ఈస్టర్ 6 వ ఆదివారము, Year A

 ఈస్టర్ 6 వ ఆదివారము, Year A
అ.కా. 8:5-8, 14-17, 1 పేతు. 3:15-18, యోహాను. 14:15-21

    “నా ఆజ్ఞలను స్వీకరించి పాటించు వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింప బడును. నేను వానిని ప్రేమించి, వానికి నన్ను తెలియపరచు కొందును” (యోహాను. 14:21).

మొదటి పఠనము: హింసలలో సంఘ వ్యాప్తి, పవిత్రాత్మ రాకడ

    అ.కా. 8-12 అధ్యాయాలలో, యెరూషలేమును దాటి వ్యాప్తి చెందిన క్రైస్తవ సంఘ చరిత్ర గురించి చూస్తాము. ఈ భాగములో కనిపించే వ్యక్తులు: ఫిలిప్పు (8:4-40), సౌలు, అననియా (9:1-31), పేతురు (9:32-11:18), బర్నబాసు, పేతురు (11:19-12:25).

8:1-25: “క్రైస్తవ సంఘము క్రూరమైన హింసల పాలయ్యెను. అపోస్తలులు తప్ప విశ్వాసులందరు, యూదయా, సమరియా రాష్ట్ర నలుమూలలకు చెల్లాచెదురైరి” (8:1). హింసల కారణముగా, క్రీస్తు సంఘము యూదయా, సమరియ, సిరియా అంతయు వ్యాప్తి చెందెను. స్తెఫాను హతసాక్షి మరణానంతరం, అనాధి క్రైస్తవ సంఘములో హింసలు చెలరేగిపోయాయి. ఈ హింసలకు ప్రధాన సూత్రదారి సౌలు. హింసతో క్రైస్తవ సంఘాన్ని నాశనం చేయాలని శత్రువులు తలంచారు. కాని, హింసల మూలమున, విశ్వాసులు చెల్లాచెదరగుట వలన, క్రైస్తవ సంఘము ఇతర ప్రదేశాలకు కూడా వ్యాప్తి చెందినది. వారు వెళ్ళినచోట, క్రీస్తు సువార్తను బోధించారు. కనుక, దేవుడు తలపెట్టిన దానిని ఎవరుకూడా నాశనం చేయలేరు.

    సంఘ పరిచర్య కొరకు ఎన్నుకొన బడిన ఏడుగురిలో ఒకరైన ఫిలిప్పు (అ.కా. 6:1-7) గూర్చి నేడు విన్నాము. అతడు సమరియా నగరమునకు వెళ్ళి, అచటి ప్రజలకు క్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటించాడు (8:5). ఫిలిప్పు వలన, క్రీస్తు సువార్త యెరూషలేము దాటి, సమరియా ప్రాంతమునకు వెళ్ళినది. ఈవిధముగా, ప్రభవు వాగ్ధానము  నెరవేరినది, “మీరు యెరూషలేములోను, యూదయా, సమరియా సీమల యందు అంతటను, భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు” (అ.కా. 1:8). సమరియాలో ‘మెస్సయా’ కొరకు ఎదురు చూచుచున్న ప్రజలు అతని ఉపదేశమును శ్రద్ధతో ఆలకించారు. అతడు ఎన్నో సూచక క్రియలను, అద్భుతాలను చేసాడు. అపవిత్రాత్మలను వెడల గొట్టాడు. పక్షవాత రోగులకు, కుంటివారికి స్వస్థతను కలుగ జేశాడు (8:6-7).

    సమరియాలో ప్రజలు దేవుని వాక్కును అంగీకరించి, జ్ఞానస్నానమును స్వీకరించారు. అందులకు, యెరూషలేము నందలి అపోస్తలులు, పేతురు యోహానులను సమరియాకు పంపారు. వారు సమరియాకు వెళ్లి, విశ్వాసులు పవిత్రాత్మను పొందునట్లుగా ప్రార్ధన చేసారు. వారిపై చేతులు ఉంచగా పవిత్రాత్మను పొందారు (8:14-17). ఆత్మను పొందటం క్రైస్తవ జీవితములో చాలా ముఖ్యం. అందుకే, పేతురు యోహానులు అద్భుతాల గురించి గాక, పవిత్రాత్మ రాక కొరకు ప్రార్ధన చేసారు. సమరియాలో సీమోను అను పేరుగల మంత్ర విద్యలు తెలిసినవాడు (8:9), పవిత్రాత్మ వరమును డబ్బుతో కొనదలుచుకొనగా, అపోస్తలులు “దేవుని దృష్టిలో అతన హృదయము సరిగా లేదు” అని అతనిని వారించారు.

    సువార్త వ్యాప్తికి ‘ప్రార్ధన’ చాలా ముఖ్యం (8:15, 22, 24) అని మనం గుర్తించాలి.

రెండవ పఠనము: మన విశ్వాసమునకు సాక్ష్యము ఇవ్వాలి

    క్రైస్తవ విశ్వాసులపై హింసలు పెట్రేగిపోతున్న నేపధ్యములో, పేతురు తన శ్రోతలకు ఈ లేఖను రాసాడు. ఈ సందర్భముగా, విశ్వాసమునకు సాక్ష్యమిచ్చుటకు “సర్వదా సిద్ధముగా ఉండుడు” (1 పేతు. 3:15) అని విశ్వాసులను కోరుచున్నాడు. మన జీవితమే ఇతరులకు ఒక సాక్ష్యం కావాలి. దీని నిమిత్తమే, క్రీస్తును ప్రభువుగా మన హృదయాలలో ప్రతిష్టించు కోవాలి. అనగా, దైవభక్తి, దైవ భయము కలిగి జీవించాలి. మనం పొందిన విశ్వాసమును, రక్షణను ఇతరులతో పంచుకోవాలి. కష్ట సమయములలో, ఆత్మ మనకు సహాయముగా ఉండును (లూకా. 12:11-12, చూడుము. 21:14-15) అని ప్రభువే స్వయముగా చెప్పియున్నారు.

    సాక్ష్యమిచ్చునప్పుడు, మర్యాదగ (వినయముగ), సగౌరవముగ (దైవభయము) ఉండాలి (1 పేతు. 3:16). దైవభయము అనగా దైవసేవ చేయడం (ద్వితీయ. 6:13), దేవుని ఆజ్ఞలను పాటించడం (ద్వితీయ. 28:58). “దేవుని పట్ల భయభక్తులు కలిగి యుండటమే విజ్ఞానమునకు మొదటి మెట్టు. అనగా దేవుని బోధనలను ఆలకించడానికి సిద్ధముగా ఉండటము (సామె. 1:7). పవిత్రుడైన ప్రభుని తెలిసికొనుటయే విజ్ఞానము (సామె. 9:10). “ప్రభువు పట్ల భయభక్తులు గలవారిమీద ఆయన కనికరము ఉండును” (లూకా. 1:50).

    అలాగే, మన అంత:కరణమును (Conscience; గ్రీకు: suneidesis) నిర్మలముగా ఉంచుకోవాలి (1 పేతు. 3:16). స్వీయ అవగాహన అని అర్ధం. తన గురించి తాను క్షుణ్ణంగా తెలిసి యుండటం. సత్ప్రవర్తన కలిగి జీవించాలి. పాపము చేయుట కంటె, మంచి కొరకు బాధలు పొందుటయే మేలు! (1 పేతు. 3:17; 2:20). ఇక్కడ హింసలను ప్రోత్సహించడమని కాదు. మనం మంచి చేసే క్రమములో, కష్టాలు సంభవిస్తే మనం ఎంత ధన్యులము! (1 పేతు. 3:14).

సువిశేష పఠనము: పవిత్రాత్మ-ప్రభు వాగ్ధానము

    యేసు, కడరాత్రి భోజన సమయములో చేసిన ఆఖరి ఉపదేశములో, “మీ హృదయములను కలవర పడనీయకుడు” (యోహాను. 14:1) అని యేసు తన శిష్యులకు చెప్పడం, గతవారం ధ్యానించాము. తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించి నందున, ‘తన శిష్యులతో ఎల్లప్పుడు ఉండుటకు ఒక ఆదరణ కర్తను, సత్య స్వరూపియగు పవిత్రాత్మను వాగ్దానం చేయుటను’ నేడు ధ్యానిద్దాం. మరోమాటలో చెప్పాలంటే, త్రిత్వైక సర్వేశ్వరునిలోని దైవీక ప్రేమతో సహవాసమును ప్రభువు శిష్యులకు వాగ్దానం చేసాడు.

    ఈ వాగ్దానాన్ని శిష్యులు పొందాలంటే, వారు యేసు ఒసగిన ప్రేమాజ్ఞను పాటించాలి: దేవున్ని ప్రేమించు; తోటివారిని ప్రేమించు. “మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. నేను తండ్రిని ప్రార్ధింతును. మీతో ఎల్లప్పుడు ఉండుటకు మరొక ఆదరణ కర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ. లోకము ఆయనను చూడదు. కనుక, ఆయనను పొందజాలదు. మీరు ఆయనను ఎరుగుదురు. కనుక, ఆయన మీతో నివసించును. మీ యందు ఉండును” (14:15-17). “నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. అపుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము” (14:23). కనుక, మన ప్రేమ కేవలం మాటలలోగాక, క్రియారూపం దాల్చాలి.

    మన ప్రేమ క్రియారూపం దాల్చడానికి కొన్ని సూచనలు (Eric Fromm, The Art of Loving): మొదటిగా, మన ప్రేమ క్రమశిక్షణ కలదై యుండాలి. క్రమశిక్షణ యనగా కష్టమైనను సరియైన దానిని చేయడం, సులభమైన మార్గాలు వెదకడం కాదు. కష్టమైన పని చేయడంలో త్యాగం ఉంటుంది. త్యాగం లేనిది ఏదీ కూడా నిజమైన ప్రేమ కాదు. రెండవదిగా, ప్రేమలో సహనం ఉండాలి. తటస్థముగా వచ్చేది కాదు ప్రేమ. సహనం ఉన్నవారే వేచియుండ గలరు. సహనం కలవారు వివేకముతో ప్రవర్తిస్తారు. మనతోను, ఇతరులతోను మనం సహనం కలిగి యుండాలి. మూడవదిగా, ప్రేమ సహేతముగా (reasonable) ఉండాలి. మన ప్రేమ భావోద్వేగాలపై మాత్రమే గాక, విచక్షణా జ్ఞానముపై ఆధారపడి యుండాలి. ఎందుకన, మన భావోద్వేగాలు మారుతూ ఉంటాయి. కనుక ఆచరణాత్మకముగా ఉండాలి. భావోద్వేగాలు మన తార్కికములో ఆధిపత్యం వహించ కూడదు. ఆలోచన లేకుండా వ్యవహరిస్తే, ప్రేమను వక్రీకరించిన వారమవుతాము. నాలుగవదిగా, ప్రేమకు వినయం ఉండాలి. మన ప్రేమకు పెద్ద అడ్డంకి అహంకారం. “నన్ను క్షమించు” అని చెప్పడం చాలా కష్టం! వినయం నిజమైన ప్రేమకు పునాది అని గుర్తుంచుకుందాం! ఐదవదిగా, ప్రేమకు విశ్వాసం ఉండాలి. ఎలాంటి ఆధారాలు లేకపోయినను నమ్మకం కలిగి యుండటం. ప్రేమకు ఘోరమైన శత్రువు నమ్మకం, విశ్వాసం లేకపోవడం! చివరిగా, ప్రేమకు నిర్భయత్వం ఉండాలి. ఇతరుల వద్దకు వెళ్ళగలగాలి, వారి జీవితాలను మనం తాక గలగాలి. చాలాసార్లు, అభద్రతా భావముతో లేదా తిరస్కరణకు భయపడి, వెళ్ళలేక పోవుచున్నాము. ప్రేమించడానికి చాల ధైర్యము కావాలి.

    దేవుని ఆత్మ మనలో వసించుచున్నది అని చెప్పడానికి దేవుని వాక్యమే సాక్ష్యం: 1 కొరి. 3:16, 6:19, 2 కొరి. 6:16, 2 తిమో. 1:14, రోమీ. 8:9. ఆత్మద్వారా, క్రీస్తు తన సాన్నిధ్యాన్ని శిష్యులకు వాగ్దానం చేసారు. ఈ ఆత్మద్వారా విశ్వాసులకు తండ్రి దేవునితో సహవాసం ఏర్పడుతుంది. మనం ఎప్పుడైతే, నిజంగా క్రీస్తును ప్రేమిస్తామో, అప్పుడే, ఆయన ఆజ్ఞలను పాటిస్తాము. అల్లకల్లోల సమాజంలో, ఏది చేసినా ఓకే! అనే సమాజంలో, దేవుని ఆజ్ఞలను అణచివేయు నిబంధనలుగా, భారముగా, ‘స్వతంత్రము’ను అడ్డుకునేవిగా పరిగణింప బడుచున్నాయి! కాని, దేవుని ఆజ్ఞలు మనలను ‘సత్యము’ను తెలియపరచి, నిజ స్వతంత్రములోనికి నడిపించును.

    నేడు ప్రభువు ఆజ్ఞలను, పాటించడం పక్కన పెడితే, ఆజ్ఞలను తెలిసినవారు తక్కువై పోతున్నారు. బైబులు గ్రంథ పఠనము చాలా వరకు తగ్గిపోయింది. దేవుని వాక్యములోని మన మూలాలను మరచి పోతున్నాము. సృష్టి ఆరంభమునుండి నేటివరకు, ప్రతి ఒక్క వ్యక్తిని, దేవుడు తన “పోలికలో” చేసాడు. “దేవుడు మానవ జాతిని సృజించెను. తన పోలికలో మానవుని చేసెను. స్త్రీ పురుషులనుగా మానవుని సృష్టించెను” (ఆది. 1:27). దైవీక లక్షణాలలో ‘ఆత్మ’ ఒకటి. ‘ఆత్మ’ అనగా “నిత్యజీవము”, కలకాలము ఉన్నవాడు. దేవుడు మోషేతో “నేను ఉన్నవాడను” (నిర్గమ. 3:14) అని చెప్పెను. కనుక, దేవుడు ప్రతీ మానవుని సృష్టికర్త. దేవుని ఆత్మ మనిషి శరీరానికి ప్రాణాన్ని ఇస్తున్నది. తల్లి గర్భమున పడిన క్షణము నుండి మరణించే క్షణము వరకు దేవుని ఆత్మ మానవునిలో ఉంటుంది.

    అయితే, శిష్యులతో “ఎల్లప్పుడు ఉండుటకు” ప్రభువు వాగ్దానం చేసిన “ఆదరణ కర్త” (14:16-17) ఎవరు? ఆదరణ కర్త అగు ఆయన సత్య స్వరూపియగు ఆత్మ. ఆయన కలకాలము విశ్వాసులతో ఉండును. విశ్వాసులు దేవుని ఆజ్ఞలను, దేవుని నియమములను గుర్తించడానికి, జ్ఞానోదయాన్ని కలుగ జేస్తుంది. లోకము ఆయనను చూడదు, కనుక ఆయనను పొంద జాలదు. కాని, క్రీస్తునందు విశ్వాసులు ఆయనను చూడగలరు, ఆయనను పొందగలరు. ఆయన విశ్వాసులలో ఎల్లప్పుడు వాసము చేయును. ఈ సత్య స్వరూపియగు ఆత్మను విశ్వాసము, ప్రేమ ద్వారా స్వీకరించెదరు. కనుక, త్రిత్వైక దేవుని సాన్నిధ్యములో జీవించ గలుగుటకు ఆత్మ సహాయము చేయును (14:17, 15:26, 16:13, 1 యోహా. 4:6, 5:6).

    “ఆదరణ కర్త”, “సత్య స్వరూపియగు ఆత్మ, “న్యాయవాది” గురించి యోహాను రచనలలో మాత్రమే కనిపిస్తుంది. “నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది. కాని, ఇప్పుడు మీరు వానిని భరింపలేరు. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినపుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను వినిన దానినే బోధించును. జరుగబోవు విషయములను మీకు తెలియ చేయును” (16:12-13). విశ్వాసములోను, ప్రేమలోను ఎదగడానికి మనలోనున్న ఆత్మ మనకు సహాయం చేయును.

    తాను ప్రేమించినటుల ఒకరినొకరు ప్రేమించాలని యేసు తన శిష్యులకు నేర్పించాడు. యేసు వారితో, “నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించు కొనుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో, దానిని బట్టి, మీరు నా శిష్యులని అందరు తెలిసి కొందరు” (యోహాను. 13:34-35).

    నేడు మన సమాజములో షరతులతో కూడిన ప్రేమనే ఎక్కువగా ఉన్నది. జ్ఞానస్నానము, భద్రమైన అభ్యంగనము ద్వారా పరిశుద్ధాత్మను పొందియున్నను, పరిశుద్ధాత్మను పొందిన వారిగా మనం జీవించడం లేదు. దేవుని యొక్క అనంతమైన ప్రేమే మనలో వసిస్తున్న పరిశుద్ధాత్మ. తండ్రి దేవుని ఆత్మ, జీవము. ఆత్మ (హీబ్రు: ruah; గ్రీకు: pneuma) అను పదానికి గాలి, శ్వాస, పవనంఅనే మూలార్ధాలు ఉన్నాయి. ఇది దేవుని శ్వాస. మన ఆత్మలను పరిశుద్ధము చేయు ఆత్మ. ఆ అనంత ప్రేమను మన తోటి సహోదరీ, సహోదరులపై చూపుచూ జీవించాలి. మన ప్రేమ షరతులు లేని ప్రేమగా మారాలి. దేవునిపై, తోటివారిపై, షరతులు గల ప్రేమ నుండి షరతులు లేని ప్రేమగా మారడమే పవిత్రత. అనంతమైన ప్రేమతో తోటివారిని ప్రేమించే ప్రతీ విశ్వాసి, యేసునకు ప్రియ శిష్యుడుగా మారును.

    ప్రభువు మనకొసగిన గొప్ప వరం పవిత్రాత్మ. పవిత్రాత్మ వరంద్వారా, ఉత్థాన క్రీస్తు సాన్నిధ్యం మనతో ఉన్నది. ఆత్మ శక్తియే నేడు మనలను నడిపిస్తున్నది. దేవునికి సాక్షులుగా ఉండునట్లు చేయుచున్నది. “పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు ‘యేసే ప్రభువు’ అని అంగీకరింప జాలడు” (1 కొరి. 12:3). దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశ పెట్టెను. ఆ ఆత్మ, ‘అబ్బా! తండ్రీ!’ అని పిలచుచున్నది” (గలతీ. 4:6). క్రీస్తుతో సహవాసం ఏర్పడాలంటే, ముందుగా పవిత్రాత్మ మనలను స్పృశించాలి. కుమారుడు తండ్రి సహవాసములోనికి నడిపిస్తాడు (కతోలిక శ్రీసభ సత్యోపదేశం, నం. 683). అందుకే, మనం ఎన్నటికీ ఈ లోకములో అనాధలము కాము.

    ఆత్మపరిశీలన చేసుకుందాం: దేవుని ఆజ్ఞల పట్ల, నా భావన ఏమిటి? దేవుని ఆజ్ఞలను విశ్వాసముగా, ప్రేమతో పాటిస్తున్నానా? దేవుని ఆజ్ఞలు దేవుని త్రిత్వైక దేవుని సహవాసములో, ఐఖ్యతలో ఉండునట్లు చేయునని విశ్వసిస్తున్నానా? పవిత్రాత్మను పొందిన క్రీస్తు విశ్వాసిగా జీవిస్తున్నానా?

No comments:

Post a Comment