిస్తుంది కాని, వాస్తవ రూపము దాగియుంటుంది. చిన్న బిడ్డల మనస్తత్వము కలిగిన వారు కపట వేషము వేయరు. వారి వాస్తవ స్వరూపమే బాహ్యముగా కనబడుతుంది.

ఎప్పుయితే, నాతో, ఇతరులతో, ప్రకృతితో నేను నిజాయితిగా ఉంటానో, అక్కడ దేవుడు ఉంటాడు. దేవుడు సత్యస్వరూపి. దేవునితో, ఇతరుతో నా నిజ వాస్తవముతో నిజాయితీగా ఉండటమే మతము. బయటకు కనిపించే కపట వేషధారణ మతము కాదు. మనము కపట వేషముఅనే సంస్కృతిలో బ్రతుకుతున్నాము. దీనినుండి మనము బయటపడాలి. యేసు తిరుహృదయం ఇలా బిగ్గరగా అరుస్తున్నది, ఆకించుదాం: నా అనంతమైన ప్రేమను మీపై కృమ్మరించుటకు నా హృదయం పూర్తిగా తెరచియున్నది. నేను ఎలాంటి కపటము లేకుండా నన్ను నేను మీకు చూపెదను. కనుక, మనందరిపై కుమ్మరించ బడిన దేవుని అనంత ప్రేమకు యేసు తిరుహృదయం ఒక శక్తివంతమైన చిహ్నము. యేసు తిరుహృదయం దైవీక, మానవ ప్రేమకు ప్రాతినిధ్యం. కరుణతో మనవైపు చూసే యేసు తిరుహృదయమువైపు గాంచెదము. ఆ హృదయమునుండి నేర్చుకుందాము.

బైబిలులో ‘హృదయం’ అనే పదం దాదాపు వెయ్యిసార్లు ఉపయోగించబడింది. కొన్నిసార్లు మాత్రమే శరీరములో ఒక భాగంగా వాడబడింది. మిగతా అన్నిసార్లు, ప్రత్యేకమైన అర్థాలతో ఉపయోగించబడింది. అనగా ‘హృదయం’ సంపూర్ణ వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని, అంత:రంగాన్ని సూచించే విధంగా ఉపయోగించబడింది.

దేవుడు ప్రేమ. ఈ లోకములో జన్మించిన దేవుని ప్రేమ యేసు క్రీస్తు ప్రభువు. దేవుని హృదయాన్ని అనగా దేవుని ప్రేమను, దయను యేసు ఈలోకంలో బహిర్గత పరచాడు. “ఎవరును ఎప్పుడును దేవుని చూడలేదు. తండ్రి వక్షస్థలమున ఉన్న జనితైక కుమారుడైన దేవుడే ఆయనను తెలియపరచెను” (యోహాను. 1:18). యేసు తిరుహృదయం గురించి యోహాను. 19:34లో కనులకు కట్టినట్లుగా చూడవచ్చు, “సైనికులలో ఒకడు (లాంగినుస్) ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము, నీరు స్రవించెను.” తద్వారా, జ్ఞానస్నాన నీటిబుగ్గను ఆవిష్కారించాడు. రక్తము, నీరు జ్ఞానస్నానం, దివ్యసత్ప్రసాదాలకు ప్రతిరూపాలు. అవి నూతన జీవపు సంస్కారాలు (కతోలిక శ్రీసభ సత్యోపదేశం, నం.1225). ఇది దేవుని ప్రేమకు గొప్ప నిదర్శనం. తనను సిలువపై కొట్టిన వారిని సైతం ప్రేమించిన హృదయం. క్రీస్తు మన రక్షణకోసం తననుతాను బలిగా అర్పించుకున్నాడు. ఆయన ప్రేమ, దయ, కనికరము, మనపై ఏవిధముగా కుమ్మరింపబడినదో తెలియుచున్నది. “దేవుడు తన ప్రేమతో మన హృదయములను నింపెను” (2 కొరి. 5:5).

యేసు తిరుహృదయం కనికరముగల హృదయం. బైబిలులో ‘కనికరము’ అనగా లోతైన, హృదయంతరాలలోని భావము. ఒక తల్లి తన బిడ్డల బాధను అనుభవించగల ప్రేమ. అలాగే, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ ఫలితం జీవము. మనము జీవించునట్లు చేయుచున్నది. ఈ విషయాన్ని లూకా 7:11-17 లో చూడవచ్చు. నాయినులో వితంతువు ఏకైక కుమారుడు మరణించినప్పుడు, ఆ తల్లిని చూచి, యేసు కనికరించి, “ఏడవ వద్ధమ్మా” అని ఓదార్చి, మరణించిన ఆ బిడ్డను జీవముతో లేపాడు.

ప్రభువు ఎల్లప్పుడూ మనలను ప్రేమతో, కనికరముతో చూస్తూ ఉంటాడు. ఆయన హృదయం కనికరమైనది. మనలోని పాపాలను, గాయాలను, ఆయనకు చూపిస్తే, వాటిని క్షమిస్తాడు. మన పాపాల వలన ఆయన హృదయం గాయపరచబడింది. కాని, మానవ హృదయంతో మనల్ని ప్రేమించాడు. మనల్ని రక్షించాడు. అందుకే ఆయన హృదయం ప్రేమకు గుర్తుగా, సంకేతంగా నిలిచింది.

మనపై దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే, ఆయన మనలను తన పవిత్ర ప్రజలుగా, సొంత ప్రజలుగా ఎన్నుకొన్నాడు. దేవుని కనికరమును పొందాలంటే, ఆయనను ప్రేమించి, ఆయన ఆజ్ఞలను పాటించాలి. దేవుని ఆజ్ఞ ప్రేమించడం. కనుక, మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని ఎరిగిన వాడగును. దేవుని ఎవరును, ఎన్నడును చూడలేదు. మనము ఒకరి యెడల ఒకరము ప్రేమ కలవారమైనచో,  దేవుడు మనయందు ఉండును. ఆయన ప్రేమ మనయందు పరిపూర్ణమగును.

యేసు తిరుహృదయం మనలను ఈవిధంగా ఆహ్వానిస్తుంది: “భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా! నా యొద్ధకు రండు. మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడననియు, వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అపుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు” (మత్త. 11:28-29). కనుక, మన హృదయాలను దేవునికి తెరుద్ధాం. తిరుహృదయానికి అంకితం చేద్దాం. దేవునితో, తోటి వారితో సఖ్యపడుదాం.

వినయ, విధేయతలతో తిరుహృదయానికి అంకితం చేసుకున్నయెడల, శాంతి, ఆనందము పొందెదము. అలాగే, మన కుటుంబాలను తిరుహృదయానికి అంకితం చేద్దాం. మన సంపూర్ణ నమ్మకాన్ని ఆయనలో ఉంచుదాం. మనపై ప్రేమాగ్నితో రగిలిపోతున్న తిరుహృదయం మనలను రక్షించును, శాంతి సమాధానము ఒసగును. పరస్పరము ప్రేమ కలిగి జీవించుదాం (చదువుము. 1 యోహా. 4: 7-9). యేసు తిరుహృదయము మనలను ప్రేమించి, ఆశీర్వదించును గాక!

యేసు తిరుహృదయ చిత్రపటము యొక్క అర్ధము: పునీత మార్గరెట్ మేరి అలకోక్వే పొందిన దర్శనాల ఆధారముగా, యేసు తిరుహృదయ చిత్రపటము గీయబడినది. హృదయం, యేసు భౌతిక హృదయాన్ని, ఆయన త్యాగపూరితమైన ప్రేమను సూచిస్తుంది. పొడవబడిన, రక్తంకారుచున్న హృదయం, సిలువపై పొడవబడిన హృదయాన్ని, రక్తము, నీరు స్రవించడాన్ని సూచిస్తుంది. ముళ్ళకిరీటం, సిలువ మరణానికి ముందుగా, ఆయనను అవమానించడానికి, హింసించడానికి ఆయన తలపై ఉంచబడిన ముళ్ళకిరీటమును సూచిస్తుంది. హృదయ పైభాగమున ఉన్న సిలువ, మానవాళి కొరకు విజయాన్ని సాధించిన సిలువకు సూచన. యేసు రక్షణ కార్యముద్వారా, ఆ సిలువ పరలోకమును, భూలోకమునకు నిచ్చెన వంటిది. హృదయముపైన అగ్నిజ్వాలలు, మానవాళిపట్ల యేసు ప్రేమాగ్ని జ్వాలలకు సూచన. హృదయము చుట్టు ఉన్న కాంతి, లోకాంధకారమున వెలుగుచున్న దైవీక కాంతికి సూచన.


గురుశ్రీ ప్రవీణ్ కుమార్ గోపు OFM Cap.
STL (Biblical Theology)
95506 29255

No comments:

Post a Comment