15వ సామాన్య ఆదివారము, Year B
ఆమో. 7:12-15; ఎఫెసీ. 1:3-14; మార్కు. 6:7-13
దేవుని ఎంపిక
యేసు తన పన్నిద్దరు శిష్యులను [అపోస్తలులు] తన చెంతకు పిలిచి, బోధించుటకు జంటలుగా వారిని వివిధ గ్రామములకు పంపారు. యేసు తన శిష్యులను పిలిచారు, సిద్ధపరచారు, ఎన్నుకున్నారు, దేవుని చిత్తమైన సువార్త పరిచర్యకు వారిని ప్రవక్తలుగా పంపారు. శిష్యులు వెళ్లి పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలెనని ప్రజలకు బోధించారు. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు యేసు వారికి శక్తిని ఇచ్చినందున, వారు అనేక పిశాచములను పారద్రోలారు. రోగులకు అనేకులకు తైలము అద్ది స్వస్థపరచారు.
యేసు వారిని సువార్త పరిచార్యకు పంపే ముందుగా, వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు చేసారు. ప్రయాణానికి కనీస అవసరాలైన చేతి కర్ర, పాదరక్షలను
మాత్రమే తీసుకొని వెళ్ళాలని కోరారు. రొట్టెగాని, సంచిగాని, ధనమునుగాని, రెండు
అంగీలనుగాని తీసుకుపోరాదు. భోజనము, ఆతిధ్యము కొరకు యేసు శిష్యులు దేవునిపై
ఆధారపడాలి. దేవునిపై విశ్వాసము కలిగి జీవించాలి. వారు ప్రధానముగా బోధకులుగా,
సాక్షులుగా జీవించాలి.
యేసు
సూచనలు చాలా ప్రాముఖ్యమైనవి, అత్యవసరమైనవి. శిష్యులు లోక శోధనలలో, వ్యామోహాలలో
పడిపోకుండా ఈ సూచనలు వారికి ఎంతగానో తోడ్పడతాయి. యేసు సూచనలను అలక్ష్యంచేస్తే, అనవసరమైన విషయాలపై దృష్టి
మరలుతుంది.
మార్కు సువార్తీకుడు మాత్రమే పాదరక్షలను తీసుకెళ్లడం గురించి ప్రస్తావించారు. మత్తయి సువార్తలో చేతి కర్ర, పాదరక్షలను తీసుకువెళ్లరాదని చెప్పబడింది (మత్త. 10:10). లూకా అసలు పాదరక్షలనే ప్రస్తావించ లేదు (లూకా. 9).
ఆమోసును దేవుడు ఎన్నుకొని తన ఉద్దేశమును తెలియజేయుట:
ప్రవక్తలు
దేవుని సందేశాన్ని ప్రజలకు ప్రకటించేవారు. దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు
కొనివచ్చువారు. అయితే, దేవుని వాక్కును నిరాకరించువారు, దేవుని దీవెనలు,
ఆశీర్వాదాలను కోల్పోవుదురు. యూదా రాజ్యములోని బెత్లెహేము దారిలోని తెకోవ
గ్రామానికి చెందిన గొర్రెలకాపరి, అత్తిపండ్లు అమ్ముకుంటూ జీవనోపాధిని సాగించే ఆమోసును
(క్రీ.పూ. 760-755) దేవుడు తన ప్రవక్తగా ఎన్నుకున్నాడు. దేవుడు అతనికి ఒక ఉద్దేశాన్ని
నిర్దేశించాడు. అదియే, యిస్రాయేలీయులకు ప్రవచనము చెప్పుమని ఆజ్ఞాపించారు.
యిస్రాయేలు దేశములో ప్రవక్తలు లేక కాదు. కాని, దేవుడు ప్రవక్తకాని ఆమోసును
ఎన్నుకున్నారు. దేవుని పిలుపు, ఎన్నిక ఇలాగే ఉంటుంది! [దేవుని ప్రజలు సోలోమోను
మరణం తరువాత, క్రీ.పూ. 930, రెండు రాజ్యాలుగా చీలిపోయారు. 10 తెగలు ఉత్తర రాజ్యము
(యిస్రాయేలు), 2 తెగలు దక్షిణ రాజ్యము (యూదా)గా విడిపోయారు].
రెండవ యరోబాము రాజు పాలన కాలములో (క్రీ,పూ. 785-745), యిస్రాయేలు అన్నిరంగాలలో అభివృద్ధి చెందారు. కాని, మతాచార విషయాలలో యిస్రాయేలీయులు చిత్తశుద్ధిని కోల్పోయారు. అవినీతి బాగా పెరిగిపోయింది. సామాజిక న్యాయం అడుగంటి పోయింది. అలాంటి పరిస్థితులలో ప్రవక్తగా పిలువబడిన ఆమోసు అవినీతి, అన్యాయాలకు విరుద్ధముగా ప్రవచించారు. దేవుని తీర్పు గురించి ప్రవచించారు. పశ్చాత్తాపపడి దేవునివైపుకు మరలి రావాలని కోరారు. పశ్చాత్తాపపడనిచో, ప్రవాసమునకు (బానిసత్వము) వెళ్ళుదురని చెప్పారు. అలాగే, కొన్ని సంవత్సరాలకే వారు అస్సీరియాకు బానిసలుగా కొనిపోబడ్డారు.
అయితే, దేవుని వాక్యమును తెలియజేయడానికి
యిస్రాయేలుకు వచ్చిన ఆమోసును, యాజకుడైన అమాస్యా నిరాకరించాడు. రాజుపై కుట్రలు
పన్నుచున్నాడని యరోబాముకు వర్తమానము పంపాడు. అమాస్యా ఆమోసుతో, “దీర్ఘదర్శీ!
[ప్రవక్త] నీవిక యూదాకు వెడలి పొమ్ము. అచట ప్రవచనము చెప్పి పొట్టపోసి కొనుము. ఇక
బెతేలున మాత్రము ప్రవచనము చెప్పవలదు. ఇది రాజు ఆలయము. ఈ రాజ్యమునకు చెందిన
దేవాలయము” అని అన్నాడు. అమాస్యా మాటలు యిస్రాయేలు ఎలాంటి స్థితిలో ఉన్నదో
స్పష్టమగు చున్నది. అందుకు ఆమోసు, “నేను భుక్తి కొరకు ప్రవచనములు చెప్పువాడను
కాను. ప్రవక్తల సమాజమునకు చెందినవాడను కాను. నేను మందల కాపరిని. అత్తిచెట్లను
పరామర్శించు వాడను. కాని ప్రభువు గొర్రెల కాపరినైన నన్ను పిలిచి నీవు వెళ్లి
యిస్రాయేలీయులకు ప్రవచనము చెప్పుమని ఆజ్ఞాపించెను” అని చెప్పారు.
ఆమోసు కాలములోనైనా, యేసు కాలములోనైనా, అపోస్తలుల కాలములోనైనా, మన కాలములోనైనా, పశ్చాత్తాపపడి దేవుని వైపుకు మరలి రావాలనేదే దేవుని సందేశం! అప్పుడే, దేవుని దీవెనలు మనపై కురుస్తాయి. అలాగే, దేవుడు ఒక్కొక్కరికి ఒక ఉద్దేశాన్ని నిర్ణయించాడు. దానిని తప్పక నెరవేరుస్తారు. దేవుని పిలుపు ఎప్పుడు, ఎలా వస్తుందో ఆశ్చర్యకరముగా ఉంటుంది!
రెండవ పఠనము
పౌలుద్వారా దేవుడు మన ఎన్నిక, పిలుపు గురించి ఇలా తెలియజేయుచున్నారు: క్రీస్తునందు దేవుడు, మనలను ఆశీర్వదించి,
మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మిక ఆశీస్సును ఒసగుచున్నారు. “మనము పవిత్రులముగను,
నిర్దోషులముగను ఉండుటకు లోకసృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారిగా
ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమవలన, క్రీస్తుద్వారా మనలను కుమారులనుగ తన
చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని యుండెను. ఇది ఆయన సంతోషము,
సంకల్పము.” ఇదియే ప్రవక్తలందరు బోధించిన సందేశము.
కనుక, దేవుని ఆశీస్సులు పొందాలంటే, మనం పవిత్రముగా నిర్దోషులుగ జీవించాలన్నదే దివ్య సందేశము. ఆమోసు సందేశము కూడా ఇదియే! క్రీస్తు చేత పంపబడిన అపోస్తలుల సందేశము కూడా ఇదియే! క్రీస్తునందు బోధించు, జీవించు నేటి ప్రవక్తల సందేశము కూడా ఇదియే!
ఆమోసువలె
సాధారణ జీవితాలను జీవించుచున్న మనలను కూడా ప్రభువు తన సేవకు పిలుచుకుంటాడు.
జ్ఞానస్నానము ద్వారా మనము ఇప్పటికే ఆయనకు బోధకులుగా, సాక్షులుగా, సేవకులుగా పిలువబడినాము. ఇతరుల సేవకై పిలువబడినాము. ఇది అనుకోకుండా జరిగినది కాదు. దేవుడు
ఉద్దేశపూర్వకముగా మనలను ఎన్నుకున్నారు. శిష్యులవలె మనలనుకూడా అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి పంపుచున్నారు. నేటి అపవిత్రాత్మలు: మత్తుపదార్ధాలు, తాగుబోతుతనం,
జూదం, వ్యామోహం, అవినీతి, భౌతికవాదం, వినియోగవాదం...
Very nice and clear and more enriching the soul
ReplyDeleteThank dear fr