ఒత్తిడి చట్రంలో బతుకు చిత్రం

ఒత్తిడి చట్రంలో బతుకు చిత్రం

ప్రభువా! మార్చలేని వాటిని అంగీకరించుటకు నాకు ప్రశాంతత నొసగుము.
మార్చగలిగే వాటిని మార్చుటకు ధైర్యమునిమ్ము.
ఆ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకొను జ్ఞానమొసగుము.


ఒత్తిడి అనేది మన జీవితంలో భాగం. ఇది ప్రతీ ఒక్కరు అనుభవించేదే! జీవితములో మంచి ప్రదర్శన చేయడానికి, మనలను ప్రేరేపించుటకు కొంతవరకు ఒత్తిడి అవసరమే! అది ‘పరిమితి’ దాటితే సమస్యగా మారవచ్చు! మన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్థితిని ప్రభావితం చేయగలదు. అయితే, ఎంతమాత్రం భయపడనవసరం లేదు. ఒత్తిడికి మనం ఎలా ప్రతిస్పందిస్తాము, అనగా మన ఆలోచనాధోరణిపై ప్రధానముగా దాని నియంత్రణ ఆధారపడి ఉంటుంది. కనుక, ఇది మన చేతులో పనే!

ఒత్తిడికి కారణాలు అనేకం. అనుదిన జీవితములోని ఆందోళనలకు కారణం ఏదైనా కావచ్చు! ఒక్కోసారి నీవే కారణం కావొచ్చు! ప్రధాన కారణాలు: పని, ఆర్ధికం, ఆరోగ్యం, సంబంధాలు మొ.వి. ప్రస్తుతం కరోన వైరస్ వలన మన జీవితములో ఎంతో అనిశ్చితి నెలకొన్నది! దానితోపాటు ఆంక్షలు, పరిమితులు... ఎంతో ఒత్తిడికి లోనవుతున్నాము (మన మంచి కోసమే, వాటిని మనం మార్చలేము!).

అయితే, కఠినమైన సమయములో చాలామంది దేవునికి ప్రార్ధనలు చేస్తారు. బైబులును చదువుతారు. బైబులు వాక్యం ద్వారా ఒత్తిడినుండి బయటపడటానికి దేవుడు మనకు సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధముగా ఉంటారు.

ముందుగా, మన ఒత్తిడికి కారణాలేమిటో విశ్లేషించు కోవాలి. బాహ్యముగా వ్యక్తులు, పరిస్థితులు కావొచ్చు. అంత:ర్గతముగా మన ఆలోచనలు కావొచ్చు, కనుక మన ఆలోచన విధానాన్ని పరిశీలించుకోవాలి. చాలాసార్లు, అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాము. కారణాలన్నింటిని జాబితాగా రాసి, ఏవి ఎక్కువ, ఏవి తక్కువ ఒత్తిడిని కలిగిస్తున్నాయో గుర్తించండి. వీటి గురించి దేవుని సన్నిధిలో ధ్యానించండి. మీకు నమ్మకమైన వారితో చర్చించండి. పరిష్కారం తప్పక దొరుకుతుంది.

నాలుగు విషయాలు చాలా ముఖ్యం:

1. శారీరక స్థితి

ప్రతీ ఒత్తిడికి మన శరీరం ప్రతిస్పందిస్తూ ఉంటుంది. కనుక, మన శరీరానికి తగిన విశ్రాంతి (సుఖ నిద్ర), మంచి భోజనం (సరైన పోషణ), వ్యాయామం తప్పనిసరి.

సరిపడ నిద్రించడం చాలా కీలకం. నిద్రలేమి ఒత్తిడి ఉన్నదని చెప్పడానికి ఒక కారణం. నిద్రలేమికి కారణం ఏమిటో తెలుసుకోండి. ఏదైనా సమస్య ఉంటే, ప్లాన్ ప్రకారం దానిని నియంత్రించండి. ఒక క్రమం చొప్పున ఒకే సమయములో నిద్రకు ఉపక్రమిస్తే మేలు. “నీవు శయనించునపుడు భయపడక నిశ్చింతగా నిద్రపోదువు” (సామె. 3:24). శిష్యులు వారు చేసిన ప్రేషిత కార్యములను, బోధనలను తెలియచేసినప్పుడు, యేసు వారితో, “మీరు ఏకాంత స్థలమునకు వచ్చి, కొంత తడవు విశ్రాంతి తీసికొనుడు” (మార్కు. 6:31) అని చెప్పారు.

విరామం మనకు ఎంతో అవసరం. అది మన ఒత్తిడిని తగ్గించేదిగా ఉండాలి.

మన దేహాలకు సరైన (తగురీతిలో) పోషణ ఇవ్వడం ఎంతో అవసరం. పోషక విలువలు ఎంతో ముఖ్యం. “నీవు తినినను, త్రాగినను, ఏమిచేసినను,  దానిని అంతటిని  దేవుని మహిమ కొరకై  చేయుము” (1 కొరి. 10:31).

శారీరక వ్యాయామం ఒత్తిడిని తగ్గించడానికి అద్భుతముగా ఉపయోగపడుతుంది. మనం బాగా ఇష్టపడి, మరింత సౌకర్యవంతముగా ఉండేదే ఉత్తమ వ్యాయామం. ఏది చేసినా క్రమం తప్పకుండా చేద్దాం. మన శరీరం ‘ఫిట్’గా ఉంటే, మన గురించి మనకే మంచి భావన కలుగుతుంది.

- గట్టిగ ఊపిరి పీల్చండి. శ్వాస ఆందోళనకు విరుగుడు.

- సంగీతం వినండి, మంచి పుస్తకాలు చదవండి.

- నడక, పరిగెత్తడం, తోటపని...

“నేను భ్రష్టుడను కాకుండుటకై నా శరీరమును నలుగ గొట్టుకొనుచు అదుపులో ఉంచుకొందును” (1 కొరి. 9:27) అని పౌలు అన్నారు.

నవ్వండి. ఒత్తిడిలో నవ్వు ఎంతో ప్రభావితం చేస్తుంది. నవ్వు అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఊపిరి తిత్తులను శుభ్రం చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను వృద్ధి చేస్తుంది. నవ్వు సంతోషంగా, ఉత్సాహముగా ఉండే అనుభూతిని కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన మంచి నవ్వు కలిగి ఉండటానికి మనం ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఎదుటివారిని నొప్పించే విధంగా మన జోకులు ఉండకూడదు. “ప్రభువు మీకు ప్రసాదించిన ఆనందమే మీకు శక్తి” (నెహెమ్యా 8:10).

2. మానసిక స్థితి

ఒత్తిడివల్ల మానసిక లక్షణాలు: అలసట, ఆందోళన, చిరాకు లేదా కోపం. ఈ ఒత్తిడులను తగ్గించుకోవడానికి మనకు ఎన్నో మార్గాలున్నాయి: ఔషధం, చికిత్స, ధ్యానం, యోగ... మన మనస్సులను, భావోద్రేకాలను క్రమబద్దీకరించు కోవాలి. దాని ఫలితం దీర్ఘశాంతం, లేకపోతే ఒత్తిడి. సానుకూలమైన దృక్పధం, వైఖరిని అలవర్చుకుందాం. దీనికి విశ్వాసంతోపాటు (మన జీవితం దేవుని ఆధీనములో ఉంది) మానసిక క్రమశిక్షణ ఎంతో అవసరం. వాస్తవంగా ఎదురయ్యే సమస్యను మనస్సుపెట్టి ఆలోచించాలి. ఒక పరిస్థితిలో మనం ఎంత ఒత్తిడికి గురవుతున్నామనేది మన వైఖరిపైనే, మన ఆలోచన విధానముపైనే ఉంటుంది.

మన మానసిక స్థితి సరిగా ఉండాలంటే, మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో గమనించాలి. మనస్తత్వాలు / వైఖరులు అంటువ్యాధి లాంటివి. నిరాశావాదానికి దూరంగా ఉండండి. విశ్వాసముతో, ఆశావహ దృక్పధముతో ముందుకు సాగాలి. మన సానుకూల వైఖరి మనలను శారీరకముగ దృఢముగా ఉంచుతుంది. “శాంత గుణము వలన ఆయురారోగ్యములు కల్గును” (సామె. 14:30).

అభద్రతా భావం మనలను దుర్భల స్థితికి చేర్చుతుంది. అభద్రతా భావం కలిగించే వ్యక్తులకు, పరిస్థితులకు దూరంగా ఉండాలి. నమ్మకం కలిగించే వ్యక్తులు భద్రతా భావాన్ని కలిగిస్తారు. దేవుని చిత్తం తెలుసుకోగలగాలి. దేవుడు మనకు ఎన్నో సూచనలు చేస్తాడు, కాని మనం పట్టించుకోము. ఆతరువాత నిరుత్సాహం, నిరాశ, తద్వార ఒత్తిడి. “దేవుని ఉద్దేశానుసారముగా పిలువబడిన వారికి, అన్నియును మంచికే సమకూరునట్లు దేవుడు చేయునని మనకు తెలియును” (రోమీ. 8:28). “నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియును. నేను మీ అభివృద్ధినేగాని వినాశనము కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించితిని” (యిర్మీ. 29:11) అన్న మన దేవుని మాటలను విశ్వసించుదాం.

3. సంబంధ బాంధవ్యాలు

ప్రేమ, క్షమ, శాంతం తప్పక మన బాంధవ్యాలలో ఉండాలి. లేకపోతే పంతాలు, పట్టింపులు, తద్వారా ఒత్తిడి. “అందరి తోడను సౌమ్యముగా జీవించునట్లు మీకు సాధ్యమైనంత వరకు ప్రయత్నింపుడు” (రోమీ. 12:18) అని పౌలు చక్కటి సలహా ఇచ్చారు. మన జీవితములో ప్రతీ సంబంధాన్ని విశ్లేషించుకొని, ఆ సంబంధం కొరకు నా సమయాన్ని ఎంతవరకు వెచ్చించవచ్చో ప్రార్ధనాపూర్వకముగా నిర్ధారించుకోవాలి. ఎప్పుడు వాదిస్తూ, వ్యతిరేక ధోరణితో ఉండేవారికి దూరంగా ఉండటం మంచిది. వేరేవాళ్ళ గురించి చెవులు కొరుక్కొనేవారితో, ఇతరులను విమర్శించేవారితో, కించపరచే మాటలు మాట్లాడేవారితో మన సమయం వెచ్చించాల్సిన అవసరం లేదు. ఒత్తిడికి కారకులయ్యే వ్యక్తులకు దూరముగా ఉండటం మంచిది లేదా వారితో వ్యవహరించే వివేచన మనకుండాలి.

క్షమించలేని తత్వం మనలను ఒత్తిడికి గురిచేస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడిని తగ్గించడంలో క్షమాపణ అనేది సర్వోత్తమమైనది. మన మనస్సుకు కలిగిన బాధను వదిలిపెడితే, మన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. “ఇతరులను క్షమించు, అపుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ తప్పిదములను క్షమించును” (మార్కు. 11:25). క్షమించుటకు మన బలం సరిపోదు, దేవుని సహాయం మనకు తప్పక కావాలి. అందుకే “క్షమించడం దైవీక లక్షణం” అన్నారు.

మనం చేసిన తప్పుకు మనమే బాధ్యత వహించాలి. దానిని వేరేవారిపై నెట్టడం కాదు లేదా సాకులు చెప్పడం కాదు. మన తప్పులను కప్పిపుచ్చుకుంటే, ఒత్తిడిని కోరితెచ్చుకున్నట్లే!

4. ఆర్ధిక స్థితి

నిజాయితీగా కష్టపడి పనిచేయాలి. లేకపోతే, అప్పులు, చెడు వ్యాపార లావాదేవీలు, తద్వారా ఒత్తిడి కలిగించే పరిస్థితులకు లోనవుతాము. పాపం ఒత్తిడికి గురి చేస్తుంది. మన జీవితాలు పరిశుద్ధంగా, నీతిగా ఉండేలా చూసుకోవాలి. మన పని, బాధ్యతలు సక్రమముగా చేసినప్పుడు, దేవుడు మనలను హెచ్చిస్తాడు.

ఆశలకూ ఆదాయానికి మధ్య సర్దుబాటు చేసుకోవాలి. మన ఆర్ధిక స్థితిని గుర్తించాలి. అవసరమై కొంటున్నానా లేదా ఆశతో కొంటున్నానా? అని ప్రశ్నించుకుందాం. పొదుపు చేయడం ఎంతో మంచిది. బంధువులకు, స్నేహితులకు అప్పుగా ఇవ్వకండి. అప్పులు చేయవద్దు. ఆదాయం కంటే తక్కువలోనే బ్రతకడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది.

మనకున్న దానితో తృప్తిగా ఉందాం. “డబ్బును కోరుకొను వారికి అది చాలినంత లభింపదు. ధనము ఆశించు వానికి అది వలసినంత దొరకదు. ఇదియును వ్యర్ధమే” (ఉపదేశకుడు 5:10). “మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్ధనలో దేవుని అర్దింపుడు” (ఫిలిప్పీ. 4:6).

పై నాలుగు విషయాలకు పునాది: ప్రార్ధన, ధ్యానం, దేవుని వాక్యం, ఆధ్యాత్మిక జీవితం. ఇతరత్ర ఆకర్షణలకు లోనుకాకుండా, మన పునాదిని పటిష్ట పరచుకోవాలి. ప్రార్ధనలో నిలకడ (నిర్దిష్ట సమయం, స్థలం) ఉండాలి. మన మనుగడ మన దేవునితో నున్న సంబంధాన్ని బట్టే ఉంటుంది! తుఫాను రాకముందే మన పునాదిని పటిష్ట పరచుకుందాం. “ఆపదలో ధైర్యము కోల్పోవువాడు నిజముగా దుర్భలుడే” (సామె. 24:10) నిజమే కదా! మన జీవితములోని ఒత్తిళ్లను తప్పించుకోలేము. కాని ప్రార్ధనతో, దేవుని వాక్యముతో మన ఆత్మలను బలపరచుకోవచ్చు. తద్వారా ఒత్తిడులను ఎదుర్కోవడానికి శక్తిని, ధైర్యాన్ని పొందుతాం.

1. దేవుని ఆరాధించు: ఒత్తిడి కోపానికి దారి తీస్తుంది. మనం రోజు ప్రార్ధించే దేవుని మీద కూడా కోపపడతాము, ఆయనను నిందిస్తాము లేదా విస్మరిస్తాము. దేవుడు మన సృష్టికర్త. మన స్తుతులకు ఆయన ఎప్పుడు పాత్రుడే, అర్హుడే. దేవుని ఎలా స్తుతించాలో తెలియకపోతే, ఈ బైబులు వాక్యాల సహాయం తీసుకో: హెబ్రీ. 12:28; కీర్తన. 95; కీర్తన. 100.

2. ప్రార్ధించు: దేవునిపై ఆధారపడి జీవించు. దేవుని సలహా తీసుకో. దేవుని ఆలోచన ఏమిటో తెలుసుకో. గతంలో దేవుడు నీకు చేసిన గొప్ప కార్యాలను విశ్వసించు. నీ సమస్యకన్న దేవుడు గొప్పవాడని తెలుసుకో! “దేవుడు నమ్మదగినవాడు. మీ నిగ్రహశక్తిని మించి మిమ్ము శోధింపనీయడు. అంతేకాక, మీరు శోధింపబడునప్పుడు, దానిని సహింపగల శక్తిని మీకు ఒసగి, బయట పడు మార్గమును మీకు ఆయన చూపును” (1 కొరి. 10:13). “నాకు అసాధ్యమైనదేమి కలదు?” (యిర్మీ. 32:27) అని దేవుడు పలుకుచున్నాడు. ప్రార్ధించడం సులువు అనుకుంటాం, కాని కొన్నిసార్లు కష్టముగానే ఉంటుంది. కనుక ఈ బైబులు వాక్యాల సహాయముతో ప్రార్ధించు: 1 తెస్స. 5:17; యిర్మీ. 29:11-14; 1 యోహా. 5:14-15.

3. సహాయం కొరకు అడుగు: ఒత్తిళ్లలో ఒంటరి పోరాటం చేయకూడదు. మన మీద జాలిపడేవాళ్ళు కాదు, మనలను పట్టించుకోనేవాళ్ళు ఉండటం మంచిది. పొరుగు వారిని ప్రేమించడం, క్రీస్తును పోలి జీవించడాన్ని ప్రోత్సహించడంలో భాగంగా, తోటివారి బాధలను పంచుకోమని గలతీ. 6వ అధ్యాయం ఉపదేశిస్తుంది. శారీరక, మానసిక ఒత్తిడి కలిగినప్పుడు, తక్షణమే నమ్మకమున్న కుటుంబ సభ్యులనుగాని, స్నేహితులనుగాని, సహోద్యోగులనుగాని, సహాయం అడగాలని మరచిపోకు. రోమీ. 12:4-5; సామె. 11:2; నిర్గమ. 18:14-15.

4. సంఘాన్ని కోరుకో: ఒత్తిడికి లోనైనప్పుడు, మనం జీవిస్తున్న సంఘాన్ని మరచిపోతాము. ఒంటరివారమని అనుకుంటాము. ఒంటరితనం మన భయాన్ని, ఆందోళనను అధికం చేస్తుంది. క్రీస్తు శరీరమైన తల్లి శ్రీసభ తోటిసంఘం. మనం బలహీనులుగా ఉంటే, మనలను బలపరచడానికి, మనకు సహాయం చేయడానికి, కష్టాల సమయములో మద్దతు ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటుంది. సంఘమునుండి పారిపోవడానికి ప్రయత్నం చేయకు. ఒక చిన్న సందేశం ద్వారా ప్రార్ధన చేయమని సంఘాన్ని అభ్యర్దించు. నీ గురించి శ్రద్ధ వహించేవారు తప్పక నీకోసం ప్రార్ధన చేస్తారు: హెబ్రీ. 10:24-25; 1 కొరి. 12:25-27.

5. బైబులు చదువు: దేవుని వాక్యాన్ని హృదయములో పదిలపరచుకొని, దాని ప్రకారం జీవించు. బైబులు మనలో నిరాశను తొలగించి ఆశను, నమ్మకాన్ని బలపరుస్తుంది. ఒత్తిడులను (ఆత్రుత, ఆందోళన, విచారము, చింత, వెత, భారము, ఆలసట) దేవునికి అప్పజెప్పమని వాక్యం కోరుతుంది: చదువుము. ఫిలిప్పీ. 4:6-7, మత్త. 6:34, సామె. 3:5-6, మత్త. 11:28-30.

ఒత్తిడికి బైబులు చూపే పరిష్కారం ఒక్కటే – దేవునిపై ఆధారపడి జీవించండి. నా సృష్టికర్త నాకోసం మరణించేంత వరకు నన్ను ప్రేమించి, నా పాప భారాన్ని తొలగించిన ఆయన, నా అనుదిన జీవిత ఒత్తిళ్లను తప్పక పట్టించుకుంటాడు.
Fr. Praveen Kumar Gopu OFM Cap.
STL (Biblical Theology), M.A. Psychology

No comments:

Post a Comment