14వ సామాన్య ఆదివారము, Year B

 14వ సామాన్య ఆదివారము, Year B
యెహెజ్కె. 2:2-5; 2 కొరి. 12:7-10; మార్కు. 6:1-6


యేసు తన పట్టణమైన ‘నజరేతు’కు తిరిగి వచ్చెను. శిష్యులు కూడా ఆయనతో ఉండిరి. యేసు పుట్టినది బెత్లేహేములో అయినప్పటికిని, పెరిగింది నజరేతులోనే కనుక, యోసేపు, మరియ, యేసు గురించి అక్కడ వారందరికీ బాగా తెలుసు! తన వారి వద్దకు తిరిగి వచ్చిన యేసు, విశ్రాంతి దినమున ప్రార్ధనా మందిరములో బోధించెను. ఆరంభములో ఆయనను వినుచున్న వారందరూ ఆశ్చర్యపడ్డారు. కాని మరుక్షణములోనే వారు ఆయనను విశ్వసించలేదు. ఆయనను అనుమానంగా చూసారు. శత్రువులా భావించారు. దీనికి ముఖ్యకారణం, వారికి యేసు చిన్నపటినుండి బాగా తెలుసు. ఆయన కుటుంబం అందరికీ బాగా పరిచయం. ఒక సాధారణ కుటుంబం! సాధారణ ప్రజలు! కాని ఇప్పుడు యేసు బోధకుడిగా, ప్రవక్తగా వారిమధ్య కనిపించారు. ఆయన చేసిన అద్భుత కార్యములను, అతని జ్ఞానమును గురించి విన్నారు, చూసారు.

యేసు నజరేతును వీడి (మత్త. 4:13), “హృదయ పరివర్తనము చెందుడు. పరలోక రాజ్యము సమీపించి యున్నది” (4:17) అని బోధిస్తూ, పన్నెండు మంది అపోస్తలులను ఎన్నుకొని (4:18-22) తన బహిరంగ ప్రేషిత కార్యాన్ని ప్రారంభించారు. “ఆయన కీర్తి గలిలీయ ప్రాంతమంతట వ్యాపించెను” (మార్కు. 1:28). ఆయన కీర్తిని వారు అంగీకరించలేక పోయారు. ముఖ్యముగా, ఒక వండ్రంగి కుమారుడనైన యేసును వారు ఎదురు చూస్తున్న మెస్సయగా అంగీకరించలేక పోయారు. వారు ఎదురుచూసే మెస్సయ, రోమను సామ్రాజ్యాన్ని కూలదోసి, యూదుల రాజ్యాన్ని స్థాపిస్తాడని వారు భావించారు.

అందుకే వారు, వారికి బాగా పరిచయమున్న యేసును మెస్సయగా అంగీకరించలేక పోయారు. వారు, “ఈయనకు ఇంత జ్ఞానము ఎక్కడనుండి వచ్చినది? (యేసు చదువులేని వాడని అంటున్నారు) అద్భుత కార్యములను ఎట్లు చేయగలుగు చున్నాడు? ఈయన వండ్రంగి కాడా? మరియమ్మ కుమారుడు కాదా? [యేసు పుట్టుక రీతిని అవమానిస్తున్నారు; ఆయన ఎక్కడనుండి వచ్చాడో ఎరుగక ఉండిరి: యోహాను. 7:27, 9:29-30] అని చెప్పుకొనుచు ఆయనను తృణీకరించిరి.” ఇంతకు ముందే, మార్కు. 3:21లో ఇలా చదువుచున్నాము: “ఆయన కుటుంబ సభ్యులు ఆ విషయమును విని, ఆయనకు మతి చలించినదని ప్రజలు పలుకుచుండుటచే ఆయనను అచటి నుండి తీసుకొని వెళ్ళుటకు వచ్చిరి.”

యేసును వారు ఒక ‘వైఫల్యము’గా (ఫెయిల్యూర్) భావించారు. వారి ప్రతికూల వైఖరిని చూసి యేసు వారితో, “ప్రవక్త తన పట్టణమునను, బంధువుల మధ్యను, తన ఇంటను తప్ప ఎచటనైనను గౌరవింపబడును” అని పలికారు. వారి అవిశ్వాసానికి యేసు ఆశ్చర్యపడ్డారు. అవిశ్వాసం అనగా దేవుని శక్తిని గుర్తించక పోవడం! అందుకే యేసు అక్కడ తన స్వంత పట్టణములో, కేవలం కొంతమందిని మాత్రమే స్వస్థత పరచారు. ఏ అద్భుతమును అక్కడ చేయజాలక పోయారు. అందులకు యేసు, తన శిష్యులతో అచటనుండి పరిసర గ్రామాలకు వెళ్లి ప్రజలకు బోధించారు. తన వారిమధ్య నిరాకరింప బడిన యేసు, ఇతర చోట్లలో ఓ నూతన కుటుంబాన్ని ఏర్పరచుకున్నారు. తన వారు నిజముగా ఎవరో స్పష్టం చేసారు: “దేవుని చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి” అని ప్రకటించారు (మార్కు. 3:31-35). దేవుని చిత్తమును నేరవేర్చుటయనగా, మన జీవితములో జరుగు అద్భుత కార్యములను గుర్తించడం, మనపట్ల దేవుని ప్రణాళికను అంగీకరించడం, దేవునితో సహవాసం చేయడం.

సమూవేలు మొదటి గ్రంథము 16:7లో ఇలా చదువుచున్నాము: “ఇతని రూపమును, ఎత్తును చూచి భ్రమపడకుము. నేనితనిని నిరాకరించితిని. దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు. నరుడు వెలుపలి రూపమును మాత్రమే చూచును. కాని దేవుడు హృదయమును అవలోకించును.” అందుకేనేమో మనం నేడు ఎంతో అందముగా అలకరించుకుంటాము! ఎందుకంటే, మనం కేవలం బాహ్యరూపం మాత్రమే చూస్తాము కాబట్టి! 

మన హృదయాలు గర్వముతో [అహం] ఉంటే, వాస్తవాలను చూడలేము, సత్యాలను గ్రహించలేము. ఇతరులను అర్ధంచేసుకోలేము, వారిని అంగీకరించలేము. కనుక, మనకు వినమ్రత, నిజాయితీ ఎంతో అవసరము! అందుకే నజరేతు ప్రజలు ప్రభువును మెస్సయగా అంగీకరించలేక పోయారు.

యెహెజ్కేలును దేవుడు ప్రవక్తగా ఎన్నుకొని తన ప్రేషితకార్యము కొరకై పంపుచున్నారు. ప్రవక్తను యిస్రాయేలీయుల చెంతకు పంపుచున్నారు. వారు ఎలాంటి వారో కూడా దేవుడు ప్రవక్తకు స్పష్టముగా తెలియజేసారు: వారు దేవునిపై తిరిగుబాటు చేసారు. ఇంకను చేయుచునే ఉన్నారు. వారి పూర్వులు కూడ అట్లే చేసారు. వారు మొండివారు. దేవుని లెక్కచేయనివారు. అలాగే, యెహెజ్కేలును కూడా ఎదురింతురు, నిరాకరింతురు. అతను ముళ్ళ పొదలలో తిరుగుచున్నట్లుగా ఉంటుంది, తేళ్ళ మీద కూర్చున్నట్లుగా ఉంటుంది. కాని, దేవుడు యెహెజ్కేలును భయపడవలదు అని చెప్పారు. 

యేసు కాలములో కూడా యిస్రాయేలీయులు అట్లే ఉండిరి. అందుకే, మెస్సయను [యేసు] తృణీకరించారు. నేడు దేవుడు మనలను కూడా ప్రవక్తలుగా పిలచుచున్నాడు. నేటికీ ప్రజలు దేవునిపై, దేవుని నియమాలపై తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. యెహెజ్కేలును పంపినట్లుగా దేవుడు మనలను వారి మధ్యకు పంపుచున్నారు.

యెహెజ్కేలుకు ముళ్ళమీద కూర్చున్నట్టు అనిపించినట్లుగా, పౌలు తన శరీరములో ఒక ముల్లు గ్రుచ్చబడినట్లు భావించినట్లుగా చెబుతున్నాడు. దురదృష్టవశాత్తు, ‘ముల్లు’ అను “బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు, బాధలు”నుండి బయట పడాలంటే, పౌలుకు ఉన్నది ఒకే ఒక మార్గం. అది యెహెజ్కేలువలె చెడుకు వ్యతిరేకముగా బోధిస్తూ, క్రీస్తుకు సాక్షిగా ఉండటమే! యెహెజ్కేలుతో దేవుడు “భయపడవలదు” అని చెప్పారు. అలాగే పౌలుతో “నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగు చున్నది” అని చెప్పారు. యేసు మాటలను జ్ఞాపకం చేసుకుందాం: “నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినపుడు, హింసించినపుడు, నిందారోపణ గావించినపుడు, మీరు ధన్యులు” (మత్త. 5:11).

క్రైస్తవులముగా, మనం కొనసాగిస్తున్న ప్రేషిత సేవలో భయపడనవసరము లేదు, ఎందుకన, దేవుని కృప మనకు చాలు. అందుకే పౌలు ఇలా ధైర్యముగా చెప్పగలిగారు: “నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను.” 

యేసు మన ఆదర్శం. దేవుని కృపతో, పవిత్రాత్మతో అభిషిక్తుడైన యేసు ధైర్యముగా దైవరాజ్యము గురించి బోధించారు. ఆయనను అవహేళన చేసారు, నిందించారు, అవమానించారు, తిరస్కరించారు. ఆయనను తిరుగుబాటు దారుడుగా ముద్రించారు. అయినను, యేసు ఎన్నడు అధైర్య పడలేదు. తన బోధనను, స్వస్థతలను ఆయన తరం వారికి కొనసాగించారు. తన ప్రేషిత కార్యమును, తండ్రి చిత్తమును, రక్షణ ప్రణాళికను ఎన్నడు విడిచి పెట్టలేదు. అలాగే, దేవునిచేత పిలువబదినటువంటి మనమందరము మన తరం వారికి మనం ధైర్యముగా, యెహెజ్కేలు, పౌలు, యేసు క్రీస్తువలె సువార్త పరిచర్యను [ప్రేమ, సేవ] కొనసాగించాలి.

సువార్త ప్రచారముతో పాటు, కాలం మారుతున్న కొలది, మన ప్రేషిత కార్యాలను, సేవలను నవీకరించు కోవాలి. శ్రీసభలో వివిధ పరిచర్యల ఆవశ్యకత ఎంతగానో యున్నది. నేడు మన సమాజములో ఎన్నో సమస్యలు (రైతు సమస్యలు, వలసదారుల సమస్యలు, ఆరోగ్య సమస్యలు...), ఎన్నో సవాళ్లు ఉన్నాయి. వీటికి మనం తప్పక ప్రతిస్పందించాలి. వాటికి అనుగుణముగా, సందర్భోచితముగా మన ప్రేషిత సేవ కొనసాగాలి. 'సృజనాత్మకమైన, క్రియాశీలకమైన, ప్రామాణికమైన, అర్ధవంతమైన' పరిచర్యలను ఆవిష్కరించాలి. సరికొత్త విధముగా పరిచర్యలకు పదును పెట్టాలి. ప్రజల అవసరాలను బట్టి పరిచర్యలు అందించబడాలి. వాటిని అమలుపరిచేందుకు, పథకాలు, ప్రణాళికలు రూపొందించాలి. మార్గాలను అన్వేషించాలి. దీనిలో ప్రతి ఒక్కరము భాగస్వాములం కావాలి.

అలాగే, మన మధ్యలోనున్న బోధకులను, ప్రవక్తలను గుర్తించగలగాలి!

No comments:

Post a Comment