తపస్కాల ఐదవ ఆదివారము, Year A

తపస్కాల ఐదవ ఆదివారము
యెహెజ్కె. 37:12-14; రోమీ. 8:8-11; యోహాను. 11:1-45

నేడు తపస్కాల ఐదవ వారములోనికి ప్రవేశించి యున్నాము. యేసు భూలోక పరిచర్య చివరి దశకు చేరుకుంటుంది. యేసు వివిధ అద్భుత చిహ్నములద్వారా, “జీవజలము”గా “లోకమునకు వెలుగు”గా, “మంచి కాపరి”గా, ప్రకటించిన తరువాత, నేడు మరణించిన లాజరును, పునర్జీవమును ఒసగు సందర్భమున, “నేనే పునరుత్థానమును, జీవమును” అని యేసు ప్రకటిస్తున్నాడు. ఈ అంశముపై ధ్యానిద్దాం.

సువిశేష పఠనము: మరణించిన లాజరును, యేసు జీవముతో లేపుటను గురించి విన్నాము. ఈ సందర్భములో, “నేనే పునరుత్థానమును, జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికిని మరణింపడు” (యోహాను. 11:25) అని యేసు తనను గూర్చిన గొప్ప సత్యమును బహిర్గతం చేసాడు. మరణముద్వారా, క్రీస్తునందు పునర్జీవము పొందెదము.

‘మరణించిన లాజరును జీవముతో లేపుట’, సువార్తలలో మహాశక్తివంతమైన, ఆశ్చర్యకరమైన అద్భుతం. యోహాను సువార్తలో ఏడవ (చివరి) అద్భుత చిహ్నము. క్రీస్తు శక్తికి సర్వము సాధ్యమేనని, చివరికి మరణమునుకూడా జయించుట ఆయనకు సాధ్యమని, ఈ అద్భుతచిహ్నం మనకి తెలియజేయుచున్నది. ఈ అద్భుతము వలన, అనేకమంది క్రీస్తు విశ్వాసములోనికి నడిపింపబడినారు. అదేసమయములో, యేసును ద్వేషించినవారికి, ఇది వ్యతిరేక ప్రభావాన్ని కలిగించినది. వారిలో ఆగ్రహాన్ని పెంచి, యేసును నిర్భంధించి, ఖండించి, సిలువవేయడం వరకు తీసుకొని వెళ్ళినది.

లాజరు జబ్బు పడగానే, మార్తమ్మ, మరియమ్మలు యేసుకు వర్తమానం పంపారు. తన స్నేహితుడైన లాజరు (“దేవుడు నా సహాయము”) వ్యాధిగ్రస్తుడై ఉన్నాడని వర్తమానమును యేసు తెలుసుకున్నాడు. “బెతానియాలో ‘లాజరు’ అను వ్యక్తి వ్యాధిగ్రస్తుడై ఉండెను. అది మరియమ్మ, ఆమె సోదరి మార్తమ్మల గ్రామము” (11:1). వీరు లాజరుకు తోడబుట్టినవారు. యేసు వీరి యింటిని సందర్శించడం, లూకా. 10:38-42లోను, మరల యోహాను. 12:1-8లో మరియమ్మ యేసును పరిమళ ద్రవ్యములతో అభిషేకించడం చూడవచ్చు. బెతానియా గ్రామము (యూదయా ప్రాంతము) యెరూషలేమునుండి మూడు కి.మీ. దూరంలో ఉంది. మార్తమ్మ, యేసు తల్లి మరియమ్మవలెనె, యేసుపై తన సంపూర్ణముగా నమ్మకాన్ని వ్యక్తపరచినది. “యేసుకు పరిమళ తైలము పూసి, ఆయన పాదములను తలవెంట్రుకలతో తుడిచినది ఈ మరియమ్మయే! (11:2, 12:1-8). ఇది మరియమ్మ భక్తికి, అనుబంధానికి తార్కాణం (పునీత సిరిల్). ఈ స్త్రీ, మత్తయి (26), లూకా (7) సువార్తలలో చెప్పబడిన స్త్రీ కాదు (పునీత క్రిసోస్తం). ఈ కుటుంబము యేసుతో సన్నిహిత సంబంధాన్ని కలిగియున్నది. వాస్తవానికి, యేసు వారితో స్నేహసంబంధాన్ని కలిగియున్నాడు. యేసు ప్రేమించిన లాజరు వ్యాధిగ్రస్తుడైనాడు. “ప్రభూ! మీరు ప్రేమించు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు” (11:3). యేసు వస్తాడని ఎంతో ఆశతో ఎదురుచూశారు. కాని, చివరికి లాజరు అత్యక్రియలకు కూడా రాలేదు.

యేసుతో ఎంత సాన్నిహిత్యం ఉన్నను, వ్యాధి, మరణం తప్పదు. అయినను యేసు, “ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు. ఇది ‘దేవుని మహిమ’ కొరకును, ఇందుమూలమున దేవుని కుమారుడు మహిమ పరుపబడుటకును వచ్చినది” (11:4) అని అన్నాడు. “మృత్యువును దేవుడు కలిగింపలేదు. ప్రాణులు చనిపోవుట చూచి ఆయన సంతసింపడు” (సొ.జ్ఞాన. 1:13). దేవుని మహిమ గురించి, మానవ భాషలో చెప్పాలంటే, “యావే తేజస్సు కొండ కొమ్మన ప్రజ్వరిల్లుచున్న అగ్నివలె కనిపించెను” (నిర్గమ. 24:17, చదువుము. నిర్గమ. 33:20-23). “దేవుని మహిమ” క్రీస్తునందు బహిర్గతమయ్యెను, “దేవుని మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి” (లూకా. 2:9). క్రీస్తు సాక్షాత్కారమున శిష్యులు “క్రీస్తు మహిమ”ను గాంచిరి (లూకా. 9:28-36). క్రీస్తు తన మహిమలో ప్రవేశించుటకు శ్రమలను పొందవలసి యున్నది (లూకా 24:26, ఫిలిప్పీ. 2:5-11). యోహాను ముఖ్యముగా దేవుని మహిమ గురించి ప్రస్తావించాడు (యోహాను. 12:23, 13:31-32). యేసు తాను మహిమతోను, శక్తితోను తిరిగి వస్తానని చెప్పారు (లూకా. 21:27). కనుక, నేటి సువిశేష పఠనముద్వారా రెండు విషయాలను గ్రహించవచ్చు: ఒకటి, లాజరు పునర్జీవముతో, ప్రజలు దేవునకు మహిమ చేకూర్చెదరు. రెండు, క్రీస్తు మహిమ, శ్రమలద్వారా వచ్చును. ఈ అద్భుతము యేసు మరణమునకు దారి తీసింది (యోహాను. 11:45-53). మరణం, ఆయన మహిమను చేకూర్చింది.

మరణం ఎందుకు అంత భయంకరమైనది? వాస్తవానికి, మరణం పరలోకానికి, శాశ్వత జీవానికి మార్గము. ఇది మనందరి విశ్వాసము. సువార్తకూడా దీనిని బోధిస్తున్నది. అయితే, శారీరక మరణం కన్న, ఆధ్యాత్మిక మరణం భయంకరమైనది. అంతిమ ఆనందం యేసులో ఎకమైనప్పుడే, అయితే, అది మరణముద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కనుక, మరణాన్ని భయంకరమైనదిగా భావింపక, మన పునర్జీవమునకు మార్గమని నమ్ముదాం. మంచి జీవితమును జీవించినవాడు మరణానికి భయపడడు.

నేటి మొదటి పఠనములో, బాబిలోనియా ప్రవాసములోనున్న యిస్రాయేలు ప్రజలు, నిరాశలో ఉన్నారు. ఇది ఒకలాంటి మరణాన్ని సూచిస్తుంది. అలాంటి ప్రజలతో దేవుడు, “నా ప్రజలారా! నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపుదును. నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించునట్లు చేయుదును. మీరు మీ దేశమున వసించునట్లు చేయుదును” (యెహెజ్కె. 37:12-14). తన ప్రజలు తన జీవము కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. పాపము చేసి తననుండి దూరమైన ప్రతీసారి దేవుడు ఏదోవిధముగా, పరిష్కారాన్ని చూపిస్తున్నాడు. యెహెజ్కేలు పలికిన ప్రవచనాలు యేసు క్రీస్తునందు నెరవేరాయి. పాపము వలన మరణించిన మనకు జీవమును ఒసగుటకు ఆయన ఈ లోకమునకు ఏతెంచాడు. “నేను జీవము నిచ్చుటకును, దానిని సమృద్ధిగఇచ్చుటకును వచ్చియున్నాను” (యోహాను. 10:10) అని యేసు చెప్పాడు. మరణానికి పరిష్కారం యేసు క్రీస్తు! ఆనాటి ప్రజలకు ప్రవాస ముగింపు, విముక్తి అయితే, నేడు క్రీస్తుద్వారా అందరికీ పాపవిముక్తి!

ఏదేమైనప్పటికిని, లాజరు మరణించాడు. “యేసు మార్తమ్మను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించెను” (11:5). లాజరు మరణించినను, ఆ కుటుంబము క్రీస్తుపై సంపూర్ణ నమ్మకము ఉంచింది. యేసు మరణము ఈ లోకము జీవించుటకు అయినచో (యోహాను 6:51), లాజరు వ్యాధి, మరణము కొరకుగాక, దేవుని మహిమ కొరకు వచ్చెను.

లాజరు జబ్బు పడెనని వినియు, యేసు తాను ఉన్న చోటనే ఇంకను రెండు రోజులు ఉండెను. ఆ తరువాత, యేసు యూదయాకు వెళ్ళెను, ఎందుకన లాజరు మరణించెను (11:6-16). తన స్నేహితుడు, జబ్బు పడెనని తెలిసియు, యేసు వెమ్మటే వెళ్ళలేదు. ఎందుకన, తండ్రి చిత్తమేమితో ఎరిగియున్నాడు. తన ‘సమయము’ కొరకై వేచియున్నాడు. తండ్రి మహిమను బహిర్గత మొనర్చుటకు యేసు అట్లు చేసాడు. తన శ్రమలు, మరణము తరువాత పునరుత్థానము ఉన్నదని తన శిష్యుల విశ్వాసం బలపడుటకు యేసు అట్లు చేసాడు. తానే పునరుత్థానమును, జీవమును అన్న గొప్ప సత్యమును తెలియజేయుటకు యేసు అట్లు చేసాడు.

అక్కడికి వెళ్ళితే, యూదులు తనను చంపాలని చూస్తున్నారని తెలిసికూడా, యూదయా ప్రాంతమునకు వెళ్దామని తన నిర్ణయాన్ని శిష్యులకు తెలియజేసాడు. మొదట శిష్యులు దానిని నిరాకరించారు. ఎందుకన, యూదులు యేసును రాళ్ళతో కొట్టుటకు, ఆయనను పట్టుకొనుటకు ప్రయత్నించిరి, కాని యేసు తప్పుకొనిపోయెను (యోహాను. 10:31-39). యేసు లోకమునకు వెలుగు (యోహాను 1:4, 8:12, 9:5, 12:46). ఆ వెలుగులో నడిస్తే, మనలను ఎవరు ఏమీ చేయలేరు. “రాత్రివేళ నడచిన యెడల (అనగా యేసునందు విశ్వాసము లేకుండా), వాడు తొట్రుపడును. ఏలయన, వానియందు వెలుగు లేదు” (11:10). విశ్వాసులు ప్రభువుతో నడచినంత కాలము, వారు తొట్రిల్లరు, భయపడరు. కనుక, శిష్యులు భయపడకుండా, యేసుతో యూదయాకు వెళ్లాలి. కనుక, మన విశ్వాసముకూడా యేసునందు సంపూర్ణముగా ఉండాలి. అన్ని పరిస్థితులలోను, విశ్వాసాన్ని కోల్పోరాదు.

“మన మిత్రుడు లాజరు నిద్రించుచున్నాడు. నేను అతనిని మేల్కొల్పుటకు వెళ్ళుచున్నాను” (11:11) అని యేసు శిష్యులతో చెప్పెను. నిద్రించుట” (గ్రీకు kekoimetai) మరణానికి సభ్యోక్తి (కటినమైన విషయాలను మృదువైన భాషలో చెప్పడం), “మేల్కొల్పుట” (గ్రీకు exupniso) అనగా రక్షించుట. లాజరు నిజముగా మరణించాడని శిష్యులు అర్ధము చేసుకొనలేదు. అలాగే, యేసు తన మరణం గురించి చెప్పెననికూడా అర్ధం చేసుకోలేక పోయారు. అందుకే, యేసు వారితో “స్పష్టముగ, లాజరు మరణించెను” అని చెప్పాడు. అప్పుడు శిష్యులు అర్ధము చేసుకొనిరి.

యేసు బెతానియాకు చేరుకొనేసరికి, అప్పటికే లాజరు సమాధి చేయబడి నాలుగు దినములు అయినది (11:17). 11:20-23లో యేసు మార్తమ్మల సంభాషణ చూస్తున్నాము. “యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కాని మరియమ్మ ఇంటియందే కూర్చుండి ఉండెను” (11:20). మార్తమ్మ యేసుతో, ‘ప్రభూ! మీరు ఇచట ఉండియున్నచో, నా సహోదరుడు మరణించి ఉండెడివాడు కాదు’ అని చెప్పెను. లాజరు మరణించియున్నను, ఆమె యేసుతో, ‘ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియును’ అని అనెను (11:22). మార్తమ్మ తన సంపూర్ణ నమ్మకాన్ని యేసులో ఉంచినది. ఇప్పటికైనా, యేసు తన సహోదరుడిని బ్రతికించగలడు అని విశ్వసించినది. అందుకే, యేసు ఆమె విశ్వాసమును చూచి, “నీ సహోదరుడు మరల లేచును” (11:23) అని చెప్పాడు. ప్రతీవ్యక్తికి దేవునియందు విశ్వాసము, ప్రేమ ఉండాలి. దేవునితో సాంగత్యము ఉండాలి. లాజరును లేపిన ప్రభువుకు సమస్తము సాధ్యమే అని అర్ధమగుచున్నది.

యేసు మార్తమ్మతో, నేనే పునరుత్థానమును, జీవమును” (11:25) అని అధికారపూర్వకమైన ప్రకటన చేసాడు. ఆమెకు పూర్తిగా అర్ధం కాకున్నను, యేసు మాటలను విశ్వసించినది, “అవును ప్రభూ! లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవగు క్రీస్తు నీవేనని విశ్వసించుచున్నాను” (11:27). ఆమె యేసును మెస్సయాగా, ప్రభువుగా విశ్వసించినది. యేసు లాజరును జీవముతో లేపాడు. ఇది యోహాను సువార్తలో అతిగొప్ప అద్భుత చిహ్నము. యేసుకు అసాధ్యమైనది ఏదియు లేదు.

యేసుతోపాటు మనముకూడా లేవనెత్తబడతామని మనము ఎరిగియున్నాము (చదువుము. 1 తెస్స. 4:13-14). లాజరును జీవముతో లేపుట, దానికి చిహ్నముగా, గురుతుగా ఉన్నది.

ఆతరువాత, మరియమ్మకూడా యేసును కలిసి విలపించినపుడు, యేసు హృదయం చలించినది. దీర్ఘముగా నిట్టూర్చాడు. కన్నీరు కార్చాడు. యేసు మరల దీర్ఘముగ నిట్టూర్చి, ఆ సమాధి యొద్దకు వచ్చాడు. (11:32-38). మనము కేవలము ప్రార్ధన చేస్తే సరిపోదు. అవసరతలోనున్న వారికి చేయూతనివ్వాలి. మనం అద్భుతాలు చేయకపోవచ్చు, కాని, మనకు సాధ్యమైన సహాయం తప్పక చేయాలి.

యేసు లాజరును పునర్జీవము ప్రసాదించెను (11:38-44). యేసు మనలనుకూడా లేపును అని విశ్వసించాలి. పాపము ఆత్మకు మరణము. పశ్చాత్తాపము ఆత్మకు జీవము. యేసు తన పునరుత్థానమును, మన పునరుత్థానమును సూచించుటకు, ముగ్గురిని పునర్జీవముతో లేపెను: ప్రార్ధానా మందిరాధ్యక్షుడు యాయీరు కుమార్తె (మార్కు. 5:22-24, 35-43, మత్త. 9:18-26, లూకా. 8:40-56), నాయినులో వితంతువు కుమారుడు (లూకా. 7:11-17), లాజరు (యోహాను 11:38-45). లాజరును లేపినది “దేవుని మహిమ కొరకు” అని యేసు స్పష్టము చేసాడు (11:40). యేసు ముందుగా కనులెత్తి, తండ్రి దేవునికి ప్రార్ధన చేసాడు (11:41-42). యేసు ప్రార్ధన, తండ్రితో తనకు ఉన్న అనుబంధాన్ని, శాశ్వత ఐఖ్యతను తెలియజేస్తుంది (యోహాను 1:1,18). యేసు ఎప్పుడుకూడా తండ్రి చిత్తమును నెరవేర్చడానికే పాటుబడ్డాడు. ఇచ్చట యేసు, అద్భుతము కొరకు శక్తికొరకుగాక, అక్కడ ఉన్నటువంటి వారి విశ్వాసము కొరకు ప్రార్ధన చేసాడు. “ఇక్కడ ఉన్న జనసమూహము నిమిత్తమై, నీవు నన్ను పంపినట్లు వారు విశ్వసించుటకై ఇటుల పలికితిని” (11:42). పిమ్మట యేసు బిగ్గరగ, లాజరూ! వెలుపలకు రమ్ము అని పలుకగా. చనిపోయినవాడు వెలుపలకు వచ్చెను (11:43-44). యేసు మృతులనుండి లాజరును సజీవునిగా చేసాడు, ఎందుకన, “తండ్రి ఎట్లు మృతులను సజీవులుగ చేయునో తనకు ఇష్టమైన వారిని సజీవులను చేయును” (యోహాను. 5:21). అంతేకాక, “ఆ గడియ సమీపించుచున్నది. అప్పుడు సమాధులలోని వారు ఆయన స్వరములను విని, ఉత్థానులగుదురు” (యోహాను. 5:28-29). నేడు ప్రభువు మనలనందరినీకూడా పిలుస్తున్నాడు. లేచి, ఆయన చెంతకు వచ్చి, మరల జీవించుదాం.  

మన జీవితములో అద్భుతాలు జరగాలంటే, మనలో దేవునిపై విశ్వాసము, నమ్మకము ఉండాలి. అంతేగాక, దేవుని కార్యముతో మనం సహకరించాలి. ఈ మహాద్భుతములో, యేసు అక్కడ ఉన్నవారి సహాయ సహకారాన్ని కోరారు: మొదటిగా, “రాతిని తొలగింపుడు” (11:39) అని యేసు పలికెను. యేసు ఆజ్ఞాపిస్తే ఆ రాతి తొలగిపోయేది కాదా! అయినను, మన సహకారాన్ని ప్రభువు కోరుచున్నారు. ఇది మన విశ్వాసానికి పరీక్ష వంటిది. యేసు భరోసామీద వారు రాతిని తొలగించిరి, “అంతట వారు రాతిని తొలగించిరి” (11:41). రెండవదిగా, యేసు బిగ్గరగ, “లాజరూ! వెలుపలకు రమ్ము” అని పలికెను. చనిపోయినవాడు వెలుపలకు వచ్చెను. (11:43-44). యేసు పిలువగనే, లాజరు చీకటి సమాధిలోనుండి బయటకు వచ్చాడు. అనగా, మనకి మనమే సహాయం చేసుకోవాలి. మూడవదిగా, యేసు వారితో, “కట్లు విప్పి, అతనిని పోనిండు” అని అనెను (11: 44). లాజరు తనకుతానుగా బయటకు వచ్చినను, తనకుతానుగా బంధింప బడిన వస్త్రములను విప్పుకొనలేడు. అతనికి సంఘము యొక్క అవసరత ఉన్నది. ఈ కార్యము ద్వారా, సంఘము లాజరును తిరిగి తమలో ఒకనిగా అంగీకరిస్తుంది. మరి, దేవునితో సహకరించుటకు నేను సిద్ధముగా ఉన్నానా? మనకు, వెలుగు అయిన క్రీస్తుకు మధ్యనున్న రాతి బండను తొలగించడానికి నేను సిద్ధముగా ఉన్నానా? మరణము నుండి బయటకు రావడానికి మొదట అడుగు వేయడానికి నేను సిద్ధముగా ఉన్నానా? ఇతరుల బంధములను విప్పి (క్షమించి), స్వతంత్రులను చేయుటకు నేను సిద్ధముగా ఉన్నానా?

ఈ అద్భుతము తరువాత, ఇంత గొప్ప చిహ్నము తరువాత, అందరు తప్పక యేసును విశ్వసిస్తారు అని మనం అనుకోవచ్చు. కాని, ఈ సంఘటన తరువాత, యూదులు యేసుపై ఇంకా ఎక్కువగా కుట్ర చేసిరి. మనము కూడా విశ్వాసులము అని చెప్పుకుంటాము కాని, అనేక సందర్భాలలో దానిని నిరూపించుకొనలేక పోవుచున్నాము. సంపూర్ణ విశ్వాసమును, అనంతమైన ప్రేమను యేసునందు ఉంచలేక పోవుచున్నాము. యేసు లాజరును లేపిన తరువాత కొందరు విశ్వసించారు, కొందరు అనుమానించారు (Theodore). వారు పవిత్ర స్థలమును, జాతిని నాశనము చేయబడునని భయపడ్డారు, కాని, చివరికి రెండింటిని కోల్పోయారు (Augustine). ఈ అద్భుతమును చూచిన యూదులలో పలువురు విశ్వసించిరి. కాని వారిలో కొందరు అవిశ్వాసులై, యేసును నిందించుటకు, చట్టవిరుద్ధమైన పనులు చేయడానికి సాహసించాడు అన్నట్లుగా పరిసయ్యుల వద్దకు వెళ్లి, వివరించిరి (Theodore of Mopsuestia).

తపస్కాలము మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచుకోవడానికి, ఆత్మతో మన జీవితాలను వెలిగించుకోవడానికి గొప్ప కాలము. యేసు చెప్పినట్లుగా, “జీవమును ఇచ్చునది ఆత్మయే. శరీరము నిష్ప్రయోజనము” (యోహాను. 6:63). దివ్యసంస్కారములద్వారా, జీవమొసగు ఆత్మను పొందియున్నాము. నేటి రెండవ పఠనములోని పౌలుగారి మాటలను ఇక్కడ గుర్తుచేసుకోవడం సమంజసం: “శరీరాను సారముగా జీవించువారు దేవుని సంతోషపెట్టలేరు. మీ యందు నిజముగ దేవుని ఆత్మ వసించుచున్నచో, మీరు శరీరము నందు గాక ఆత్మయందు ఉన్నారు” (రోమీ. 8:8-9). కనుక మనం ఆత్మయందు ఎదగాలి. అప్పుడే మనం సాతానును, పాపమును, మరణమును జయించగలము.

ఆత్మపరిశీలన చేసుకుందాం:

నేను చీకటిలో నడుస్తున్నానా లేక వెలుగులో నడుస్తున్నానా? నేను యేసులో సంపూర్ణముగా నమ్మకము ఉంచానా? నేను అనారోగ్యం పాలైనప్పుడు ఎలా వ్యవహరిస్తున్నాను? నాకు ప్రియమైనవారు తీవ్రవ్యాధులకు గురియైనప్పుడు, నా విశ్వాసం ఎలా ప్రభావితమయ్యింది? నా కష్ట సమయములో, యేసు ఆలస్యముగా వచ్చాడని ఎప్పుడైనా భావించానా? నేను కూడా మృతులలోనుండి లేపబడతానని విశ్వసిస్తున్నానా? దేవుని మహిమను ప్రదర్శించే అద్భుతచిహ్నాలు నా జీవితములో ఉన్నాయా?

యేసు ప్రభువా! నీ వాక్కులు, కార్యాలు తండ్రి మహిమను బహిర్గత మొనర్చును.
యేసు ప్రభువా! తండ్రి మహిమలోనికి నన్ను నడిపించే వెలుగువు నీవే!
యేసు ప్రభువా! నీ వెలుగులో నమ్మకముగా నడచుటకు సహాయము చేయుము.
యేసు ప్రభువా! తండ్రిని మీరు ఏది అడిగినను, ఆయన మీకు ఒసగును.
యేసు ప్రభువా! పాపస్థితిలో నేను ఉండకుండునట్లుగా, తండ్రిని అడుగుము.
యేసు ప్రభువా! నీవే పునరుత్థానమును, జీవమును.
యేసు ప్రభువా! నీవు నన్ను ఎప్పుడు ఆలకిస్తావని నేను ఎరిగియున్నాను.

1 comment:

  1. Thank you so much dear father, for wonderful and thought provoking reflection......

    ReplyDelete