బైబులు భాషలు

 బైబులు భాషలు

హీబ్రూ, గ్రీకు, అరమాయిక్ భాషలు బైబులు భాషలుగా ప్రసిద్ధి గాంచాయి. హీబ్రూ మరియు అరమాయిక్ భాషలు సెమిటిక్ భాషల కుటుంబానికి చెందినవి (ప్రపంచ వ్యాప్తముగా ఐదు భాషల కుటుంబాలు ఉన్నాయి: ఆర్య భాషలు, ద్రావిడ భాషలు, మాంగోలాయిడ్ భాషలు, నీగ్రాయిడ్ భాషలు, సెమిటిక్ భాషలు). గ్రీకు భాష ఇండో-యూరోపియన్ భాష. సెమిటిక్ అనే పదం నోవా కుమారుడైన షేము (ఆది. 10:1) నుండి ఉద్భవించినది.

హీబ్రూ

హీబ్రూ కనాను మండలపు భాష. ఇశ్రాయేలు ప్రజలు పాలస్తీనా దేశములో స్థిరపడినప్పుడు, హీబ్రూ భాషను స్వీకరించారు (2 రాజు. 18:26, యెషయ 19:18). తద్వారా హీబ్రూ వారి అధికారిక భాషగా మారింది. పూర్వ నిబంధనలోని అనేక గ్రంథాలు హీబ్రూ భాషలోనే వ్రాయబడినవి. దీనిని 2 రాజు. 18:26లో “హీబ్రూ భాష” (Judean)గా, యెషయ 19:18లో “కనాను మండలపు భాష”గా, సీరా - పీఠిక 22, యోహాను 19:20లో “హీబ్రూ భాష” (Hebrew)గా పిలువబడుచున్నది. బాబిలోనియా ప్రవాసము తరువాత, అరమాయిక్ భాష, హీబ్రూ భాషను భర్తీ చేసింది. అరమాయిక్ భాషయే, హీబ్రూ భాషగా ప్రసిద్ధి గాంచినది (అ.కా. 21:40, 22:2).

కనాను మండలపు భాషనుండి హీబ్రూ భాష అభివృద్ధి చెందినది. బైబులు భాషలు అయిన హీబ్రూ, అరమాయిక్ భాషలు రెండుకూడా 22 హల్లులతో, ఒకే సంఖ్యగల వర్ణమాలను కలిగి యున్నాయి. ప్రతీ హల్లుకు ఒక సంఖ్యా విలువ కలదు. హీబ్రూ యూదుల అధికారిక భాషగా మారింది. వారి పవిత్ర గ్రంథాలన్నియు హీబ్రూ భాషలోనే వ్రాయబడినవి.

హీబ్రూ భాషను రెండు కాలాలుగా విభజించవచ్చు: ప్రవాస కాలమునకు ముందు మరియు ప్రవాస కాలము తరువాత. ప్రవాస కాలమునకు ముందు ఉన్న హీబ్రూ భాషను శాస్త్రీయ (classical) హీబ్రూ భాషగా పిలువవచ్చు. ప్రవాస కాలము తరువాత, అరమాయిక్ భాష ప్రభావితము వలన, హీబ్రూ భాష ఎన్నో మార్పులకు గురి అయినది. ఆ తరువాతి కాలములో, హీబ్రూ భాషకు బదులుగా, అరమాయిక్ భాష క్రమముగా ప్రజల సాధారణ భాషగా మారినది.

అరమాయిక్

అరమాయిక్ చాలా పురాతన భాష. క్రీ.పూ.1000 మధ్య కాలములో, పశ్చిమ ఆసియా భూభాగములోనికి చొచ్చుకొనిపోవ ప్రారంభించిన సంచార జాతుల వారు ఈ భాషను మాట్లాడేవారు. అరమేయులు (Aramaens) ఎప్పుడు కూడా సామ్రాజ్యాలను స్థాపించలేదు, కాని వారికంటూ చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. అయితే, వీరి భాష అక్కాడియన్ భాషను భర్తీచేసి, దౌత్యములో మాధ్యమ భాషగా మారినది. అరమాయిక్ భాషను అస్సీరియా, బాబిలోనియా, పర్షియన్ ప్రజలు వాడారు. పర్షియనుల ద్వారా అరమాయిక్ భాష భారత దేశమునకు కూడా చేరినది. అశోక చక్రవర్తి యొక్క కొన్ని శాసనాలు అరమాయిక్ భాషలో కనుగొన బడ్డాయి.

అరమాయిక్ భాషలో వ్రాయబడిన పూర్వ నిబంధన గ్రంథ భాగాలు: ఆది. 31:47, యిర్మీ. 10:11, దాని. 2:4b-7:28, ఎజ్రా. 4:8-6:18, 7:12-26.

అరమాయిక్ ‘బాబిలోనియా తాల్ముద్’ యొక్క ప్రధాన భాష. తాల్ముద్ అనగా “విద్య”. ఇది సాహిత్య గ్రంథము. యూద బోధకుల రచనలు, బోధనలను సమీకరించి ఒక సాహిత్యముగా మలిచారు. దీనినే ‘వ్యాఖ్యానం’ అని కూడా అంటారు.

బాబిలోనియా ప్రవాసము తరువాత, హీబ్రూ భాషకు బదులుగా, అరమాయిక్ భాష యూదుల ప్రధాన భాష అయినది. అరమాయిక్ భాష యేసు మరియు ఆయన శిష్యుల మాతృభాష.

గ్రీకు

అలెగ్జాండ్రియా యూదుల సౌలభ్యము కొరకు, హీబ్రూ బైబులు గ్రంథము, క్రీ.పూ. 3వ శతాబ్దములో గ్రీకు భాషలోనికి అనువాదం చేయబడినది. గ్రీకు బైబులును సెప్తువజింత్ (LXX) అని పిలువబడుచున్నది. జామ్నియా (క్రీ.శ. 85-90) సమావేశము వరకు గ్రీకు బైబులు, యూదులకు అత్యంత ప్రియమైనదిగా ఉండినది. ఎప్పుడైతే, క్రైస్తవులు గ్రీకు బైబులును ఉపయోగించడం ప్రారంభించారో, యూద పండితులు దానిని తిరస్కరించారు. యూదులు కేవలం హీబ్రూ బైబులును మాత్రమే ఉపయోగించడం ప్రారంభించారు.

పూర్వ నిబంధనలోని సొలోమోను జ్ఞానగ్రంథము, మక్కబీయుల రెండవ గ్రంథము మరియు నూతన నిబంధనలోని అన్ని గ్రంథాలు కూడా గ్రీకు భాషలోనే వ్రాయబడినవి. బైబులు గ్రీకు భాష శాస్త్రీయ గ్రీకు భాష కాదు, కాని ప్రసిద్ధ భాష లేదా వాడుక భాష (Koine).

గ్రీకు గ్రీసు సామ్రాజ్యపు అధికారిక భాష. అలెగ్జాండరు మహా చక్రవర్తి (క్రీ.పూ. 356-323) దండయాత్ర తరువాత, గ్రీకు భాష ఆసియా, ఐగుప్తు (ఈజిప్టు) దేశాలలో వాడుక భాష అయినది. 

No comments:

Post a Comment