విభూతి బుధవారం

విభూతి బుధవారం
యోవేలు 2:12-18; 2 కొరి. 5:20-6:2; మత్త. 6:1-6, 16-18

"నీవు మట్టినుండి పుట్టితివి కాన చివరకు మట్టిలోనే కలసిపోవుదువు" (ఆది. 3:19). 


నేడు విభూతి బుధవారము. తల్లి శ్రీసభకు చాలా ముఖ్యమైన రోజు, ఎందుకన, నేడు అధికారికముగా, 40రోజుల తపస్సు కాలమును ప్రారంభించుకొను చున్నాము. "ఇదిగో! ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము. ఇదే రక్షణ దినము" (2 కొరి. 6:2). నేడు, మనం అశీర్వదించబడిన విభూతిని స్వీకరించబోవు చున్నాము. ఈ విభూతిని, గతసంవత్సరము మ్రానికొమ్మల ఆదివారమున ఆశీర్వదించిన కొమ్మలనుండి సిద్ధము చేస్తాము. ఈ కొమ్మలు క్రీస్తునందు మన విశ్వాసానికి సూచికలు. సంవత్సరము తరువాత, ఈ కొమ్మలు ఎండిపోయి యుంటాయి. ఎండిపోయిన ఈ కొమ్మలు, పాపముచేసి, మలినమైన మన ఆత్మలకు ప్రతీకలు. నొసటిపై సిలువ గురుతులో స్వీకరించే విభూతి, తపస్సు కాలములో మనకుండవలసిన అంత:ర్గత స్వభావమునకు సూచిక. విభూతి వినయానికి, పశ్చాత్తాపానికి సూచన.

విభూతిని వాడే ఆచారం, పాతనిబంధన కాలము నుండియే యున్నది. విభూతి దు:ఖము, మరణము, ప్రాయశ్చిత్తమునకు చిహ్నం. అహష్వేరోషు రాజు యూదులను కుట్రపన్ని చంపడానికి రాజశాసనమును చేసాడని విని, మొర్దెకయి "సంతాపముతో బట్టలు చించుకొనెను. గోనె తాల్చి తలమీద బూడిద చల్లుకొని పరితాపముతో పెద్దగా ఏడ్చెను" (ఎస్తే. 7(4):1). యోబు తాను పలికిన పలుకులకు సిగ్గుపడి, "దుమ్ము, బూడిద పైన చల్లుకొని పశ్చాత్తాప పడుచున్నాను (యోబు. 42:6) అని పలికెను. ఇజ్రాయేలు ప్రజల బాబిలోను బానిసత్వమును గూర్చి ప్రవచిస్తూ దానియేలు ఇలా పలికాడు, "నేను ప్రభువుకు భక్తితో ప్రార్ధన చేయుచు అతనికి మనవిచేసికొని ఉపవాసముండి గోనె తాల్చి బూడిదలో కూర్చుంటిని" (దాని. 9:3). 

యేసు ప్రభువుకూడా, విభూతిని గూర్చి సూచించాడు, "మీయందు చేయబడిన అద్భుత కార్యములు, తూరు సీదోను పట్టణములలో జరిగియుండినచో, ఆ పురజనులెపుడో గోనెపట్టలు కప్పుకొని, బూడిద పూసికొని హృదయ పరివర్తనము పొందియుండెడివారే" (మత్త. 11:21).

శ్రీసభ ఈ ఆచారాన్ని తపస్కాల ఆరంభానికి, ప్రాయశ్చిత్తానికి గురుతుగా తీసుకొని యున్నది. తపస్కాలములో మన మరణము గూర్చి తలంచి, పాపాలకు దు:ఖపడుతూ ఉంటాము. గురువు విభూతిని ఆశీర్వదించి విశ్వాసుల నుదిటిపై సిలువ గురుతు వేస్తూ, "ఓ మానవుడా! నీవు ధూళినుండి పుట్టితివనియు, తిరుగ ధూళిగ మారిపోవుద వనియు స్మరించుకొనుము" లేక "పశ్చాత్తాపపడి క్రీస్తు సువిశేషమును నమ్ముకొనుము" అని చెప్పును. తద్వారా, తపస్సుకాల ధ్యేయమైన "పశ్చాత్తాపము, మారుమనస్సు, సువార్తపట్ల విధేయత"కు యేసు మనలను నడిపించు చున్నాడు. 'పశ్చాత్తాపము' అనగా పాపమునుండి మరలడము, సువార్తను విశ్వసించడము. నిజముగా, నిజాయితీగా మన జీవితాలను మార్చుకోవడము, పునరుద్దరించుకోవడము. మన దృష్టిని దేవుని వైపుకు త్రిప్పుకొని, ధైర్యముతో, దృఢసంకల్పముతో ఆయనను అనుసరించడము.

విభూతియొక్క తాత్పర్యం 'పశ్చాత్తాపపడి పాపాలకు ప్రాయశ్చిత్త పడటము'. మన రక్షణార్ధమై శ్రమలనుపొంది, మరణించి ఉత్థానుడయిన ప్రభువునకు మన హృదయాలను అర్పించి మారుమనస్సు పొందటము. మన జ్ఞానస్నాన వాగ్దానాలను తిరిగి చేయడం. క్రీస్తులో పాతజీవితమునకు మరణించి, నూతన జీవితమునకు ఉత్థానమవడము. భూలోకములోనే, దైవరాజ్యమును జీవించుటకు ప్రయాసపడి, పరలోకములో దాని పరిపూర్ణతకై ఎదురు చూడటము.

నీనెవె వాసులు (అస్సీరియా ప్రజలు) గోనె పట్టలు, బూడిదతో పశ్చాత్తాప పడిన విధముగా (యోనా. 3:5-6), మనముకూడా విభూతిని మన నుదిటిపై ధరించి మన పాపాలకోసం, చెడు జీవితముకోసం పశ్చాత్తాప పడుచున్నాము. ఈ లోక జీవితము శాశ్వతము కాదని గుర్తుకు చేసుకొంటున్నాము. మన హృదయాలను అణకువ పరచుకొంటున్నాము.

మొదటి పఠనములో, యోవేలు ప్రవక్త పశ్చాత్తాపపడవలెను అని ప్రజలను ప్రభువు ఆహ్వానముగా తెలియజేయుచున్నాడు. "ఇప్పుడైన మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు. మీ బట్టలు చించు కొనుట చాలదు. మీ గుండెలను ముక్కలు చేసి కొనుడు. మీరు ప్రభువు చెంతకు తిరిగి రండు. అతడు కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాదు. అనంతమైన ప్రేమకలవాడు. తాను నిశ్చయించు కొన్నట్లు శిక్షింపక మన్నించి వదలి వేయువాడు" (2:12-13). నిజమైన పశ్చాత్తాపము, ప్రభువు చెంతకు తిరిగిరావడం" 

రెండవ పఠనములో, పౌలు, దేవునితో సఖ్యత పడాలని అర్ధిస్తున్నాడు. ఎందుకన, "క్రీస్తు పాపరహితుడు. కాని, దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగ చేసెను. ఏలయన, ఆయనతో ఏకమగుటవలన, మనము దేవుని నీతిగ రూపొందింపవలెనని అట్లు చేసెను" (5:21). యోవేలు ప్రవక్త, పౌలు అపోస్తలుడు ఇరువురుకూడా పశ్చాత్తాపపడుటలో ఆలస్యము చేయరాదు అని తెలియజేయు చున్నారు.

విభూతి బుధవారము, ఆనందదాయకమైన ఘట్టముకూడా. ఎందుకన, నేడు, రక్షకుడైన యేసు యెరూషలేము పట్టణములోనికి విజయవంతముగా ప్రవేశిస్తున్నాడు. యేసు మన హృదయాలలోనికి ప్రవేశిస్తున్నాడా? అని ఆత్మపరిశీలన చేసుకుందాం! 

సువార్త పఠనములో చెప్పబడినట్లుగా, అనాదికాలముగా, తపస్సుకాలములో ఆచరిస్తున్న పద్ధతులు: ప్రార్ధన, ఉపవాసము, దానధర్మాలు లేదా కరుణగల కార్యాలు చేయుట. ఈ మూడు కార్యాలుకూడా మనలను దేవుని దరికి, అలాగే తోటివారి దరికి చేరులాగ చేయును. దేవుని రాజ్యముకూడా మనలనుండి ఆశించేది ఇవే. అయితే, ఈ మూడింటిని, కపటభక్తి లేకుండా చేయాలని యేసు తన అనుచరులను కోరుచున్నాడు. కపటం (గ్రీకు hypocritai) అనగా మన 'అంత:ర్గత వైఖరి, మనం చేయుకార్యాలతో పొంతన లేకపోవడం'. కపటం అనగా 'చెప్పేది ఒకటి, చేసేది మరొకటి'. కపటవేషధారి ఎవరంటే, 'అందరిముందు ఒకటి చేయడం, ఒంటరిగా ఉన్నప్పుడు మరొకటి చేయడం'. నేటి కపటవేషదారులు ఎవరంటే, హింస, అశ్లీలత, అనైతికత మొ.గు. వాటిగురించి ఫిర్యాదు చేసేవారు, వ్యక్తిగతముగా వాటిని త్యజించలేనివారు. ఒకరితోరకంగా, ఇంకొకరితోరకముగా నియమాలను వర్తించడం కపటం. కపటం రక్షణకు, పవిత్రతకు ఆటంకం. "ధర్మశాస్త్ర బోధకులకంటే, పరిసయ్యులకంటె, మీరు నీతిమంతమైన జీవితము జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరు" (మత్త. 5:20) అని యేసు స్పష్తం చేసియున్నారు. మనం చాలాసార్లు ఇతరులు చూడాలని (గ్రీకు theathenai, ఆంగ్లం theater) ఈ భక్తికార్యాలను చేస్తూ ఉంటాము. దేవుడు మాత్రమే మన అంత:ర్గత స్వభావమును, సరియైన ప్రేరణను చూస్తున్నాడని / చూడగలడని చేయాలి. దేవుడే మనకు తగిన బహుమానమును ఇచ్చును.

ప్రార్ధన: 

ప్రార్ధన అనగా 'దేవునితో సంభాషించుట'. దివ్యబలిపూజ అతి గొప్ప ప్రార్ధన. కనుక, తపస్సు కాలములో పూజాబలిలో పాల్గొందాం. దివ్యపూజ తరువాత, మనం దేవుని సన్నిధిలో ఒంటరిగా ఉండటానికి ప్రయత్నం చేయాలి: దివ్యసత్ర్పసాద సన్నిధిలో గడపటం, ఆధ్యాత్మిక పుస్తక పఠనం, జపమాల, సిలువమార్గము జపించడం.  అయితే, "కపట భక్తులవలె ప్రార్ధన చేయవలదు" (మత్త. 6:5). అందరు చూడాలని ప్రార్ధన చేయకూడదు. "గదిలో ప్రవేశించడం" అనగా మన 'హృదయములోనికి ప్రవేశించడం'. దేవుని మన హృదయములో కలుసుకుంటాం. దేవున్ని కలుసుకోవాలంటే, హృదయం పాపరహితమై ఉండాలి, అందుకే ఈ తపస్కాలం. అనేక వ్యర్ధపదములతో ప్రార్ధన చేయకూడదు. ఈ సందర్భముగానే, యేసు 'పరలోక ప్రార్ధన'ను (మత్త. 6:9-13) నేర్పించారు. క్రైస్తవ ప్రార్ధన ఉద్దేశము, తండ్రి దేవునితో సత్సంబంధములోనికి నడిపించబడటం. 'పరలోక ప్రార్ధన' వ్యక్తిగత ప్రార్ధనగాక, సంఘ ప్రార్ధన. దేవుని రాజ్యము, భూలోకములో పరిపూర్ణము కావాలని ప్రార్ధన చేయాలి. దైవరాజ్య సువార్తకు (కొండమీద బోధన) మనమంతా ప్రతిస్పందించాలి. ఎలా? మంచి కార్యాలు 'చేయడం' వలన. "చేయడం" (గ్రీకు  poieo) అనే పదం మత్త. 6:1-3లో ఐదు సార్లు ప్రస్తావించ బడింది. ఈ నీతిమంతమైన కార్యాలు పవిత్రతలో ఎదగడానికి ఎంతో అవసరము. యేసు 'ప్రభువు', 'రక్షకుడు' అని నోటితో చెబితే పవిత్రత ఆపాదించదు, మన చేతలలో, కార్యాలలో దానిని నిరూపించుకోవాలి. మన ప్రవర్తన, జీవితాలద్వారా, ఇతరులకన్న భిన్నమైనవారమని చూపించాలి.

ఉపవాసము: 

పాపాలకు ప్రాయశ్చిత్త దినము ఉపవాసదినముగా, మోషే ప్రకటించడం లేవీ. 16:29-34లో చూస్తున్నాము. దేవున్ని దర్శించడానికి ఉపవాసము చేసేవారు. మోషే 40 దినాలు ఉపవాసము ఉన్నాడు (నిర్గమ. 34:28). ఆ తరువాత యూదులకు  ఉపవాసం చేయడం సాధారణమైనది. కొంతమంది వారానికి రెండుసార్లు ఉపవాసం చేసేవారు. కొంతమంది దు:ఖము వలన ఉపవాసము చేసేవారు. ఇంకొంతమంది, సువార్తలో ప్రభువు చెప్పినట్లుగా, ఇతరులు చూడాలని ఉపవాసము చేసేవారు. ఇలాంటి ఉపవాసమును ప్రభువు ఖండించుచున్నారు (మత్త. 6:16-18). ఈరోజు ఉపవాస దినము. ఈరోజు, తపస్కాలములోని 7 శుక్రవారాలు కూడా మాంసమును తీసుకోము. ఉపవాసము అనగా మనకిష్టమైన వాటిని వదిలివేయడం. మన పంచేద్రియాలకు ఆహ్లాదపరిచే వాటిని వదులుకోవడం. దేవుని ఎదుట తననుతాను వినయముగా అర్పించుకోవడం నిజమైన ఉపవాసము. ఉపవాసము, పాపాలకు పశ్చాత్తాపమునకు, భక్తికి, పరిత్యాగమునకు సూచన. తన బహిరంగ ప్రేషిత కార్యమును ప్రారంభంచేముందు, యేసు నలుబది రోజులు ఉపవాసమున్నాడు. నిజమైన ఉపవాసం, దేవుని కొరకు, ఆయన నీతికొరకు ఆకలిదప్పులు కలిగి యుండటం.

ఉపవాసము గురించి, ప్రభువు పలుకులుగా, ప్రవక్తలు చెప్పిన  మాటలు: చదువుము. యెషయ. 58:6-7, యిర్మీ. 14:12; జెక. 7:5. నూతన నిబంధనములో, ఆధ్యాత్మిక మెరుగుదలకోసం, ఉపవాసము సిఫార్సు చేయడం చూడవచ్చు: చదువుము. అ.కా. 13:2, 14:22-23; 2 కొరి. 6:5, 11:27. శ్రీసభ పితరులుకూడా (పునీత అగుస్తీను, పునీత లియో ఘనుడు) ఉపవాసము మనలను దేవుని సాన్నిధ్యానికి, తోటివారి సాంగత్యానికి, చివరికి, దేవునిలో ఐఖ్యతకు నడిపించును అని బోధించారు. శ్రీసభ సత్యోపదేశం నం. 2043: 'నియమిత దినాల్లో ఉపవాసాన్ని, భోగ్యాహార నిషేధాన్ని, శుద్ధ భోజన నియమాన్ని పాటించాలి'.

దానధర్మాలు: 

పునీత యోహాను క్రిసోస్తం ఇలా అన్నారు, "మనకు అవసరము లేనిదీ ఏదైనా పేదవారికే చెందాలి. ఇతరులకు సహాయం చేయునప్పుడు, వారి గౌరవాన్ని కాపాడాలి. దానధర్మాలను, మొక్కుబడిగా కాక, నిజాయితీతో కూడిన విశ్వాసముతో చేయాలి. స్వార్ధపూరిత ఉద్దేశాల కొరకుగాక, దేవుని దయ, ఔదార్యములపై ఆధారపడుచున్నామను ఉద్దేశముతో చేయాలి".

ఈ మూడింటి గురించి, శ్రీసభ సత్యోపదేశం నం. 1434లో చూడవచ్చు: ఉపవాసం, దానం, ప్రార్ధన, ఈ మూడు తనకు, దేవునికి, ఇతరులకు సంబంధించిన పరివర్తనను అభివ్యక్తం చేస్తాయి. పాపపరిహారాన్ని పొందేందుకు మరికొన్ని మార్గాలను సూచిస్తాయి. అవి, పొరుగు వానితో సఖ్యత, పశ్చాత్తాపాన్ని సూచించే కన్నీళ్లు, పొరుగువాని రక్షణపట్ల అభిలాష, పునీతుల వేడుదల, ప్రేమ భావం.

No comments:

Post a Comment