“క్రోనోస్” మరియు “కైరోస్” (= “కాలము”) అనగా ఏమి?
ఈ వ్యాసములో (మరో నూతన సంవత్సరములోనికి అడుగిడుతున్న సందర్భముగా), కాలము గురించి ధ్యానిద్దాం. శూన్యము నుండి దేవుడు సమస్తాన్ని సృష్టించాడని బైబులు గ్రంథములో చదువుచున్నాము (ఆ.కాం. 1:2). ఎప్పుడైతే దేవుడు చీకటినుండి వెలుగును వేరు చేసాడో, కాలముయొక్క కొలతలు, విభజనలు వచ్చాయి (ఆ.కాం. 1:3-5). ఎప్పుడైతే దేవుడు భూమికి వెలుగు నిచ్చుటకు ఆకాశమున జ్యోతులగు సూర్య, చంద్ర, నక్షత్రాలను సృజించాడో, నిర్ణీత సమయాలు అనగా దినములు, సంవత్సరములు వచ్చాయి (ఆ.కాం. 1:14-15). ఈవిధముగా, ప్రపంచ ఆవిర్భావం, కాల ప్రారంభం అన్నింటికీ మూలాధారం దేవునిసృష్టి అని స్పష్టముగా అర్ధమగుచున్నది. అనగా, అన్ని కాలాలు దేవునియొక్క ఆధీనములో ఉన్నాయి.
దేవుడు ఈ సృష్టిని చేయడం మాత్రమేగాక, ఈ సృష్టిలయను ఋతువులతో కూడిన, వ్యవసాయమునకు సాధ్యపడు శీతాకాల వర్షాలు, ఎండాకాల కరువులు అను కాలచక్రముతో సృష్టిని నిలబెడుతున్నాడని, కొనసాగిస్తున్నాడని ఇశ్రాయేలు ప్రజలు గుర్తించారు. దేవునియొక్క ఈ విముక్తి చర్యలు ఇశ్రాయేలు ప్రజల గతమును నిర్దేశించి, పునరుద్దరింపబడిన అవకాశాలతో కూడిన భవిష్యత్తును వారికి అందించాయి. దేవుడు ఎందుకు కాలాన్ని లేదా సమయాన్ని సృష్టించాడు? ప్రతీ కాలానికి, సమయానికి దేవుని యొక్క ఉద్దేశ్యం ఉన్నది. “లోకములో ప్రతి కార్యమునకు అనువైన సమయము ఒకటి కలదు. దేవుడు ప్రతి పనికి దానికి తగిన సమయము నియమించెను” (ఉపదేశకుడు 3:1, 11).
బైబులులో కాలానికి “క్రోనోస్” మరియు “కైరోస్” అనే రెండు గ్రీకు పదాలు వాడబడ్డాయి. రెండింటికి ‘కాలము’ అని అర్ధమున్నను, అవి వేర్వేరు విషయాలను సూచిస్తున్నాయి.
“క్రోనోస్”: “క్రోనోస్” అనగా సెకన్లు, నిమిషాలను సూచిస్తుంది. ఇది ఫలానా సమయాన్ని సూచించే కాలము. కాల వ్యవధిని సూచిస్తుంది. లెక్కవేసుకోగలిగే సమయము అని చెప్పవచ్చు. ఉదాహరణకు రోజుకు 24 గంటలు. రోజులో మనం పనిచేయు గంటలు...మొ.వి. ఒకవిధముగా, కాలాన్ని లెక్కవేసుకోవడం కూడా ఒక్కోసారి అవసరమే! ఎందుకన మన జీవితం చాలా చిన్నది. “మా ఆయుష్కాలము ఎంత స్వల్పమైనదో మేము గ్రహించునట్లు చేయుము. దాని వలన మేము విజ్ఞులమగుదుము” (కీర్తన 90:12). “నరుల జీవితము గడ్డి పరక వంటిది” (కీర్తన 103:152; 1 పేతురు 1:24). “మీ జీవితము రేపు ఎట్లుండునో మీకు కూడా తెలియదు కదా! మీరు ఈ క్షణముండి, మరు క్షణములో అదృశ్యమయ్యెడి పొగమంచు వంటివారు” (యాకోబు 4:14). “క్రోనోస్” వాడబడిన కొన్ని బైబులు వాక్యాలను చూద్దాం: లూకా 18:4 ‘కొన్నాళ్ళు’; 1 కొరి 16:7 ‘కొంతకాలము’; 2 తిమో 1:9 ‘అనాది కాలము’; తీతు 1:2 ‘చాల కాలము’; రోమీ 16:25 ‘గతమున’; మార్కు 9:21 ‘ఎంతకాలము నుండి?’, ‘పసితనము నుండి’ దర్శన 10:6 ‘ఇక ఆలస్యం ఉండదు’.
అయితే, ఈ కాలలెక్కింపులో పడిపోయి, పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో చెప్పిన విషయాన్ని ఎన్నటికీ మరువరాదు: “మీరు ఎట్లు జీవించుచున్నారు అను దానిని గూర్చి శ్రద్ధవహింపుడు జ్ఞానహీనులవలె జీవింపకుడు. వివేకవంతులవలె జీవింపుడు. ఇవి చెడుదినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును [కాలము] సద్వినియోగము చేసికొనుడు” (5:15-16). ఇచ్చట ‘కాలము’కు పౌలుగారు ‘కైరోస్’ అన్న గ్రీకు పదమును వాడియున్నారు. మరి ‘కైరోస్’కు నిజమైన అర్ధం ఏమిటో చూద్దాం.
“కైరోస్”: “కైరోస్” సెకన్లు, నిమిషాల గురించి కాదు. మనము లెక్కలేసుకొనే కాలము కాదు. ఇది అనుకూలమైన కాలమును లేదా తగిన సమయమును లేదా దేవుడు ఏర్పాటు చేసిన కాలమును సూచిస్తుంది. కాల పరిధి కాకుండా, ఇది ఒక అవకాశము (ఎఫెసీ 5:16) అని ఇంకో మాటలో చెప్పుకోవచ్చు. దీనిని ఈ ఉదాహరణ ద్వారా విశదీకరించవచ్చు: కోవిడ్-19 ఒక కాలములో (‘క్రోనోస్’) ఉంటున్నది. ఈ కాలములో మనము ఎంతవరకు దొరికిన ప్రతి అవకాశమును (‘కైరోస్’) సద్వినియోగము చేసుకుంటున్నాము. ఈ కష్టకాలములో మనం ఏమి నేర్చుకుంటున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము అన్న దానిని సూచిస్తుంది.
“కైరోస్” వాడబడిన కొన్ని బైబులు వాక్యాలను చూద్దాం: అ.కా. 7:20 ‘ఆ సమయములోనే’; రోమీ 5:6 ‘నిర్ణీత కాలమున’; రోమీ 9:9 ‘ఇదే సమయమున’; అ.కా. 19:23 ‘ఆ కాలములోనే’. అలాగే, యేసు జీవితములో అతి ప్రాముఖ్యమైన క్షణాలను ‘కైరోస్’ సూచిస్తుంది: ఆయన ఆగమనం, దైవరాజ్య ప్రారభం, ఆయన శ్రమలు, మరణము, ఉత్థానము, ఆయన రెండవ రాకడ. దేవుడు నిర్ణయించిన కాలము [‘కైరోస్’] యేసు జీవితములో ఎలా నేరవేరినదో ఇంకొంచెం విఫులముగా చూద్దాం.
దైవ నిర్ణీత కాలము – యేసు జీవితము
యేసు క్రీస్తు ప్రభువు జీవితమున దేవుడు నిర్ణయించిన కాలమును గలతీ 4:4-5లో చూస్తున్నాము: “కాలము [‘క్రోనోస్’] పరిపక్వమయినపుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడియున్న వారిని విముక్తులను చేసెను.” యేసు జన్మము ఈ లోకములో అనుకోకుండా జరిగినది కాదు. అది దైవ ప్రణాళిక ప్రకారం జరిగినది. సృష్టి ఆరంభముననే దేవుడు యేసు జన్మకాలమును నిర్ణయించినాడు. యేసు ప్రభువు తన జీవితములో ప్రతీది కూడా దేవుని నిర్ణీత కాలము ప్రకారమే చేసియున్నాడు: “కాలము [‘కైరోస్’] సంపూర్ణమైనది (దేవుడు నిర్ణయించినటువంటి కాలము). దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది, సువార్తను విశ్వసింపుడు” (మార్కు 1:15) అని తన బహిరంగ ప్రేషితకార్యమును ఆరంభించాడు. దేవుడు నిర్ణయించిన కాలము ఆసన్నము కానప్పుడు యేసు దానిని బాహాటముగా చెప్పియున్నాడు: “నా సమయము ఇంకను రాలేదు. మీ సమయము ఎప్పుడును సిద్ధముగా నున్నది” (యోహాను 7:6) అని యేసు తన సోదరులతో చెప్పెను. యేసు దేవాలయములో బోధించుచుండగా, ఆయనను చంప యత్నించు వారు “ఆయనను పట్టుకొన యత్నించిరి. కాని, ఆయన గడియ ఇంకను రానందున ఎవడును ఆయనపై చేయివేయలేదు” (యోహాను 7:30). “గడియ” అనగా, యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన సమయము (యోహాను 13:1) అని అర్ధమగుచున్నది. కడరాత్రి భోజన సమయములో, “తండ్రీ! గడియ వచ్చినది. నీ కుమారుడు మహిమపరచుటకు నీవు నీ కుమారుని మహిమ పరుపుము” (యోహాను 17:1) అని ప్రార్ధించాడు. గెత్సేమని తోటలో యేసు, “గడియ సమీపించినది. ఇదిగో! ఇప్పుడే మనుష్యకుమారుడు పాపుల చేతికి అప్పగింపబడ బోవుచున్నాడు” (మార్కు 14:41) అని తన శిష్యులతో అన్నాడు. క్రీస్తు మరణము కూడా దేవుని నిర్ణీత కాలముననే జరిగెను: “మనము బలహీనముగ ఉన్నప్పుడే నిర్ణీత కాలమున భక్తిహీనుల కొరకై క్రీస్తు మరణించెను” (రోమీ 5:6). దేవుడు నిర్ణయించిన కాలమున మన పాపాల పరిహారబలిగా క్రీస్తు తననుతాను సిలువపై అర్పించుకొనెను. 1 తిమో 6:15 ప్రకారం, ‘యుక్త కాలమున’ యేసు మరల తిరిగి వచ్చును (చూడుము 1 పేతురు 5:6).
దైవ నిర్ణీత కాలము – మానవాళి
అ.కా. 17:26 చదువుకుందాం: “ఒక్క పురుషుని నుండియే దేవుడు అన్ని జాతుల జనులను కలిగించి, భూలోక మంతట వారిని నివసింప జేసెను. ఆయన ముందుగానే వారివారి కాల పరిమితులను, వారివారి నివసించు స్థలముల సరిహద్దులను స్థిరపరచెను.” సృష్టికి పూర్వమే దేవుడు మనందరికీ ప్రణాళికను సిద్ధము చేసాడు. నేడు మనము ఇచ్చట అనుకోకుండా లేము. దేవుని ప్రణాళిక ప్రకారము ఈ కాలములో, ఈ సమయములో ఇచ్చట ఉన్నాము. ఇది నిజముగా మనలో ఆశను నింపాలి. మన [తిరుసభ] ఐఖ్యత దేవుని ప్రణాళికగా విశ్వసించాలి.
ముగింపు: విశ్వాసులు
క్రీస్తు ఉద్భవించిన కాలమును (‘కైరోస్’) అవకాశముగా భావించి విజ్ఞతతో, వివేకముతో
సద్వినియోగ పరచుకోవలెను (ఎఫెసీ 5:16, కొలొస్సీ 4:5). నిద్రనుండి మేల్కొనవలెను.
రక్షణ లభించు సమయము మరింత దగ్గరయైనది. సత్ప్రవర్తన కలిగి జీవింపవలెను (రోమీ
13:11-14). క్రీస్తు తిరిగి వచ్చు కాలము ఎప్పుడో మనకు తెలియదు కనుక ఈ సమయమును, అయన
రాకకై వేచియుండవలెను, ఎదురుచూడవలెను, ప్రార్ధన చేయవలెను. ఈ కాలము తీర్పు దినమును
సూచిస్తుంది (మార్కు 13:33, 1 పేతురు 4:17).
No comments:
Post a Comment