పెంతకోస్తు మహోత్సవము, Year ABC

పెంతెకోస్తు మహోత్సవము, Year ABC
అ.కా. 2:1-11; 1 కొరి 12:3-7, 12-13; యోహాను 20:19-23


 సర్వేశ్వరుని ఆత్మ లోకమంతట వ్యాపించెను. సమస్తము వారి ఆధీనములో యున్నది. ధ్వనించిన ప్రతి మాట వారికి తెలియును. అల్లెలూయ!

నేడు పెంతెకోస్తు లేదా పవిత్రాత్మ పండుగ. ఒక ముఖ్యమైన పండుగ. ఇది ఈస్టర్ పండుగ తర్వాత 50వ రోజున జరుపుకుంటారు. నేడు శ్రీసభకు ఎంతో శుభదినము! ఆనందదాయకమైన రోజు! పవిత్రాత్మ మనపై వేంచేసిన రోజు. దైవీక జీవితము మానవ హృదయాలలోనికి ప్రవేశించిన రోజు! తల్లి శ్రీసభ జనించిన రోజు! దేవుని రక్షణ కార్య గొప్ప ఫలితమే పరిశుద్ధాత్మ దిగిరావడం!. నేడు గురువు ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తారు, ఇది పరిశుద్ధాత్మ యొక్క అగ్ని జ్వాలలకు ప్రతీక!

యూదుల పండుగ సందర్భము: యూదుల పండుగ అయిన పెంతెకోస్తు పండుగ రోజున, విశ్వాసులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. “పెంతెకోస్తు” అనే పదం గ్రీకు పదం (Pentekoste, పెంటెకోస్ట్అనగా యాభైవ రోజు’ అని అర్ధము. పాత నిబంధనలో, పెంతెకోస్తు యూదుల పంట కోత పండుగైన షవు-ఒట్ (Shavuot) అనే పండుగతో ముడిపడి ఉంది. యూదులు, పాస్కా పండుగ అనంతరం, 7 వారాల తరువాత (అనగా 50 రోజుల తరువాత) పెంతెకోస్తు పండుగను కొనియాడేవారు. ఇది యూదుల మూడు ప్రధాన పండుగలలో రెండవ ముఖ్యమైన పండుగ (ఒకటి, Pesah-పాస్కాపండుగ, రెండు, Pentecost-పెంతెకోస్తు పండుగ, మూడు, Sukkoth- గూడారాల పండుగ). యూదులు ప్రధానముగాకోతకాలము ముగియు సందర్భమున దేవునికి కృతజ్ఞతలుధన్యవాదములు తెలుపుటకు పెంతెకోస్తు ఉత్సవమును కొనియాడేవారు. ఆ రోజు గోధుమ పంట ప్రధమ ఫలాలను దేవునికి అర్పించెడివారు.

అలాగేతరువాత కాలములోదేవుడు సినాయి పర్వతముపైఐగుప్తునుండి విడుదలైన 50వ రోజునదేవుడు మోషేకు పది ఆజ్ఞలను, అనగా ‘చట్టము’ ఒసగిన జ్ఞాపకార్ధముగా ఈ పండుగను కొనియాడేవారు. యూదులు ఈ పండుగకుప్రపంచ నలుమూలలనుండి యెరూషలేమునకు వచ్చేవారు.

నూతన నిబంధనలో, ఈ పండుగకు నూతన అర్థం వచ్చింది. అపోస్తుల కార్యములు 2:1-31 ప్రకారం, యేసు పునరుత్థానం తర్వాత 50 రోజులకు, శిష్యులు ఒకచోట కూడుకొని యున్నప్పుడు, పరిశుద్ధాత్మ వారిపైకి అగ్ని జ్వాలల రూపంలో దిగివచ్చింది. వారు పరిశుద్ధాత్మతో నిండి, వివిధ భాషలలో మాట్లాడటం ప్రారంభించారు. ఈ అద్భుతమైన సంఘటన ద్వారా, శిష్యులు యేసు సందేశాన్ని వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజలకు ప్రకటించ గలిగారు.

పవిత్రాత్మ వాగ్ధానము: “నేను తండ్రిని ప్రార్ధింతును. మీతో ఎల్లప్పుడు ఉండుటకు మరొక ఆదరణ కర్తను ఆయన మీకు అనుగ్రహించును... నేను మిమ్ము అనాధలుగా విడిచి పెట్టను” (యోహాను 14:16, 18) అని యేసు శిష్యులకు వాగ్దానం చేసారు. అలాగే, “నేను తండ్రి యెద్దనుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చెడివాడునుతండ్రి యెద్దనుండి వచ్చు సత్యస్వరూపియును అగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. మీరు మొదటినుండియు నా వెంట ఉన్నవారు. కనుకమీరును నన్ను గురించిన సాక్ష్యులు” (యోహాను 15:26-27; 16:7) అని పవిత్రాత్మ వచ్చినప్పుడు, శిష్యులు ఆయనకు సాక్షులుగా ఉండాలని యేసు ప్రభువు కోరారు. తనకు సాక్ష్యులుగా ఉండమని ప్రభువు తన శిష్యులను ఆహ్వానించి యున్నారు. ఎందుకనవారు ఆయనతో జీవించారుఆయన జీవితాన్ని, ప్రేషిత కార్యాన్ని పంచుకొని యున్నారుఆయన బోధనలను ఆలకించి యున్నారుఆయన అద్భుతాలలో పాలుపంచు కున్నారు. ఆయన జీవితానికిశ్రమలకుమరణానికి సాక్ష్యులయ్యారు. ఇప్పుడు వారు ఆయన ఉత్థాన మహిమను అనుభవించి యున్నారు.

పవిత్రాత్మ రాకడ: మోక్షారోహణమునకు ముందుగాయెరూషలేములోనే ఉండమని, తండ్రి దేవుని వాగ్ధానమును స్వీకరించుటకు సంసిద్దులవమని యేసుతన శిష్యులను కోరియున్నారు (లూకా. 24:49). దానినిమిత్తమై, శిష్యులు మరియతల్లితో కలసి ప్రార్ధనలో ఒక చోట కూడియున్నారు. అప్పుడుయేసు ప్రభువు వాగ్ధానము చేసిన విధముగనే, యూదుల పవిత్రాత్మ పండుగ రోజున, “వారు పవిత్రాత్మతో నింపబడ్డారు” (అ.కా. 2:4). వారు ఉత్థాన క్రీస్తు ఆత్మతో నింపబడ్డారు. పెంతెకోస్తు మహోత్సవమునపవిత్రాత్మ శక్తి శిష్యులపై వేంచేసెను. అప్పుడు “అగ్నిజ్వాలలు నాలుకలవలె” వ్యాపించిఒక్కొక్కరిపై నిలిచెను. అ.కా. 2:1-11లో పవిత్రాత్మ రాకడగూర్చి వింటున్నాము. భయభ్రాంతులైన వారు పవిత్రాత్మ రాకడతో ధైర్యముపొంది క్రీస్తు సందేశమును బహిరంగముగా బోధించారు.

పవిత్రాత్మను స్వీకరించక ముందు శిష్యులు కలవరము, దిగులు, నిరాశతో ఉన్నారు. యూదులకు భయపడుచూ, బిక్కుబిక్కుమని, దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రార్ధనలో నున్న వారిపై పవిత్రాత్మ దిగివచ్చినది. అలాగేయెరూషలేములో ఉన్న విశ్వాసులందరిపైకి వేంచేసినది. అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని ఒసగిన కొలది వారు అన్యభాషలలో మాటలాడ సాగిరి. ఆ శబ్దము విని జనసమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు యూదులలో ప్రతీవ్యక్తియుఅవిశ్వాసులు తన సొంత భాషలలో మాటలాడుట విని కలవరపడిరి. ఇదీ పెంతెకోస్తు అనుభవము.

శ్రీసభ పరిచర్య, శ్రీసభ జన్మదినోత్సవము: పవిత్రాత్మ రాకతోశ్రీసభ సువార్త పరిచర్య ఈ లోకమున ఆరంభమైనది. భయముతోనున్న విశ్వాసులు ధైర్యమును పొందారు. నిస్సహాయ స్థితిలో నున్నవారి విశ్వాసం బలపడింది. పవిత్రాత్మను పొందినవారు ధైర్యముతో యెరూషలేములోనుపలుచోట్లలోను దైవవాక్యమును బోధించారు. పవిత్రాత్మను పొందడం అనగా దేవుని శక్తిని, ఉత్సాహమును పొందడం.

పెంతెకోస్తు మహోత్సవమున శ్రీసభ జన్మదినోత్సవము అని చెబుతూ ఉంటాము. పవిత్రాత్మ రాకతో, శ్రీసభ పరిచర్య ప్రారంభమైనది. శిష్యుల బోధనల వలన, అనేకమంది క్రీస్తు సంఘములో చేరారు. “విశ్వసించిన వారందరు కలిసి, సమిష్టిగా జీవించారు” (అ.కా. 2:44). శ్రీసభ అనగా భూలోకమంతట వ్యాపించియున్న క్రీస్తు సంఘము. ఈ సంఘము దైవసాన్నిధ్యమును ప్రత్యక్షముగానుదైవప్రేషిత కార్యమును ఈ లోకమున కొనసాగిస్తూ ఉన్నది. ప్రభువు తన శిష్యులకు దర్శనమిచ్చినప్పుడు వారికి రెండు అనుగ్రహాలను అనుగ్రహించాడు: శాంతి, మరియు పాపమన్నింపు. పవిత్రాత్మశక్తితో నింపబడి తన కార్యమును కొనసాగించమని క్రీస్తు శిష్యులను ఆదేశించి యున్నాడు. పవిత్రాత్మ వారికి క్రీస్తు సందేశమును తెలియ పరచును.

నేటి రెండవ పఠనములో, పౌలు కొరింతీయులకు చెప్పినట్లుగా, ఆత్మ వరాలను సంఘ శ్రేయస్సుకై ఉపయోగించాలి. “అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింప బడినది” (1 కొరి 12:7). మన సంఘాలు ప్రేమ కలిగిన సంఘాలుగా మారాలంటే, ఒకరినొకరు క్షమించు కోవాలి. ఎవరు ఒకేలా ఉండరు కాబట్టి, బేధాభిప్రాయాలు రాడడం సహజం. ఈ భిన్నత్వములో ఏకత్వం ఉండాలంటే, మనం తప్పక ఒకరినొకరము క్షమించు కోవాలి, ఒకరినొకరు అంగీకరించు కోవాలి..

మొదటి పఠనము అ.కా. 2:1-11లో గమనించవలసిన అంశాలు: శిష్యులు క్రీస్తు ఆదేశాన్ని విధేయించారు. యెరూషలేము వీడక దేవుని వాగ్ధానము వచ్చు వరకు అక్కడే వేచియుండమని చెప్పిన క్రీస్తు ఆదేశాన్ని వారు అక్షరాల పాటించారు. అమూల్యమైన సమయాన్ని ప్రార్ధనలో గడిపారు. పవిత్రాత్మ దిగివచ్చినప్పుడు ఒక శబ్దము వచ్చెను. అయితే, ఆ శబ్దము అందరు వినలేదు. కేవలము, విశ్వాసులు మాత్రమే వినగలిగారు. విని ఒకచోట గుమికూడి యున్నారు. అవిశ్వాసులు పవిత్రాత్మను పొందుటకు అనర్హులైనారు. అగ్నిజ్వాలలు నాలుకలవలె వ్యాపించి అక్కడ నున్న ఒక్కొక్కరిపై నిలుచుట వారికి కనబడెను. ఇది దైవసాన్నిధ్యమునకు సూచికగా యున్నది. అప్పుడు పవిత్రాత్మ శక్తిని పొందినవారు అన్యభాషలలో మాటలాడ సాగారు. వినినవారు వారి సొంత భాషలలో వినగలిగారు. వారి భాషలలో క్రీస్తు సాన్నిధ్యమును చూడగలిగారు. అది ప్రేమ భాష అని గుర్తించారు.

పెంతెకోస్తు పండుగ ఐఖ్యతకు ప్రతీక: పెంతెకోస్తు పండుగ ఐఖ్యతకు చిహ్నముగా యున్నది. బాబేలు గోపురం వద్ద భాషల గందరగోళం ద్వారా విభేదాలు ఏర్పడగా, పెంతెకోస్తు నాడు పరిశుద్ధాత్మ ద్వారా భాషల వరం ఐక్యతకు దారితీసింది. పరిశుద్ధాత్మ వివిధ భాషలు, సంస్కృతులు, నేపథ్యాలు కలిగిన ప్రజలను శ్రీసభలో ఏకం చేస్తుంది. పరిశుద్ధాత్మ సామరస్యాన్ని సృష్టిస్తుంది. పరిశుద్ధాత్మ కేవలం భాషలను అర్థం చేసుకోగల శక్తిని ఇవ్వడమే కాదు, అంతకు మించి సామరస్యాన్ని సృష్టిస్తుంది. ఇది ప్రజల హృదయాలను కలుపుతుంది, వారిని ఒకే ఆత్మతో, ఒకే లక్ష్యంతో నడిపిస్తుంది. క్రీస్తు దేహం (శ్రీసభ)లోని ప్రతి సభ్యుడు, వారి వైవిధ్యాలతో సంబంధం లేకుండా, ఒకే ఆత్మచే నడిపించబడి, ఒకరికొకరు అనుబంధంగా ఉంటారు.

యేసు దర్శనముశాంతి, శ్వాస (పవిత్రాత్మ): నేటి సువిశేష పఠనము, యోహాను సువార్త 20:19-23 ప్రకారం, శిష్యులు పవిత్రాత్మను క్రీస్తు ఉత్థానమైన రోజే పొంది యున్నారు. ఆదివార సమయమున యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసికొని యున్నపుడు, యేసు వచ్చి వారిమధ్య నిలువబడి, “మీకు శాంతి కలుగునుగాక!” అనెను. పాత నిబంధనలో ‘శాంతి’ (salom) అనగా సంతోషముగా ఉండుట, సకలాన్ని కలిగియుండుట: సంతానం, సంపద, పాడిపంటలు; నిర్భయముగా నిద్రపోయేవాడు; శత్రువులపై విజయాన్ని పొందేవాడు. కనుక, “శాంతి అనగా తనతోతాను, ఇతరులతో, ప్రకృతితో సమాధానముగా ఉండేవాడు. అయితే, ఇంకా లోతైన అర్ధం ఏమిటంటే, ‘శాంతి’ అనగా ‘దేవునితో సమాధానముగా యుండుట’ (న్యాయా 6:24) అని అర్ధము. పెంతెకోస్తు దినమున, యేసు శిష్యులకు ఒసగిన ‘శాంతి’ వారిలోనున్న భయాన్ని తీసివేసి, సంపూర్ణ సంతోషాన్ని ఇచ్చినది. యేసు ‘శాంతి’ మనలను స్వతంత్రులను కూడా చేయును. ‘శాంతి’ ఉత్థాన క్రీస్తు ఒసగు గొప్ప బహుమతి. తన శ్రమలు, మరణ, ఉత్థానము వలన లోకము తండ్రి దేవునితో సార్వత్రిక సఖ్యతను చేకూర్చడం క్రీస్తు శాంతి.

కుమారుడు, తండ్రి కార్యముపై వచ్చినప్పుడుతండ్రి ఆత్మను గైకొని ఈ లోకానికి వచ్చారు. తండ్రి కార్యమును ముగించుకొని తిరిగి వెళ్ళేప్పుడు ఆ ప్రేషిత కార్యమును తన శిష్యులకు అప్పగించు చున్నారు. కనుక, ఆత్మను గైకొని, ప్రేషిత కార్యమును కొనసాగించ వలసి యున్నది. అందులకే, ప్రభువు వారిపైకి శ్వాస ఊది, “పవిత్రాత్మను పొందుడు” (pneuma agion) (యోహాను 20:22) అని చెప్పెను.

“ఎవరి పాపములనైనను మీరు క్షమించిన యెడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములను క్షమింపని యెడల అవి క్షమింపబడవు” (యోహాను 20:22) అని చెప్పెను. పాపములను క్షమించే అధికారమును ఉత్థాన క్రీస్తు తన శిష్యులకు ఇచ్చారు. ప్రస్తుత కాలములోపాపసంకీర్తనము ద్వారాదేవుని క్షమాపణ కోరేవారు చాలా తక్కువ! పాపము వలన ముక్కలైన ప్రజలనుపాపక్షమాపణ ద్వారాదేవునిలో ఐఖ్యపరచడం తిరుసభ కర్తవ్యం.

ప్రభువు ప్రేషిత కార్యముశిష్యుల ప్రేషిత కార్యము ఒక్కటే! మన ప్రేషిత కార్యము కూడా అదియే! సృష్టి ఆరంభములో దేవుడు శ్వాసను ఊది మానవున్ని తన పోలికలో సృజించారు. ఈనాడు, క్రీస్తు తన శ్వాసను ఊది, ఓ నూతన సృష్టిని రూపొందించారు. క్రీస్తులో మనముకూడా ఓ నూతన సృష్టి. సోదరప్రేమ, క్షమాపణక్రీస్తు సందేశములో ముఖ్యాంశాలు. ఇదే సందేశాన్ని మనము కొనసాగించాలని ప్రభువు కోరుచున్నారు.

గలతీ. 5:16-25లో పునీత పౌలు, జ్ఞానస్నానముద్వారా పవిత్రాత్మ శక్తిని పొందిన మనము ఎల్లప్పుడూ ఆత్మయందు జీవించాలని చెప్పుచున్నాడు. శరీరమునకు సంబంధించిన కోరికలకు లోనుగాక, ఆత్మయందు జీవించండని కోరుచున్నాడు. క్రీస్తుద్వారా, నూతన సృష్టిగా మారిన మనము దేవునికి సంబంధించిన వారము, కావున ఆత్మను అనుసరించి క్రమముగా జీవించాలి. దైవ బిడ్డలముగా, పవిత్రముగా జీవించాలి. శరీర కార్యములు చేయువారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. శరీరము కోరునదిఆత్మ కోరు దానికి విరుద్ధముగా ఉండును. ఆత్మ కోరునదిశరీరము కోరడానికి విరుద్ధముగా ఉండును. ఈ రెంటికిని బద్ధవైరము. ఆత్మశక్తితో, శరీర కార్యములను అధిగమించగలం.

పవిత్రాత్మ: త్రిత్వైక సర్వేశ్వరునిలో మూడవ వ్యక్తి. హీబ్రూలో ‘రుహ’ అనగా ‘ఆత్మ’ అని సమానార్ధం. ఈ పదానికి గాలి, శ్వాస, పవనం అనే మూలార్ధాలు ఉన్నాయి. ఇది దేవుని శ్వాస. యేసు పవిత్రాత్మను ‘ఆదరణ కర్త’ (ఒకరి పక్షాన నిలిచేవాడు), ‘ఓదార్చువాడు’, ‘సత్యస్వరూపి’ అని సంబోధించారు. పౌలు, ‘వాగ్ధాన ఆత్మ’ (గలతీ 3:14, ఎఫెసీ 1:13), ‘దత్తత నిచ్చే ఆత్మ’ (రోమీ 8:15, గలతీ 4:6), ‘క్రీస్తు ఆత్మ’ (రోమీ 8:9), ‘ప్రభువు ఆత్మ’ (2 కొరి 3:17), ‘దేవుని ఆత్మ’ (రోమీ 8:9,1415:191 కొరి 6:117:40)అని సంబోధించాడు. పేతురు, ‘మహిమోపేత ఆత్మ’ (1 పేతు 4:14) అని సంబోధించాడు. తిరుసభను వ్యాపకము చేసి దానిని ఏర్పరచుటకు అపోస్తలులకు విశేషమైన జ్ఞానమునుదైవ సహాయమును ఇచ్చుటకు యేసు ప్రభువు ఆత్మను పంపెను.

భద్రమైన అభ్యంగనము పవిత్రాత్మ దివ్యసంస్కారము. వేదసత్యములో మనలను దృఢపరచుటకు, పవిత్రాత్మయైన సర్వేశ్వరుని యొక్క జ్ఞాన వరములనుఅనుగ్రహములను ఇచ్చు దేవద్రవ్యానుమానము.

పవిత్రాత్మ వరాలు: పవిత్రాత్మ వరాలు 7: జ్ఞానము, బుద్ధి (అవగాహనము), విమర్శ (సదూపదేశము), దృఢత్వము (స్థైర్యము), తెలివి, భక్తి, దైవభయము (యెషయ 11:2-4). ఇవి క్రైస్తవుల నైతిక జీవనాన్ని పోషిస్తాయి. వాటిని స్వీకరించేవారి సుగుణాలను పూర్తిచేసి సంపూర్ణం గావిస్తాయి. విశ్వాసుల విధేయతకు తోడ్పడతాయి (కతోలిక శ్రీసభ సత్యోపదేశము, నం. 1830, 1831).

పవిత్రాత్మ ఫలాలు: ప్రేమ, ఆనందము, శాంతి, ఓర్పు, దయ, మంచితనము, ఔదార్యము, సాధుత్వము, నమ్మకపాత్రము, నిరాడంబరత, ఆత్మనిగ్రహం, సచ్చీలత (కతోలిక శ్రీసభ సత్యోపదేశము, నం. 1832). గలతీ 5:16-25 లేదా 1 కొరి 12:2-13న పవిత్రాత్మ వరాలుపవిత్రాత్మ శక్తిని గూర్చి పునీత పౌలుగారి ప్రవచనాలను వింటున్నాము. ఆత్మవరాలు ఆధ్యాత్మిక కార్యాలుఅవి మనలను దైవపవిత్రతలో నడిపించును.

ఆత్మ సంబంధమైన ధర్మక్రియలు:

1. సందేహించు వారికి బుద్ధి చెప్పుట
2. వేద సత్యములను ఎరగని వారికి అవి నేర్పుట
3. పాపాత్ములను పుణ్యమునకు త్రిప్పుట
4. దు:ఖపడు వారిని ఓదార్చుట
5. నిందలనుఅవమానములను క్షమించుట
6. కీడును ఓర్పుతో సహించుట
7. జీవించువారి కొరకుమృతి పొందిన వారి కొరకు సర్వేశ్వరుని వేడుకొనుట

పవిత్రాత్మ పని (యోహాను 16:1-15): పవిత్రాత్మ వచ్చి పాపమును గురించియునీతిని గురించియుతీర్పును గురించియు, లోకమునకు నిరూపించును. సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు, సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతటతాను ఏమియు బోధింపక తాను వినిన దానినే బోధించును. జరగబోవు విషయములను మీకు తెలియ జేయును. పవిత్రాత్మ పని రెండు కార్యాలుగా చెప్పుకోవచ్చు: ఒకటి, రక్షణ మార్గమున మనలను నడుపును. తండ్రి వద్దకుకుమారుడు యేసు చెంతకు మనలను నడిపించును. కావున, ఆత్మ పలుకులను మనం విని పాటించాలి. రెండు, యేసు పలుకులను, మార్గమునుచిత్తమును అర్ధము చేసుకొనులాగ చేయును. సువార్తకు సాక్షమిచ్చుటకు మనకు బలమునునిర్బయమును ఒసగును. మన విశ్వాసమును జీవించుటకు మనలను పునరుద్ధరించును.

పెంతెకోస్తు మహోత్సవము తండ్రి ఆత్మకుమారుని ఆత్మ శిష్యులపైకి రావడాన్ని కొనియాడు పండుగ. ఈ ఉత్సవము ద్వారా దేవుడు ఏవిధముగా మన జీవితాలలో జోక్యం చేసికొంటున్నారోత్రిత్వైక దేవునిలో మనలను ఏవిధముగా భాగస్తులను చేయుచున్నారోమనలను ఒక నూతన సృష్టిగా మార్చుతున్నారో తెలిసికొంటున్నాము. ఆ కృతజ్ఞతా భావముతో ఈ మహోత్సవాన్ని కొనియాడుదాం.

పరిశుద్ధాత్మ లేకుండా, శ్రీసభ పరిచర్య ముందుకు కొనసాగదు. కనుక, ఆ పవిత్రాత్మ శక్తివరాలు మన పైనకూడా దిగిరావాలని ప్రార్ధన చేద్దాం. ఆయన ప్రేషిత కార్యములో పాలుపంచు కొనునట్లు తగు శక్తిని ఒసగమని వేడుకొందాం!

క్రీస్తునందు విశ్వాసులారా! పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి హృదయంలో ఐతే ఉంటారో! వారు సరిదిద్ద బడతారు. అంటే, జ్ఞానస్నానము తీసుకొనిన మనందరిలో పరిశుద్ధాత్మ దేవుడు వేంచేసి యున్నారు. మనము పరిశుద్ధాత్మ దేవుని అనుసరణలో నున్నవార మయితే, దేవుడు మనకు ప్రసాదించిన ఆజ్ఞలను పాటిస్తాము, సాటివారిని ప్రేమించే మనసును కలిగి యుంటాము, సాటివారిని క్షమించే హృదయమును కలిగి యుంటాము, సాటివారికి సహాయపడే హృదయమును కలిగి యుంటాము, మనము చేసిన తప్పులను సరిదిద్దుకొనే మనస్సును కలిగిన వారమై యుంటాము.

మనమందరము కూడా, పరిశుద్ధాత్మ స్వభావములో, అనగా ఆత్మానుసారులమై జీవించ గలగాలి. శరీరానుసారులమై జీవిస్తే, మనలో పరిశుద్ధాత్మానుసరణ ఉండదు. కనుక, సత్య స్వరూపియైన పరిశుద్ధాత్మ దేవున్ని మనము కలిగి యున్నాము కాబట్టి, మనము ఎల్లప్పుడూ, ఆత్మానుసారులమై, సత్యములో, నీతిలో, న్యాయములో, జీవించడానికే నిత్యప్రయత్నం చేస్తూ ఉండాలి.

దేవుని పరిశుద్ధాత్మను మనము ఏ విధముగానూ దుఃఖ పరచకూడదు. జాగ్రత్త కలిగి జీవించాలి. పరిశుద్ధాత్మ దేవున్ని మన హృదయములోనికి ఆహ్వానించి, మనతో మాట్లాడుమని, మనము చేసిన పాపములను మనము తెలుసుకొని, వాటిని విడనాడు విధముగా సరిచేయుమని, మన లోపాలను సరి చేయమని, సక్రమమైన మార్గములో నడిపించుమని పరిశుద్ధాత్మ దేవున్ని అనుక్షణం వేడుకోవాలి.

పెంతెకోస్తు ఒక చారిత్రక సంఘటన మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ నిరంతరం శ్రీసభలో మరియు ప్రతి విశ్వాసిలో నివసిస్తుందని గ్రహించాలి. సాధారణ జీవితంలో, ఉద్యోగంలో, కుటుంబంలో, సామాజిక సంబంధాలలో పరిశుద్ధాత్మ ప్రేరణలను అనుసరింఛి, తద్వారా పరిశుద్ధతను సాధించాలి.

No comments:

Post a Comment