యేసు బప్తిస్మము
యెషయ 42:1-4,
6-7; అ.కా. 10:34-38; మత్త. 3:13-17
ఉపోద్ఘాతము: ఈరోజు యావత్ కతోలిక
శ్రీసభ ప్రభువుని జ్ఞానస్నాన పండుగను జరుపుకొనుచున్నది. ఈ ఆదివారంతో సామాన్య
కాలములోనికి ప్రవేశిస్తున్నాము. యేసు క్రీస్తు జ్ఞానస్నాన పండుగ సందర్భములో క్రీస్తు
ప్రభువు పొందిన జ్ఞానస్నానముయొక్క అంతరార్ధమును పరిశీలించుట,
దానికి మన క్రైస్తవ జీవితానికి మధ్యనున్న సన్నిహిత
సంబంధమును గ్రహించుట, మన విశ్వాస
జీవితమునకు ఎంతో ముఖ్యము! జ్ఞానస్నానములోని భాగ్యమును, భాధ్యతను గుర్తెరుగుట చాలా
ప్రాముఖ్యము!
పాపపరిహార్ధమై,
ముఖ్యముగా జన్మపాప పరిహారానికి,
జ్ఞానస్నాన దివ్యసంస్కారం అత్యవసరమని శ్రీసభ
బోధిస్తున్నది. యేసు జన్మ పాపములేక జన్మించియున్నాడు. జీవితాంతముకూడా పాపరహితునిగా
జీవించాడు. అట్లయినచో, క్రీస్తు
ఎందుకు బప్తిస్మమును పొందియున్నాడు? క్రీస్తు బప్తిస్మ యోహానునుండి జ్ఞానస్నానము పొందుటవలన,
మనకు సుమాతృకగా యున్నాడు. ఆయనలో జన్మపాపము, ఏ ఇతర
పాపము లేకున్నను, జ్ఞానస్నానమును
స్వీకరించియున్నప్పుడు, పాపచీకటినుండి విడుదల చేయు జ్ఞానస్నానం మనకి ఇంకెంత అవసరమో! బప్తిస్మము
క్రీస్తుకు అవసరమని కాదు, కాని మనకి ఎంత అవసరమోయని తెలియజేస్తున్నది. క్రీస్తు బప్తిస్మము,
జ్ఞానస్నాన దివ్యసంస్కార స్థాపనకు మూలం. ఆయన శరీరం,
నీటిని ఆశీర్వదించియున్నది. పవిత్రాత్మ పావురరూపమున
దిగిరావడం, తండ్రి
ఆయనగూర్చి ఆనందించడం యేసుక్రీస్తుని సువార్తాబోధన ఆరంభానికి సంకేతాలు. “పవిత్రాత్మతోను,
శక్తితోను, దేవుడు నజరేయుడగు యేసును అభిషేకించెను. ఆయన అంతటను పర్యటించుచు,
మేలుచేయుచు, పిశాచశక్తికి లోబడిన వారందరును బాగుచేసెను. ఏలయన, దేవుడు ఆయనతో ఉండెను” (అ.కా. 10:38).
జ్ఞానస్నానము: జ్ఞానస్నానమును తపోస్నానమని, బప్తిస్మమని కూడా పిలుస్తారు. జ్ఞానస్నానమును అనగా ఏమి?
“జన్మపాపమును, ఇతర పాపమును పోగొట్టి మనలను
సర్వేశ్వరునికి తిరుసభ బిడ్డలుగా చేయు దేవద్రవ్యానుమానము.” జన్మపాపము ఆది
తల్లిదండ్రులైన అవ్వ ఆదాములనుండి సంక్రమిస్తుంది. ఇతర పాపము స్వయం కృతాపరాధము వన
జరుగుతుంది.
యేసు క్రీస్తు బప్తిస్మము: మరి క్రీస్తులో ఏపాపమును లేదు (హెబ్రీ. 4:15, యోహాను. 18:38, 19:4,6) ఆయన దేవుని కుమారుడు (లూకా. 1:32, 35, మత్త. 3:17). మరి యేసు క్రీస్తుకి జ్ఞానస్నానము అవసరమేనా?
ఎందుకు, ఆయన జ్ఞానస్నానమును స్వీకరించారు? దేవుని ప్రణాళికను నెరవేర్చుటకు (మత్త. 3:15). మనతో తన సంఫీుభావమును తెలియజేయు
నిమిత్తము, దేవుని
సేవకులను, సేవకు మాటలను
గౌరవించాని మనందరికీ ఒక సుమాతృక నిచ్చుటకు (యోహాను. 13:15),
ఆయన జ్ఞానస్నానము స్వీకరించారు.
యేసు ఎందులకు
జ్ఞానస్నానము స్వీకరించారు? మొదటిగా, దేవుని
ప్రణాళికను నెరవేర్చుటకు: అందుకు యేసు యోహానుతో, “ఇపుడిట్లే జరుగనిమ్ము. దేవుని
ప్రణాళిక అంతటిని మనము ఈ రీతిగా నెరవేర్చుట సమంజసము” (మత్త. 3:15) అని పలికాడు.
అనంతమైన దేవుని ప్రేమకు సూచన. రెండవదిగా, లోకరక్షకుని మార్గమును సుగమము చేయు క్రమములో
బప్తిస్మ యోహాను చెప్పినది (ప్రవచించినది), చేసినది అంతయు యధార్ధమని చెప్పుటకు. ఈవిధముగా, పాతనిబంధన
ప్రవక్తల ప్రవచనాలను ప్రభువు సంపూర్ణం చేయుచున్నాడు. మూడవదిగా, పాపములోనున్న
మానవాళితో తన సంఫీుభావమును తెలియజేయు నిమిత్తము, దేవుని సేవకులను, సేవకుల మాటలను
గౌరవించాలని మనందరికీ ఒక సుమాతృకను ఇచ్చుటకు ఆయన జ్ఞానస్నానము స్వీకరించారు: “నేను
చేసినట్లు మీరును చేయవలయునని మీకు ఒక ఆదర్శమును ఇచ్చితిని” (యోహాను. 13:15). నాలుగవదిగా, యేసు క్రీస్తు
జ్ఞానస్నానములో ఇమిడియున్న పరమ రహస్యము ఏమనగా, యేసు నీటిలోనికి ప్రవేశించుట వలన, నీటిని పవిత్ర
పరచాడు. ఆ నీటిద్వారా (జ్ఞానస్నానము) ఎంతోమంది రక్షణను సుగమం చేసాడు. యేసు
బప్తిస్మం (నీటిలోనికి ప్రవేశం) సిలువ మరణానంతరం ఆయన సమాధి చేయబడుటను
సూచిస్తున్నది. నీటిలోనుండి బయటకు వచ్చుట ఆయన మరణమును సమాధిని జయించుటను
సూచిస్తున్నది, ఇచ్చట
జ్ఞానస్నాన సమయములో పవిత్రాత్మను స్వీకరించిన ఆయన, మృత్యుంజయుడైన తరువాత పవిత్రాత్మ
వరప్రదాతగా సూచిస్తున్నది. ఆదితల్లిదండ్రుల పాపఫలితముగా మూయబడిన స్వర్గద్వారము, క్రీస్తు
జ్ఞానస్నాన సమయములో తెరువబడింది (మత్త. 3:16). “ఆయన (క్రీస్తు) మిమ్ము పవిత్రాత్మతో స్నానము
చేయించును” (మార్కు. 1:8).
యేసు క్రీస్తు జ్ఞానస్నానములో ఇమిడియున్న పరమ రహస్యము: నీటిలోనికి ప్రవేశించుట, సిలువ మరణానంతరం ఆయన సమాధి చేయబడుటను సూచిస్తున్నది.
నీటిలోనుండి బయటకు వచ్చుట ఆయన మరణమును సమాధిని జయించుటను సూచిస్తున్నది,
ఇచ్చట జ్ఞానస్నాన సమయములో పవిత్రాత్మను స్వీకరించిన
ఆయన మృత్యుంజయుడైన తరువాత పవిత్రాత్మ వరప్రదాతగా సూచిస్తున్నది. ఆది తల్లిదండ్రుల
పాపఫలితముగా మూయబడిన స్వర్గద్వారము, క్రీస్తు జ్ఞానస్నాన సమయములో తెరువబడెను (మత్త. 3:16).
క్రీస్తు అభిషేకం: యేసు క్రీస్తు యోర్దాను నదిలో జ్ఞానస్నాన మొందినప్పుడు పవిత్రాత్మచే
అభిషిక్తులైనారు (మత్త. 3:16). దేవుడు క్రీస్తు ప్రభువును అభిషేకించారు (యెషయ
42:1, 6. 61:1-2,
లూకా. 4:18, అ.కా. 10:38). యేసు యోర్దాను
నదిలో జ్ఞానస్నాన మొందినప్పుడు, నీటితోగాక, దేవుని
పవిత్రాత్మతోను, శక్తితోను,
అభిషేకింపబడినాడు (మత్త. 3:16, అ.కా. 10:38). తండ్రి దేవుడు కుమార క్రీస్తు ప్రభువును అభిషేకించాడు (యెషయ 42:1,6;
61:1-2; లూకా. 4:18). ప్రధమ సృష్టి సమయములో నీళ్ళపై తిరుగాడిన ఆత్మ క్రీస్తుపై
దిగివచ్చాడు. ఇది నూతన సృష్టి ప్రారంభానికి నాంది (సత్యోపదేశం 1224).
పూర్వవేదములో
ఎవరైనా ఒక వ్యక్తి ప్రముఖమైన పనికి లేదా పదవికి నియమింప బడినప్పుడు దేవుని ఆత్మ ఆ
వ్యక్తిపై దిగివచ్చేది. ఉదా: కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నియేలును
ఇస్రాయెలీయులకు, రాజుగా
నియమించబడినప్పుడు యావే ఆత్మ అతని మీదికి దిగివచ్చెను (న్యాయా. 3:9-10).
గిద్యోనును దేవుని ఆత్మ ఆవేశింపగా అతడు బూరనూదెను (న్యాయా. 6:34). యోఫ్తా
విషయములోను దేవుని ఆత్మ అతనిని ఆవేశింపగా (న్యాయా. 11:29), యావే సౌలును తన ప్రజలకు రాజుగా అభిషేకించినప్పుడు (1 సమూ.
10:1), సౌలు రాజు
యుద్ధమునకు పోవునప్పుడు (1 సమూ. 11:6), ప్రవిత్రాత్మ ప్రేరణముచే ప్రజలు ప్రవచనము పలుకుట చూస్తున్నాం.
క్రీస్తు బప్తిస్మం - దైవ సాక్షాత్కారం: యేసు బప్తిస్మం ఒక సాక్షాత్కారం. “ఆయన నీటి నుండి వెలుపలికి వచ్చిన
వెంటనే పర మండలము తెరువ బడుట, పవిత్రాత్మ పావుర రూపమున తనపై దిగివచ్చుట చూచెను. అప్పుడు పరలోకము నుండి ఒక
వాణి, ‘నీవు నా
ప్రియమైన కుమారుడవు. నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను’ అని వినిపించెను” (మార్కు. 1:10-11). ఈవిధముగా, తండ్రి దేవుడు, తన కుమారుడిని
ఈలోకమున సాక్షాత్కరింప జేశాడు. అలాగే తన కుమారుని ప్రేషిత కార్యమును వెల్లడిచేసాడు.
జ్ఞానస్నానం తరువాత తన జీవితాన్ని జనంమధ్య ప్రారంభించాడు. ఉత్థానం పిమ్మట
శిష్యులతో, “మీరు వెళ్లి,
సకల జాతి జనులకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నాన మొసగుచు, వారిని నా శిష్యులను చేయుడు” అని చెప్పాడు (మత్త. 28:19).
తండ్రి దేవుని వాక్కు, నేటి మొదటి పఠనములోని యెషయ ప్రవక్త ప్రవచనాలను
ధ్వనిస్తుంది: “ఇదిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాడ్యుని చేసితిని. ఇతడినెన్నుకొంటిని. ఇతని వలన ప్రీతీ
చెందితిని. ఇతనిని నా ఆత్మతో నింపితిని” (42:1). నేటి సంఘటన, త్రిత్వైక దేవుని సాక్షాత్కారం. క్రిస్మస్ యూదులకు సాక్షాత్కారం అయితే,
ముగ్గురు జ్ఞానుల యేసు సందర్శన అన్యులకు
సాక్షాత్కారం. అలాగే, నేటి యేసు
బప్తిస్మ పండుగ పశ్చాత్తాప పడే పాపాత్ములందరికి ఓ గొప్ప సాక్షాత్కారం.
యేసు
క్రీస్తు బప్తిస్మ పండుగను కొనియాడుచున్న మనము, నేడు దేవుడు తన దైవకుమారుని గురించి నీతో మాట్లాడటం నీవు
వినాలి. నిన్ను, నన్ను
మనలనందరినీ తండ్రి దేవుని వద్దకు చేర్చుటకే ఈ లోకమునకు పంపబడినాడు. అవును! దేవుడు
ప్రాయశ్చిత్త బలిగా తన కుమారున్ని పంపాడు. మనలను రక్షించి దేవునితో సఖ్యపరచుటకు
వాక్కు మానవుడైనది! (సత్యోపదేశం 457). కనుక, ఆ
దైవకుమారున్ని నీ రక్షకుడిగా అంగీకరించు! నీ రక్షణకై ఆయనతో సహకరించు!
నేడు
దేవునికి కృతజ్ఞతలు తెలుపుదాం. ఎందుకన, మనం పొందిన జ్ఞానస్నానము ద్వారా, ఆదిపాపమునుండి శుద్దులము గావింపబడినాము, దేవుని కృపను పొందియున్నాము, పవిత్రాత్మ వరమును పొందియున్నాము, దేవుని బిడ్డలమైనాము. తల్లి శ్రీసభలో సభ్యులమైనాము. అలాగే,
క్రైస్తవులముగా, మన ప్రేషితకార్య బాధ్యతను గుర్తించుదాం! ఎందుకన,
యేసు ప్రేషితకార్యం, ఆయన జ్ఞానస్నానముతో ప్రారంభమైనట్లే, మన ప్రేషితకార్యముకూడా మన జ్ఞానస్నానంతో ప్రారంభమైనది. మన
ప్రధాన బాధ్యత: మన జీవితాల ద్వారా క్రీస్తుకు సాక్షులుగా జీవించడం - క్రైస్తవ
నైతిక విలువలుగల జీవితమును జీవించడం. ప్రభువా! నీవు సృష్టికర్తయైన తండ్రి దేవుని కుమారుడవని,
లోకరక్షకుడవని విశ్వసించుచున్నాను. తండ్రి కృపను,
సత్యమును లోకమునకు తీసుకొని వచ్చితివని
విశ్వసించుచున్నాను. మిమ్ములను నిత్యమూ అనుసరిస్తూ, ఆ కృపను, సత్యమును మేము పొందునట్లుగా మాకు మీ కృపను అనుగ్రహించండి!
జ్ఞానస్నాన దివ్యసంస్కారం: ఏడు దివ్యసంస్కారాలలో మొదటిది, ఇతర సంస్కారములన్ని దీనిపై ఆధారపడి యున్నాయి. క్రీస్తు ప్రభువే స్వయముగా తన
శిష్యులతో ఇలా చెప్పియున్నారు: ''సకల జాతి జనులకు పిత, పుత్ర, పవిత్రాత్మ
నామమున జ్ఞానస్నాన మొసగుచు, వారిని నా శిష్యులను చేయుడు'' (మత్త. 28:19). యేసు నికోదేముతో సంభాషిస్తూ ఇలా చెప్పియున్నాడు: “ఒకడు నీటివలన, ఆత్మవలన జన్మించిననే తప్ప దేవునిరాజ్యములో ప్రవేశింపలేడు”
(యోహాను. 3:5). ఈ విధముగా, రక్షణ పొందుటకు, జ్ఞానస్నానము తప్పనిసరి అని ప్రభువు తెలియజేసియున్నాడు. కతోలికులకు,
జ్ఞానస్నానము ఓ ఆనవాయితీ మాత్రమే కాక,
క్రైస్త్వవత్వమునకు గురుతుగానున్నది. ఎందుకన,
బప్తిస్మము, క్రీస్తులో మనకి ఓ నూతన జీవితమును ఒసగుచున్నది. అయితే, జ్ఞానస్నానము పొందినవారు మాత్రమే రక్షింపబడుదురా?
జ్ఞానస్నానము పొందాలని కోరిక కలిగియుండి మరణించినవారు
కూడా రక్షింపబడుదురు. వారి తప్పిదమువలనగాక, క్రీస్తు సువార్తను ఎరిగియుండకపోయినను,
సహృదయముతో, ఆత్మప్రేరణతో, దైవాన్వేషణచేస్తూ,
వారి మంచి కార్యములద్వారా, ఆత్మసాక్షి అనుసారముగా, దైవచిత్తమును నేరవేర్చువారుకూడా రక్షింపబడుదురు (Lumen
Gentium).
జ్ఞానస్నానమువలన ముఖ్యముగా ఆరు అనుగ్రహాలను పొందెదము:
1.
జన్మపాపము మరియు వ్యక్తిగత పాపదోషము తొలగించబడును. 2. ఈలోకమున మరియు ఉత్తరించు స్థలమున,
పాపము వలన ప్రాప్తించు తాత్కాలిక మరియు శాశ్వత
శిక్షనుండి ఉపశమనమును పొందెదము. 3. దైవానుగ్రహముతో మనము నింపబడెదము. అనగా దేవునియొక్క జీవితము మనలో
కలిగియుండెదము. పవిత్రాత్మ వరాలైన దైవజ్ఞానము, తెలివి, దైవనిర్ణయం, దైవబలం,
వివేకము, దైవభక్తి, దైవభీతిలను
పొందెదము. దివ్య సుగుణాలైన విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమలను పొందెదము. 4. క్రీస్తులో భాగస్తులమయ్యెదము. 5. భూలోకమున క్రీస్తు శరీరమైన శ్రీసభలో భాగస్తులమయ్యెదము. 6. మిగతా సంస్కారములలో పాల్గొనునట్లు చేయును.
దైవానుగ్రహములో మన ఎదుగుదలకు తోడ్పడును.
మన జ్ఞానస్నానం: దివ్య సంస్కారం (“an outward and visible sign of an inward
spiritual grace”) అయిన జ్ఞానస్నానం క్రైస్తవ
సమాజములోనికి ప్రవేశసాంగ్యము; దీనిద్వారా, దేవుడు మనలను
తన దత్తపుత్రులనుగా చేసికొనుచున్నాడు. ఈ బంధం ఎన్నటికిని విడదీయరానిది. యేసు
బప్తిస్మమునందువలె, మన
బప్తిస్మముయందు త్రిత్వైకదైవం మనతో వాసంచేయుచున్నది. దేవునకు దత్తపుత్రులుగా
మారుచున్నాము. మనకోసం పరలోకం తెరువబడుచున్నది. ఈరోజు మనం కొనియాడే యేసు బప్తిస్మ
పండుగకు అర్ధాన్ని చేకూర్చాలంటే, మన జ్ఞానస్నానముద్వారా, క్రీస్తుకు, శ్రీసభకు
మనతోనున్న సంబంధాన్ని గుర్తించాలి. మన జ్ఞాన స్నానముద్వారా బోధించుకార్యాన్ని,
భాద్యతను స్వీకరించియున్నాము. ఇదే మన జ్ఞానస్నాన
పిలుపు. క్రీస్తు బప్తిస్మపండుగను కొనియాడుచున్న మనం, మన జ్ఞానస్నాన ప్రమాణాలను
నూత్నీకరించుదాం. విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా జీవించుదాం. తండ్రి దేవుడు, పవిత్రాత్మ దేవుడు, పుతృడైన క్రీస్తుద్వారా మనయందు, మన జ్ఞానస్నానమందు ఆనందించునుగాక!
It is really meaningful and it is very much enhancing and so reflective. Thank you dear father.
ReplyDelete