ఈస్టర్ నాలుగవ ఆదివారము Year A
అ.కా. 2:14, 36-41, 1 పేతు. 2:20-25, యోహాను. 10:1-10
కాపరి స్వరము
ఈరోజు
ఈస్టర్ నాలుగవ ఆదివారం. దీనికి “మంచికాపరి ఆదివారము” అని పేరు. గతవారము, ఎమ్మావు
గ్రామమునకు వెళ్ళుచున్న ఇద్దరు శిష్యులకు ఉత్థాన క్రీస్తు దర్శనమిచ్చిన సంఘటనను
ధ్యానించాము. తప్పిపోయిన గొర్రెలవలెనున్న వారిని, మంచి కాపరి అయిన యేసు వారిని వెదకి,
కనుగొన్నాడు. నేడు సువిశేష పఠనములో, కాపరి, గొర్రెల గురించి వింటున్నాము. యోహాను
సువార్తికుడు, తన సువార్తలో, ఉత్థాన క్రీస్తును వివిధ బిరుదులతో మనకు పరిచయం చేస్తున్నాడు:
“జీవాహారము, జగతికి జ్యోతి... మొ.వి. ఈరోజు క్రీస్తును “మంచి కాపరి”గా సువార్తలో చూస్తున్నాము.
ప్రతీ బిరుదుకూడా సూక్ష్మముగా, గొప్పగా, అద్భుతముగా పరిచయం చేయబడింది. అలాగే, నేటి
సువిశేషములో, యోహాను యేసును “ద్వారము”గా పరిచయం చేస్తున్నారు.
గొర్రెల మంద దృష్టాంతము
యేసు
ఒక నూతన జీవితానికి ‘ద్వారము’. యేసు ‘గొర్రెల మంద దృష్టాంతము’ చెప్పినప్పుడు, విన్నవారు
గ్రహించలేక పోయారు. “గొర్రెల దొడ్డిలోనికి ‘ద్వారము’న ప్రవేశింపక వేరొక మార్గమున
ఎక్కి వచ్చువాడు దొంగయు, దోపిడికాడునై ఉన్నాడు” (10:1) అని యేసు చెప్పాడు. గొర్రెల
కాపరులు, గొర్రెల మందలను రాత్రులలో రక్షించుకోవడానికి, కంచెలను ఏర్పాటు చేస్తారు.
దానికి ఒకే ద్వారము ఉంటుంది. “ద్వారమున ప్రవేశించువాడు గొర్రెలకాపరి” (10:2).
వేరొక మార్గమున వచ్చువాడు దొంగ, దోపిడికాడు. సంరక్షణ కొరకు, కొన్నిసార్లు వివిధ
మందలను ఒకే చోట ఉంచుతారు. అలాంటప్పుడు, గొర్రెలు తప్పిపోక ఉండుటకు, వేరే మందలలో
కలిసిపోకుండా, కావలివాడు తలుపు తీసినప్పుడు, కాపరి ముందుగ నడుచుచుండగా, గొర్రెలు
కాపరి స్వరమును విని, గుర్తుపట్టును. కనుక అవి వాని వెంట పోవును (10:3-4). పరాయి
వాని (దొంగ, దోపిడికాడు) స్వరమును ఎరుగవు కనుక అవి వాని వెంట వెళ్లక దూరముగా
పారిపోవును (10:5).
గొర్రెల మంద దృష్టాంతము – వివరణ
“గొర్రెలు
పోవు ద్వారమును నేనే... నేనే ద్వారమును! ఎవడేని నా ద్వారా ప్రవేశించిన యెడల వాడు
రక్షణ పొందును. అతడు వచ్చుచు పోవుచు ఉండును. వానికి మేత లభించును” (10:7,9) అని యేసు
వాగ్ధానము చేసాడు. అవును! ఆయనే ద్వారము, ఎందుకన, ఆయనే విశ్వాసులందరికి సత్యమునకు
మూలము. పరలోకములో త్రిత్వైక దేవునితో జీవించాలంటే, క్రీస్తు అను ద్వారమున మనము
ప్రవేశించాలి. “దేవునితో ఐఖ్యమగుటకు మనలను నడిపించే తండ్రి ద్వారము క్రీస్తు” (Ignatius). “నేను జీవము
నిచ్చుటకును, దానిని సమృద్ధిగ ఇచ్చుటకును వచ్చియున్నాను” (యోహాను. 10:10) అని
చెప్పాడు. ఆ సమృద్ధిగల జీవమే, పరలోకములో దేవునితో ఐఖ్యమవడము!
యేసు
“నేనే ద్వారమును” అని చెప్పుటలో మూడు విషయాలను గమనించవచ్చు: ఒకటి, రక్షణ: ఈ
ద్వారముద్వారా (యేసు) ప్రవేశించువారు ‘రక్షింపబడుదురు’. “నేను వానికి నిత్యజీవము
ప్రసాదింతును. కనుక, అవి ఎప్పటికిని నాశనము చెందవు (యోహాను 10:28). రెండు, స్వతంత్రము:
ఈ ద్వారముద్వారా (యేసు) ప్రవేశించువారు వచ్చుచు, ‘పోవుచు ఉందురు’. యెరూషలేము
దేవాలయమునకు ‘గొర్రెల ద్వారము’ అనేది ఒకటి ఉండేది. దేవాలయములో బలులను
అర్పించడానికి, గొర్రెలను ఈ ద్వారమున తీసుకొని వెళ్ళేవారు. గొర్రెలు వెళ్ళడమే
తప్ప, తిరిగి వచ్చేవి కావు, ఎందుకన, అవి బలిగా అర్పించబడేవి. ఈవిధముగా, యూదుల బలి
అర్పణ విధానమును, యేసు సవాలు చేయుచున్నాడు! తనను అనుసరించువారి నిజ స్వతంత్రము
గూర్చి యేసు మాట్లాడుచున్నాడు. మూడు, నిత్యజీవము: ఈ ద్వారముద్వారా (యేసు)
ప్రవేశించువారికి ‘మేత’ (నిత్య జీవము) లభించును. ఆకలిదప్పులు లేని జీవితమును వారు
పొందుదురు. “నేను జీవము నిచ్చుటకు, దానిని సమృద్ధిగ ఇచ్చుటకును వచ్చియున్నాను”
(10:10). “నేనే మార్గము, సత్యము, జీవము. నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు
రాలేడు” (యోహాను. 14:6). యేసు అను ‘ద్వారము’ ద్వారా ప్రవేశించువారు మాత్రమే
కాపరులు. ఆయన ఎవరినైతే అగీకరిస్తాడో, వారే ప్రామాణికమైన కాపరులు. యేసు మంచి కాపరి.
తన గొర్రెలను ఎరిగియున్నాడు. వారిని కాపాడును. అయితే, అన్నింటికన్న ముఖ్యముగా,
ఆయనే ‘ద్వారము’.
శ్రీసభ పితరుల అభిప్రాయం
కాపరి, గొర్రెలను అనుసరించుటకు బదులుగా, గొర్రెలే కాపరిని
అనుసరించును. అవి సంచరించకుండా, కాపరి వాటిని ఒకచోట చేర్చును (Chrysologus). క్రీస్తు మందలో చేర్చుటకు, ‘ద్వారము’
అయిన లేఖనములను (దేవుని వాక్కు) వారికి కాపరి ఉపదేశించును (Chrysostom). క్రీస్తును అంగీకరించువారు ఆ
ద్వారమున ప్రవేశింతురు (Augustine). కాపరులు ద్వారమున మాత్రమే ప్రవేశింతురు. దొంగలు ఎటునుండైనా
ప్రవేశిస్తారు (Theodore). ద్వారమున ప్రవేశించు నిజమైన కాపరి, క్రీస్తు ద్వారా
మాత్రమే ప్రవేశిస్తాడు (Augustine).
పరిసయ్యులు
దొంగలు, దోపిడిగాండ్రు. యేసు పాపులను చేరదీస్తే, పరిసయ్యులు పాపులను ఖండించారు. వారు
ప్రజలను ప్రేమించలేదు. వారు “వేరొక మార్గమున ఎక్కివచ్చువారు”. యేసు ఆదర్శముగల మంచి
కాపరి. ప్రస్తుత కాలములోకూడా చెడు కాపరులు ఉన్నారు: స్వార్ధపరులు, ప్రజలను రక్షించుటకు
బదులుగా వారిని తప్పుడు మార్గములో నడిపించేవారు. వారి సంరక్షణ, సౌకర్యం చూసుకుంటూ,
ప్రజలను ‘తోడేళ్ళకు, దొంగలకు’ వదిలివేస్తున్నారు.
నేటి పఠనములో
మరో రెండు ఉద్దేశాలను కూడా మనం గమనించాలి: 1. ద్వారమున ప్రవేశించుట 2. స్వరమును
గుర్తించుట. మనకు దేవుని వాక్కు (సువార్తలు) నిజమైన ‘ద్వారము’. మనము క్రీస్తు
మందలో చేరాలంటే, మనము ప్రవేశించే ‘ద్వారము’ నాలుగు సువార్తలు. క్రమము తప్పకుండా
సువార్తలను మనం ధ్యానించాలి. అవి క్రీస్తుకు దర్పణాలు. సువార్తలు క్రీస్తునందు మన
విశ్వాసాన్ని పరిచయం చేయడం మాత్రమేగాక, అవి తండ్రి దేవుని దరిచేరుటకు, మనకు మార్గము,
సత్యము, జీవమును దయచేయును. నేడు మనలో చాలామంది సువార్తలద్వారా కాకుండా, దొంగలవలె,
వారి స్వంత మార్గములద్వారా పరలోకములోనికి ప్రవేశించాలని చూస్తున్నారు. ఇది, తనను,
ఇతరులను వినాశనానికి దారి తీయును.
తిరుసభ
పరలోకానికి సంకేతం, సాధనం. క్రీస్తు, తన ప్రేషిత కార్యమైన లోకరక్షణను తిరుసభద్వారా
కొనసాగిస్తున్నాడు. తిరుసభ క్రీస్తు వధువు. కనుక ఈ రెండు సత్యాలను గుర్తించాలి: అందరు
క్రీస్తునందు రక్షణ పొందే అవకాశం, రక్షణకు తిరుసభ ఎంతో అవసరం (పునీత రెండవ జాన్
పౌల్).
సువార్తలలో
క్రీస్తు స్వరము ప్రతిధ్వనించును. కనుక, మనం క్రమము తప్పకుండా సువార్తలను చదవాలి,
ధ్యానించాలి. అప్పుడు, కాపరి స్వరమును వినగలము. “కావలి వాడు వానికి తలుపు తీయును: గొర్రెలు
వాని స్వరమును వినును. అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి, బయటకు తోలుకొని
పోవును. తన గొర్రెలను అన్నిటిని బయటకు తోలుకొని వచ్చిన పిదప, వాడు వానికి ముందుగ
నడుచును. గొర్రెలు వాని స్వరమును గుర్తించును. కనుక అవి వానివెంట పోవును” (యోహాను.
10:3-4).
మొదటి పఠనములో, పేతురు ఇచ్చిన సలహా
నేటి కాపరులందరికి వర్తించును. ప్రజలను
నడిపించడానికి కాపరులు పవిత్రాత్మతో నింపబడి యుండాలి. “మీరు హృదయ పరివర్తన చెంది
మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కరు యేసు క్రీస్తు నామమున బప్తిస్మము పొందవలయును.
అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు” (అ.కా. 2:38).
రెండవ పఠనములోకూడా, పేతురుగారు,
తప్పిపోయిన గొర్రెలవలె యున్న వారందరు తిరిగి మంచి కాపరి యొద్దకు రావాలని
పిలుపునిస్తున్నారు. క్రీస్తు మన కొరకు బాధపడి, ఆయన అడుగు జాడలలో మనము
అనుసరించుటకు ఒక ఆదర్శమును ఏర్పరచాడు. మనము పాపమునకు మరణించి నీతికి
జీవించునట్లుగ, ఆయన మన పాపములను తనపై ఉంచుకొని సిలువ మ్రానిపై మోసాడు. ఆయన పొందిన
గాయములచే మనము స్వస్థత పొందాము. మనము త్రోవ తప్పిన గొర్రెల వలె ఉంటిమి. ఇప్పుడు మన
ఆత్మలను రక్షకుడును, కాపరియు అగువాని యొద్దకు మనము మరలి రావాలి.
జగద్గురువులు
పోపు ఫ్రాన్సిస్ గురువులకు సందేశమిస్తూ, గురువులు దేవుని కృపను, స్వస్థతను,
అవసరములోనున్న ప్రతీఒక్కరికి తీసుకొని రావాలని, “గొర్రెల వాసనను తెలిసిన గొర్రెల
కాపరులవలె” గురువులుకూడా తమ ప్రజల గురించి క్షుణ్ణముగా ఎరిగియుండాలని, ముఖ్యముగా
పేదవారికి చేరువలో యుండాలని కోరారు. దేవునికి-మానవాళికి మధ్యవర్తులుగా (mediators)
ఉండాల్సిన కాపరులు, క్రమముగా నిర్వాహకులుగా (managers) మారుచున్నారు. ఈ కారణముచేతనే,
కొందరు కాపరులుగాక, అసంతృప్తులుగా, హృదయాన్ని కోల్పోయినవారిగా మారుచున్నారు. అందుకే
జగద్గురువులు, ‘తమ గొర్రెలను ఎరిగిన కాపరులవలె’ ఉండాలని, ప్రజలు గురువులను నిస్వార్ధపరులుగా,
‘మనుష్యులను పట్టువారు’గా గుర్తించాలని, విశ్వసించాలని కోరియున్నారు.
గొర్రెల కాపరులు: ప్రతీరోజు,
మనచుట్టూ ఎన్నో గొర్రెల మందలను, గొర్రెల కాపరులను చూస్తూ ఉంటాము. పాత నిబంధనలో, గొర్రెల
కాపరులను చూసినట్లయితే, వారి సమస్త జీవితాన్ని గొర్రెలతోనే గడుపుతారు. వాటిని
పోషించడం, పెంచడం, గాయపడినవాటికి వైద్యం చేయడం, అన్నింటికన్న ముఖ్యముగా,
అపాయములనుండి వాటిని కాపాడటం చేస్తూ ఉంటారు. యెహెజ్కేలు ప్రవక్తద్వారా, యావే
దేవుడు తననుతాను ఒక “కాపరి”గా యిస్రాయేలు ప్రజలకు తెలియజేసాడు. ఇస్రాయేలు చెడు కాపరులను హెచ్చరించాడు. “మంచి కాపరి”ని
పంపిస్తానని వాగ్దానం చేసాడు (తప్పక చదువుము. 34:1-31, యిర్మీ. 49:19, 50:44).
అయితే, ఇది యిస్రాయేలు ప్రజలను ఎంతమాత్రము ఆశ్చర్యపరచ లేదు. ఎందుకన, వారికి
గొర్రెల కాపరుల గురించి బాగా తెలుసు. అబ్రహాము అతని కుమారులు, గొర్రెల కాపరులు. దావీదు
గొర్రెల కాపరి. ప్రారంభ దశలో, యూదుల నాయకులు, రాజులు గొర్రెల కాపరులే! వారు ఇస్రాయేలు
కాపరులుగా పిలువబడినారు. ఇస్రాయేలు నాయకులు కాపరులుగా విఫలమైనందున, ప్రవక్తలు ‘మంచి
కాపరి’ కొరకు ఎదురు చూసారు (యెహెజ్కె. 34:23, యెషయ 40:11, యిర్మీ. 31:10-17, మీకా.
5:2-5, జెక. 11:11-12, 13:7-9).
ప్రవక్తలు,
ఇశ్రాయేలు ప్రజలు ఎదురుచూచిన ఆ ‘మంచి కాపరి”యే, యేసు క్రీస్తు. నూతన నిబంధనలో,
యేసు ప్రభువు తననుతాను మంచి కాపరిగా తెలియ జేశాడు. గొర్రెల కొరకు తన ప్రాణములను అర్పించు
కాపరిగా, ప్రతీగొర్రెను ఆయన వ్యక్తిగతముగా పిలుచును, కాపాడును (యోహాను. 10:1-21,
చూడుము. 1 పేతు. 2:25, హెబ్రీ. 13:20). సిలువపై తన ప్రాణాలర్పించి, తన ప్రజలకు రక్షణ
ఒసగాడు. అలాగే, మంచి కాపరిగా, తుది తీర్పున, “మేకలను గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని
వేరుపరచును” (మత్త. 25:33).
మంచి
కాపరి అయిన యేసును ఆదర్శముగా తీసుకొని, ప్రేమ, సంరక్షణతో, తన ప్రజల కాపరులు
చూపాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ నేపధ్యములోనే, శ్రీసభ నాయకత్వము గురించి, పేతురుకు
కూడా యేసు సవాలు విసిరాడు: “అవును ప్రభూ! నేను నిన్ను ప్రేమించుచున్నాను” అని పేతురు
చెప్పినప్పుడు, ప్రభువు, “నీవు నా గొర్రెపిల్లలను మేపుము” (యోహాను. 21:15), “నా
గొర్రెలను కాయుము” (21:16), “నా గొర్రెలను మేపుము” అని అన్నాడు. ఆ తరువాత పేతురు సంఘ
పెద్దలతో, “మీ ఆధీనమందున్న దేవుని మందకు కాపరులు కండు. అయిష్టముతోకాక, దేవుని
చిత్తము అనుకొని ఇష్టపూర్వకముగ దానిని కాపాడుడు. దుర్లభమైన ఆపేక్షతోకాక, మన:పూర్వకముగ
దానిని కాయుడు. మీ ఆధీనమందున్న వారిపై అధికారము చలాయింపక మీరు మందకు మాతృకగా
ఉండుడు” (1 పేతు. 5:2-3) చెప్పాడు.
మనలో
అందరముకూడా నాయకులయ్యే అవకాశాన్ని కలిగియున్నాము: జగద్గురువులు, మేత్రాణులు,
విచారణ గురువులు, ప్రభుత్వాధికారులు, తల్లిదండ్రులు... కాపరులుగా మనం
సఫలమవ్వాలంటే, మొదటిగా మనలో అంకితభావం ఉండాలి. నిజమైన నాయకుడు, తన
వారికొరకు తన సర్వాన్ని అర్పిస్తాడు. అంకితభావము కలిగిన నాయకులు ఈ నాలుగు
లక్షణాలను కలిగి ఉంటారు: 1. సమర్ధత (Competent): అన్ని విషయాలలో, ముఖ్యముగా
ఆధ్యాత్మిక విషయాలలో కూడా సమర్ధులై ఉండాలి. 2. నిబద్ధత (Commitment):
ఉదారస్వభావము కలిగియుండాలి. వారి సమయాన్ని (Time), ప్రతిభను (Talent), నిధిని (Treasure)
పంచుకోవడానికి సిద్ధముగా ఉండాలి. 3. పవిత్రత (Consecration): అనగా, నాయకులు
దైవ సేవకొరకు ప్రత్యేకముగా ఎన్నుకొనబడుట. సేవే వారి ప్రధాన కర్తవ్యం కావాలి. 4.
మారుమనస్సు (Conversion): ఇతరులు చేసిన ఏ తప్పులనైనను క్షమించడానికి సిద్ధముగా
ఉండటం.
రెండవదిగా,
జ్ఞానం ఉండాలి. నిజమైన నాయకుడు తన ప్రజలను ఎరిగియుంటాడు (యోహాను. 10:3). బైబులు
ప్రకారం, ఎరిగియుండుట’ లేదా ‘తెలుసుకొనుట’, మేధోజ్ఞానము (Intellectual Knowledge)
కన్న ఎక్కువ. అనగా, వారి పేర్లు, పని, ఆశయాలు, ప్రణాళికలు, భావాలు, వారి జీవిత
పరిస్థితులు, నేపద్యాలు, కష్టాలు... అన్నీ తెలిసి యుండటం.
మూడవదిగా,
ఆదర్శముగా ఉండాలి. నాయకులు సంఘములో వారి మాటద్వారా, చేతలద్వారా ఇతరులకు
ఆదర్శముగా ఉండాలి. గురువులు ప్రజలకు, తల్లిదండ్రులు పిల్లలకు, బోధకులు
విద్యార్ధులకు... ఉదాహరణగా, ఆదర్శముగా ఉండాలి.
మన బాధ్యత: నేడు గొర్రెలను, ఏకము
చేయుటకు బదులుగా, వాటిని చెల్లాచెదురు చేసే కాపరులు ఎక్కువై పోయారు. వీరు నిజమైన
క్రీస్తు అనుచరులు కానేరరు. వారి మహిమ కొరకు ప్రాకులాడువారు. స్వప్రయోజనాల కొరకు
సువార్తలను నిర్దేశిస్తారు. వారి స్వంత ఆలోచనలను గుడ్డిగా నమ్ముతారు. వాస్తవానికి,
వారు కాపరిలేని గొర్రెలవంటి వారు. సువర్తా బోధనలకు తిరిగి రావాలి. సువార్తా విలువల
ప్రకారం జీవించాలి. క్రీస్తే నిజమైన ‘మార్గము’ అని గుర్తించాలి, విశ్వసించాలి. లోకమునకు
వెలుగువలె, ఉప్పువలె, సువార్త సందేశాన్ని మనం ఈ లోకములో, జీవించాలి, ప్రకటించాలి. క్రీస్తు
గొర్రెలను (విశ్వాసులు) సన్మార్గములో నడిపించుటకు మనము ప్రయత్నం చేయాలి. ఇది మనందరికి
ఒక గొప్ప సవాలు! బాధ్యత!
No comments:
Post a Comment