తపస్కాల మొదటి ఆదివారము, Year A


తపస్కాల మొదటి ఆదివారము, Year A
ఆది. 2:7-9, 3:1-7, రోమీ. 6:12-19. మత్త. 4:1-11

విభూతి బుధవారముతో తపస్సు కాలమును ప్రారంభించాము. నేడు తపస్కాల మొదటి ఆదివారము. తపస్కాలము మారుమనస్సుకు పిలుపు. తపస్కాలం క్రీస్తు ఉత్థాన పండుగకు సిద్దపడు సమయము. నేటి పఠనాలు, శోధనలు, జీవిత పరీక్షలు, వాటిని ఎలా జయించాలి అన్న సత్యాలను బోధిస్తున్నాయి.

మొదటి పఠనము: ఈనాటి మొదటి పఠనాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగంలో (2:7-8)యావే దేవుడు నేలమట్టిని (adamah) తీసుకొని, దానినుండి మానవుని (adam) చేసెను. అతని ముక్కు రంధ్రములలో ప్రాణ వాయువును ఊదెను. మానవుడు జీవము గలవాడయ్యెను. అనగా, సృష్టి ఆరంభమునుండి మనము దేవునితో సంబంధమును కలిగియున్నాము. ఆయన జీవమును కలిగి యున్నాము. మానవుని నివాసము కొరకు దేవుడు ఏదెను తోటను సృష్టించెను. ఆ తోట నడుమ రెండు చెట్లను ప్రత్యేక లక్షణాతో దేవుడు రూపొందించెను. ఒకటి, ప్రాణమిచ్చు చెట్టు. ఇది అమరత్వాన్ని అంటే జీవాన్ని ప్రసాదించే చెట్టు. ఈ చెట్టు పండ్లను తినవద్దని దేవుడు నిషేధించలేదు. అయినా, వారు దానిద్వారా అమరత్వం పొందలేదు. రెండవది, మంచి-చెడ్డల తెలివినిచ్చు చెట్టు. ఈ చెట్టు పండును తినవద్దని దేవుడు ఆదేశించినా, వారు తినడంతో, వారు వినాశకరమైన ఫలితాలను చవిచూశారు.

దీనిఫలితమే, ఈనాటి మొదటి పఠనపు రెండవ భాగం. అదే మానవుని పతనము (3:1-7). మానవుడు జిత్తులమారి సర్పము మాట విని, శోధనలోపడి, దేవుని ఆజ్ఞను లెక్కచేయకుండా, అవిధేయతతో, కన్నుల పండుగగా ఉన్న ఆ చెట్టు పండును తిని, పాపాన్ని ప్రవేశపెట్టారు. వారు ఆ పండును తినిన వెంటనే వారి ఆనందమయమయిన స్థితిని పోగొట్టుకున్నారు. ఇలా మానవుని పతనం ప్రారంభమయింది. దేవుని పోలికలో ఉన్న మానవుడు, అకస్మాత్తుగా దేవుడంటే భయం కలిగింది. భయానికి ప్రధాన కారణం పాపం. పాపము వలన, మానవుడు దేవుని నుండి దాక్కోవడం, తప్పించుకోవడం, పారిపోవడం జరుగుతుంది. ఇతరులపై తీర్పుచేయడం జరుగుతుంది, దేవునిలాగా ప్రవర్తించాలని భావించడం జరుగుతుంది. దేవుడు దయామయుడు, కరుణగలవాడు అని తెలుసుకోవాలి. కనుక, ఎల్లప్పుడు, దేవునిపై ఆధారపడాలి. దేవుని ప్రణాళికకు, వాక్కుకు వ్యతిరేకముగా ఏమి చేసినను మనకు వినాశనము తప్పదు (ఈకాలములో ఉదాహరణ: కోవిడ్ 19).

రెండవ పఠనము:  రెండవ పఠనంలో, పౌలు మానవుని పతనాన్ని విశదపరచు చున్నాడు. అవిధేయత వలన, పాపం లోకములో ప్రవేశించినది. ఆదిపాపము అందరికి ఆపాదించ బడినది. పౌలు, ఆదాము-క్రీస్తును పోలుస్తూ, పౌలు క్రీస్తు ప్రాముఖ్యతను వెలుగులోనికి తెచ్చారు. ఆదాము పాపాన్ని ప్రపంచానికి పరిచయం చేసి, మానవాళి దానిలో పాలుపంచుకునేటట్లు చేస్తే, క్రీస్తు దానినుంచి విముక్తిని ప్రసాదించాడు. పాపంద్వారా మరణం వచ్చింది, కాని క్రీస్తు ఉనికి వలన మానవునికి జీవం ఒసగబడినది. పౌలుప్రకారం, మానవులంతా ఆదాము పాపంలో పాలుపంచుకున్నారు. ఆదాము చేసిన పాపం (ఆధ్యాత్మిక) మరణానికి కారణమయితే, యేసు మరణం, పాపాన్ని జయించి, మానవునికి శాశ్వత ఆనందమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. మనిషి పాపంతో నాశనమై, క్రీస్తు చేత రక్షింపబడ్డాడు.

సువార్త పఠనము: శ్రీసభ, సువార్త పఠనం ద్వారా యేసు, సాతానుచే శోధింపబడుటను గూర్చి ధ్యానించమని, ఈ కృపాకాలంలో మనల్ని ఆహ్వానిస్తుంది. ప్రభువు పొందిన శోధనలను, ఆనాడు ఎడారిలో యిశ్రాయేలు ప్రజలు పొందిన పరీక్షలతో పోల్చవచ్చు. యేసు 40రోజుల ఎడారి అనుభవం, ఇశ్రాయేలు ప్రజల 40సం.ల ఎడారి ప్రయాణానికి తార్కాణం. అందుకే, యేసు 'నూతన ఇశ్రాయేలు'గా మూర్తీభవించాడు. అయితే, యిశ్రాయేలు ప్రజలు ఆ శోధనలను, పరీక్షలను, ఎదుర్కొనలేక పాపములో పడిపోయారు. కాని క్రీస్తు, దైవవాక్కును ఉపయోగించి వచ్చిన శోధనలను ఎదుర్కొని మనకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇశ్రాయేలు చేయలేకపోయిన దానిని యేసు చేయుచున్నాడు. “మనవలెనే అన్నివిధములుగా శోధింపబడి, పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు, యేసు” (హెబ్రీ. 4:15).

యేసు ఎడారిలో 40 రోజులు ఉపవాస ప్రార్ధనలో గడిపాడు. 40రోజుల తరువాత, ఎడారిలో సైతానును ఎదుర్కున్నాడు. ఎడారి, మన ఆధ్యాత్మిక ప్రయాణములో భాగమే! ఎడారి శోధనలకు అలాగే శాంతికి నిలయం! ఎడారిలో దాక్కోవడానికి చోటు ఉండదు. అంతా బహిరంగతగా ఉంటుంది. అంటే, ప్రతీది మనలను ఆకర్షించేదిగా ఉంటుంది. లోకములో సైతాను అనేది వాస్తవము! శోధనలకు (గ్రీకు peirasmos) మూలం సైతాను (గ్రీకు diabolis) అనగా ‘నిందితుడు’, ‘అపవాదు’. గ్రీకు బైబులులో హీబ్రూ పదమునుండి, “సాతాను” (satan)గా అనువదించ బడినది, అనగా ‘విరోధి’, ‘శతృవు’. క్రీ.పూ. 200ల నుండి, సాతాను అనగా ‘చెడు’ అని ప్రత్యామ్నాయ అర్ధముగా మారినది. నూతన నిబంధన కాలముకల్ల, ఇది ‘దయ్యము’ (devil), ‘దుష్టశక్తి’గా మారినది.

మన వినాశనానికి సైతాను శోధించును. కాని, మనము అనేకసార్లు దేవుడు మనలను శోధిస్తున్నాడని అనుకుంటాము. దేవుని నిందిస్తూ ఉంటాము. “దేవుడు ఎవరిని శోధింపడు” అని యాకో. 1:13లో స్పష్టం చేయబడినది. కాని, దేవుడు మనలను పరీక్షించే అవకాశము లేకపోలేదు (ఉదా. నిర్గమ. 16:4, ద్వితీయ. 8:2, కీర్తన. 26:2, 139:23, యిర్మీ. 17:10, 1 రా.ది.చ. 29:17, 1 కొరి. 3:13) దేవుని పరీక్ష మన మేలుకై, మెరుగుదలకై, అభివృద్ధికై ఉంటుంది. సైతాను నిత్యమరణము అయిన తన రాజ్యములో మనం ఉండాలని కోరుతుంది. యేసు నిత్యజీవమైన తన రాజ్యములో ఉండాలని ఆశిస్తాడు. అయితే, శోధనలు మనలో నుండికూడా వస్తాయి, “తన దుష్ట వాంఛలచే తానే ఆకర్షింపబడి చిక్కుపడినపుడు మానవుడు శోధింపబడును” (యాకో. 1:14). దుష్ట వాంఛనుండి పాపము, పాపము పండి మృత్యుకారకమగును (యాకో. 1:15).

యేసు సైతాను శోధనలన్నింటిని కూడా జయించాడు. సైతానుకు లొంగలేదు. దేవునియొక్క గొప్పశక్తిని సైతానుపై ప్రదర్శించాడు. బప్తిస్మము పొందిన తరువాత, దేవుడు యేసును తన కుమారునిగా ప్రకటించిన అనంతరం, "యేసు సైతానుచే శోధింప బడుటకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడెను" (4:1). అలాగే, ప్రతీ విశ్వాసి (దేవుని బిడ్డ) శోధింపబడును. "కుమారా! నీవు దేవుని సేవింపగోరెదవేని పరీక్షకు సిద్ధముగా నుండుము" (సీరా. 2:1). పాపాత్ముడు తన శోధనలను జయించుటకు కావలసిన శక్తిని యేసువద్ద యున్నదని, ఎందుకన ఆయన శోధనలను విజయవంతముగా జయించాడని మనం తెలుసుకోవాలి! ఎడారిలో యేసు శోధనల సమయములో, పరలోక తండ్రి దేవుని చిత్తాన్ని ఎన్నుకోవడంద్వారా దేవునిపై తన సంపూర్ణ విశ్వాసాన్ని, విధేయతను ప్రదర్శించాడు.

మొదటి శోధన: సైతాను యేసు వద్దకు వచ్చి, "నీవు దేవుని కుమారుడవైనచో (మత్త. 3:7) ఈ రాళ్ళను రొట్టెలుగా మారునట్లు ఆజ్ఞాపింపుము" (4:3). స్వప్రయోజనం కొరకు తన శక్తిని ఉపయోగించమని శోధన. అధికారమునకు శోధన. కాని, ప్రభువు సైతానుతో, "మానవుడు కేవలం రొట్టె వలననే జీవింపడు. కాని దేవుని నోటినుండి వచ్చు ప్రతిమాట వలన జీవించును" (4:4, ద్వితీయ. 8:3, నిర్గమ. 16) అని సమాధానమిచ్చాడు. ఆత్మ వరాలను, స్వలాభం కొరకుగాక, సంఘము కొరకు, "అందరి మేలు కొరకై" ఉపయోగించాలి (1 కొరి. 12:7). యేసు ప్రేషిత సేవలో, అయిదు రొట్టెలను, రెండు చేపలను ఐదువేలమందికి పంచిపెట్టాడు. యేసు తన ఆకలి తీర్చుకోవడానికికాక, ఇతరుల ఆకలి తీర్చడానికి ఆ గొప్ప అద్భుతాన్ని చేసాడు (మత్త. 14:13-21).  

ఆనాడు ఎడారిలో ఉన్న యిశ్రాయేలు ప్రజలకు ఇలాంటి పరీక్ష ఎదురయింది. వారు ఆకలిగొనినపుడు, వారిని ప్రభువు ఆశ్చర్యకరంగా ఎర్ర సముద్రాన్ని రెండుపాయలుగా చీల్చి వారిని దాటేటట్లు చేశాడన్న విషయంకూడా మరచిపోయి, ఈజిప్టులో మాంసం భుజించుచూ ఎంతో సంతోషముగా ఉండేవారమని సణుగుకున్నారు. అప్పుడు యావే, అద్భుత రీతిలో ఆకాశమునుండి మన్నా (ఆహారము) కురిపించి, తనకు అసాధ్యమైనది ఏమీలేదని నిరూపించాడు. యిశ్రాయేలు ప్రజలవలెకాక, యేసు నలభైరోజులు ఉపవాసముండి ఆకలిగొనినపుడు సణుగుకొనక, దేవుని వాక్కును ఉపయోగించి, శోధనను ఎదుర్కొన్నాడు. మనంకూడా మన దేహాన్ని కాపాడుకొనుటకు, ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కాని ఈ కృపాకాలం మనకు గుర్తుచేసే విషయమేమిటంటే, దేహాన్ని మించినది ఆత్మ. ఆత్మనికూడా మనం పోషించాలి.  Our hearts are restless, till they rest in you. పాఠం: మనం కోరుకొనే ఈ భూసంబంధమైన వస్తువులకన్న దేవుడు మనకు ముఖ్యమని, దీనినే ఉపవాసం (దగ్గరవ్వటం) చూపిస్తుందని యేసు మనకు నేర్పిస్తున్నాడు.

రెండవ శోధన: పిమ్మట సైతాను యేసును నగరములోని దేవాలయ శిఖరమున నిలిపి, "నీవు దేవుని కుమారుడవైనచో (మత్త. 3:7) క్రిందికి దుముకుము. నిన్నుగూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును. నీ పాదమైనను రాతికి తగలకుండ నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు" (4:6, కీర్తన. 91:11). ప్రతిష్ట కొరకు శోధన. నేడు జనాదరణ కోసం, సంపాదనకోసం శోధన. కాని, యేసు, "ప్రభువైన నీ దేవుని నీవు శోధింపరాదు" (4:7, ద్వితీయ. 6:16, నిర్గమ. 17) అని సమాధానం ఇచ్చాడు.

యిశ్రాయేలు ప్రజలతో చేసుకున్న ఒడంబడిక ప్రకారం యావే వారిని వాగ్ధాన భూమివైపు మోషేను నాయకునిగా ఉంచి నడిపిస్తున్నపుడు, వారు ఆ వాగ్ధాన భూమిని త్వరగా చేరుకోలేకపోతున్నారనే ఆలోచన వారికొచ్చి, యావేపై విశ్వాసముంచక, మోషే సినాయి పర్వతంపై ఉన్నపుడు వారంతా బంగారు దూడను ఆరాధించారు (నిర్గమ. 32: 8). ఇలా, యావే కోపానికి పాతృలయ్యారు. యేసునకు ఇలాంటి సందర్భం ఎదురైనపుడు తను ఏమియూ ఆలోచింపక, ఈలోక రాజ్యానికి ఆశపడక, సాతానును ఆరాధించకుండా, కేవలం ప్రభువైన దేవునినే పూర్ణమనస్సుతో ఆరాధించాలని తెలియజేస్తున్నారు. పాఠం: ప్రార్ధన, ఆరాధనలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలని యేసు మనకు భోదిస్తున్నాడు.

మూడవ శోధన: తిరిగి సైతాను యేసును మిక్కిలి ఎత్తయిన పర్వత శికరమున చేర్చి, భువియందలి రాజ్యములన్నింటిని, వాటి వైభవమును చూపి, "నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తమును ఇచ్చెదను" (4:8-9). సంపద, ఐశ్వర్యం కొరకు శోధన. మనం (గురువులు, నాయకులు, అధికారులు) ఇతరులకు సేవ చేసే బదులుగా, ఇతరులు మనకు సేవచేయాలి అనే శోధన. అందుకు యేసు, "సైతాను! పొమ్ము! ప్రభువైన నీ దేవుని ఆరాధింపుము. ఆయనను మాత్రమే నీవు సేవింపుము" (4:10, ద్వితీయ. 6:13, నిర్గమ. 32) అని యేసు పలికెను. యేసు తండ్రి దేవునికే నమ్మకపాతృనిగా ఉన్నాడు.

యిశ్రాయేలు ప్రజలు, స్వర్గంనుంచి మన్నా పొందిన తర్వాత, యావే వారికి కావలసిన కోరికలన్నింటిని తీర్చాలని వారు భావించారు. మన్నా దొరికిన తర్వాత నీటికోసం సణుగుకున్నారు. తరువాత అసలు యావే వారి మధ్య ఉన్నాడా? లేదా? అని సందేహించారు (నిర్గమ. 17:7). అద్భుతం జరగనంత మాత్రాన విశ్వాసం లేదని అర్ధం కాదు’’. పాఠం: అవసరమున్న వాటిని చూసుకొనుటకు, దేవుడు జోక్యం చేసుకుంటాడని, మనకు ఆపద లేనిసమయంలోకూడ, ఆపద కల్పించుకొని, మనకు సహాయం చేయమని దేవుని పరీక్షింపరాదని యేసు మనకు గుర్తుచేస్తున్నారు.

సాతాను శోధనను ఎదుర్కొనటంద్వారా క్రీస్తు, తన తండ్రిపట్ల తనకున్న ప్రేమ అన్నిటికంటే బలమని నిరూపించారు. శ్రీసభ మనలనుండి ఈనాటి దివ్య పఠనాలద్వారా కోరేది ఇదే. మనం, క్రీస్తును ఆదర్శంగా తీసుకొని, శోధనను అధిగమించి, ప్రభు ప్రేమను గుర్తించి, అతని ప్రేమ బాటలో, అతని చిత్తప్రకారం జీవించి, అతని ప్రణాళికను నెరవేర్చాలి. మనం అనారోగ్యంతో బాధపడినప్పుడు, వైద్యుని దగ్గరకు వెళితే ఒక చీటిలో మందు రాసి వాటిని వాడమంటాడు. అలాగే మన ఆత్మకు ఎదుగుదల కావాలని, శోధనలను ఎదుర్కొనే శక్తికావాలని శ్రీసభ, కృపాకాలంలో ఒక మందు చీటిని మనందరికీ ఇస్తుంది. ఆ చీటిలో ఉన్న మందులే: ప్రార్ధన, ఉపవాసం, దానధర్మాలు. వీటిని సాధనాలుగా మలచుకొని ప్రభు చిత్తప్రకారం నడుచుటకు ప్రయత్నిద్దాం.

యేసు శోధనలను ఎలా జయించాడు? ఆయన సైతానుతో వాదించలేదు, తర్కించలేదు. కేవలం దేవుని వాక్కును మాత్రమే సైతానుకు తెలియజేసాడు. మన శోధనలను ఎలా జయించాలి? మన శోధనలను జయించడానికి దేవుని వాక్కు, ప్రార్ధన ఆయుధాలుగా కావాలి. శోధనల సమయములో ప్రార్ధన చేయాలి. పాపములో పడిపోయే పరిస్థితులకు (వ్యక్తులు, స్థలాలు, వస్తువులు) మనము దూరముగా ఉండాలి. ప్రభువు ఇలా అన్నారు, “నీ కుడి కన్ను నీకు పాపకారణ మైనచో దానిని పెరికి పారవేయుము. నీ దేహమంతయు నరకమున త్రోయబడుట కంటె నీ అవయవములలో ఒక దానిని కోల్పోవుట మేలు” (మత్త. 5:29). అలాగే, “నీ కుడి చేయి నీకు పాపకారణ మైనచో, దానిని నరికి పారవేయుము. నీ దేహమంతయు నరకము పాలగుట కంటె నీ అవయవములలో ఒక దానిని కోల్పోవుట మేలు” (మత్త. 5:30).

శోధనలు జయించాలంటే, యేసులో మనం సంగమమై జీవించాలి. దానికి మనం చేయవలసిన మూడు పుణ్య క్రియలు: ఉపవాసము, దానధర్మాలు, ప్రార్ధన.  

ఆత్మపరిశీలన చేసుకుందాం: నేను నిజముగా దేవుని ఆరాధిస్తున్నానా? లేదా నా హృదయం లోక సంపదలపై దృష్టి సారించినదా? నేను దేవునిపై ఆధారపడుచున్నానా? లేదా నాకున్న సంపదలపై ఆధారపడుచున్నానా? నేను దేవునిపై సంపూర్ణ నమ్మకాన్ని కలిగి యున్నానా? నా జీవితములో ప్రధానముగా నేను మార్చుకోవలసిన ఆ ఒక్క విషయం ఏమిటి?

ఈ తపస్సు కాలములో నెమ్మదించి, దేవుని వాగ్దానాలను ఆలకించి, పాప, మరణములనుండి క్రీస్తు మనకొసగిన స్వతంత్రమును కొనియాడుదాం.

No comments:

Post a Comment