సామాన్య 13 వ ఆదివారం, Year B

 సామాన్య 13 వ ఆదివారం, Year B
సొ.జ్ఞాన.1:13-15, 2:23-24, 2 కొరి. 8:7-9, 13-15, మార్కు. 5:21-43

విశ్వాసముతో ప్రార్ధన చేద్దాం!

దేవుడు సర్వజ్ఞాని. సర్వమును ఎరిగినవాడు. తననుతాను ఎల్లప్పుడు మనకు బహిర్గత మొనర్చుకుంటూ ఉంటాడు. మన సమస్యలన్ని ఆయనకు తెలుసు. ఆ సమస్యలన్నిటికీ పరిష్కారము కూడా ఆయనకు తెలుసు. మనం నిజముగా ఆయనకు ప్రార్ధన చేయుచున్నామా? ప్రార్ధన మన ఆత్మకు పోషణ, బలము. యేసు యాయీరు ప్రార్ధనను మన్నించాడు. తన కుమార్తె మరణావస్థలో ఉన్నది, వచ్చి స్వస్థపరచుమని బ్రతిమాలుకొనగా, ప్రార్ధింపగా, యేసు వెమ్మటే యయీరుతో తన యింటికి బయలు దేరెను. గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పైపై బడెను. అప్పుడు, పండ్రెండు సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యద్ధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఆయన వస్త్రమును తాకగానే ఆమె స్వస్థత పొందెను. ఆ తరువాత, అప్పటికే మరణించిన యయీరు కుమార్తెకు ప్రానదానము చేసెను. ఈ రెండు అద్భుతమైన సంఘటనలలో విశ్వాసము ప్రధానము నిలుస్తుంది.

ఈ రెండు అద్భుతముల ద్వారా, దేవుడు దయామయుడు, సున్నితమనస్కుడు, తన ప్రజలను సంరక్షించువాడు అని అర్ధమగుచున్నది. ఆయన అందరికి అందుబాటులో ఉండే దేవుడు. యయీరులాంటి గొప్పవారికి, అనామకురాలైన ఆ స్త్రీలాంటి చిన్నవారికి. అయితే, అందరికీ ఉండవలసినది, దేవునికి విశ్వాసముతో ప్రార్ధన చేసే మనస్తత్వం.

యయీరు, స్త్రీల విశ్వాసము: యాయీరు “ప్రభువు పాదములపై పడ్డాడు” (5:22). విశ్వాసమునకు లేదా పశ్చాత్తాపానికి  సూచనముగా ఉండే భంగిమ. అలాగే, “ఆమె ఆయన పాదములపై బడి జరిగినదంతయు విన్నవించెను” (5:33). ప్రభు స్వస్థతకు విశ్వాసము తప్పనిసరి. ప్రభు స్వస్థతను గుర్తించడం, పశ్చాత్తాపములో భాగము. యేసు యయీరుతో, “విశ్వాసము కలిగి యుండుము” (5:36) అని అన్నాడు. మరణ సమయములోకూడా (కుమార్తె మరణించినది), విశ్వాసమును కలిగియుండాలని ప్రభువు కోరుచున్నాడు.

స్త్రీతో, “కుమారీ! నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను” (5:34) అని అన్నాడు. ఆ స్త్రీ యేసును గూర్చి విని, ఆయన వెనుకగా వచ్చినది (5:27). యేసును గూర్చిన సందేశమును వినుట వలన ఆమెలో విశ్వాసము కలిగినది. అదే విశ్వాసముతో యేసు వస్త్రములను తాకింది. స్వస్థత పొందింది. ఆరోగ్యవతియై సమాధానముతో వెళ్ళినది..

మనము సంపూర్ణ మార్పు, తద్వారా సంపూర్ణ స్వస్థత పొందాలనేదే దేవుని చిత్తం. నేటి మొదటి పఠనములో ఇలా చదువుచున్నాము: మృత్యువును దేవుడు కలిగింపలేదు, ప్రాణులు చనిపోవుట చూచి ఆయన సంతసింపడు. ఆయన ప్రతి ప్రాణిని జీవించుటకొరకే సృజించెను. ఆయన చేసిన ప్రాణులన్ని, ఆయురారోగ్యములతో అలరారుచున్నవి. జీవులలో మరణకరమైన విషయమేమీ లేదు. మృత్యువు ఈ లోకమున రాజ్యము చేయదు” (సొ.జ్ఞాన. 1:13-14).

అందుకై ఆయనలో సంపూర్ణ విశ్వాసమును కలిగి యుండాలి. కనుక, దేవునియందు మన విశ్వాసము, దృఢమైనదిగా, పరిపూర్ణమైనదిగా యుండాలి. ఆయన చిత్తానుగుణముగా, మన విన్నపాలను మనకు దయచేస్తారు.

ముఖ్యముగా, శ్రమలు, హింసల సమయాలలో, ఆనాడు క్రైస్తవ సంఘ పరిస్థితి, నేడు కరోన వైరస్ పరిస్థితి, ఇంకా అనేకమైన పరిస్థితులలో, మనం విశ్వాసాన్ని కోల్పోరాదు: “ఏమాత్రము అధైర్య పడరాదు” (5:36, 16:8), యేసును ఎన్నటికి విడిచి పెట్టి పారిపోకూడదు (14:50), వస్త్రహీనులై పారిపోకూడదు (14:51). ఎలాంటి ఆటంకము, సమస్య, హింస, బాధ ఎదురైననూ, నిర్భయముగా ఉండాలి. దృఢవిశ్వాసము కలిగియుండాలి. యేసు పాదములపై పడాలి. విశ్వాసము రక్షణ, జీవమునొసగును. దేవునితోను, ఇతరులతోను సత్సంబంధము కలిగి యుండాలి.

No comments:

Post a Comment