తపస్కాల నాలుగవ ఆదివారము, Year A

 తపస్కాల నాలుగవ ఆదివారము, Year A
1 సమూ. 16:1,6-7,10-13; ఎఫెసీ. 5:8-14; యోహాను. 9:1-41

తపస్కాల నాలుగవ ఆదివార ప్రధాన ధ్యానాంశం: క్రీస్తు – లోకమునకు వెలుగు

మొదటి పఠనము: గొర్రెల కాపరియైన దావీదును, ఇశ్రాయేలు ప్రజల ప్రతినిధిగా, రాజుగా ఎన్నుకోబడి, సమూయేలుచే అభిషేకింప బడుటను గూర్చి వింటున్నాం. సౌలు, ఇశ్రాయేలు మొదటి రాజు, దేవుని మాటలను పెడచెవినపెట్టి, తనకు యిష్టము వచ్చినట్లు వ్యవహరించుటవలన, దేవుడు అతనిని నిరాకరిస్తున్నాడు. అతని స్థానంలో దావీదును రాజుగా ఎన్నుకుంటున్నాడు. దేవుని ఎన్నిక బాహ్యపు రూపురేఖలు, దేహధారుడ్యమును బట్టి కాకుండా, అంత:రంగిక స్వభావమును, హృదయమునుబట్టి ఉంటుంది. హృదయమును అవలోకించి చూస్తాడు.

కానాను దేశమునకు వెళ్ళుమార్గమున, ఇశ్రాయేలీయులను హింసించిన కారణమున, అమాలేకీయులను మట్టికరిపించమని, వారి సంపదను శాపము పాలుచేయుమని, యావే సౌలును ఆజ్ఞాపించాడు. సౌలు, అతని సైన్యము అమాలేకీయులను వధించారు, కాని వారి సంపద మేలిమిదైయుండుట చూచి, దానిని శాపము పాలుచేయక, తమతోపాటు వారి దేశమునకు తెచ్చుకున్నారు. ఈ కార్యము యావేదృష్టిలో అవిధేయతగా పరిగణింపబడినది. ఏ కారణమున ఈ నిర్ణయం తీసుకున్నావని సమూయేలు అడుగగా, మేలిమి జాతికి చెందిన పశుసంపదను దేవునికి బలి అర్పించుటకు తీసుకొని వచ్చానని ఒకసారి, సైనికులు వధించకుండా తీసుకొని వెళ్దామంటే, వద్దని చెప్పలేకపోయానని మరొకసారి సౌలు చెబుతున్నాడు. దీనినిబట్టి, అతని హృదయం దేవునివైపు కాకుండా సంపదవైపు మరల్చబడినదని రూఢీ అగుచున్నది. సంపాదనకు దగ్గరవుతూ, దేవునికి దూరమవసాగాడు.

సౌలును నిరాకరించిన దేవుడు, అతని తర్వాత ఇశ్రాయేలీయులను నడిపించే నాయకుని ఎన్నుకొని, అతనిని అభిషేకించుటకు, ప్రవక్తయైన సమూయేలును బెత్లెహేమునకు పంపి, జెస్సె కుమారులలో ఒకనిని ఎన్నుకొని, తన తరపున అభిషేకించమని కోరుచున్నాడు. అర్హుడైన వానికోసం సమూయేలు వెదుకుతున్నాడు. దేహధారుడ్యమును, కండలు గలిగిన వీరునికోసం చూస్తున్నాడు. కాని, సమూయేలు చూస్తున్న అర్హతను దేవుడు అంగీకరించలేదు. నరుడు చూసిన దృష్టితో దేవుడు చూడడు. నరుడు బాహ్యపు రూపురేఖను చూస్తే, దేవుడు అంత:రంగమును, హృదయమును అవలోకించును అని యావే దేవుడు తెలియజేస్తున్నాడు. హృదయం మానవ ఆలోచనకు, క్రియలకు మూల కేంద్రము (మార్కు. 7:15-16, 18-23). ఈ మూల కేంద్రం బాగుంటే, రాజవ్వడానికి జేష్టుడు కానవసరం లేదు. హృదయం శుద్ధముగా ఉంటె, మంచి కుటుంబ వంశావళి చెందినవాడు మాత్రమే ఉండాల్సిన పని లేదు. సాంప్రదాయమును కాకుండా దేవుడు సహృదయమును చూస్తాడు.

దేవునిచే ఎన్నుకొనబడటానికి, అభిషేకించబడటానికి నీకున్న ప్రతిభ మాత్రమే సరిపోదు. నీకున్న మంచి కుటుంబ చరిత్ర మాత్రమే ముఖ్యంకాదు. నీకున్న అందం, రూపం, దేహధారుడ్యం, బలము కలిగిన బాహువు, నేర్చిన విలువిధ్యలు, సాధనాలు, వాక్చాతుర్యం, నేర్పరితనము, ఆలోచనాశక్తి మాత్రమే సరిపోవు. దేవుని కృప, కనికరం, నడిపింపు కావాలి. దేవుని ఆలోచనలకు అనుకూలంగా స్పందించే హృదయం, విధేయత, వినయం కావాలి. అన్నింటికి మించి దేవునితో అనుబంధం, సహవాసం కలిగియుండటం చాలా ముఖ్యం. దేవుని మాటను ధ్యానించే, ఆచరించే, నడిచే, హత్తుకొనే హృదయం కావాలి. అటువంటి హృదయం కలిగియుంటే, దేవుని కృప మన బహీనతలను బలంగా మారుస్తుంది. అనర్హతను అర్హతుగా మారుస్తుంది. ఆయనతోడు ఎండలో నీడలాగ, రాత్రిలో వెలుగులాగా మనలను వెంబడిస్తుంది. ఆయన మాటను విని, ఆయన బాటలో నడిచే హృదయాన్ని కోరుకుందాం!

సువిశేష పఠనం: యోహాను సువార్తలో చిహ్నాలను (యేసు చేసిన అద్భుతములు) వ్రాయడానికిగల కారణం, శిష్యుల విశ్వాసం బలపడుటకు, “యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకు, ఈ విశ్వాసముద్వారా ఆయన నామమున జీవము పొందుటకు” (యోహాను. 20:31). నేటి సువార్త పఠనం, పుట్టు గ్రుడ్డివానికి యేసు దృష్టిని ఒసగు అద్భుత చిహ్నముగూర్చి వినియున్నాము. శారీరక దృష్టితోపాటు, ఆత్మదృష్టినికూడా యేసు అతనికి ఒసగుచున్నాడు. ‘యేసు లోకమునకు వెలుగు’ అని గుడ్డివాడు గుర్తించాడు. పుట్టు గ్రుడ్డివానిని స్వస్థపరచిన యేసు, పాపులను చీకటినుండి, వెలుగులోనికి తప్పక నడిపించును.

మనలో చాలామందిమి పాపమువలన [ఆధ్యాత్మిక] అంధులుగా జీవిస్తున్నాము. పాపము వలన, చీకటిలో జీవిస్తున్నామని తెలుసుకోలేక పోవుచున్నాము. తెలిసినను, బలహీనతల వలన పాపములో చిక్కుకొని, బానిసలై, బయటపడలేక పోవుచున్నాము. మన జీవితాలను, సంపూర్ణముగా యేసువైపుకు త్రిప్పినచో, పాపమును జయించవచ్చు. గ్రుడ్డివాని శారీరక ద్రుష్టిదానము, మన అంత:రంగిక గ్రుడ్డితనానికి తార్కాణం. కనుక, మనకు నేడు ఆధ్యాత్మిక అంధత్వమునుండి స్వస్థత కావాలి.

మనలో చాలామందిమి ఆధ్యాత్మిక అంధులం. హృదయ పరివర్తన చెందాలని తెలుసుకోలేక పోవుచున్నాము. లోకపు వ్యామోహాలలో పడిపోయి జీవిస్తున్నాము. దేవునికి ఎక్కువ సమయాన్ని ఇవ్వలేకపోవుచున్నాము. ప్రార్ధన జీవితాన్ని వదిలివేసాము. ఆదివారముకూడా గుడికి రావడానికి కష్టమైపోతుంది. ఉద్యోగం, పని, సంపాదన మీదపడిపోయాము. నేటి మన పరిస్థితి ఆ గ్రుడ్డివాని పరిస్థితికన్న దయనీయముగా ఉంది. ఆధ్యాత్మిక అంధత్వం, శారీరక అంధత్వం కన్న దయనీయమైనది. పాపమును చూడనిచో, పశ్చాతాపపడనిచో, మారుమనస్సు పొందనిచో, శాశ్వతమైన అంధకారములో జీవిస్తాము.

బైబులులో, దేవుడు అనేకసార్లు పాపముగూర్చి తన ప్రజలను హెచ్చరించారు. “నేను మీ ప్రార్ధనలను ఆలకించను, మీ చేతులు నెత్తురుతో నిండియున్నవి” అని యెషయ 1:15లో చూస్తున్నాము. తప్పక పాపమును వీడాలి. యేసుకూడా నిత్యజీవితము పొందాలంటే హృదయపరివర్తన అవసరమని బోధించారు. పాపము ఉద్దేశపూర్వకముగా చేయు నిర్ణయము. యేసును అంగీకరించడమా, తృణీకరించడమా అనేది మన నిర్ణయం! ఆ స్వతంత్రం మనకే ఇవ్వబడినది.

“యేసు మార్గమున పోవుచు ఒక పుట్టుగ్రుడ్డి వాడిని చూచెను” (9:1). యేసు ప్రభువు మన అవసరతలను, మన జీవితాలను చవిచూస్తాడు. మనవైపునుండి ఎప్పుడుకూడా తన చూపును త్రిప్పుకోరు. ఇప్పుడు మనమున్న దయనీయ స్థితినికూడా చూస్తున్నారు. గ్రుడ్డివాడిని స్వస్థత పరచుట వలన, యేసు దేవుని కార్యమును, చిత్తమును నెరవేర్చాడు. అతను పుట్టుకతోనే గ్రుడ్డివాడు. పుట్టుకతో గ్రుడ్డివారైతే, ఆ వ్యక్తిగాని, అతని తల్లిదండ్రులుగాని చేసిన పాపఫలితమే అని యూదులు నమ్మేవారు (ఆది. 19:11, నిర్గమ. 20:5, ద్వితీయ. 5:9). అయితే, గ్రుడ్డితనానికి పాపము కారణం కాదు. అంధత్వం అవిశ్వాసానికి తార్కాణం (9:2-4). యేసుతోపాటు ఉన్న శిష్యులు గ్రుడ్డివానిని చూడలేదు. వారు ఆత్మసంబంధమైన గ్రుడ్డివారు. అందుకే, “వీడు గ్రుడ్డి వాడుగా పుట్టుటకు ఎవరు పాపము చేసిరి? వీడా? వీని తల్లిదండ్రులా?” (9:2) అని అడిగారు. యేసు ఈ రెండు భావనలను త్రోసిపుచ్చాడు (9:3). శిష్యులు, ఆత్మదృష్టిని కలిగియున్న యెడల, ‘బోధకుడా! ఈ గ్రుడ్డివానికి మనం ఎలా సహాయం చేద్దాం?’ అని అడిగేవారు. కదా?

శ్రమలు ప్రతీ మనిషి జీవితములో భాగమే! ఈ శ్రమలు ఎందుకు, కారణం ఏమిటి? అందరు అడిగే ప్రశ్నలే! కొంతమంది సాతాను అని, కొంతమంది, దేవుని శిక్ష అని చెబుతూ ఉంటారు. దేవుడు ఎందుకు నాకు ఈ కష్టాలను ఇస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాము! శిష్యులవలె (9:2), మనంకూడా, ఎవరి పాపము వలన నాకు ఈ కష్టాలు అని యేసును అడగాలని అనుకుంటాము. ఏదేమైనప్పటికిని, ‘దేవుని కార్యము బయలుపడుటకై’ (9:3) మనకీ కష్టాలు, శ్రమలు! మన ప్రశ్నకి, ప్రభువు ఇలా సమాధాన మిస్తున్నారు, “నన్ను అనుసరింపగోరు వాడు తన్నుతాను పరిత్యజించుకొని, తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను (మత్త. 16:24, మార్కు. 8:34-35, లూకా. 9:23). మన కష్టాలను, సిలువవేయబడిన క్రీస్తుతో ఐఖ్యము చేయాలి. పునీత మదర్ తెరెసా ఇలా చెప్పారు, “మన శ్రమలు క్రీస్తు శ్రమలలో భాగమైతే, అవి మనకు గొప్ప వరాలుగా మారుతాయి. క్రీస్తు శ్రమలలో పాలుపంచుకొనే గొప్ప అవకాశమును కలిగియుండటమే మనిషి పొందిన గొప్ప వరము. అవును! ఇది నిజముగా గొప్ప వరము, దేవుని ప్రేమకు తార్కాణం. ఈవిధముగనే, ఈ లోకానికి తండ్రి దేవుడు తన ప్రేమను చూపించాడు. శ్రమలు పొంది, మరణించడానికి, తన కుమారున్ని ఈ లోకానికి పంపాడు. ప్రేమ అన్నింటికన్న గొప్ప వరమని, యేసు తన శ్రమలద్వారా చూపించాడు. శ్రమలలో, మనకోసం తన్నుతాను బలిగా అర్పించుకున్నాడు.”

యేసు ఈ లోకమునకు వెలుగు. నిన్న, నేడు, రేపు, ఎప్పటికీ ఆయన ఈలోకానికి వెలుగు (9:5). “నేలమీద ఉమ్మివేసి, ఆ ఉమ్మితో మట్టిని కలిపి, ఆ మట్టిని గ్రుడ్డివాని కనులమీద రాసి, వెళ్లి ‘సిలోయము’ (పంపబడినవాడు) కోనేటిలో కడుగు కొనుము అని చెప్పెను. ఆ గ్రుడ్డివాడు వెళ్లి కడుగుకొని, చూపును పొంది తిరిగి వచ్చెను” (9:6-7). ఇది యేసు అద్భుతాన్ని చేసిన తీరు! లేదా దృష్టిని ఒసగిన తీరు! ఇరుగుపొరుగు వారు, దేవునిపట్ల ఆ వ్యక్తి విశ్వాసాన్ని, ప్రేమను చూడలేకపోయారు (9:8). వీరుకూడా (తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు) ఆత్మసంబంధమైన అంధులు. గ్రుడ్డివాడిని స్వస్థత పరచినది యేసే అని చూసినను, విన్నను, విశ్వసించలేదు. సినగోగు నుండి (యూదుల ప్రార్ధనాలయం) వెలివేస్తారని పరిసయ్యులకు భయపడ్డారు.

“అతనిని నేనే” (9:9) అన్న వాక్యం, దేవునితో ఆ వ్యక్తి సాంగత్యాన్ని తెలియజేయుచున్నది. పరిసయ్యులు ఈ చిహ్నాన్ని దైవకార్యముగా పరిగణించలేదు, ఎందుకన, విశ్రాంతి దినమున ఇది జరిగెను (9:14). అందుకే వారు, “ఇతడు విశ్రాంతి దినమును పాటింపలేదు. కనుక దేవుని యెద్ద నుండి వచ్చినవాడు కాదు. పాపియైన మనుష్యుడు ఇట్టి అద్భుతచిహ్నములు ఎట్లు చేయగలడు” (9:16) అని అన్నారు. కాని స్వస్థత పొందిన వ్యక్తి మాత్రము, “ఆయన ఒక ప్రవక్త” అని తన అభిప్రాయాన్ని ప్రకటించాడు (9:17). యూదులు విశ్రాంతి దినమునకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చిరిగాని, వారి పాపబుద్ధిని తెలుసుకోవడములో, మార్చుకోవడములో విఫలమయ్యారు. యేసుకుమాత్రం, విశ్రాంతి దినముకన్న, స్వస్థత చేకూర్చడం ముఖ్యముగా భావించాడు. గ్రుడ్డివాడు మనుష్యకుమారుడైన యేసును సంపూర్ణముగా విశ్వసించి ఆయనను ఆరాధించాడు (9:38).

యూదులు ఆ వ్యక్తి తల్లిదండ్రులను ప్రశ్నించగా, ‘వారి కుమారుడేనని, పుట్టుకతోనే గ్రుడ్డివాడని, అయితే, ఇప్పుడు చూడగలుగుచున్నాడని’ సాక్ష్యమిచ్చారు (9:19-21). యూదులు తమ పలుకుబడితో, ఆ వ్యక్తిద్వారా, యేసును తప్పుబట్టాలని చూసారు, విశ్రాంతి దినమును పాటించలేదని, ఆయన పాపాత్ముడు అని నిరూపించ ప్రయత్నం చేసారు. తన స్వస్థతద్వారా, ఆ వ్యక్తి విశ్వాసములోనికి నడిపించబడితే, పరిసయ్యులు మాత్రం ఆధ్యాత్మిక అంధత్వములోనే ఉండిపోయారు. ఇంత గొప్ప అద్భుత కార్యము, దైవకార్యము జరిగినను, వారి హృదయ కన్నులు విశ్వాసములోనికి తెరువబడలేదు. వారిలోనున్న కపటవేషాన్ని చూసుకొనక, ఇతరులను తీర్పుచేయడానికి, తప్పుబట్టడానికి, ఖండించడానికి సిద్ధపడ్డారు (9:30-34).

ఆత్మసంబంధమైన అంధత్వము: ‘సత్యము’ను గ్రహించకపోవడమే ఆత్మ సంబంధమైన అంధత్వము. యేసు పాపాత్ములను, ముఖ్యముగా పశ్చాత్తాపపడేవారిని, మారుమనస్సు పొందేవారిని ఎన్నటికీ తృణీకరించడు. అందుకే, చూపు పొందిన “వానిని వెలివేసిన వార్త విని, యేసు వానిని కనుగొన్నాడు” (9:35). శారీరక దృష్టిని పొందినను, ఆత్మ సంబంధమైన అంధత్వమునుకూడా తొలగించుటకు, అనగా అంతర్ధ్రుష్టిని ఒసగుటకు యేసు అతనిని వెతుకుతూ వచ్చాడు. అందుకే యేసు, “నీవు మనుష్యకుమారుని విశ్వసించుచున్నావా? అని అడుగగా, “ప్రభూ! నేను విశ్వసించుచున్నాను” అని వాడు యేసును ఆరాధించాడు (9:36-38). నిజముగనే, యేసు మనుష్య కుమారుడు, దైవకుమారుడు, ప్రభువు, లోకమునకు నిజమైన వెలుగు. యేసు పాపమును ఖండిస్తాడు కాని పాపిని కాదు.

పరిసయ్యులు, “మేము కూడ గ్రుడ్డివారమా?” (9:40) అని ప్రశ్నించారు. పరిసయ్యులు ఆత్మసంబంధమైన గ్రుడ్డివారు. కనులున్నను, చూడలేరు. చూడగలిగినను, గ్రహించలేరు. దృష్టి ఉన్నను, అంతర్ధ్రుష్టి లేదు. యేసు చేసిన ఈ గొప్ప అద్భుత చిహ్నమును విశ్వసించలేదు, నిరాకరించారు. యేసుపట్ల పక్షపాత ధోరణిని చూపారు. విశ్రాంతి దినమును (సబ్బాతు) పాటించలేదని, యేసును పాపాత్ముడని అన్నారు. ద్వేషము, గర్వము వారిని గ్రుడ్డివారిగా చేసింది.

యేసు ఈ లోకమునకు “తీర్పు చేయుటకు” (9:39) వచ్చెను. అయితే, ఈ తీర్పు, లోకమును ఖండించుటకు కాదు, కాని రక్షించుటకే! మనముకూడా ఆత్మ సంబంధమైన అంధత్వమునుండి స్వస్థత పొందాలి. అనేకసార్లు, దేవుని మంచితనాన్ని చూడలేకపోతాము. ఇతరులలోనున్న మంచితనాన్ని చూడలేకపోతాము. అవసరములలోనున్న వారికి సహాయం చేయకపోవడం... యేసు మాత్రమే మనలను స్వస్థపరచగలడు. కనుక, యేసే దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుదాం. ఆయన నామమున జీవము పొందుదాం.

రెండవ పఠనములో, పౌలు చెప్పినట్లుగా, ఒకప్పుడు మనము ‘చీకటి’లో (పాపము, చెడుకార్యాలు) ఉండినవారము. కాని, ఇప్పుడు క్రీస్తునందు ‘వెలుగు’లో (విశ్వాసం, పుణ్యకార్యాలు) ఉన్నాము. కనుక, ‘వెలుగు’కు (ఉత్థాన క్రీస్తు) సంబంధించిన ప్రజలవలె మనం జీవించాలి: హృదయ పరివర్తన, విశ్వాసం, జాగరూకత, ప్రార్థన, దేవుని వాక్కు, సేవాభావముతో జీవించడం. మంచి, నీతి, సత్యము అను వెలుగు ఫలములతో జీవించాలి. అనగా, క్రీస్తు మనలో ప్రతిబింబించాలి. పాపము చేసి మరల చీకటిలోనికి వెళ్ళకూడదు. చీకటిలోనున్న వారిని వెలుగులోనికి తీసుకొనివచ్చే ప్రయత్నం చేయాలి.

తపస్కాలము, ‘వెలుగు’ను పొందుకాలము. మనలోనున్న అంధత్వము తొలిగిపోవాలని, క్రీస్తు అను వెలుగుతో మనం నిత్యం ప్రకాశింపబడాలని ప్రార్ధన చేద్దాం.

యేసు ప్రభువా! నేను చూచుటకు, నా హృదయపు కన్నులను తెరువుము!
యేసు ప్రభువా! నేను పాపిని
యేసు ప్రభువా! నా పాపామును శుద్ధిచేయుము
యేసు ప్రభువా! తండ్రి చిత్తమును నెరవేర్చుటకు నాకు సహాయము చేయుము
యేసు ప్రభువా! నీవు మాత్రమే నన్ను స్వస్థత పరచగలవు
యేసు ప్రభువా! సువార్తలోని ఈ అద్భుత చిహ్నములు, నీతో లోతైన సాంగత్యములోనికి నడిపించునుగాక!

No comments:

Post a Comment