తపస్కాల రెండవ ఆదివారము, Year A

 తపస్కాల రెండవ ఆదివారము
ఆది. 12:1-4, 2 తిమో. 1:8-10, మత్త. 17:1-9

నేడు తపస్కాల రెండవ వారములోనికి ప్రవేశిస్తున్నాము. ఈ ఆదివారమును ‘దివ్యరూప ధారణ’ ఆదివారము అని పిలుస్తారు. ఎందుకన, ప్రతీసంవత్సరం, తపస్కాల రెండవ ఆదివారమున, సువిశేష పఠనం, యేసు దివ్యరూప ధారణ గురించి ఉంటుంది. నేటి మొదటి పఠనములో దేవుడు అబ్రహామును పిలుచుట, అబ్రహాముని ప్రత్యుత్తరమును గురించి వింటున్నాము. మనం పొందుకున్న రక్షణము మన కృషి ఫలితము కాదని అది దేవుని ఉచితానుగ్రహమేనని పౌలు రెండవ పఠనములో చెబుతున్నారు.

అబ్రహాముకు పిలుపు

క్రైస్తవ విశ్వాసం ప్రకారం అబ్రహాము విశ్వాసమునకు తండ్రి. అబ్రహాము అనగా అనేక జాతుల వారికి తండ్రి. నమ్మకానికి, విశ్వాసానికి అబ్రహాము ప్రతీక. దేవుడు పిలిచినప్పుడు విధేయుడగునట్లు చేసినది విశ్వాసమే. ఫలితముగా, అబ్రహాము గొప్పవాడు అగుటను చూస్తున్నాము. మనంకూడా అబ్రహామువలె దేవుని పిలుపును అంగీకరించి, దేవునిపై భారమునుమోపి, దేవునిపై నమ్మకం ఉంచి జీవిస్తే ఆయన మనను అధికముగా ఆశీర్వదించుతారు. దేవునియందు విశ్వాసం కారణముగా అబ్రహాము శోధింపబడ్డాడు. కాని విశ్వాసమును పోగొట్టుకొనలేదు. మనంకూడా శోధింపబడినప్పుడు విశ్వాసమును నింపుకుంటే దేవుడు గొప్పగా బహుకరిస్తారు.

యేసు దివ్యరూప ధారణ: వ్యాఖ్యానము

దివ్యరూప ధారణ, యేసు జీవితములో జరిగిన మహత్కర సంఘటన. యేసు శ్రమలానంతరం పొందబోవు మహిమకు తార్కాణం. ఇదొక గొప్ప దివ్యదర్శనము. దీనిని మనం మూడు సువార్తలలోను చూడవచ్చు: మత్త. 17:1-13, మార్కు. 9:2-13, లూకా. 9:28-36. అలాగే, పేతురు తన లేఖలో, యేసు దివ్యరూప ధారణ గురించి ప్రస్తావించాడు: 2 పేతు. 1:16-18.

“ఆరు దినములు గడచిన పిమ్మట” (17:1) అను వాక్యముతో ప్రారంభమగుచున్నది. ఆరు దినముల ముందట ఏమి జరిగిందో తెలుసుకొనుట ముఖ్యము! ‘పేతురు అపోస్తులందరి తరుపున, క్రీస్తును గూర్చిన గొప్ప విశ్వాసమును ప్రకటించాడు: “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు” (మత్త.16:16). అప్పుడు, యేసు పేతురుపై తన సంఘమును [శ్రీసభ, ekklesia] నిర్మిస్తానని ప్రభువు చెప్పాడు (మత్త. 16:18-19, ఎఫెసీ. 2:20, దర్శన. 21:14). అటుతరువాత, ప్రభువు తన పాటులు, శ్రమల గురించి ప్రస్తావించాడు (మత్త. 16:21). శిష్యులు ఈ వైవిధ్యాన్ని అర్ధం చేసుకోలేకపోయారు. మరల, పేతురు శిష్యుల బృందం తరుపున, ‘ఇది ఎన్నటికి సంభవించును గాక” అని వారించాడు. ఇది సైతాను పనిగా యేసు వర్ణించాడు (మత్త. 16:22-23). శిష్యులలో అవిశ్వాస నేపధ్యములో, వారి విశ్వాసాన్ని బలపరచడానికి తన దివ్యత్వాన్ని వారికి ప్రదర్శిస్తున్నాడు.

యేసు పేతురును,  యాకోబును, అతని సోదరుడగు యోహానును తన వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతము పైకి వెళ్ళెను” (17:1). లూకా సువార్తీకుడు, వారిని వెంటబెట్టుకొని, “ఆయన ప్రార్ధన చేసికొనుటకై పర్వతము పైకి వెళ్ళెను” (9:28) అని చెప్పాడు. పర్వతాలు, దేవుని సాన్నిధ్యాన్ని బహిర్గతమొనర్చిన ప్రత్యకమైన ప్రదేశాలు. పాత నిబంధన గ్రంథములో, మోరీయా కొండ (ఆది. 22:2), సీనాయి (హోరేబు) కొండ (నిర్గమ. 19), కర్మెలు కొండ (1 రాజు. 18), దైవసాక్షాత్కారమునకు ప్రత్యేక ప్రదేశాలుగా నిలిచాయి. యేసు ప్రభువు జీవితములోకూడా, ‘పర్వతాలు’ లేదా ‘కొండలు’ ముఖ్యమైన సంఘటనలకు ప్రత్యేక ప్రదేశాలుగా నిలిచాయి: “యేసు పర్వతమును ఎక్కి కూర్చుని ఉపదేశింప (అష్టభాగ్యములు) నారంభించెను” (మత్త. 5:1-2, 8:1); యేసు “ఉన్నత పర్వతముపైన” (సంప్రదాయం ప్రకారం, తాబోరు కొండ) దివ్యరూప ధారణ చెందెను; “యేసు ఓలీవు పర్వతమునకు వెళ్లి ప్రార్ధన చేసెను” (లూకా. 22:39-46; యోహాను 8:1); ‘కపాల స్థలము’ అను నామాంతరము గల ‘గొల్గొతా’ అను స్థలమున (కొండ) సిలువ వేయబడెను (మత్త. 27:33); యేసు ఓలీవు పర్వతమున పరలోకమునకు కొనిపోబడెను (అ.కా. 1:9-12). నేడు మనం ప్రతిరోజు వెళ్ళవలసిన కొండ ‘దివ్యబలి పూజ’. దేవాలయానికి రావాలి. పూజలో దేవున్ని సాక్షత్కరించగలం. కనుక, క్రమం తప్పక, దివ్యపూజా బలిలో పాల్గొనాలి. భయాలను, శోధనలను, పరధ్యాసలను పక్కనబెట్టి, ఏకదృష్టితో పాల్గొనాలి. అప్పుడు మనముకూడా, పేతురువలె, “ప్రభూ! మనము ఇచట నుండుట మంచిది” (17:4) అని మనస్పూర్తిగా చెప్పగలం.

దివ్యరూపధారణ సమయమందు, “యేసు రూపాంతరము చెందెను. అయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లగా నయ్యెను” (17:2). లూకా, “ఆయన ప్రార్ధన చేసికొనుచుండగా” (9:29) రూపాంతరము చెందెనని చెప్పాడు. అది మహోన్నతమైన యేసుని రూపాంతరము. తన దైవత్వమును సాక్షాత్కరించెను. శిష్యులకు, యేసు ‘దైవకుమారుడు’ అని, ‘ప్రవచింపబడిన వాగ్దానాలు ఆయనలో నెరవేరాయని’, బహిర్గతం చేయబడింది. వారి విశ్వాసం బలపడింది. మనము కూడా రూపాంతరం చెందాలి. బహిర్గత మార్పుకాక, అంత:ర్గత మార్పు (ప్రవర్తన, ఆలోచనా ధోరణి) మనలో కలగాలి.

“యేసుతో మోషే, ఏలియాలు సంభాషించెను” (17:3). మోషే ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రమును ఒసగాడు. మోషే ధర్మశాస్త్రమునకు సూచన. ఏలియా ప్రవక్తలలో ఒక గొప్ప ప్రవక్త. ఏలియా ప్రవక్తల బోధనలకు సూచన. మోషే, ఏలియా, ఇరువురు పర్వతముపై దేవుని దర్శించారు. ప్రభువువలె 40 దినాలు ఉపవాసము చేసారు. ఇచ్చట, ధర్మశాస్త్రమునకు, ప్రవక్తల ప్రవచనములకు యేసు పరిపూర్ణము అని సూచించుటకు వారిరువురు దర్శనమిచ్చిరి. “నేను ధర్మశాస్త్రమును, ప్రవక్తల ప్రబోధమును సంపూర్ణ మొనర్చుటకు వచ్చితిని” (మత్త. 5:17) యేసు స్పష్టము చేసియున్నాడు.

“అంతలో ఒక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించెను” (17:5). దివ్యముఖ తేజస్సును చూచి ఎవరును జీవించలేరు (నిర్గమ. 33:20), తట్టుకొని నిలువలేరు. నేలపై బోరగిల పడుదురు (అ.కా. 9:3-4. నిర్గమ. 34:29-30, 33-35). అందుకే, శిష్యులు బోరగిల పడిరి (మత్త. 17:6).

అనేక సందర్భములలో, దేవుడు పర్వతముపై మేఘమువలె (నిర్గమ. 19:9, 24:15-18), అగ్నివలె (నిర్గమ. 19:18), దిగివచ్చినట్లుగానే దివ్యరూపధారణ సమయములోకూడా మేఘమువలె (మత్త. 17:5) దిగివచ్చెను.

“ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయనను గూర్చి నేను ఆనంద భరితుడనైతిని. ఈయనను ఆకింపుడు” (17:5) అని పరమ తండ్రి వాణి వినిపించెను. యేసు నిజముగా ‘దేవుని కుమారుడు’ అని శిష్యులు అర్ధముచేసుకుంటున్న విషయాన్ని, ఆ వాణి ధృవపరుస్తున్నది. “ఆయన చెప్పినట్లు చేయుడు” (యోహాను. 2:5) అని మరియ శిష్యులతో చెప్పినది. “నా మాటను పాటించువాడు నిత్య జీవమును పొందును” (యోహాను. 5:24) అని యేసు ప్రభువే స్వయముగా చెప్పియున్నారు. ఎందుకు మనం ఆయన మాట వినాలి? ఎందుకన, ఆయనయే ఇహపరమందు సర్వాధికారి (మత్త. 28:18). ఆయన మూలమున, సమస్తమును సృష్టించబడెను (యోహాను. 1:3), ఆయన మూలమున, ఆయన కొరకే సమస్తములున్నవి. ఆయనకే సదా స్తుతికలుగునుగాక (రోమీ. 11:36). ఆయన మాటలో జీవమున్నది (ఫిలిప్పీ. 2:9-11), దేవుడు ఆయనపై అంగీకార ముద్రను (యోహాను. 6:27) వేసియున్నారు. కావున, మనము ఆయనను ఆకించాలి.

“శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరగిల పడిరి” (17:6). విశ్వాసలేమి, భయము (ఉదా. అబ్రహాము: ఆది. 15:1, మరియ: లూకా. 1:30-31, యోసేపు: మత్త. 1:20; గొల్లలు: లూకా. 2:10). కనుక, మన విశ్వాసాన్ని బలపరచుటకు, యేసు, “లెండు, భయపడకుడు” (17:7) అని తన అభయాన్ని ఇస్తున్నాడు. భయమును నుండి విశ్వాసము లోనికి ప్రభువు ఆహ్వానిస్తున్నారు. శిష్యులు అలలకు భయపడినప్పుడు (మత్త. 14:27), శిష్యులు అద్భుతరీతిన చేపలు పట్టినప్పుడు (లూకా 5:10), ‘ఎవరికి భయపడుట’ గూర్చి బోధించునప్పుడు (లూకా 12:7), ‘స్వర్గ సంపదలు’ గురించి బోధించేటప్పుడు (లూకా 12:32), “భయపడవలదు” అని చెప్పియున్నాడు. మన భయాలు తొలగిపోవాలంటే, యేసు క్రీస్తు మాటలు వినాలి. ఆయనకు సాక్షులై ఉండాలి.

“అంతట శిష్యులు కనులెత్తి చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరును కనిపించలేదు” (17:8). ఈ రూపాంతరమే మనలో కలగాలి, అనగా, మన దృష్టి యేసుపై మాత్రమే ఉండాలి. ఆయనే మన గమ్యం, ధ్యేయం. చుట్టూ కనిపించే ఆకర్షణలు, ప్రకృతి అందాలు, సంపదలు, అధికారం, పదవులు, హోదాలు, సుఖాలు, సౌలభ్యాలు... మొ.విగాక, యేసును మనం చూడగలగాలి. పేతురు ఆ కొండమీదే ఉండటానికి శిబిరాలను నిర్మిస్తానని ప్రభువుతో అన్నాడు (17:4).

“వారు ఆ పర్వతమునుండి దిగివచ్చు చుండ, యేసు వారితో “మనుష్య కుమారుడు మృతుల నుండి లేపబడు వరకు [ఉత్థానము] మీరు ఈ దర్శనమునుగూర్చి ఎవ్వరితో చెప్పరాదు అని యేసు ఆజ్ఞాపించెను” (17:9). “శిష్యులు ఆ రోజులలో ఆ విషయమును ఎవ్వరికి చెప్పలేదు” అని లూకా వ్రాసాడు (9:36). “తాను క్రీస్తునని ఎవరితోను చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించాడు” (మత్త. 16:20). దీనికి కారణం, శిష్యులు ఇంకా మెస్సయా అనగా పరిపూర్ణముగా అర్ధం చేసుకోలేదు. క్రీస్తు ఉత్థానము మాత్రమే వారికి పరిపూర్ణముగా తెలియునట్లు చేయును.

రెండవ పఠనములో, పౌలుగారు చెప్పినట్లుగా మనము అనుభవించుచున్న రక్షణ మన కార్యము వలనగాక దేవుని ఉచితానుగ్రహము వలననే. ఈ సత్యమును, అందరికి బోధింప కృషి చేయాలి. ఇది మనందరి బాధ్యతగా గుర్తెరిగి, నెరవేర్చాలి, ప్రకటించాలి.

దివ్యరూపధారణలో దాగియున్న పరమార్ధము

ఇప్పటి వరకు శిష్యులచేత ఒక బోధకునిగా, నాయకునిగా, రక్షకునిగా, మెస్సయాగా, పరిగణింపబడిన యేసు, తన నిజస్వరూపమును తెలియపరచడం ఎంతోముఖ్యం. ఫలితముగా, శిష్యుల విశ్వాసము దృఢపరచబడినది. ప్రభువులో నున్న దైవత్వమును చూపించి, ఫలితముగా, శిష్యులను బలపరచియున్నాడు. తండ్రి తనకు అప్పగించిన పనిని నెరవేర్చుచున్నారు (యెషయ 42:1-4, లూకా. 9:35. యోహాను. 4:34). తాను మోషేతోను (ధర్మశాస్త్రము), ఏలియాతోను (ప్రవక్తలు) మాట్లాడుటద్వారా తాను ప్రవక్తల ప్రబోధములను, ధర్మశాస్త్రమును రద్దుచేయక, సంపూర్ణ మొనర్చుటకు వచ్చితినని (మత్త. 5:17) తెలియ జేయుచున్నారు.

అలాగే, యేసు దివ్యరూప ధారణ, పరలోక పరమరహస్య అనుభూతిని తెలియజేయుచున్నది. పరలోకం అంటే ఒక స్థలము కాదని, అది ఒక వ్యక్తి అని, ఆ వ్యక్తి యేసు క్రీస్తు అని తెలియజేయుచున్నది. యేసు ప్రభువే ఆ దైవరాజ్యము. త్రిత్వైక దేవుడే ఆ పరలోక రాజ్యము (నిత్యజీవము).

యేసు ప్రార్ధనా జీవితానికి తార్కాణం ఆయన దివ్యరూప ధారణ. ప్రార్ధన, తండ్రి-కుమారుల మధ్యననున్న బాంధవ్యము. ప్రభువు ప్రేషిత పరిచర్య అంతయు కూడా అతని ప్రార్ధన ఫలమే!

మన బాధ్యత

అబ్రహామువలె దేవుని విశ్వసించి, విశ్వాసాన్ని పాటించి దీవెనలు పొందుకోవాలి. క్రీస్తులోనున్న దివ్యస్వభావమును మనకు ఆయనయే ఒసగినారని గుర్తెరిగి అటువంటి దివ్యరూపమును ప్రదర్శిస్తూ ఇతరులను విశ్వాసమందు బలపరచాలి. ఆయన కృపచేత మనము రక్షింపబడ్డామని గుర్తెరిగి, వినయంకలిగి జీవిస్తూ, పొందిన విశ్వాసాన్ని ప్రకటిస్తూ జీవించాలి. ఎంచుకున్న మార్గము దేవునికి సమ్మతమేనా, కాదా అని తెలుసుకొనుటకు దివ్యరూపధారణ మొందెను. యెరూషలేములో తాను పొందబోవు మరణమును, తాను ఎంచుకొనిన మార్గము, తాను చేయబోవు కార్యము సరైనదా? కాదా? అని తెలుసుకొను నిమిత్తము దివ్యరూపధారణమున మోషేతోను, ఏలియాతోను చర్చించినట్లుగా చూస్తున్నాము. మనము చేయు పనులు దేవునికి సమ్మతమా? కాదా? అని తెలుసుకొనుచున్నామా? తెలుసుకొనుటకు ప్రార్ధించుచున్నామా? మన పనులు దైవనిర్ణయమేనా? అవి దేవుని చిత్తమునకు అనుగుణముగా ఉన్నవో, లేవో? అని తెలుసుకొనుటకు మనలో ఎంతమందిమి ప్రార్ధించు చున్నాము?

మనలోకూడా దివ్యరూపం ఉన్నది. దివ్యాత్మ ఉన్నది. జ్ఞానస్నానములో ఆత్మను స్వీకరించుటద్వారా, దేవుడు మట్టిముద్ధలోనికి తన శ్వాసను ఊదుటద్వారా, దివ్యసత్ప్రసాదమును స్వీకరించుటద్వారా, దేవద్రవ్యానుమానమును స్వీకరించుటద్వారా, దివ్యగ్రంథ పఠనముద్వారా దైవశక్తిని, దివ్యరూపమును పొందుకొనుచున్నాము. క్రీస్తులోని దివ్యరూపమును చూచినవారు విశ్వాసమునందు బలమును పొందుకున్నారు. మరి మనలో ఎంతమంది మనలోనున్న దివ్యరూపమును చూపుచున్నాము. ప్రార్ధన జీవితంద్వారా, విశ్వాస జీవితంద్వారా మన ఆత్మీయ, ఆధ్యాత్మిక జీవితమును చూచి ఎంతమంది విశ్వాసంలో బలపడుచున్నారు? కనీసం మనమైనా బలపడినామా? ఆత్మపరిశీలన చేసుకుందాం.

No comments:

Post a Comment