ఈస్టర్ రెండవ ఆదివారము
దివ్య కారుణ్య ఆదివారము
అ.కా. 2:42-47, 1 పేతు. 1:3-9, యోహాను. 20:19-31
క్రీస్తు ఉత్థానం - నూతన సృష్టి
ఉపోద్ఘాతము: క్రీస్తు ఉత్థానం
క్రైస్తవ విశ్వాసానికి మూలం. “క్రీస్తు లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్ధమే. మీ
విశ్వాసమును వ్యర్ధమే” (1 కొరి. 15:14). శిష్యులకు క్రీస్తు ఉత్థానం ఓ
దివ్యానుభూతి. క్రీస్తు ఉత్థానములోని పరమ రహస్యాన్ని వారు పూర్తిగా అర్ధము
చేసుకొనలేక పోయారు. కాని, క్రీస్తు ఉత్థానం వారి విశ్వాసాన్ని బలపరచినదని అనడములో ఎంత మాత్రము
అతిశయోక్తి లేదు. ఉత్థాన క్రీస్తు సాన్నిధ్యాన్ని వారు అనుభవించారు. క్రీస్తు
ఉత్థానం వారిని మనుషులుగా, దృఢవిశ్వాసులుగా మార్చినది. విశ్వాసులుగా హింసలను, అవమానములను ధైర్యముగా ఎదుర్కొనుటకు వారిని బలపరచినది.
ఉత్థానమైన తరువాత, క్రీస్తు
వారితో ఉన్నాడు, వారితో
మాట్లాడాడు, వారితో
భుజించాడు, వారికి
బోధించాడు. ఇప్పుడు వారు ఇతరులలో విశ్వాసాన్ని నింపడానికి పిలువబడినారు. అనాది
క్రైస్తవుల దృఢవిశ్వాసం ఎంత గొప్పదో మనదరికి తెలిసిన విషయమే! జ్ఞానస్నానము పొందిన
క్రైస్తవులు, ఎప్పుడైతే
యేసు 'మెస్సయ్యా'
అని విశ్వసించారో, మరణమునుండి ఉత్థానమైనాడని విశ్వసించారో,
వారు నూతన జీవితాన్ని, జీవనాన్ని పొందారు. నూతన వ్యక్తులుగా రూపాంతరం చెందారు.
క్రీస్తుకొరకు హింసలను భరించుటకును, మరణించుటకును సిద్ధపడ్డారు.
మొదటి పఠనము: అపోస్తలులు
ఉత్థాన క్రీస్తునకు సాక్షులుగా, క్రీస్తు దైవకార్యాన్నిఈ లోకములో కొనసాగించడం చూస్తున్నాము.
ఉత్థాన క్రీస్తు నామమున అనేకమైన అద్భుతములను, సూచక క్రియలను చేసియున్నారు. దీనిమూలముగా, “అనేకులు
మరియెక్కువగ, విశ్వాసులై
ప్రభువు పక్షమున చేరిరి.” ప్రజలు అపోస్తులలో ఉన్న దేవుని శక్తిని
విశ్వసించారు. క్రైస్తవ సంఘమంతయు కూడా ఐఖ్యతాభావముతో జీవించినది, “అపోస్తలుల
బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్ధించుట యందు నిమగ్నమై ఉండిరి...
అందరు కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో అందరు పాలు పంచుకొను చుండిరి”
(2:42,44). ఇది యేసు ప్రభువు యొక్క సార్వత్రిక రక్షణ సందేశము, ప్రేషితత్వమునకు
తార్కాణం.
క్రీస్తు ఉత్థానముద్వారా, దేవుడు మనకు
నూతన జీవితమును, సంతోషమును
ఒసగుచున్నాడు. క్రీస్తు మరణమును జయించి మనందరికి శాశ్వత జీవమును ఏర్పాటు
చేసియున్నాడు. అయితే, మన
భూలోక జీవితమున మన క్రైస్తవ జీవితమునకు విశ్వాసులుగా ఉండవలయును. నేడు ముఖ్యముగా
ఐఖ్యతాభావం ఎంతో అవసరం. ఇది మనతోనే ఆరంభామవ్వాలి.
సువిశేష పఠనము: ఉత్థాన క్రీస్తు
శిష్యులకు దర్శనమివ్వటం చూస్తున్నాము. యూదుల భయముచే శిష్యులు ఇంటిలో తలుపులు
మూసుకుని యుండిరి. యేసు వచ్చి వారిమధ్య నిలువబడి, “మీకు శాంతి కలుగునుగాక!” అనెను. శాంతి (షాలొమ్) వచనాలతో వారిలోనున్న భయాన్ని
తొలగించాడు. ఆయన ఉత్థాన క్రీస్తు అని తెలియజేయుటకు వారికి తన చేతులను,
ప్రక్కను చూపగా, వారు ప్రభువును చూచి ఆనందించిరి. ఆ తరువాత ఆయన వారిమీద
శ్వాసను ఊది, “పవిత్రాత్మను
పొందుడు” అని చెప్పెను.
తాను ఆరంభించిన పనిని తన శిష్యులు కొనసాగించాలని ఆదేశించాడు. పవిత్రాత్మను పొందడం
అనగా నూతన సృష్టిని పొందడం. తండ్రి తనను పంపినట్లుగా, ప్రభువు తన శిష్యులను దైవకార్యమునకై పంపుచున్నారు. యేసు
శిష్యరికములో ఈ దైవకార్యం చాలా ప్రాముఖ్యమైనది. వారుకూడా ప్రభువువలె జీవించుటకు,
ఇతరులను ప్రభువు మార్గములో నడిపించుటకు పిలువబడి
యున్నారు. పవిత్రాత్మ శక్తివలన, పాపములను క్షమించు అధికారమును శిష్యులు పొందియున్నారు, “మీరు ఎవరి పాపములనైనను, క్షమించిన యెడల అవి క్షమించబడును. మీరు ఎవరి పాపములనైనను
క్షమింపని యెడల అవి క్షమింపబడవు.” దీనిద్వారా, ఈ లోకములో ఒకే
మనస్సు, ఒకే హృదయముగల
ఒకే కుటుంబమును ఏర్పాటు చేయవలసి యున్నది. మానవాళిని దేవునితో సఖ్యపరచవలసిన అవసరము
ఉన్నది.
తోమాసు-యేసు దర్శనము: అపోస్తలుడు
తోమాసు, ప్రభువు
దర్శనాన్ని గూర్చి చూస్తున్నాము. పాస్కా ఆదివారమున యేసు శిష్యులకు
దర్శనమిచ్చినప్పుడు, తోమాసు వారితో
లేకుండెను. యేసు దర్శనాన్నిగూర్చి తోమాసుకు తెలియజేసినప్పుడు,
అతను విశ్వసించడానికి నిరాకరించాడు,
“నేను ఆయన చేతులలోని చీలలగుర్తులను చూచి,
అందు నా వ్రేలు పెట్టి, ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే
తప్ప విశ్వసింపను” (20:25) అని అన్నాడు. యేసు ఉత్థానాన్ని విశ్వసించుటకు, వ్యక్తిగతముగా ప్రభువు
సాన్నిధ్యాన్ని అనుభవించాలని ఆశించాడు. తోమాసు అవిశ్వాసి అని చెప్పడం సబబు కాదు.
వ్యక్తిగా తోమాసు చాలా ధైర్యవంతుడు, విశ్వాసపరుడు. లాజరు మరణించినప్పుడు, తోమాసుగారు, “మనముకూడ
వెళ్లి ఆయనతో పాటు చనిపోవుదము” (యోహాను. 11:16) అని తోడి శిష్యులతో అన్నాడు. తన అవిశ్వాసాన్ని ప్రకటించడానికి
కారణం, ఉత్థాన
ప్రభువును దర్శించిన ఇతర శిష్యులు, ఇంకా ఎందుకు యూదులకు భయపడి ఇంటిలో తలుపులు మూసుకొని
యున్నారు? ఉత్థాన
క్రీస్తుకు ధైర్యముగా సాక్ష్యమీయవలసి ఉన్నది కదా అని తలంచి యుండవచ్చు! వాస్తవానికి,
తోమాసు దృఢవిశ్వాసి. ఆయన విశ్వాసము కొరకు భారత
దేశమునకు వచ్చి, సువార్తను బోధించి తన విశ్వాసము కొరకు మరణించాడు.
ఎనిమిది
దినముల పిమ్మట ఆయన శిష్యులు మరల ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను.
మూసిన తలుపులు మూసినట్లుండగనే యేసు వచ్చి వారి మధ్య నిలువబడి,
“మీకు శాంతి కలుగును గాక” అనెను. అపుడు తోమా “నా ప్రభూ! నా దేవా!” అని పలికి తన
విశ్వాసాన్ని ప్రకటించాడు. అయితే, ప్రభువు, “నీవు
విశ్వసించినది నన్ను చూచుట వలన కదా! చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు” అని పలికి యున్నారు.
ప్రభవు
శిష్యులకు కనిపించి, “మీకు శాంతి
కలుగును గాక!” అని పలికిన
తరువాత, ప్రభువు ఈరోజు
మూడు ప్రాముఖ్యమైన కార్యాలను చేసియున్నారు:
(అ).
ఉత్థాన ప్రభువు శిష్యులకు ప్రేషిత పరిచర్య కార్యాన్ని అప్పగించాడు: “నా తండ్రి నన్ను పంపినట్లు, నేను మిమ్ము పంపుచున్నాను (యోహాను 20:21).
(ఆ).
దీని తరువాత, ప్రభువు
వారిపై శ్వాస ఊది “పవిత్రాత్మను
పొందుడు” (యోహాను 20:22)
అని పలికెను. ఇక్కడ మనం ముఖ్యముగా గమనింప వలసిన విషయం ఏమనగా,
సువార్తీకుడు యోహాను ప్రభువు ఉత్థానమును, పవిత్రాత్మ
రాకడను వేరువేరుగా చూడటము లేదు. ఉత్థానమైన రోజునే ప్రభువు శిష్యులకు
కనిపించినప్పుడు, పవిత్రాత్మను
ఒసగాడు. యోహాను మనకు బోధించే చక్కటి విషయం ఏమిటంటే, ఉత్థానక్రీస్తు అనుభూతిని పొందినప్పుడు,
మనం పవిత్రాత్మను పొందెదము.
(ఇ).
చివరిగా, ఉత్థాన
ప్రభువు దివ్యసంస్కారమైన “పాపసంకీర్తనము”ను
స్థాపించినాడు. ప్రభువు శిష్యులతో, “ఎవరి పాపములనైనను మీరు క్షమించిన యెడల అవి క్షమింప బడును. మీరు ఎవరి
పాపములనైనను క్షమింపని యెడల అవి క్షమింప బడవు” (యోహాను 20:23). “పాపసంకీర్తనము” అను ఈ దివ్య సంస్కారము ద్వారా, మనము దైవ కారుణ్యమును పొందుచున్నాము. మన పాపములను దేవుడు
క్షమిస్తున్నాడు.
“పాపసంకీర్తనము”
దివ్యసంస్కారమును మనం పొందిన గొప్ప వరము. దేవుడు
మాత్రమే మన పాపములను క్షమిస్తాడు. ఆ అధికారాన్ని ప్రభువు తన శిష్యులకు
ఇచ్చియున్నాడు. నేడు తిరుసభలో అభిషేకించబడిన గురువులకు ఇవ్వబడినది. గురువులు
శిష్యుల స్థానములో ఉంటున్నారు. అయినప్పటికిని, పాపములను క్షమించేది మాత్రము దేవుడే. గురువులు యేసు ప్రభవు
స్థానములో ఉండి దైవక్షమాపణను మాటలద్వారా, చేతలద్వారా విశ్వాసులకు అందిస్తున్నారు.
దేవుడు మన పాపములను క్షమించాడని గురువు ‘పాప విమోచన ప్రార్ధన’ ద్వారా మనకు తెలియజేయు చున్నాడు.
నేను “పాపసంకీర్తనము” చేసినప్పుడు స్వస్థతతో కూడిన దేవుని దయను నేను పొందుచున్నానా?
పొందలేకపోతే కారణాలు ఏమిటి? సరైన సంసిద్ధత లేక నియమిత చర్యగా (routine)
పాపసంకీర్తనము చేస్తున్నానా? భయము వలన, సిగ్గువలన నా పాపములను మనస్పూర్తిగా ఒప్పుకొనలేక పోవుచున్నానా?
దివ్యకారుణ్య మహోత్సవం
ఈరోజు
దివ్యకారుణ్య మహోత్సవం. లతీనులో ‘misereri’ అనగా ‘కనికరము చూపుట’ లేదా ‘కరుణ కలిగి యుండుట’ అని అర్ధం. “Cor”
అనగా ‘హృదయం’. హృదయములోనుండి మనం ఇతరులపై ‘దయ’ను,
‘కరుణ’ను చూపటం అని భావం. దివ్యకారుణ్యం అలాంటిదే.
గ్రీకులో ‘eleison’
అని అంటారు. అనగా ‘దయ’ అని అర్ధం. హీబ్రూలో రెండు పదాలు ఉన్నాయి. ఒకటి ‘rachamim’
(racham, rachim) శబ్దార్ధ
ప్రకారం, ‘గర్భం’
అని అర్ధం. ‘గర్భం’ నూతన జీవితానికి,
నూతన సృష్టికి సూచిక. దేవుని కారుణ్యము అంత లోతైనదని
అర్ధం. రెండవది ‘hesed’
(దేవుని) ‘స్థిరమైన ప్రేమ’ అని అర్ధము. వీటన్నింటికి
అర్ధం మనం చేసే ప్రార్ధన – “ప్రభువా, నాపై దయ
చూపుము. నీ కారుణ్యమును నాపై కుమ్మరించుము. నీ దయను, కృపను, ప్రేమను నాపై కుమ్మరించుము.” మరోవిధముగా చెప్పాలంటే, మనలను తన “గర్భము”లో దాచుకొని నూతన సృష్టిగా మనలను చేయుమని
ప్రార్ధిస్తున్నాము.
“దయ” అనగా రెండు విధాలుగా మనం అర్ధం చేసుకోవచ్చు: మొదటిది, పాపము వలన శిక్షను పొందుటకు అర్హులమైన మనం పొందక పోవడం: మన
పాపాలను (పాపము అనగా, దేవున్ని
తృణీకరించడం లేదా దేవుని నుండి వెడలిపోవడం) బట్టి మనం శిక్షార్హులము. దేవుని
కోపానికి గురికావలసిన వారము. కాని దేవుడు మన పాపాలను బట్టి మనలను శిక్షకు గురి
చేయడం లేదు. “మన పాపములకు తగినట్లుగా మనలను శిక్షింపడు. మన దోషములకు తగినట్లుగా
మనలను దండింపడు” (కీర్తన.
103:10). ఇది దివ్య కారుణ్యము, దయ, కనికరము,
ప్రేమ. దీనిని మనం పాపసంకీర్తనము అను దివ్యసంస్కారము
ద్వారా పొందుచున్నాము. రెండవదిగా, మంచిని పొందుటకు అర్హులము
కాకున్నను పొందటం: ఇదే దైవ కృప, దైవానుగ్రహము, దైవాశీర్వాదము.
ఇదియే దివ్య కారుణ్యము. మనం దేవుని వైపుకు తిరిగి వచ్చిన ప్రతీసారి దీనిని
పొందుచున్నాము.
ఈస్టర్
రెండవ ఆదివారమును, 2000లో పునీత జాన్ పౌల్ జగద్గురువులు దివ్యకారుణ్య పండుగగా
స్థాపించారు.
శ్రీసభలో
‘దివ్యకారుణ్య మహోత్సవం’ స్థాపించబడాలని ప్రభువే స్వయముగా కోరినట్లు పునీత ఫౌస్తీనమ్మగారు (దివ్యకారుణ్య
అపోస్తురాలు) తన దినచర్య పుస్తకములో తెలిపియున్నారు (పునీత ఫౌస్తీనమ్మ డైరీ,
699). ప్రభువు ఆమెకి ఈ మహోత్సవమునుగూర్చి ఫిబ్రవరి 22,
1931వ సంవత్సరములో తెలిపియున్నారు,
''పునరుత్థాన పండుగ తరువాత వచ్చు ఆదివారమున (పాస్కా
రెండవ ఆదివారము) దివ్యకారుణ్య మహోత్సవం కొనియాడబడాలనేదే నా కోరిక. ఆ దినమున,
దివ్యకరుణ సకల జనులకు ఒసగబడును. ఆ దినమున,
పాపసంకీర్తనం చేసి, దివ్యసత్ప్రసాదమును స్వీకరించు వారికి సంపూర్ణ పాపవిమోచనము,
శిక్షనుండి విముక్తియును లభించును. మానవ లోకము నా
దరికి చేరిననే తప్ప అది శాంతమును పొందలేదు. ఆనాడు, అనంత దివ్యవరానుగ్రహాలు ప్రవహించే దివ్యద్వారాలన్నీ తెరచే
ఉంటాయి. వారి పాపాలు ఎంతటివైనను, నన్ను చేరడానికి ఏ ఆత్మగాని భయపడక ఉండునుగాక! నా దరి చేరు ఆత్మలకు నా కరుణా
సముద్ర వరాలను కృమ్మరించెదను. దివ్యకారుణ్య మహోత్సవం సకల ఆత్మలకు,
ముఖ్యముగా పాపాత్ములకు శరణముగాను,
ఆదరణముగాను ఉండునుగాక!''
పునరుత్థాన
మహోత్సవము తర్వాత వచ్చు ఆదివారమున కరుణ మహోత్సవమును కొనియాడుట ద్వారా,
మన రక్షణ పాస్కాపరమ రహస్యమునకు,
దివ్యకారుణ్యమునకు ఎంతో సంబంధము కలిగియున్నదని
విదితమగుచున్నది. ఆ దినమున, ప్రత్యేకముగా రక్షణ పరమ రహస్యము దివ్యకారుణ్యము, అతి గొప్ప వరప్రసాదము అని
ధ్యానించాలి.
దివ్యకరుణ
మహోత్సవానికి ముందుగా దివ్యకరుణ నవదిన ప్రార్ధనలను, దివ్యకరుణ జపమాలను జపించి ధ్యానించి ఉత్సవానికి సంసిద్దులము
కావలయునని ప్రభువు కోరుచున్నారు. నవదిన ప్రార్ధనలను చెప్పువారికి సాధ్యమైనన్ని
వరాలు ఒసగబడును.
దివ్యకరుణ
మహోత్సవాన్ని ఘనముగా, వైభవముగా
కొనియాడాలనేదే ప్రభువు ఆకాంక్ష. ఈ మహోత్సవాన్ని జరుపుకొనే విధానాన్ని ప్రభువు
రెండు విధాలుగా సూచించారు. మొదటగా, దివ్యకరుణ చిత్ర పటాన్ని ఆశీర్వదించి, సమూహముగా గౌరవించి, ఆరాధించాలి (పునీత ఫౌస్తీనమ్మ డైరీ, 49, 341, 414,
742). రెండవదిగా, ఆ దినమున గురువులు దివ్యకరుణ గూర్చి దైవప్రజలకు బోధించాలి (పునీత
ఫౌస్తీనమ్మ డైరీ, 570,
1521).
దివ్యకారుణ్య సందేశము
దేవుడు
దయామయుడు. ప్రేమ స్వరూపి. మన కొరకు తన ప్రేమను, కరుణను ధారపోసియున్నాడు. దేవుని కరుణను విశ్వసించుదాం.
పరులపట్ల కరుణను చూపుదాం. ఎవరును దేవుని కరుణకు దూరము కాకూడదని ఆయన కోరిక. ఇదియే
దివ్యకారుణ్య సందేశము. రాబోవు జీవితమున దేవుని కరుణను మనం పొందాలంటే,
ఈ జీవితమున ఇతరులపట్ల కరుణతో జీవించాలి.
దేవుడు
మనందరిని మిక్కిలిగా ప్రేమిస్తున్నాడు. మన పాపములకన్న ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనది,
అనంతమైనది. హద్దులులేనిది, షరతులు లేనిది. తద్వారా, నమ్మకముతో ఆ అనంత ప్రేమను కోరి, ఆయన కరుణను పొంది, మనద్వారా, ఇతరులకు కూడా
ఆ కరుణ ప్రవాహించాలనేదే దేవుని కోరిక. ఆవిధముగా, ప్రతి ఒక్కరు దైవసంతోషములో పాలుపంచు కొనగలరు.
దివ్యకారుణ్య
సందేశాన్ని మనం పుణికిపుచ్చుకోవాలంటే, మూడు కార్యాలు చేయాలి:
1. దివ్యకరుణను వేడుకోవాలి: ప్రార్ధనలో
మనం దేవున్ని తరచూ కలుసుకోవాలన్నదే ఆయన కోరిక. మన పాపాలకి పశ్చత్తాపపడి,
ఆయన కరుణను మనపై, సమస్త లోకముపై క్రుమ్మరించబడాలని దివ్య కరుణామూర్తిని
వేడుకోవాలి.
2. కరుణ కలిగి జీవించాలి: మనం కరుణను
పొంది, మనద్వారా ఆ
కరుణ ఇతరులకు కూడా లభించాలన్నదే దేవుని కోరిక. ఆయన మనపై ఏవిధముగా తన అనంత ప్రేమను,
మన్నింపును చూపిస్తున్నారో, ఆ విధముగానే మనము కూడా ఇతరుల పట్ల ప్రేమను,
మన్నింపును చూపాలని ప్రభువు ఆశిస్తున్నాడు.
3. యేసును సంపూర్ణముగా విశ్వసించాలి: తన దివ్యకరుణ వరప్రసాదాలు మన నమ్మకముపై ఆధారపడియున్నవని మనం తెలుసుకోవాలనేదే
ప్రభువు కోరిక. మన ఎంత ఎక్కువగా ఆయనను నమ్మితే, విశ్వసిస్తే, అంతగా ఆయన కరుణా కృపావరాలను పొందుతాము.
“దయామయులు
ధన్యులు, వారు దయను
పొందుదురు” (మత్త. 5:7). “నాకు
ఒసగబడిన ఈ దైవకార్యము నా మరణముతో అంతము కాదని, ఇది ఆరంభమేనని, నాకు ఖచ్చితముగా తెలుసు. అనుమానించు ఆత్మలారా! దేవుని యొక్క మంచితనము గూర్చి
మీకు ఎరుకపరచుటకు, నమ్మించుటకు
పరలోకపు తెరలను తీసి మీ చెంతకు తీసుకొని వత్తును”(పునీత ఫౌస్తీనమ్మ డైరీ, 281).
యేసుక్రీస్తునందు
ప్రధమముగా బహిరంగ పరచబడిన దేవుని దివ్యకరుణా రహస్యం, ఈ యుగానికొక గొప్ప సందేశము. మానవ చరిత్ర ప్రతిదిశలోనూ,
ముఖ్యముగా, ఈ యుగములోను, దివ్యకరుణా రహస్యాన్ని
లోకానికి చాటిచెప్పాల్సిన గురుతర భాద్యత శ్రీసభకు ఉన్నది (పునీత రెండవ జాన్ పాల్
పోప్).
“యేసుక్రీస్తు
వ్యక్తిగా కారుణ్యమూర్తి. క్రీస్తును దర్శిస్తే దైవ కారుణ్యమును దర్శించడమే”
(16వ బెనెడిక్ట్ పోప్).
బర్తిమయి
గుడ్డివాడు, “దావీదు
కుమారా! యేసు ప్రభూ,
నన్ను కరుణింపుము” అని అరిచాడు,
ఫలితముగా, చూపును పొందాడు. కననీయ స్త్రీ “ప్రభూ, దావీదు కుమారా! నాపై దయ చూపుము” అని మొరపెట్టుకున్నది.
ఫలితముగా, ఆమె కుమార్తె
స్వస్థత పొందినది. పది మంది కుష్ఠ రోగులు, “ఓ యేసు ప్రభువా! మమ్ము కరుణింపుము” అని కేకలు పెట్టారు. ఫలితముగా,
వారు శుద్ధి పొందారు. సుంకరి దూరముగా నిలువబడి
కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, “ఓ దేవా! ఈ పాపాత్ముని కనికరింపుము” అని ప్రార్ధించాడు. ఫలితముగా,
దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి
వెళ్ళాడు.
దివ్య
కారుణ్య మహోత్సవమున, మనముకూడా,
“ప్రభువా! నాపై దయచూపుము, క్రీస్తువా!
నాపై దయచూపుము, ప్రభువా! నాపై దయచూపుము అని ప్రార్ధిద్దాం. ఫలితముగా, దివ్యకారుణ్యమును పొందుదాం. దేవుని దయను,
కరుణను, ప్రేమను, శాంతిని,
స్వస్థతను, దైవానుగ్రహములను పొందుదాం. ఈ రోజు, కీర్తనాకారుడితో జతకలిసి పాడుదాం: “ప్రభువు మంచి వాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ
కలకాలము ఉండును” (కీర్తన.
118:1).
అందరికి,
దివ్య కారుణ్య పండుగ శుభాకాంక్షలు! పునీత ఫౌస్తీనమ్మగారా!
మాకొరకు ప్రార్ధించండి.
No comments:
Post a Comment