యేసు నిజ దేవుడు
యేసు దేవుడు, సంపూర్ణ దేవుడు,
దేవుని కుమారుడు అనునది కతోలిక క్రైస్తవ ప్రధాన విశ్వాసము మరియు ముఖ్యమైన బోధన. ఈ
విశ్వాసాన్ని అంగీకరించని వారెవరైనా కూడా క్రైస్తవులు కానేరరు. కొన్ని బైబులు
వాక్యాలను ఆధారముగా చేసుకొని, ఆ వాక్యాల సందర్భం గ్రహించక, యేసు దేవుడు కాదని
తప్పుడు బోధనలు చేయడం జరుగుతుంది. యేసు దేవుడు, దైవకుమారుడు కాదని చెప్పేవారికి,
ఆయన కేవలం ఒక ప్రవక్త, జ్ఞాని అని చెప్పేవారికి, ఈ క్రింది ధ్యానాంశం ద్వారా
వాస్తవాన్ని తెలియజేద్దాం.
యోహాను 14:28లో యేసు, “తండ్రి
నాకంటే గొప్పవాడు” అని చెప్పారు. ఈ వాక్యమును ఆధారముగా చేసుకొని, యేసు దేవుడు కాదు
అని చెప్పడం జరుగుతుంది. కతోలిక వేదాంతశాస్త్రములో ఈ వాక్యాన్ని రెండు విధాలుగా
మనం అర్ధం చేసుకోవచ్చు. ఒకరు ఇతరులకంటే గొప్పవాడైనచో, ఆ వ్యక్తి ఇతరులకంటే భిన్నమైనవాడని
అర్ధము కాదు (మానవులు జంతువులకంటే భిన్నమైనవారు అన్నది వాస్తవం). గొప్పతనం అనేది
ఒక వ్యక్తి పరిమాణాత్మకముగా లేదా గుణాత్మకముగా గొప్పగా చేయగలగటాన్ని సూచిస్తుంది. స్పష్టమైన
ఉదాహరణను మత్తయి 11:11లో చూడవచ్చు: “మానవులందరిలో బప్తిస్త యోహాను కంటే
అధికుడగువాడు ఎవ్వడు పుట్టలేదని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. ఐనను పరలోక
రాజ్యమున మిక్కిలి తక్కువయైన వాడు అతనికంటే గొప్పవాడు.” బప్తిస్త యోహాను ఇతరులకంటే
గొప్పవాడు అని చెప్పబడినప్పటికిని అతనుకూడా ఇతర మానవులవంటివాడే. సర్వమానవాళి ఒకే
స్వభావమును కలిగియుందురు. కనుక అందరూ సమానమే!
అదేవిధముగా, ‘తండ్రి కుమారుని
కంటే గొప్పవాడు’ అని చెప్పినప్పుడు, అది వారి మధ్యనున్న బంధముపై ఆధారపడి ఉంటుంది
తప్ప, వారి స్వభావమును బట్టి కాదు. వారి స్వభావము సమానముగా ఉంటుంది. వారు (తండ్రి
దేవుడు, యేసు సుతుడు) ఇరువురు కూడా ఏక స్వభావమును కలిగియున్నారు.
బహుశా, యోహాను 14:28లో, యేసు
మానవత్వమును (ఆయన సంపూర్ణ మానవుడు కూడా) గూర్చి నొక్కిచెప్పబడుచున్నది. ఆయన
సంపూర్ణ మానవుడు కనుక, తండ్రి ఆయనకంటే గొప్పవాడు అని చెప్పడము తగినదే! ఎందుకన, ఆ
వాక్య సందర్భము ఏమనగా, తన మరణము, ఉత్థానము, శిష్యుల వద్దనుండి వెళ్ళిపోవడం గురించి
యేసు అక్కడ ప్రస్తావిస్తున్నారు. అదే యేసు, యోహాను 10:30లో సంపూర్ణ దేవునిగా, “నేనును,
నా తండ్రియు ఏకమైయున్నాము” అని చెప్పారు. కనుక, యోహాను 14:28లో యేసు మానవ స్వభావము
కలవాడై, “తండ్రి నాకంటే గొప్పవాడు” అని చెప్పారు.
యేసు
సృష్టింపబడినాడా?
దర్శన
గ్రంథము 3:14లో “విశ్వాసపాత్రుడు, సత్యవాది, సాక్షి, దేవుని సృష్టికి ఆదియును అయిన
ఆమెన్ అను వాని సందేశము” అని చదువుచున్నాము. ఇక్కడ “దేవుని సృష్టికి ఆదియును” అన్న
వాక్యాన్ని తప్పుగా అర్ధం చేసుకోబడుచున్నది. ఈ వాక్యాన్ని బట్టి కొందరు, ‘యేసు
దేవుని ప్రధమ సృష్టి కనుక యేసు దేవుడు కాదు’ అని వాదిస్తున్నారు. అయితే ఇక్కడ
అనువాదములోని తప్పును లేదా పరిమితిని గ్రహించాలి. ఇక్కడ “ఆదియును” (beginning) అని
అనువదించ బడింది, కాని గ్రీకులో వాడబడిన పదానికి సరియైన అర్ధము లేదా అనువాదము “మూలము”
(source). దర్శన గ్రంథము 21:6లో దేవుడు, “ఆల్ఫా, ఓమేగ నేనే. ఆది, అంత్యము నేనే!”
అని చెప్పాడు. ఇక్కడ “ఆది” (beginning) అని అనువదించబడింది. అంతమాత్రాన, దేవుడు
సృష్టింపబడినవాడు అని ఎంతమాత్రము చెప్పలేము కదా! కనుక దర్శన గ్రంథము 3:14లోని
వాక్యము యేసు దేవుని సృష్టికి మూలము అని అర్ధము చేసుకోవాలి, కనుక, యేసు
దేవుడు. ఈ సందర్భముగా, యోహాను 1:1-3లోని క్రీస్తుశాస్త్ర ప్రకటనను క్షుణ్ణముగా
అర్ధం చేసుకోవచ్చు: “ఆదిలో వాక్కు ఉండెను. ఆ వాక్కు దేవునితో ఉండెను. ఆ వాక్కు
దేవుడై ఉండెను. ఆయన ఆదినుండి దేవునియొద్ద ఉండెను. ఆయన మూలమున దేవుడు సమస్తమును
సృజించెను. ఆయన లేకుండ సృష్టిలో ఏదియు చేయబడలేదు” (చూడుము యోహాను 1:14). వాక్కు
సృష్టింపబడినట్లయితే, దేవుడు తననుతాను సృష్టించుకో వలసి ఉంటుంది... ఇది అసంబద్ధం కాదా!
కొలొస్సీయులకు
వ్రాసిన లేఖ 1:15లో “క్రీస్తు సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు” అని
చెప్పబడింది. ఈ వాక్యమును బట్టికూడా అనేకమంది యేసు క్రీస్తు సృష్టింప బడినవాడు అని
వాదిస్తున్నారు. ఇక్కడ క్రీస్తు (వాక్కు) సృష్టి ఆరంభము నుండియే ఉన్నవాడు అని
అర్ధం. “ఆయన అన్నింటికంటె ముందుగా ఉన్నవాడు. ఆయనయే సమస్తమునకు ఆధారభూతుడు అని కొలొస్సీ
1:16లో స్పష్టముగా చెప్పబడింది. అందుకే విశ్వాస ప్రమాణములో మనము, “ఇతడు యుగయుగములకు
పూర్వమే పితనుండి జన్మించెను. దేవునినుండి దేవునిగాను, జ్యోతినుండి జ్యోతిగాను,
నిజదేవుని నుండి నిజదేవునిగా జన్మించెను. జన్మించినవాడు, సృష్టింపబడినవాడు కాదు”
అని ప్రకటిస్తున్నాము. “దేవుడు సమస్త విశ్వమును ఆయన (యేసు క్రీస్తు) ద్వారా, ఆయన (యేసు
క్రీస్తు) కొరకు సృష్టించెను” (కొలొస్సీ 1:16).
యేసు దైవత్వమును చాటు మరికొన్ని వచనములు
-
మొదటిగా మనకు
గుర్తుకువచ్చేది, యోహాను 1:1-3 వచనాలు: “ఆదిలో వాక్కు ఉండెను. ఆ వాక్కు దేవునితో
ఉండెను. ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆయన ఆదినుండి దేవునియొద్ద ఉండెను. ఆయన మూలమున
దేవుడు సమస్తమును సృజించెను. ఆయన లేకుండ సృష్టిలో ఏదియు చేయబడలేదు.” ఈ వచనాల
ద్వారా యేసు, దేవుడు అని బహిర్గత మొనర్చబడినది.
-
యేసు జన్మించక
పూర్వమే గబ్రియేలు దూత, “మహోన్నతుని కుమారుడు, దేవుని కుమారుడు” అని పిలువబడునని
పలికెను (లూకా 1:32, 35). హీబ్రూ భాషలో యేసు అనగా ‘దేవుడు రక్షించును’. క్రీస్తు అనగా ‘మెస్సయ్య’ లేదా ‘అభిషిక్తుడు’. మన
రక్షకుడిగా ఉండుటకు దేవుడు యేసును అభిషేకించెను.
-
స్వయముగా తండ్రి
దేవుడే యేసు తన ప్రియ కుమారుడని వెల్లడించెను (మత్తయి 3:17; 17:5)
-
హెబ్రీ 1:8
“తన కుమారుని గూర్చి దేవుడు, ‘ఓ దేవా! నీ సింహాసనము నిరంతరమైనది! నీతిమంతమైన నీ
రాజదండము నీ రాజ్య పరమైనది’” ఇది దైవకుమారుడైన క్రీస్తు గురించి చెప్పబడినది కనుక,
క్రీస్తు దేవుడు అని, క్రీస్తు దైవత్వము గూర్చి గ్రంథకర్త స్పష్టము చేయుచున్నాడు.
ఈ వాక్యాలు కీర్తన 45:6-7నుండి తీసుకొనబడినవి. అచట మెస్సయ్య గూర్చి చెప్పబడినది.
-
తీతు 2:13 “సర్వోన్నతుడగు
దేవుని, రక్షకుడగు యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో
వేచియుండ వలయునని మనకు ఆ కృప తెలుపుచున్నది.”
-
యోహాను 20:28
“తోమా ‘నా ప్రభూ! నా దేవా!’ అని పలికెను.”
-
స్వయముగా
దేవుడు బయలు పరిచిన తన నామమును (“నేను ఉన్నవాడను” నిర్గమ 3:14) యేసు అనేకసార్లు
తనకు సూచించియున్నాడు. “నేనే” అన్న నామము మోషేకు బయలుపరచిన దేవుని నామమును
సూచిస్తుంది. యోహాను సువార్తలో నాలుగు సార్లు యేసు చెప్పడం చూస్తున్నాము (8:24
-“నేనే ఆయనను”, 8:58 -“నేను ఉన్నాను”, 13:19 -“నేనే ఆయనను”,18:5-6 - (“నేనే
ఆయనను”). యేసు దైవదూషణ చేస్తున్నాడని, యూదులు ఆయనపై రాళ్లురువ్వ పూనుకొన్నారు
(8:59).
-
యేసు తన
బోధనలను కూడా అధికారపూర్వకముగా బోధించాడు (మత్తయి 7:29). ప్రవక్తలు “ప్రభువు వాణి
వినిపించినది” అని ప్రభువు వాక్కును ప్రవచించారు (ఉదా. యిర్మియా 1:11, యేహెజ్కేలు
1:3). కాని, యేసు “నేను మీతో చెప్పునదేమనగా” అంటూ తన వాక్కుగా బోధించాడు (మత్తయి
5:21-28).
-
యోహాను, పౌలు,
ఇరువురుకూడా యేసు దేవునితో సమానము అని సూచించారు: “యూదులు ఆయనను చంపుటకు ఇంకను ఎక్కువగ
ప్రయత్నించిరి. ఏలయన, ఆయన... దేవుడు తన తండ్రి అని చెప్పుచు తనను దేవునికి
సమానముగా చేసికొనుచుండెనని వారు భావించిరి” (యోహాను 5:18). యేసు దైవస్వభావమును
కలిగియున్నాడు. దేవునితో తన సమానత్వమును కలిగియున్నాడు (ఫిలిప్పీ 2:6-10, మార్కు
2:28, యోహాను 5:18, 10:36). దర్శన గ్రంథము 22:13లో యేసు తాను “ఆల్ఫా ఓమేగ” అని
బయలుపరచెను.
-
యేసు దేవుడని
చెప్పుటకు అతని ఉత్థానమే గొప్ప సాక్ష్యం. ఆయన మరణమునుండి తిరిగి లేచెను. సకల
మానవాళిని రక్షించెను. “క్రీస్తే లేవనెత్తబడనిచో మన విశ్వాసము వ్యర్ధమే” (1 కొరి
15:14).
[చదువుము:
మత్తయి 14:33, 16:15-17, మార్కు 1:24, యోహాను 1:49, 11:27].
ముగింపు: యేసు క్రీస్తు ఎవరు? యేసు క్రీస్తు దేవుడు, దైవ కుమారుడు. ఆయన మన కొరకు మనుష్యావతార మెత్తెను. యేసు క్రీస్తు నిజ దేవుడా? అవును, యేసు క్రీస్తు నిజ దేవుడు. త్రిత్వములో రెండవ వ్యక్తి సుత దేవుడు. ఆయన ఆదిలో వాక్కు, పిత, పవిత్రాత్మలతో ఇప్పుడును, ఎప్పుడును ఉన్నవాడు. “ఆదిలో వాక్కు ఉండెను” (యోహాను 1:1). యేసు క్రీస్తు నిజ మానవుడా? యేసు క్రీస్తు నిజ మానవుడు. ఆయన మానవ స్వభావమును (ఆత్మ, శరీరములు) కలిగి యుండెను. మరియ తల్లి గర్భమునందు ఆయన మనుష్యావతార మెత్తెను. “వాక్కు మానవుడై మనమధ్య నివసించెను” (యోహాను 1:14). యేసు క్రీస్తు దైవ, మానవ అను రెండు స్వభావములను కలిగి యుండెను. దైవకుమారుడు ఎందుకు మనుష్యావతారమెత్తెను? పాపములనుండి మనలను విముక్తులను చేయుటకు, మోక్ష ద్వారములను తెరచుటకు, తద్వారా, మనము తండ్రి దేవునితో నిత్యజీవితము కలిగి యుండెదము.
No comments:
Post a Comment