ఈస్టర్ మూడవ ఆదివారము, YEAR A
అ.కా. 2:14, 22-33, 1 పేతు. 1:17-21, లూకా. 24:13-35
మొదటి పఠనము: పెంతకోస్తు పండుగ రోజున, పవిత్రాత్మను
పొందిన తర్వాత, యెరూషలేములో
కూడిన యూదులు, అన్యుల సమక్షములో నిర్భయముగా పేతురు ఇచ్చిన సందేశమును, నజరేయుడైన
యేసు క్రీస్తును గూర్చిన సాక్ష్యమును నేటి
మొదటి పఠనములో వినియున్నాము. క్రీస్తు మరణం, ఉత్థానం
తర్వాత, క్రీస్తును గూర్చి
బహిరంగముగా ఇచ్చిన సందేశము! నూతన గ్రంథములో దేవుని రక్షణ ప్రణాళికను గూర్చి,
ఆయన చేసిన అద్భుత కార్యములను గూర్చి ఇవ్వబడిన గొప్ప
సాక్ష్యం! క్రీస్తు మరణానికి అర్ధాన్ని వివరించిన సదేశం!
క్రీస్తు
ఉత్థానం తర్వాత శిష్యులు, ఇతర విశ్వాసులు యూదులకు భయపడి, కలసికట్టుగా ఒకచోట చేరి
ఎడతెగక ప్రార్ధన చేయుచుండిరి (అ.కా. 1:14), పరిచర్యలో, సహవాసములో కలిసియుండిరి. యేసు వాగ్ధానము చేసిన పవిత్రాత్మకై వారు వేచియుండిరి
(అ.కా. 1:4). అపోస్తులతో కూడిన ఈ చిన్న సమూహం, పవిత్రాత్మతో నింపబడింది (అ.కా. 2:4). దేవుడు ఈ లోకములో
చేసిన గొప్ప కార్యములను బట్టి వారు ఆయనను
పొగడిరి, స్తుతించిరి. పెంతకోస్తు పండుగకు వచ్చిన అపోస్తలులు, ఇతర విశ్వాసులు అందరూ,
వారివారి సొంత భాషలో చేసిన ప్రార్ధనను, స్తుతి ఆరాధనను విని (అ.కా. 2:7) అక్కడున్నవారు విస్మయమొంది, ఆశ్చర్యపడిరి.
కొందరు, ఇదేమి వింత
అని, వెక్కిరింపుగా
నవ్వారు. మరికొంత మంది, “వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారు” అని అపహాస్యము చేసిరి (అ.కా. 2:13).
ఈ
అవహేళనను, ఎగతాళిని
పేతురు తన సందేశానికి, తన
సాక్ష్యమునకు ఆరంభముగా మలచు కుంటున్నాడు. అన్యులు, యూదుల అవహేళనను పేతురు అవకాశముగా ఉపయోగించుకొను చున్నాడు. ఆశ్చర్యపడిన వారిని,
అవహేళన చేసినవారిని, పవిత్రాత్మ శక్తి అర్ధంకాని వారిని క్రీస్తు వైపుకు,
క్రీస్తు ఆరాధనలోకి నడుపుచున్నాడు. “అతని ప్రబోధమును
విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానమును పొందిరి. ఆరోజున రమారమి మూడువేల
మంది క్రీస్తు సంఘములోనికి చేర్చబడిరి” (అ.కా.2:41). అవహేళన చేసిన వారిని,
ఆరాధనలోనికి నడిపినది పేతురు సందేశము,
సాక్ష్యము.
ఈ
సందేశములో, సాక్ష్యములో
ఏమి నిక్షిప్తమై యున్నది? ఈ సందేశములోని సారమే వారి మనసులను, హృదయాలను, జీవితాలను మార్చినది. ఈ
సందేశములో, యేసు పరిచర్య,
మరణము, భూస్థాపితము,
పునరుత్థానము గురించి, విపులముగా
వివరించాడు. క్రీస్తు సిలువ త్యాగం దేవుని
రక్షణ ప్రణాళికయని, అది దేవుని బలహీనత
కాదు, దేవుని బలమని,
దేవుని శక్తియని, ప్రవక్తలద్వారా దేవుడు ప్రవచించిన వాక్యములు నెరవేరెనని
నిరూపింపబడినవని ప్రకటించాడు.
అందుకే
యోవేలు ప్రవక్త ప్రవచనమును (యోవే. 2:28-29), క్రీర్తన 16:8-11, కీర్తన 110:1 తన సందేశములో ప్రస్తావించాడు.
దావీదు సమాధికి మీరు సాక్ష్యులు. ఖాళీ (యేసు) సమాధికి మేము సాక్ష్యులము అని
ధైర్యముతో క్రీస్తు కొరకు వాదించాడు. ఆ దినమున దాదాపు మూడు వేల మందిని క్రీస్తు
సంఘములోనికి, క్రీస్తు
సహవాసములోనికి, క్రీస్తు
విశ్వాసములోనికి దేవునిచే నడిపింపబడినారు. ఇది దేవుని కార్యము. అందుకే,
పేతురుగారు తన సందేశములో చాలాసార్లు,
“దేవుడు వానిని... మీ మధ్య చేసెను” (22 వచనం),
“దేవుడు... ఆయనను మృతుల నుండి లేపెను” (24 వచనం),
ఇది “దేవుని శక్తి” అని వారికి బోధించాడు.
ఈ సందేశములో
దేవుని మనుష్యావతారము నుండి దేవుని ‘మహిమవతారం’ వరకు (అనగా యేసు మహిమలో దేవుని కుడి ప్రక్కన కూర్చున్న వరకు,
అ.కా. 2:33) క్లుప్తముగా వారికి వివరించి,
వారిని క్రీస్తు కొరకు జయించాడు. క్రీస్తులోనికి,
దేవుని మార్గములోనికి, దేవుని రాజ్యములోనికి వారిని నడిపించాడు. క్రీస్తు మరణ,
ఉత్థానములే, పేతురు సందేశ బలము. అదే అతని సందేశ సారాంశము.
నీవు
క్రైస్తవుడవైనందుకు, క్రీస్తును
నమ్ముకున్నందుకు, క్రీస్తులో
నడుస్తున్నందుకు, క్రీస్తును నీ
జీవితానికి మార్గదర్శకం చేసుకున్నందుకు, క్రీస్తు మాటలను చదువుచున్నందుకు, ఆలకిస్తున్నందులకు క్రీస్తు రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటిస్తున్నందుకు,
ఎవరైనా నిన్ను అవహేళన చేస్తున్నారా?
ఎగతాళి చేస్తున్నారా? భయపెడుతున్నారా? బెదిరిస్తున్నారా? అయినను, నీవు కలవర పడవలదు! అదరకు! బెదరకు! వారి అవహేళనను,
పేతురులాగా, నీ జీవిత సాక్ష్యమునకు ఆరంభముగా చేసుకో! నీపై విసిరిన రాళ్ళను,
నీ విజయానికి మెట్లగా మార్చుకో! క్రీస్తును
ప్రకటించడానికి అవకాశముగా మార్చుకో! క్రీస్తు మనకు యిచ్చిన వాక్యమును ఆయుధముగా
మార్చుకో! నీ ఆలోచనలు, పవిత్ర
గ్రంథముపై కేంద్రీకరించు. “ఎట్లు మాట్లాడ వలయునో, ఏమి చెప్పవలయునో” (మత్త.10:19) నీకు
కావలసిన మాటలను, నిర్భయమును ఆయన నీకు ఇస్తాడు. నిన్ను నడిపిస్తాడు,
నీతో నడుస్తాడు. నీ ద్వారా ఎంతోమందిని సన్మార్గములో,
దేవుని మార్గములో, క్రీస్తు మార్గములో నడిపిస్తాడు.
పేతురు
ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసాడు. అతనికి జ్ఞానమును ప్రసాదించి, అతనిద్వారా ఒక్క పెంతకోస్తు పండుగ రోజునే, మూడు వేలమందిని
సంపాదించుకొంటే, నీ ద్వారా కూడా,
దేవుడు ఎంతోమందిని సంపాదించుకుంటాడు. పేతురులాగా,
నిన్ను నీవు సంపూర్ణంగా అర్పించుకొనుటకు సిద్ధముగా
ఉన్నావా? అవహేళను,
ఎగతాళిని, ఎదురింపులను, అవమానములను,
దూషణములను, శ్రమలను, నిందలను,
నీ సాక్ష్యమునకు ఆరంభముగా మార్చుకో! దానికి క్రీస్తు వాక్కును ఆయుధముగా వాడుకో!
సువిశేష పఠనము: “ఎమ్మావు మార్గములో యేసు
దర్శనము” గురించి ధ్యానిస్తున్నాము. యేసు ఉత్థానం మన విశ్వాసానికి మూలం. యెరూషలేమునుండి
ఎమ్మావు గ్రామానికి వెళ్ళుచున్న ఇద్దరు శిష్యులకు ఉత్థాన క్రీస్తు దర్శన మిచ్చారు.
దీనిలో ప్రధానముగా రెండు అంశాలను ధ్యానించుదాం: లేఖనముల వివరణ (దేవుని వాక్కు),
రొట్టె విరచుట (దివ్య బలి పూజ).
లేఖనముల వివరణ: ఉత్థానమైన రోజే, ఎమ్మావు
గ్రామమునకు (యెరూషలేమునుండి 11 కి.మీ.), “విచారముతో” (24:17). వెళ్ళుచున్న ఇద్దరు
శిష్యులకు (క్లెయోపా, తోటివ్యక్తి) యేసు క్రీస్తు దర్శనమిచ్చాడు. వీరు
పన్నెండుగురులోని వారు కాదు. ఇతర శిష్యులు, బహుశా, 72గురులోని వారు కావచ్చు. ఆ
విచారానికి కారణం, వారి మాటలలోనే, “మన ప్రధానార్చకులు, అధిపతులు ఆయనను మరణ దండనకు
అప్పగించి సిలువ వేసిరి. అయితే, ఆయనయే యిస్రాయేలీయులను రక్షించునని మేము ఆశతో
ఉంటిమి” (24:20-21). వారు నజరేయుడైన యేసును, గొప్ప ప్రవక్తగా, క్రియలందును,
వాక్కునందును, శక్తిమంతునిగా పరిగణించారు. కనుక, తప్పక ఆయనే రోమను సామ్రాజ్యాన్ని
కూలదోసే మెస్సయా అని తలంచారు. ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
వారిరువురు
యెరూషలేములో జరిగిన సంఘటనలను - యేసు శ్రమలు, మరణం, ఖాళీ సమాధి, మగ్దల మరియ, ఇతర
స్త్రీల సాక్ష్యం - మార్గమున ముచ్చటించు కొనుచున్నారు. అప్పుడు, ఉత్థాన క్రీస్తు,
వారిని సమీపించి వారివెంట నడవసాగాడు. వారు ఆయనను చూచిరి, కాని గుర్తింప లేక
పోయిరి. ఇంకా వారు ఖాళీ సమాధిని, అర్ధరహితమైన మరణాన్నే చూస్తున్నారు. అందుకే,
ఉత్థాన క్రీస్తును వారు చూడలేక పోయారు. “మీరు నడుచుచు దేనిని గురించి మాట్లాడు
కొనుచున్నారు?” అని ఉత్థాన క్రీస్తు వారిని ప్రశ్నించగా, అప్పుడు క్లెయోపా, “నజరేయుడైన
యేసు”ను గురించి జరిగిన విషయములన్నింటిని విచారించాడు. ఈ సంభాషణను బట్టి, శిష్యులు
ఇంకను యేసు మరణ పునరుత్థాన పరమరహస్యాలను అర్ధం చేసుకొనలేదని తెలియుచున్నది.
అందుకే
ఆయన, “ఓ అవివేకులారా! ప్రవక్తల వచనములను అన్నింటిని నమ్మని మందమతులారా!” అని
సంబోధించి, “అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తన్ను గూర్చి
వ్రాయబడినవి అన్నియు వారికి వివరించెను” (24:25,27). వారు లేఖనముల గురించి సరిగా
ఎరిగియుండ లేదు. వారి అవిశ్వాసాన్ని, అజ్ఞానాన్ని మందలించి, వారికి ‘మెస్సయా’కు
సంబంధించిన లేఖనములను, ముఖ్యముగా, మెస్సయా ఎందుకు శ్రమలను, మరణమును పొందవలసినదో
వివరించి వారిలో విశ్వాసాన్ని నింపాడు. వాక్కు బోధించ బడినపుడు, మనంకూడా
విశ్వసించనిచో, ప్రభువు, మనలను కూడా అలాగే సంబోధిస్తారు. దేవుని వాక్కును అర్ధం
చేసుకోవడానికి, పవిత్రాత్మ మనకు తప్పక సహాయం చేస్తుంది. మరి, నీ యింటిలో బైబులు
ఉన్నదా? లేనిచో, క్రీస్తును గురించి ఎలా తెలుసుకుంటావు? బైబులు దేవుని గురించి,
యేసు క్రీస్తు గురించి, రక్షణ గురించి, జీవము...మొ.గు. వాటి గురించి తెలియజేయును.
కనుక, బైబులు చదవడం ప్రారంభించు!
రొట్టె విరచుట: వారు ఆయనకు ఆతిధ్యము ఇచ్చెను.
వారితో ఉండమని (శిష్యుల ప్రార్ధన) వారు ఆయనను బలవంతము చేయగా, ఆయన అందులకు
అంగీకరించెను. యేసు వారితో భోజనమునకు కూర్చుండినపుడు. రొట్టెను తీసుకొని
ఆశీర్వదించి, విరచి, వారికి ఇచ్చెను. క్రీస్తు ఉత్థానము తరువాత ఇదియే ప్రధమ ప్రభు
భోజనము! దానితో వారికి కనువిప్పు కలిగెను. వారు యేసును గుర్తించిరి, కాని ఆయన
అదృశ్యుడయ్యెను. మార్గములో వారితో ప్రయాణం చేసినది ఉత్థాన క్రీస్తు, మెస్సయా అని
గుర్తించారు. ఆయన అదృశ్యానికి పరమార్ధం, బహుశా, రొట్టె విరిచినపుడెల్ల (దివ్యపూజ),
ఉత్థాన క్రీస్తు సాన్నిధ్యం తప్పక ఉంటుంది.
కడరాత్రి
భోజన సమయములో, “యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి, దానిని
త్రుంచి వారికి ఒసగుచు, ఇది మీ కొరకు అర్పింప బడెడు నా శరీరము. దీనిని నా
జ్ఞాపకార్ధము చేయుడు” (లూకా. 22:19, మత్త. 26:26, మార్కు. 14:22) అని చెప్పెను.
ఉత్థాన క్రీస్తు జ్ఞాపకార్ధముగా, రొట్టెను విరిచినపుడెల్ల, ఆయన మనతో ఉంటారు. అంతట
వారు, ఆయన మార్గములో మనతో మాట్లాడునపుడు, లేఖనములన్నియు మనకు వివరించునపుడు “మన
హృదయములు ప్రజ్వరిల్ల లేదా?” (వ్యక్తిగత దైవానుభూతి) అని అనుకొనిరి (24:28-32). వారిలో
ఆశ, నిరీక్షణ చిగురించినది. క్రీస్తానుభవముతో, వారి హృదయాలు పులకించి పోయాయి.
నేడు
మన కనులు, హృదయాలు తెరువబడాలంటే, మనకోసం మరణించిన యేసు ప్రభువును మనం
గుర్తించాలంటే, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలి, దివ్యపూజా బలిలో,
దివ్యసత్ప్రసాదములో క్రీస్తును చూడగలగాలి. ప్రజ్వరిల్లు మన హృదయాలు సువార్తా
సందేశాలను పరిపూర్ణముగా అర్ధం చేసుకోవాలి.
జీవిత
సత్యాలను తెలుసుకోవాలంటే, ప్రతీ విశ్వాసి “ఎమ్మావు మార్గ అనుభవం” తప్పక కలిగి
యుండాలి. కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, సవాళ్లు, అనుమానాలు, దిక్కుతోచని
పరిస్థితులు (కరోన), శోధనలు, నిరాశ... వీటన్నింటిని దాటుకొని పోవాలి. ఇలాంటి
ప్రయాణములో ఉత్థాన క్రీస్తు మనతో నడుస్తాడు. కొన్నిసార్లు మనం ఆయనను గుర్తించలేక
పోవుచున్నాము. సువార్తలు జీవిత సత్యాలను మనకు ఎరుక పరచి, మనలను యేసు ప్రభువు దరిచేర్చును.
దివ్యపూజా బలిలో పాల్గొన్నప్పుడు, క్రీస్తు సాన్నిధ్యాన్ని అనుభవించెదము.
ఆ శిష్యులు
వెంటనే యెరూషలేమునకు వెళ్లి, అపోస్తలులకు, విశ్వాసులకు మార్గమున జరిగిన సంఘటనలను
వివరించి, ముఖ్యముగా ఆయన ఎట్లు లేఖనములను వివరించినది, ఆయన రొట్టెను విరుచునపుడు
వారు ఎట్లు గుర్తించినది తెలియ జేసిరి. “శ్రీసభ ప్రభుని దేహాన్ని భక్తి భావంతో
పూజించినట్టే పవిత్ర గ్రంథాన్ని కూడా తత్సమాన భక్తి ప్రపత్తులతో నిరంతరం పూజిస్తూ
వస్తోంది. అందుకే, ఒకే బల్లపై నుండి దేవుని వాక్కునూ. క్రీస్తు దేహాన్ని భక్తులకు
జీవాహారంగా అందివ్వడం ఎప్పుడూ మానలేదు” (శ్రీసభసత్యోపదేశం, నం. 103). “వాక్కు”లో
స్వయముగా క్రీస్తు కొలువై యుంటారు. గుడిలో పఠనాలు చదివేప్పుడు, పలికేది స్వయాన
ప్రభువే. ఆయనే మనతో మాట్లాడతారు (పవిత్ర దైవార్చనా చట్టం, నం. 7).
ప్రభువు
భోజనము మనలో కనువిప్పును, మార్పును కలిగిస్తుంది. మన విశ్వాసమును బలపరుస్తుంది. పాపక్షమాపణను
పొంది, దేవునితో సఖ్యతను పొందుతాము. ప్రతి దివ్యపూజలో క్రీస్తును కలుసుకుంటాము. అలాగే,
మన యింటిలోకూడా, కుటుంబం అంతా కలిసి భోజనం చేయడం చాలా ముఖ్యం. బిజీబిజీగా ఉన్న
మనం, కనీసం, రోజులో ఒక పూట అయిన కలిసి భోజనం చేయాలి. రోజువారి అనుభవాలను
పంచుకోవాలి. క్షమకు, సఖ్యతకు తద్వారా స్వస్థతకు ఇది ఎంతో అనుకూల సమయము.
ఎమ్మావు
మార్గములోని శిష్యులు పొందిన ఐదు ప్రాముఖ్యమైన క్రైస్తవ విశ్వాస లక్షణాలు:
1. సంఘములో
ఇతరులతో కలిసి ప్రయాణం చేయడం.
2. ఈ
ప్రయాణంలో విశ్వాస అనుభవాలను, అంచనాలను ఒకరితోనొకరు పంచుకోవడం.
3. పరిశుద్ధ
గ్రంథ పఠనం ద్వారా, ఈ విశ్వాస అనుభవాల, అంచనాల అర్ధాన్ని తెలుసుకోవడం.
4. ప్రార్ధన,
దివ్యబలి పూజలో (ప్రభు భోజనము), యేసు సాన్నిధ్యాన్ని గుర్తించడం.
5. యేసును
గుర్తించడంతో ఈ ప్రయాణం ముగియదు. ఆయన ఉత్థాన శుభవార్తను వాక్కు, చేతల ద్వారా
ఇతరులతో పంచుకోవడం.
ఉత్థాన
క్రీస్తు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నారు. మన జీవిత ప్రయాణములో మనతో కలిసి
నడచుచున్నాడు. మనలను నడిపించు చున్నాడు. మన హృదయ కన్నులను తెరచు చున్నాడు. మన
విశ్వాసాన్ని, నిరీక్షణను బలపరచు చున్నాడు. మనలోనున్న అవిశ్వాసాన్ని, అజ్ఞానాన్ని
తుడచివేయు చున్నాడు. కనుక, మన హృదయాలు ఎల్లప్పుడు క్రీస్తు కొరకు ప్రజ్వరిల్లును
గాక!
No comments:
Post a Comment