సంస్కారాలు, ఉపసంస్కారాలు, కృపానుగ్రహ చర్యలు: కతోలిక శ్రీసభ, యితర క్రైస్తవ సంఘాలు, మతాల మధ్య కృపయొక్క సారూప్యతలు,
వ్యత్యాసాలు
కతోలిక శ్రీసభ, ఇతర క్రైస్తవ సంఘాలు, మతాలలో సంస్కారాలు, ఉప సంస్కారాలు, కృపానుగ్రహ చర్యలనుండి లభించు ‘కృప’ లేదా ‘దేవుని కృప’ గూర్చి ఈ వ్యాసంలో చర్చించుదాం. మానవ ఉనికియొక్క ప్రక్రియ మూడు దశలుగా చెప్పుకోవచ్చు.[1] మొదటిగా, మనిషి ‘సృష్టింపబడిన జీవి’ (Regnum Naturae). ‘సృష్టింపబడిన జీవి’గా మానవుడు రక్షణవైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. రెండవదిగా, మనిషి ‘రక్షింపబడిన జీవి’ (Regnum Gratiae). దేవుని కనికరమును బట్టి, దేవుని వరము, మానవుని స్పందనను బట్టి అతడు/ఆమె రక్షింపబడును. మూడవదిగా, మనిషి ‘గౌరవార్ధమై ఉద్దేశింపబడిన జీవి’ (Regnum Gloriae). క్రీస్తు కొరకు మహిమగల నిరీక్షణ ప్రతీ ఒక్కరిలో ఉంటుంది. ఈ నిరీక్షణ ప్రతీ ఒక్కరిని రాబోవు దినములలో దేవునిలో ఐఖ్యమగునట్లు నడిపించును. మానవుడు దేవునిలో ఐఖ్యమవుట దేవుని పరిపూర్ణ సృష్టికి పరాకాష్ట.[2]
కతోలిక శ్రీసభ సత్యోపదేశం’ ఈవిధంగా పేర్కొనుచున్నది: "నీతిమయ జీవనం దేవుని కృపావరం వల్ల లభిస్తుంది. దేవుని బిడ్డలగుటకు, దత్తపుత్రులగుటకు, దేవుని స్వభావంలో, శాశ్వత జీవనంలో భాగస్వాములగుటకు పిలుపునిచ్చిన దేవునికి సమాధాన మివ్వటానికి ఆయన అందించే వరప్రసాదం, ఉచితార్ధం, అర్హతకు తగని సహాయమే కృపావరం" (1996).[3]
ఈ మూడు దశలలో కూడా, దేవుని సన్నిధిలో మనం ఏమిటో, మనం దేనిని సాధించుటకు పిలువబడి యున్నామో దానిని బట్టి, అభినందించుటకు దేవుని కృప మనకు తోడ్పడును. మానవుడు ‘దేవుని కృపలో వసించుట’, ‘యేసునందు దేవుడు ఒసగు ప్రేమ, స్నేహములో వసించుట’ యనగా, 'యేసు క్రీస్తు వలె ఉండుట'ను సూచిస్తుంది. ఇదియే మనిషి జీవిత అంతిమ లక్ష్యం, ఉద్దేశం.
2.
కృప
సాధారణంగా, దేవుని కృప యనగా మానవుల పట్ల దేవుని మంచితనం, దయ, కరుణ. కృప యనగా మనిషి జీవనం పట్ల దేవుని ప్రేమ. సంకటమగు మానవుని పాపస్థితి, అశాశ్వతమగు జీవిత నేపధ్యంలో మనం 'కృప'ను చూడవలయును. పాపస్థితి నేపధ్యంలో 'కృప' మనకు దయ, క్షమ వలెనె కనిపించును. అశాశ్వత జీవనం, మరణం నేపధ్యంలో, 'కృప' మనకు రక్షణవలె కనిపించును. కనుక, కృప మనలను త్రిత్వైక దేవుని అన్యోన్యతలోనికి ప్రవేశింప జేస్తుంది. "క్రీస్తు కృపావరం ఉదార కానుక. దాని మూలంగా దేవుడు తన స్వంత జీవాన్ని ఇచ్చాడు. మన పాపం నుంచి స్వస్థపరచి, పవిత్ర పరచటానికి దీన్ని పవిత్రాత్మ మన ఆత్మలో ప్రవేశపెడతాడు" (కతోలిక శ్రీసభ సత్యోపదేశం 1999).[4]
ప్రప్రధమంగా, కృపావరం పవిత్రాత్మ కానుక. ఆ పవిత్రాత్మే మనలను నీతిమంతులను, పవిత్రులను చేయును (చూడుము. కతోలిక శ్రీసభ సత్యోపదేశం 2003). సంప్రదాయకంగా, 'కృప' యనగా దేవుడు తన వ్యక్తిత్వమును వ్యక్తిగతంగా మానవునితో పంచుకోవడం లేదా దేవుని వ్యక్తిగత సాన్నిధ్యాన్ని మానవునితో పంచుకోవడం. ఈవిధంగా, 'కృప' యనగా దేవుని ఆత్మ అని అర్ధమగుచున్నది; 'కృప' యనగా దేవుని ఆత్మ, దేవుని వ్యక్తిత్వం. "'దేవుని యొక్క ఆత్మ', 'దేవుని ఆత్మ', 'దేవుడు ఆత్మ' అను భావాలు సృష్టిలో దేవుడు ఆత్మగా కార్యసాధన చేయుచున్నట్లుగా మనలను ఆలోచింప జేయుచున్నది.[5] కనుక, 'కృప' యనగా దేవుడే స్వయంగా తన వ్యక్తిత్వం వెలుపల ఆత్మ రూపమున కార్యసాధన చేయుచున్నాడని మనం అర్ధం చేసుకోవచ్చు. ఈ ఆత్మ, కృప, దేవునికి-మానవునికి మధ్యగల 'ప్రేమ సంభాషణ'గా అర్ధమగుచున్నది. అయితే ఇది నైరూప్యమైనది గాక, స్పష్టమైనది. ఎందుకన, సృష్టి ఆరంభము నుండి సర్వ సృష్టిపై దేవుని ఆత్మ తిరుగాడుచూ రూపమును, జీవమును ఒసగుచుండెను.
దేవుని కృపను అర్ధం చేసుకొనే జ్ఞానమునకు మూలం ‘యూద-క్రైస్తవ పవిత్ర గ్రంధాలు’. “ప్రభువు దయకలవాడు, దేవుని కృపయే దేవుడు ఒసగు రక్షణ. అన్ని అంశాలలో మానవుడు పొందు దేవుని రక్షణయే దేవుని కృప.”[6] యూద సంప్రదాయం (పూర్వ నిబంధనము) దేవుని కృపను స్థిరమైన, నమ్మదగిన దేవుని ప్రేమగా వివరిస్తుంది. క్రైస్తవ సంప్రదాయం (నూతన నిబంధనము) దేవుడు ప్రేమ స్వరూపి, యేసు ప్రభువు దేవుని ప్రేమకు నిదర్శనం అని వివరిస్తుంది.[7] కనుక, యేసు కేవలం దేవుని ప్రేమ మాత్రమే గాక, దేవుని కృప కూడా అని మనకు అర్ధమగుచున్నది. దీనిని సిలువపై క్రీస్తు తన రక్షణ కార్యం ద్వారా సాధించి యున్నాడు. "ఉత్థాన క్రీస్తు దేవుని కృప. కృపయైన దేవుడు ఆత్మగా యేసు క్రీస్తు ద్వారా మానవ హృదయాలలో నింపబడి వాసము చేయుచున్నాడు.”[8] మానవ రక్షణ లేదా శాశ్వత జీవితం దేవునిచేత సాధించబడినది. దేవుని కృప యనగా దేవుని యొక్క ప్రేమ యేసు క్రీస్తు ద్వారా మానవాళిపై కుమ్మరింపబడుట.
రెండవదిగా, దేవుని కృపకు ప్రాముఖ్యమైన మూలం ‘దివ్యసంస్కారములను కొనియాడుట’ లేదా ‘స్వీకరించుట’. ఇది ‘శుద్ధీకరించే కృపావరం లేదా దైవతుల్యులను చేసే కృపావరం’ (కతోలిక శ్రీసభ సత్యోపదేశం 1999). ఈ కృపావరం క్రీస్తు ఒసగిన వివిధ సంస్కారాల ద్వారా, పవిత్రాత్మ ద్వారా అందజేయ బడును. దివ్యసంస్కారాల వేదాంత అధ్యయనం, ప్రతీ దివ్య సంస్కారంలో దాగియున్న పరమ రహస్యమును వివరిస్తుంది. తద్వారా, సంస్కారాలను స్వీకరించువారు దేవుడు తనను తాను వ్యక్తపరచుకొను రక్షణ కార్య సన్నిధిలో, క్రీస్తు పరమ రహస్యాలలో పాల్గొనెదరు.
మూడవదిగా, దేవుని కృపను పొందుటకు మూలం ‘ఉప సంస్కారాలు’. ఇవి చిహ్నాలు, సంకేతాలు, వ్యక్తీకరణలు, కార్యములు. ఇవి మానవ విశ్వాసమును, ఆదర్శాలను మాత్రమే గాక, వాటిలోనున్న దైవసాన్నిధ్య అంశమును కూడా తెలియ జేయును. ఆరాధనలో, మతాచారాలలోని ఉపసంస్కారాల ఉపయోగం, దేవుడు-మానవుల మధ్యనున్న సంబంధ వాస్తవమును చాటును. ఉపసంస్కారాలు బాహ్యంగా కనిపించెడు గురుతులు, చిహ్నాలు లేదా సంకేతాలు. అయినను, అవి ఆధ్యాత్మిక ప్రభావాన్ని ఒసగును. “మానవ శుద్ధీకరణకు, దైవారాధనకు దోహదం చేసే ఇంతటి శక్తిమంతమైన ఆధ్యాత్మిక సాధనాలు భౌతిక ప్రపంచంలో మరేవీ కనిపించవు” (పవిత్ర దైవార్చనా చట్టం, 61).[9]
నాలుగవదిగా, దైవకృపకు మూలం ‘ప్రత్యేక కృపానుగ్రహాలు’. వ్యక్తిగత పవిత్ర జీవితమునకు, సువార్తా విలువలను అనుసరించుటకు, క్రీస్తులో జీవితమును కలిగుయుండుటకు సబంధించి, క్రైస్తవుని క్రియలు, చర్యల ద్వారా ఈ ‘ప్రత్యేక కృపానుగ్రహాలు’ పొందబడును. “తన కృపావర కార్యంలో సహకరింపటానికి మనిషిని దేవుడు స్వచ్చందంగా ఎన్నుకున్నాడు” (కతోలిక శ్రీసభ సత్యోపదేశం 2008) అను వాస్తవం వలన ఈ కృపానుగ్రహాలు పొందబడును. ఈ ‘ప్రత్యేక కృపానుగ్రహాలు’ క్రైస్తవ జీవిత బాధ్యతలను, శ్రీసభలోని ప్రేషిత కార్యములను నిర్వహించుటకు నిర్దేశింప బడినవి.[10]
3. కతోలిక శ్రీసభలో దివ్యసంస్కారాలు – దైవ కృప
పవిత్రమైన ప్రేషిత కార్యమును కొనసాగించుటకు కతోలిక శ్రీసభకు ఉన్న ప్రధానమైన మార్గం ‘దివ్యసంస్కారాలు’. అగోచరమగు శ్రీసభ, క్రీస్తు కార్యములకు దివ్యసంస్కారాలు గోచరమగు సంకేతాలు. దివ్యసంస్కారాల ద్వారా శ్రీసభ విశ్వాసం వ్యక్తపరచబడును, దేవునకు ఆరాధన అర్పించబడును, మానవాళి శుద్దీకరింపబడును. దివ్యసంస్కారాలు క్రీస్తు ప్రభువు చేత స్థాపించబడినవి. దివ్యసంస్కారాల వలన విశ్వాసం బహిర్గత మవుతుంది, వృద్ధి చెందుతుంది, బలపడుతుంది. అంతేగాక, విశ్వాసులు శుద్ధిగావింప బడుదురు.[11] కృపావరంను ఒసగుట వలన, సద్గుణాలను వృద్ధిచేయుట వలన దివ్యసంస్కారాలు పవిత్రతను ఆర్జించును. విశ్వాసంతో దివ్యసంస్కారాలను స్వీకరించు వారికి నిత్య జీవితము వాగ్దానం చేయబడును.
‘దివ్యసంస్కారాలు కృపను ఒసగును’ అను విశ్వాసం దాదాపు మొదటి రెండు శతాబ్దాలనుండే ఉన్నది. ‘దివ్యసత్ప్రసాదము నిత్య జీవితంనకు ఔషధమని, పరిష్కారమని తద్వారా మనం మరణించాక ఎల్లకాలం యేసు క్రీస్తునందు జీవింతుమని, అలాగే దివ్యసంస్కారాలను విశ్వాసంతో స్వీకరించువారికి అవి కేవలం నిత్యజీవితంను సూచించుటేగాక దానిని ఆర్జించి పెట్టును అని పునీత అంతియోకు ఇన్యాసిగారు తెలిపియున్నారు.[12] జ్ఞానస్నానము పొందువారు పరిశుద్ధాత్మ ద్వారా ‘పునర్జన్మ’ను పొందెదరు అని పునీత అంబ్రోసుగారు తెలిపియున్నారు.[13] దివ్యసంస్కారాలు దైవకృపావరంను సమర్ధవంతంగా ఒసగును అని పునీత అగస్టీనుగారు తెలిపియున్నారు. చిహ్నములైన సంస్కారాలు విశ్వసించువారి పరిశుద్ధత కొరకు దేవుని చేత మాత్రమే ఎన్నుకొనబడి, స్థాపించబడి, సరియైన అధ్యాత్మికమగు, అర్ధవంతమగు మాటలచే అనుకరింపబడినవి[14] అని పునీత తోమాసు అక్వినాసుగారు తెలిపియున్నారు.[15] యేసు ప్రభువు స్వయంగా ఏడు దివ్యసంస్కారములను స్థాపించెనని, మన రక్షణకు తప్పనిసరియని, కృపను కల్గియున్నవని ‘ట్రెంటు మహా సభ’ (1545-1563) స్పష్టంగా పేర్కొన్నది.[16] ‘రెండవ వాటికన్ మహా సభ’ దివ్యసంస్కారాల వేదాంతమును మూడు దశలుగా విభజించినది: సామూహిక దైవార్చన, క్రీస్తు రక్షణ కార్యము, దైవవ్యాక్యార్చనందు విశ్వాసము (చూడుము. పవిత్ర దైవార్చనా చట్టం, 5-12). దివ్యసంస్కారాల ప్రధానోద్దేశం విశ్వాసులను శుద్దీకరించడం...నిజానికి దివ్యసంస్కారాలన్నీ సహజంగానే విశ్వాసులకు దేవుని కృపావరాలను ఆర్జించి పెడతాయి, కాని, దీనితోపాటు, దివ్యసంస్కారాలను ఆచరించడం ద్వారా విశ్వాసులు విశిష్టమైన కృపావరాలను స్వీకరించి ఆధ్యాత్మిక లబ్ధిని పొందగలుగుతారు, త్రికణ శుద్ధిగా దేవుని ఆరాధించ గలుగుతారు, ప్రేమ సేవాధర్మాల ప్రకారం జీవించ గలుగుతారు (పవిత్ర దైవార్చనా చట్టం, 59).
దివ్యసంస్కారాలు శుద్దీకరణకు సాధనాలు, దైవీక అనుగ్రహాలకు మూలాలు. దివ్యసంస్కారాల ద్వారా విశ్వాసులు కృపావరంను పొందు విధానం గూర్చి పునీత తోమాసు అక్వినాసు గారు వివరించి యున్నారు. మానవుడు పాపపు స్థితిలో ఉన్నాడు కనుక ఆధ్యాత్మిక విషయాలను అవగతం చేసుకొనలేడు. కనుక దివ్యసంస్కారాలు మానవుని ఆధ్యాత్మిక విషయాలవైపు నడిపించును. “పాపముచేత గాయపడిన ఆత్మకు దివ్యసంస్కారాలు ఆధ్యాత్మిక ఔషధాలుగా ఉంటాయి.”[17] పాపపు స్థితిలోనున్న మానవుడు దివ్యసంస్కారాల ద్వారా క్రీస్తుని కలుసుకొని, పాత (పాపపు) స్థితినుండి రక్షింపబడి ఆధ్యాత్మిక విషయాలను అవగతం చేసుకొనును. ఈ ‘కలయిక’ దివ్యసంస్కారాల బాహ్య సంకేతాల ద్వారా ఆపాదించు కృపానుగ్రహము వలన సాధ్యమగును. “ఈ దివ్యసంస్కారాల కృపానుగ్రహం పరిశుద్దాత్మచే కృమ్మరింపబడిన ప్రత్యేకమైన దైవీక సహాయము. ఈ దైవీక సహాయము దివ్యసంస్కారాలచేత నిర్దేశింపబడిన ధ్యేయాన్ని ఆత్మ సాధించుటకు తోడ్పడును.”[18] ఈ దివ్యసంస్కారాల కృపావర దివ్యశక్తి, క్రీస్తు మరణ పునరుత్థానాల ద్వారా (పాస్కా పరమ రహస్యం) లభించును. ఇదియే మానవుడు దైవత్వములో పాలుపంచు కోవడం. దేవుడే స్వయంగా మానవునితో జీవమునొసగు బంధాన్ని ఏర్పరచుకోవడం. ఈ బంధానికి పునాది ప్రేమ. ఈ బంధంయొక్క ధ్యేయం దైవత్వం. మానవాళి, దైవత్వంలో భాగస్థులవటం దైవీక జీవిత పరిపూర్ణం.[19]
4. కతోలిక శ్రీసభలో ఉపసంస్కారాలు – కృపానుగ్రహం
ఉపసంస్కారాలు శ్రీసభ సంస్కారాలు. వీటిద్వారా శ్రీసభ విశ్వాసులను క్రీస్తునందు లోతైన అనుబంధానికి నడిపించును. ఉపసంస్కారాలు పవిత్ర చిహ్నాలు. వాటిని శ్రీసభ స్థాపించింది. ఇవి దివ్యసంస్కారాలను పోలి ఉంటాయి. శ్రీసభ మధ్యవర్తిత్వం ద్వారా మనం పొందే ఆధ్యాత్మిక ప్రయోజనాలను, ప్రభావాలను ఇవి ప్రతీకాత్మకంగా వ్యక్తం చేస్తుంటాయి. అలాగే ఈ శ్రీసభ సంస్కారాలు దివ్యసంస్కారాలను అర్ధవంతంగా ఆచరించడానికి, సత్ఫలితాలను పొందడానికి, విశ్వాసులకు ఎంతగానో తోడ్పడతాయి; అలాగే విశ్వాసుల జీవితాల్లోని కీలకమైన ఘట్టాలు ఈ శ్రీసభ సంస్కారాల ద్వారా శుద్దీకరింప బడతాయి (పవిత్ర దైవార్చనా చట్టం, 60). ఈ దివ్యసంస్కారాలు, శ్రీసభ సంస్కారాలు విశ్వాసులను శుద్దీకరించి, క్రీస్తు మరణ పునరుత్థానాల ద్వారా లభించే దేవుని అపార కృపావరాలను వారిపై వర్షింప జేస్తాయి (పవిత్ర దైవార్చనా చట్టం, 61).
ఈ ఉపసంస్కారాలు ఏడు దివ్యసంస్కారాలకు కొనసాగింపు. మనం చేసెడు ప్రతీ కార్యములో ఈ ఉపసంస్కారాలు దేవుని కృపానుగ్రహమును తెచ్చును. ఈ ఉపసంస్కారాలు దివ్యసంస్కారాలకు వికిరణాలు. ఉపసంస్కారాలు, దివ్యసంస్కారాలు దైవీక జీవితంనకు మూలాలు. ‘దైవీక జీవితం’ అను ఒకే ఉద్దేశంను ఇవి కలిగి ఉన్నాయి. అయితే, “సంస్కారాలు అందించినట్లుగా పవిత్రాత్మ కృపావరాన్ని ఉపసంస్కారాలు అందివ్వ లేవు; శ్రీసభ ప్రార్ధన ద్వారా, కృపావరాన్ని అందుకోటానికి మనలను సిద్ధంచేసి దానికి సహకరింపటానికి మనల్ని సముఖుల్ని చేస్తాయి” (కతోలిక శ్రీసభ సత్యోపదేశం 1670).
మన జీవితంలో శక్తియుతమైన దివ్యానుగ్రహాలను పొందుటకు ఉపసంస్కారాలు ఆధారాలు. అతి ప్రాపంచిక క్రియలను సైతము శుద్ధిచేయు శక్తి వాటికి ఉన్నది. ఉపసంస్కారాలు దివ్యసంస్కారాల ఫలాలను అందుకోటానికి, పలువిధ జీవన పరిస్థితులను పవిత్రం చేయటానికి మానవులను సిద్ధంచేస్తాయి. శ్రీసభ ఉపసంస్కారాలను కేవలం అద్భుతమైన ఉత్తరీయాలకు, జపమాలకు పరిమితం చేయక, సర్వ మానవ కార్యాలకు పరివేష్టించునట్లు చేయును. కతోలిక శ్రీసభ ఉపసంస్కారాలలో వ్యక్తులపై, భోజనంపై, వస్తువులపై, స్థలాలపై దీవెనలు ప్రధమ స్థానంలో ఉంటాయి.[20] ఈ దీవెనలు దేవుని కార్యములు మరియు కృపను బట్టి దైవ స్తుతిని, దైవానుగ్రహాలను ప్రతీ ఒక్కరు సువార్తానుసారముగా వినియోగించుకొనుటకు శ్రీసభ ప్రార్ధనలను కలిగియున్నవి. క్రీస్తునందు, క్రైస్తవులను తండ్రి దేవుడు “ప్రతి ఆధ్యాత్మిక దీవెన”తో దీవించును (కతోలిక శ్రీసభ సత్యోపదేశం 1677, 1671); రెండవదిగా, కొన్ని దీవెనలకు శాశ్వత ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే, దేవునికోసం అవి వ్యక్తులను ప్రతిష్టిస్తాయి; లేదా కొన్ని వస్తువులను లేదా స్థలాలను అర్చనలో ఉపయోగింపటానికి ప్రతిష్టిస్తాయి. వ్యక్తుల దీవెనల్లో యాజకాభిషేక సంస్కారాన్ని తీసికోరాదు (కతోలిక శ్రీసభ సత్యోపదేశం 1672);[21] మూడవదిగా, విశ్వాసుల్లో ఉన్న భక్తి మార్గాలను, క్రైస్తవ జీవితంను పోషించి, సుసంపన్నం చేయు ప్రజాహిత భక్తి (కతోలిక శ్రీసభ సత్యోపదేశం 1674).[22] ఈ ఉపసంస్కారాలన్నియు కూడా దేవునితో మానవ సంబంధ వాస్తవాన్ని తెలియ జేయును. అలాగే పాపవిముక్తిని పొందే అవకాశమును కలుగజేయును.[23] అయితే ఉపసంస్కారాల యెడల విశ్వాసం తప్పనిసరి.
5. కతోలిక శ్రీసభ - యితర కృపానుగ్రహ చర్యలు
మన రక్షణకు అవసరమైన కృపానుగ్రహాలను పొందుటకు ఇతర మార్గాలు –
ఆధ్యాత్మిక పరోపకార క్రియలు, శారీరక పరోపకార క్రియలు,[24]
క్రైస్తవ జీవితంను మానవ, వేదాంత సుగుణాలకనుగుణంగా జీవించడం మరియు పవిత్రాత్మ
వరాలు, ఫలాలు.[25] దేవునికి
అవిధేయత వలన మానవుడు పాపపు స్థితిలో ఉన్నాడు. ఈ స్థితినుండి విముక్తి యగుటకు,
ఉత్తమ ఏకైక మార్గమైన క్రీస్తు రక్షణ కార్యం మినహాయించి, కతోలిక శ్రీసభ అనేక
మార్గాలను నిర్దేశిస్తుంది. ఈ మార్గాల ద్వారా అవసరమయ్యే కృపానుగ్రహాలను మన రక్షణ
లేదా నిత్యజీవిత ప్రయాణంలో పొందుటకు సహాయపడును (కతోలిక
శ్రీసభ సత్యోపదేశం 1810-1811). ఈ
కృపానుగ్రహ క్రియలు ప్రధమంగా దేవుని, ఆతర్వాత కృపానుగ్రహ చర్యలను చేపట్టు
వ్యక్తిని, సత్క్రియలనుండి లబ్దిపొందు వ్యక్తిని మహిమ పరచుటకు, గౌరవించుటకు నెరవేర్చ
బడుచున్నాయి. కాబట్టి “మంచి పనుల యోగ్యత మొదటి స్థానంలో దేవునికే... ఎందుకన,
కృపావర క్రమంలో ముందడుగు దేవునిదే...ఆతర్వాతే విశ్వాసులకు ఆపాదింపబడుతుంది...
పవిత్రాత్మతోను, ప్రేమతోను ప్రేరేపితులమై, మన పవిత్రీకరణ, ఇతరుల పవిత్రీకరణ,
కృపావరం, ప్రేమల వృద్ధి, శాశ్వత జీవన సాధన కోసం అవసరమయ్యే కృపావరాలకు యోగ్యులం
కాగలం (కతోలిక శ్రీసభ సత్యోపదేశం 2008-2010).
ఈ సత్క్రియలను చేయుటకు దేవుడు మనకు తన కృపావరము నొసగును అని దృఢంగా విశ్వసించుదము. దేవుడు ఈ సత్క్రియలను మన జీవితంలో ఉంచి స్వేచ్చాసంకల్పంతో కూడిన మన ప్రత్యుత్తరమును ఆహ్వానించును. మనం సానుకూలంగా స్పందించినప్పుడు, దేవుని సంతోష పెట్టుదము. అప్పుడు దేవుడు తన కృపను, మనం చేయు సత్రియలను బట్టి, ఆయన స్నేహపూర్వక ఎదుగుదలలో కొనసాగుటకు మరింత కృపావరము నొసగును. “క్రియాశీలియైన ప్రేమలో క్రీస్తుతో మనల్ని సమైక్య పరుస్తూ, మన చర్యలకు అలౌకిక గుణానికి, ఫలితంగా దేవుని ముందు, యితరుల ముందు వాటి యోగ్యతకు హామీనిస్తుంది (కతోలిక శ్రీసభ సత్యోపదేశం 2011). అతి ముఖ్యంగా, మనం గుర్తుంచు కోవలసినది, “క్రైస్థవ ప్రార్ధనా లక్ష్యం ఈ కృపావరాలు, ప్రయోజనాల సాధనయే. యోగ్యమైన చర్యలకు అవసరమైన కృపావరాన్ని ప్రార్ధన అందిస్తుంది (కతోలిక శ్రీసభ సత్యోపదేశం 2010).
6. యితర క్రైస్తవ సంఘాలు – దివ్య సంస్కారాలు, ఉపసంస్కారాలు,
కృపానుగ్రహ చర్యలు
‘ద్వితీయ లియోన్స్ సమావేశం’ (1274) నుండి శ్రీసభ స్థాపించబడిన ఏడు దివ్యసంస్కారాలను విశ్వసించి నమ్మకంగా కొనియాడుతుంది. ఇదే విషయాన్ని ‘ఫ్లోరెన్స్ సమావేశం’ (1439), మరీ ముఖ్యంగా ‘ట్రెంటు మహాసభ’ (1547) పునరుద్ఘాటించాయి. అయితే, 16వ శతాబ్దంలో పాశ్చాత్య దేశాలలో శ్రీసభలో పెద్ద చీలిక జరిగినప్పుడు, ఏడు దివ్యసంస్కారాలపట్ల విశ్వాసంలో, కొనియాడు క్రమంలో, వేదాంతంలో, సిద్ధాంతంలో కూడా ఎన్నో విభేదాలు చోటు చేసుకున్నాయి. అనేకమైన ప్రొటస్టంటు వర్గాలు ఏడు దివ్యసంస్కారాలలో జ్ఞానస్నానమును, ప్రభు భోజనమును మాత్రమే అంగీకరిస్తున్నాయి. మిగతా వర్గాలు ఏ ఒక్క దివ్య సంస్కారమును కూడా గుర్తించుట లేదు. వాటిని కేవలం దైవకృప నొసగని చిహ్నాలుగా మాత్రమే లేదా కొన్ని క్రైస్తవ అంశాలలో ‘విధులు’గా పరిగణిస్తున్నాయి. సువార్తలో మన ప్రభువైన క్రీస్తు కేవలం రెండు సంస్కారములను మాత్రమే స్థాపించాడని, అవి ‘జ్ఞానస్నానము’, ‘ప్రభు భోజనము’ అని ఆంగ్లికన్ సంఘం తన ‘సామాన్య ప్రార్ధన గ్రంథం’లో పేర్కొన్నది. లూథరన్ సంఘం జ్ఞానస్నానము, ప్రభు భోజనము, పాపసంకీర్తనమను దివ్య సంస్కారాలను ఆమోదిస్తున్నది. ఈ రెండు లేదా మూడు దివ్యసంస్కారాలను కొనియాడు పద్ధతిలోను, నిర్వహించే క్రమంలోను కతోలిక శ్రీసభకు, యితర వర్గాలకు మధ్యన వ్యత్యాసాలు ఉన్నాయని మనం గుర్తించాలి. అందుకే, వివిధ సంఘాలలో, జ్ఞానస్నానము, దివ్య సత్ప్రసాదము పట్ల ‘క్రైస్తవ సంబంధమైన’ సమస్యలు ఈనాటికి కూడా ప్రబలంగా ఉన్నాయి.
ఉపసంస్కారాల విషయంలో అనేక ప్రొటస్టంటు వర్గాలు కతోలిక శ్రీసభ విధానంపట్ల విభేదాలు కలిగి యున్నాయి. బాహ్యపరమైన ఒక వస్తువు ఏవిధంగా ఆధ్యాత్మిక శక్తిని పొందును అనునది వారి విబేధన. విమర్శిస్తున్నప్పటికినీ, వారి పరిచర్యలలో అనేక ఉపసంస్కారాల భావాన్ని ఉపయోగిస్తూనే ఉన్నారు. ఉదాహరణకు, అష్టనిక్షేపణ ద్వారా వ్యక్తులను ఆశీర్వదించడం, దుష్టశక్తుల బారినుండి కాపాడుటకు యిండ్లపై ప్రార్ధనలు చేయడం, స్వస్థతా ప్రార్ధనలో తైలాలతో వ్యక్తులను అభిషేకించడం, భోజనమునకు ముందు ప్రార్ధన చేయడం...మొ.వి. అలాగే, వారి ఆరాధనలో, వేడుకలలో జలము, స్లీవ, బైబులు, ద్రాక్షారసము, వ్యక్తులు, తైలాలు మొ.గు వాటిని ఉపయోగిస్తున్నారు. ఎదేమైనప్పటికినీ, ఉపసంస్కారాలలోని కృపానుగ్రహం, విశ్వాసం పట్ల ప్రొటస్టంటు వర్గాలు కతోలిక శ్రీసభ బోధనతో స్థిరంగా విభేదిస్తున్నాయి.
ప్రొటస్టంటు వర్గాల వేదాంతం, సిద్ధాంతం విశిష్టంగా నాలుగు భావాలపై నిర్మితమై యున్నది: కృప మాత్రమే (sola gratia), విశ్వాసం మాత్రమే (sola fide), క్రీస్తు మాత్రమే (solus Christus), దైవవాక్కు మాత్రమే (sola Scriptura). తదనుగుణంగా, క్రీస్తు మరియు వాక్కునందు విశ్వాసమును పాటించుటలో, ప్రకటించుటలో, అలాగే క్రైస్తవ బోధనలలో, ప్రొటస్టంటు వర్గాలు సనాతనస్తులు, అక్షరాల అనుసరించువారు. ఈవిధంగా, ప్రొటస్టంటు సంఘాలలోని ‘కృపానుగ్రహ చర్యలు’ సువార్త విలువలు మరియు క్రీస్తుపై ఆధారపడి యున్నవి.
7. యితర మతాలలో సంస్కారాలు, ఉప సంస్కారాలు, కృపానుగ్రహ
చర్యలు
సాధారణంగా, సంస్కారాలు దైవసాన్నిధ్యాన్ని కోరు మతాచారాలను సూచిస్తున్నాయి. ప్రతీ మతంలోనూ విశ్వాసుల ఆధ్యాత్మిక ఆకాంక్షలను తీర్చుటకు, వ్యక్తిగత, సామూహిక జీవితంలో కొన్ని ముఖ్య ఘట్టాలను, ఉదాహరణకు, మతంలో చేరిక, యౌవ్వనంలోకి అడుగిడుట, వివాహము, మరణము మొ.గు వాటికి సంస్కారాలు సూచికలుగా ఉన్నాయి. ఈ ఘట్టాల అంత:ర్గత భావాలను సంస్కారాలు ప్రదర్శిస్తూ ఉంటాయి. ఈలోకంలో దేవుని కార్యమును, మానవాళి పట్ల దేవుని ప్రేమను సూచించుటకు విశ్వాసులకు, విశ్వాస సంఘానికి సంస్కారాలు ఎంతగానో ఆచరాణాత్మకమైనవి, అర్ధవంతమైనవి, అలాగే మంచి అవగాహన మార్గాలు.
భారతావనిలోని నాలుగు ప్రధానమైన హిందు, ముస్లిం, బౌద్ధ, జైన మత సంస్కృతులను క్లుప్తంగా విశ్లేశించుదాం.
హిందూ మతం
వేదాలలో కనిపించెడు సంస్కృత పదం ‘సంస్కార’ (Saṁskāra) ఆంగ్ల భాషలో “సాక్రమెంట్” (Sacrament), తెలుగులో “సంస్కారము” అన్న పదాలకు సమానమైనది. దీని అర్ధం, “అంత:ర్గత ఆధ్యాత్మిక కృపను సూచిస్తూ బాహ్యంగా కనిపించెడు సాంగ్యము లేదా చర్య.”[26] ఒక వ్యక్తి తన శరీరమును, మనస్సును, బుద్ధిని శుద్దీకరించుకొని తద్వార సంఘంలో సంపూర్ణ సభ్యునిగా కాదలచుటకు నిర్వహించు అభ్యంగన సాంగ్యము.[27] హిందూ మతంలో ‘సంస్కారాలు’ మానవాభివృద్ధిలో వివిధ దశలలో నిర్వహించెడు ఆచారాలు. ఈ ఆచారాలలో అనేకమైన చర్యలు నిర్వహించ బడతాయి. ఇవి పరివర్తన ఆచారాలు. అనగా ఒక వ్యక్తి తనలోని మాలిన్యమును, పాపమును తీసివేసి తన జీవితంలో వచ్చు ఒక ఘట్టానికి లేదా తరువాతి దశ కొరకు సంసిద్ధ పరచుటకు నిర్దేశింప బడినవి. పూర్వజన్మలోగాని, ప్రస్తుత జన్మలోగాని సంక్రమించిన పాపకళంకమును తీసివేయ బడక, ఆశుద్దుడుగా నున్న వ్యక్తి ఎలాంటి ఆచార కర్మలచేత ప్రతిఫలమును పొందలేడు. ఈ క్లిష్టమైన స్థితినుండి సంస్కారాలు ఒక వ్యక్తిని శుద్దీకరించును. ఈవిధంగా, ఒక వ్యక్తిలో దాగియున్న సామర్ధ్యాలను వెలికి తీయుటకు సంస్కారాలు అవసరమని అర్ధమగుచున్నది.
హిందూ వేదాలలో ప్రముఖంగా 16 సంస్కారాలు ఉన్నాయి. వీటిని ‘పొడశ’ సంస్కారాలు అంటారు. ఇవి ఐదు భాగాలుగా విభజింప బడినవి: 1. పూర్వజనన సంస్కారాలు – ‘గర్భాదానము’ (గర్భమును శుద్ధిచేయు చర్య), ‘పుమ్ సవనం’ (మగ పిల్లవాడు పుట్టాలని చేసెడి చర్య), ‘సీమంతోన్నయనం’ లేదా ‘సీమంతం’ (మాతా గర్భ రక్షణ కొరకు చేయు చర్య). 2. బాల్య సంస్కారాలు – ‘జాతకర్మ’ (బొడ్డు తాడు కోసే చర్య), ‘నిష్క్రామణ’ (శిశువును తొలిసారి ఇంట్లోనుండి బయటకు తీసుకొని రావడం), ‘నామ కరణం’ (పేరు పెట్టడం), ‘అన్న ప్రాశన’ (శిశువుకు తొలిసారి ఘనాహారం తినిపించడం), ‘చూడా కరణ’ (పుట్టు వెంట్రుకలు తీయుట), ‘కర్ణవేదం’ (చెవులు కుట్టించుట). 3. విద్యా సంస్కారాలు – ‘విధ్యారంభం’ (అక్షరాభ్యాసం), ‘ఉపనయన’ (విద్యాభ్యాస ఆరంభం), ‘వేదారంభం’ (వేదాభ్యాసం), ‘కేశాంతం’ (మొదటిసారి గెడ్డం గీయించుట), ‘సమావర్తన’ లేదా ‘స్నాన’ (చదువు ముగించుట). 4. వివాహ సంస్కారం – పెళ్ళి. 5. అంత్యేష్టి సంస్కారం – అంత్య క్రియలు.[28] ఈ సంస్కారాలు జీవితంలోని దోషాలను తొలగించి సన్మార్గంలో నడిపించి సభ్యతను కలిగిస్తాయి. దేహాన్ని శుద్ధిచేయు లేదా బాగుచేయు చర్యలే సంస్కారాలు. సంస్కారాలు జీవిత కాలమును – గర్భధారణ నుండి మరణం వరకు – నిర్వహించబడును. ఒక వ్యక్తిని శుద్ధిపరచి సద్గుణాలను పెంపొందించును. అయితే, ప్రస్తుత కాలంలో కేవలం మూడు సంస్కారాలే ఆచారణలో ఉన్నాయి: ‘ఉపనయన’, ‘వివాహ’, ‘అంత్యేష్టి సంస్కారం’.[29]
సంస్కారాల ప్రత్యేకమైన ఉద్దేశాలు ఎనిమిది: 1. శత్రు ప్రభావాలను, చెడు ఆత్మలను, అశుభప్రదమైన వానిని తొలగించుట, 2. అనుకూలమైన ప్రభావాలను ఆకర్షించుట, 3. భౌతిక శ్రేయస్సు కొరకు విజ్ఞప్తి చేయుట, 4. భావోద్వేగ భావాలను వ్యక్తపరచుట, 5. ఆధ్యాత్మిక, సాంస్కృతిక శ్రేయస్సు పొందుట, 6. నైతిక శ్రేయస్సు పొందుట, 7. వ్యక్తిగత అభివృద్ధిని సాధించుట, 8. ‘సాధన’ ద్వారా ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పొందుట.[30]
సంస్కారాలను నిర్వహించు క్రమంలో అనేకమైన వస్తువులను ఆరాధనా సాంగ్యాలలో ఉపయోగిస్తూ ఉంటారు. ఉదాహరణకు జలం, అగ్ని, పవిత్ర స్థలాలు, ప్రార్ధనలు, ఆశీర్వాదాలు, బలి వస్తువులు, ఆదేశాలు, చిహ్నాలు, ఇంద్రజాలం, నిషేధాలు మొ.వి.[31]
హిందూ మతంలోని ‘యితర కృపానుగ్రహ చర్యలు’ రెండు: ధర్మ (సరైన జీవన విధానం), కర్మ (సరైన చర్యలు). మోక్షమును పొందుటకు, ధర్మ, కర్మ అను ఈ రెండు సూత్రాలు చాలా ప్రాధమికమైనవి. సరైన జీవన విధానమునకు, అనేకమైన సరైన చర్యలు అవసరం. ఈ సూత్రాలు ఆధ్యాత్మిక ధ్యేయాలను సాధించును. ఈ లోకమున, ఆధ్యాత్మిక లోకమున అర్హత సాధించునట్లు చేయును.
ముస్లిం మతం
ముస్లిం మతం ఏకదైవ మతం. అల్లా అను ఒకే దేవుని విశ్వసిస్తుంది. అల్లాయే సృష్టికర్త, పాలకుడు, దయ, కరుణ గలవాడు. ఒక వ్యక్తి క్రియలను బట్టి తీర్పు చేయు న్యాయాధిపతి. మహమ్మద్ ప్రవక్త దేవుని వార్తాహరుడు. మహమ్మద్ ప్రవక్త మత విలువలకు ప్రతిరూపం, సంఘానికి ఆదర్శమూర్తి.
‘సంస్కారం’ అను పదానికి సాధారణ అర్ధంలో మూర్తీభవించే సంస్కారాలు ముస్లిం మతంలో కనిపించవు. ముస్లిం మతం ప్రాముఖ్యంగా ఐదు ‘మూల స్తంభాలపై’ లేదా నియమాలపై మరియు ఆరు ఆచారాలపై నిర్మించబడి యున్నది. ఇవి వ్యక్తిగత ధర్మాన్ని, కార్యాన్ని దైవ చిత్తానికి సమర్పించుటకు తోడ్పడును. ఐదు ‘మూల స్తంభాలు’: 1. ‘శహద’ (అల్లా ఒక్కడే దేవుడని విశ్వాసమును ప్రకటించుట), 2. ‘సలత్’ (రోజుకు ఐదుసార్లు నమాజ్ చేయుట), 3. ‘జకత్’ (ధర్మం చేయుట), 4. ‘సామ్’ (రంజాన్ సమయంలో ఉపవాసం చేయుట), 5. ‘హజ్’ (‘మక్కా’ పవిత్ర స్థలమును సదర్శించుట). ఆరు ఆచారాలు: 1. శుద్ధి ఆచారాలు, 2. ‘కితాన్’ (సున్నతి), 3. ‘అకికాహ్’ (శిశు జన్మకు జంతు బలి), 4. ‘ఈద్ అల్-ఫితర్’ (రంజాన్ ఉపవాసంలో చేసెడు చర్యలు), 5. ‘ఈద్ అల్-అధా’ (అబ్రహాము బలి గౌరవార్ధమై నిర్వహించు ఆచారాలు), 6. అంత్యక్రియల ఆచారాలు. దిన, సంవత్సరీక ఆచారాల ద్వారా ముస్లింలు అల్లా అనుభూతిని పొందెదరు.
అల్లా యొక్క 99 నామాలను లేదా గుణాలను వల్లించుటకు ‘మిస్బాహ’ (పూసల దండ)ను కొన్నిసార్లు ఉపయోగిస్తారు. దీనిని ఖచ్చితంగా ఉపసంస్కారమని చెప్పలేము కాని మత ప్రాముఖ్యతను సాధించుటకు ఉపయోగపడును. అలాగే ‘ఖురాన్’, ‘షరియ’ (ఇస్లామిక్ చట్టం) వారి సంపూర్ణ జీవిత విధానాన్ని ప్రతిబింబిస్తాయి. వీటిని విధేయించుట ద్వారా ముస్లింలు నిత్య జీవితంకు నిర్దేశింప బడెదరు.
బౌద్ధ మతం
బౌద్ధ మతం నాస్తిక మతం అని పిలువబడుతుంది. మానవ ఆత్మ స్వీయ విముక్తి కొరకు నిర్దేశింప బడినది. పునర్జన్మ చక్రం నుండి విడుదలైన ఆత్మ అంతిమ విధియైన ‘నిర్వాణం’ పొందును. బౌద్ధమత ప్రాధమిక బోధనల సారాంశం: నాలుగు జీవిత సత్యాలు మరియు అష్టాంగ మార్గం. నాలుగు జీవిత సత్యాలు: 1. ‘సర్వం దు:ఖం’ (జీవితం దు:ఖంతో కూడుకొని యున్నది. బాధలు అనేవి సాధారణం), 2. ‘దు:ఖ సముదయ్’ (దు:ఖమునకు కారణం కోరిక, అజ్ఞానం, అనుబంధాలు), 3. ‘దు:ఖ నిరోధ’ (దు:ఖమును నివారించవచ్చు), 4. ‘దు:ఖ నిరోధ గామిని ప్రతిఫల’ (దు:ఖమును నివారించుటకు సరైనది అష్టాంగ మార్గం). అష్టాంగ మార్గం: 1. ‘సమ్యక్ జీవనం’ (తనకు లేదా ఇతరులకు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని కీడు కలుగకుండా జీవించడం), 2. ‘సమ్యక్ కర్మము’ (హానికలిగించే పనులు చేయకుండుట), 3. ‘సమ్యక్ వచనము’ (నొప్పించకుండా, వక్రీకరించకుండా సత్యమును మాట్లాడటం), 4. ‘సమ్యక్ సాధన’ (ప్రగతికోసం మంచి ప్రయత్నం చేయడం), 5. ‘సమ్యక్ స్మృతి’ (స్వచ్చమైన దృష్టితో విషయాలను స్పష్టంగా చూడగలగడం), 6. ‘సమ్యక్ సమాధి’ (రాగద్వేషాలకు అతీతంగా మనసును స్థిరపరచుకొని సత్యాన్ని అన్వేషించడం), 7. ‘సమ్యక్ దృష్టి’ (భ్రమపడకుండా ఉన్నది ఉన్నట్లుగా చూడగలగడం), 8. ‘సమ్యక్ సంకల్పము’ (ఆలోచించే విధానంలో మార్పు). బుద్ధుడు తన బోధనలలో ‘కర్మ సిద్ధాంతం’నకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చాడు. ‘నిర్వాణం’ లేదా ‘పూర్వజన్మ చక్రం నుండి విడుదలయే’ మానవ జీవిత ధ్యేయమని బోధించాడు.
కతోలిక శ్రీసభలోవలె బౌద్ధమతంలో సంస్కారాలుగాని, ఉపసంస్కారాలుగాని లేవు. బహుశా, అష్టాంగ మార్గమును కృపానుగ్రహ చర్యతో పోల్చవచ్చు. దైవీక జీవితంలో పాల్గొనుటకు, ‘నిర్వాణం’ లేదా ‘నిత్యజీవితం’ పొందుటకు కృపానుగ్రహం ఒక అత్యవసర సాధనము.
జైన మతం
జైన మతం బౌద్ధ మతానికి సమకాలీనం. బౌద్ధమతం వలెనె, జైనమతం కూడా మోక్షం పొందుటకు ‘సత్ జ్ఞానము’, ‘సద్భక్తి’, ‘సదాచారము’ అను మూడు ప్రాముఖ్యమైన సాధనాల గూర్చి బోధిస్తుంది. వీటిని సాధించుటకు జైన మతం ఐదు గొప్ప వ్రతములను లేదా సూత్రములను పాటించాలని తెలియజేయు చున్నది: 1. ‘అహింస’ (జీవ హింస చేయరాదు), 2. ‘సత్య’ (అసత్యమాడరాదు), 3. ‘అస్తేయ’ (దొంగతనం చేయరాదు), 4. ‘బ్రహ్మచర్య’ (బ్రహ్మచర్యము అవలంభించుట), 5. ‘అపరిగ్రహ’ (ఆస్తిపాస్తులు ఉండరాదు).
జైనులు రాగద్వేషాలను, సుఖదు:ఖాలను, బంధాలను, విరక్తత్వమును జయించి, జ్ఞానమును, దృష్టిని, సత్యమును, సామర్ధ్యమును నిగూఢపరచి ఆత్మను కర్మలనుండి విముక్తి గావించెదరు. జైనమతం అహింసను అన్నివిధముల పాటించాలని, సకల జీవరాసుల పట్ల దయ కలిగియుండాలని బోధిస్తుంది.
జైనులు సృష్టికర్తయైన దేవున్ని విశ్వసించరు. కాని, అనేక దేవుళ్ళకు ఆరాధనలు సల్పెదరు. వారిపేరిట ఉత్సవములను కొనియాడెదరు. జైనమతంలో సంస్కారాలుగాని, ఉపసంస్కారాలుగాని లేవు. కేవలం ఐదు సూత్రాలతో సదాచారమును కల్గియున్న యెడల ఆత్మ పరకాయ ప్రవేశంనుండి తప్పించుకొని మోక్షమును సాధించుటకు కృపానుగ్రహమును పొందును.
8. సంస్కారాలు, ఉపసంస్కారాలు, కృపానుగ్రహ చర్యలలో కృప సారూప్యతలు
కతోలిక శ్రీసభ
1. సంస్కారాలు,
ఉపసంస్కారాలు, కృపానుగ్రహ చర్యలు కృపానుగ్రహమును కలిగియున్నవి. అవి విశ్వాసులకు
కృపానుగ్రహమును సంపాధించును. ఇవి దైవీక జీవితమునకు మూలం. వీటి ఏకైక ఉద్దేశ్యం –
మోక్షం, దైవీక జీవితం, నిత్య జీవితం.
2. ఇవి
విశ్వాసమునకు లక్ష్యాలు. వీటిద్వారా శ్రీసభ విశ్వాసులకు బోధించి వారిని పోషించును.
3.
ప్రధానంగా ఇవి ఒకే ఉద్దేశ్యము కొరకు ప్రేరేపించ బడినవి – ఆరాధనలు, భక్తి ద్వారా
విశ్వాసులను శుద్దీకరించడం.
4. విశ్వాసులకు
అవసరమైన కృపానుగ్రహమును ఒసగుటకు ఇవి భౌతిక, మానవ, ఆధ్యాత్మిక అంశాలతో ప్రమేయం
కలిగి యుండును.
5.
ఆత్మల రక్షణార్ధమై త్రిత్వైక దేవుని ప్రణాళిక రక్షణాయుత నిమిత్తమై అవసరమైన
కృపానుగ్రహాలకు అవి దోహదం చేయును.
6.
ధారాళమైన దయను, క్రీస్తు రక్షణ బహుమానమును, విశ్వాసుల స్వేచ్చను, నమ్మికను, దైవకృపను
ముందుగానే ప్రతిపాదిస్తూ, అవసరమైన కృపానుగ్రహాలను సాధించును.
7. ఇవి
కృపానుగ్రహాలకు ఆధారాలు కనుక, దేవుడు-మానవుల మధ్యన సంబంధాన్ని, సమాచారమును
నిర్మించును.
8.
విశ్వాసులు ఆశించు కృపానుగ్రహాలను సాధించుటకు, తద్వారా ఇంకా ఉన్నతమైన కృపానుగ్రహాల
స్వీకరణకు సంసిద్ధం చేయుటకు ఒకదానికొకటి సహాయకంగా ఉండును. దైవసాన్నిధ్యమును, ఉపసంస్కారాల
ఆధ్యాత్మిక ప్రభావాలను గ్రహించుటకు కృపానుగ్రహ చర్యల వలన విశ్వాసులకు అవి
ఉపయుక్తంగా ఉండును. అలాగే, సంస్కారాలు సూచించు కృపను స్వీకరించుటకు ఉపసంస్కారాలు విశ్వాసులను
సంసిద్ధం చేయును.
9. ఇవన్నియుకూడా కృపానుగ్రహాల యొక్క సార్ధకమైన సంజ్ఞలు.
కతోలిక శ్రీసభ – యితర క్రైస్తవ సంఘాలు
1.
కతోలిక శ్రీసభ వలె అనేక ప్రొటస్టంటు సంఘాలు, క్రీస్తు స్థాపించిన, ఆజ్ఞాపించిన
(మత్తయి 28:19-20) ‘జ్ఞానస్నానము’, ‘ప్రభు భోజనము’ అను రెండు దివ్యసంస్కారాలను
మాత్రమే విశ్వసిస్తున్నాయి, కొనియాడుతున్నాయి.
2.
పాపమును కడిగివేయుటకు, ఆధ్యాత్మిక పునరుద్దీకరణ కొరకు జ్ఞానస్నానము అభిషిక్తుడైన
యాజకునిచే కొనియాడ బడుచున్నది.
3. సంస్కారాలు
దేవుని కృపను వ్యక్తపరచునని, విశ్వాసమును కొనసాగించునని అనేక ప్రొటస్టంటు సంఘాల
నమ్మకం.
4.
జ్ఞానస్నానము దేవుడు-మానవుల మధ్యనున్న నిబంధనకు గుర్తు. ఇది యేసు క్రీస్తునందు
విశ్వాసులను ఐఖ్యం చేయును. శ్రీసభలో / సంఘంలో సభ్యులను చేయును.
కతోలిక శ్రీసభ – యితర మతాలు
1. ఆధ్యాత్మికతను,
నిత్యజీవమును పొందుటకు సర్వ మతాలు కొన్ని ఆచారాలను కలిగియున్నవి.
2.
కతోలిక క్రైస్తవులవలె హిందువులు సంస్కారాలను, ముస్లింలు ఆరు ఆచారాలను జీవిత వివిధ
దశలలో నిర్వహిస్తూ ఉంటారు. దుష్ట ఆత్మలను పారద్రోలుటకు, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను
పొందుటకు, తద్వారా సాంఘిక, సాంస్కృతిక, నైతిక శ్రేయస్సు కొరకు నిర్వహిస్తూ ఉంటారు.
3. ఈ
సంస్కారాల ఆచారాల లక్ష్యం, ఉద్దేశ్యం – ‘నిత్య జీవితమును పొందుట’. హిందూ, జైన
మతాలలో ‘మోక్షం’ అని, బౌద్ధమతంలో ‘నిర్వాణం’ అని, క్రైస్తవ, ముస్లిం మతాలలో ‘నిత్య
జీవితం’ అని పిలువబడుచున్నది.
4.
కతోలిక క్రైస్తవులవలె, మంచి ఆధ్యాత్మిక జీవితమును జీవించుటద్వారా, దైవానుభూతి పొందుటకు,
యితర మతాచారాలు ‘ప్రస్తుత జీవితము’ను ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నాయి.
9. సంస్కారాలు, ఉపసంస్కారాలు, కృపానుగ్రహ చర్యలలో కృప వ్యత్యాసాలు
కతోలిక శ్రీసభ
1. కృపానుగ్రహాలను
ఆర్జించుటలో సంస్కారాలు, ఉపసంస్కారాలు, కృపానుగ్రహ చర్యల మధ్యన వ్యత్యాసాలు
ఉన్నాయి. ఏడు దివ్య సంస్కారాలను క్రీస్తు స్థాపించాడని, అవి బైబులు గ్రంథమున
మూలాన్ని కలిగియున్నవని కతోలిక శ్రీసభ బోధిస్తుంది. ఇవి చేయబడిన కార్యమునుండి
పనిచేయును (ex opere operato) ఉపసంస్కారాలు,
కృపానుగ్రహ చర్యలను శ్రీసభ స్థాపించినది. ఇవి వానియందుంచు విశ్వాస
సద్గుణమునుండి (ex opere
operantis) మరియు శ్రీసభ ప్రార్ధన ద్వారా
(ex opere operantis Ecclesiae) పని చేయును.
2.
దివ్యసంస్కారాలు క్రీస్తు పాస్కా పరమరహస్యాలపై, శ్రీసభ విశ్వాసముపై, సంప్రదాయము,
రక్షణ, నిత్యజీవితముపై కేంద్రీకృతమై ఉన్నాయి. ఉపసంస్కారాలు, కృపానుగ్రహ చర్యలు
మతభావాలపై, విశ్వాసుల శ్రేయస్సుపై కేంద్రీకృతమై ఉన్నాయి.
3. దివ్యసంస్కారాలు
దీక్షను, స్వస్థతను, సమైఖ్యతను సూచిస్తున్నాయి. వానినుండి లబ్దిపొందు వారిని
శుద్దీకరించును. ఉపసంస్కారాలు, కృపానుగ్రహ చర్యలు, విశ్వాసుల భక్తిని ప్రాతినిధ్యం
వహిస్తున్నాయి.
4. దివ్యసంస్కారాలు
క్రైస్తవ జీవిత వివిధ దశలలో స్వీకరింప బడుచున్నవి. ఉపసంస్కారాలు, కృపానుగ్రహ
చర్యలకు ఎలాంటి ఆంక్షలు లేవు.
5.
దివ్యసంస్కారాలు అవి సూచించు పద్ధతిలోనే పవిత్రాత్మ కృపావరములను కృమ్మరించును. ఉపసంస్కారాలు,
కృపానుగ్రహ చర్యలు భక్తి, విశ్వాస ఆధ్యాత్మిక ఫలాలను ఫలించును.
6. దివ్యసంస్కారాల
ప్రభావం పవిత్రాత్మ శక్తిచేత, క్రీస్తు వాగ్దానంచేత ఉండినది. ఉపసంస్కారాలు,
కృపానుగ్రహ చర్యల ప్రభావం మన విశ్వాసంపై, వానిపై కృమ్మరింపబడు ఆశీర్వాదాలపై
ఆధారపడి యున్నవి.
కతోలిక శ్రీసభ – యితర క్రైస్తవ సంఘాలు
1. దివ్యసంస్కారాలు
యేసు ప్రభువుచే స్థాపించబడినవి; అవి దేవుని కృపావరమును ఒసగును. అనేక ప్రొటస్టంటు
సంఘాలు కేవలం జ్ఞానస్నానము, ప్రభు భోజనము అను రెండు సంస్కారాలను మాత్రమే
ఆచరిస్తున్నాయి. వీనిని కేవలం ఆచార సూచనలుగా విశ్వాసంద్వారా అంగీకరించాయి.
2. ప్రొటస్టంటు
క్రైస్తవుల ప్రకారం దివ్యసంస్కారాలు దేవుని కృపావరమును ఒసగవు.
3.
అనేక ప్రొటస్టంటు సంఘాలు దివ్యసంస్కారాలలోని కృపావర ప్రభావముకన్న, వాటిని
స్వీకరించువారి విశ్వాసమునకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నాయి.
కతోలిక శ్రీసభ – యితర మతాలు
1. కతోలిక
శ్రీసభ క్రీస్తు రక్షణ కార్యము, మనిషి స్వేచ్చాసంకల్పం ద్వారా సాధించబడిన దేవుని
కృపావరమునకు ప్రాముఖ్యతను ఇస్తుంది. యితర మతాలు కేవలం మనవ ప్రయత్నాలకు మాత్రమే
ప్రాముఖ్యతను ఇస్తున్నాయి.
2. యితర
మతాలలో కృపానుగ్రహాలు ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి అనుభావిక ప్రయత్నాల వలన సాధింపబడు
చున్నవి. దేవుని కృపావరాలు మరణం తర్వాత కూడా, యితర విశ్వాసుల ప్రార్ధనల వలన
సాధింపబడునని కతోలిక శ్రీసభ బోధిస్తుంది.[32]
3.
దేవుని కృపావరాలు దైవమానవ తలంపు వలన పొందబడునని కతోలిక శ్రీసభ విశ్వాసం. యితర
మతాలు దైవ కృప కేవలం మానవ ప్రయత్నాలు, చర్యలపై మాత్రమే ఆధారపడునని
విశ్వసిస్తున్నాయి.
ముగింపు
మన విశ్వాస ప్రయాణంలో దైవకృపానుగ్రహం ముఖ్యమైన భాగమని నమ్మకంగా చెప్పవచ్చు. ప్రస్తుత జీవితంలోను, శాశ్వత జీవితంలోను మన విశ్వాసం కొనసాగుటకు కావలసిన దైవకృపావరాలను పొందుటకు సంస్కారాలు, ఉపసంస్కారాలు, కృపానుగ్రహ చర్యలు మనకు తోడ్పడును. అదేవిధంగా, యితర క్రైస్తవ సంఘాలలోను, యితర మతాచారాలలోను విశ్వాసమును, భక్తిని వ్యక్తపరచు కొన్ని చర్యలను గమనింపవచ్చు.
రచన: గురుశ్రీ జోసఫ్ తంగరాజ్, MHM
అనువాదం: గురుశ్రీ ప్రవీణ్ కుమార్ గోపు, OFM Cap.
[1] కార్ల్ బాత్ క్రైస్తవునికి-సమాజానికి మధ్యన ఉన్న చేరికను,
దూరమును విశ్లేషించడానికి, త్రిముఖ దృక్పధం గూర్చి చర్చించాడు. చూడుము. Rinse H. Reeling Brouwer, Karl Bath and Post-Reformation
Orthodoxy (England, Ashgate Publishing Ltd., 2015), p. 223.
[2] చూడుము. కొలొస్సీ. 1:27.
[3] చూడుము. యోహాను. 1:12-18, 17:3; రోమీ. 8:14-17.
[4] Roger Haight, Sin and Grace,
in Fiorenza F.S., and Galving, John P., Eds. Systematic Theology: Roman
Catholic Perspective, 2nd Edition (Fortress Press, Minneapolis,
2011), pp. 402-403.
[5] Roger Haight, Sin and Grace,
p. 408.
[6] Roger Haight, Sin and Grace,
pp. 405-406.
[7] చూడుము. 1 యోహా. 4:7-21.
[8] Roger Haight, Sin and Grace,
p. 406.
చూడుము. రోమీ. 5:5.
[9] పవిత్ర దైవార్చనా చట్టం, నం. 61. ద్వితీయ వాటికన్ మహాసభ
అధికార పత్రాలు, అనువాదం గుంటూరు ఏసుపాదం (సికింద్రాబాద్, జీవన్ ప్రింట్, 2009).
[10] చూడుము. రోమీ. 12:6-8.
[11] The Code of Canon Law, 840; పవిత్ర దైవార్చనా చట్టం, 59.
[12] Alister E. McGrath, Christian
Theology: An Introduction, 5th edition (London, Blackwell
publishers, 2011), p. 407.
[13] Alister E. McGrath, Christian
Theology, p. 407.
[14] ఈ కారణం చేతనే అధికారంగా
ఆమోదింపబడిన ప్రకరణ పుస్తకాలను మాత్రమే, సంస్కారాల నిర్వహణకు ఉపయోగించాలి.
[15] Paul J. Glenn, A Tour of the
Summa of St. Thomas Aquinas (Bangalore, Theological Publications, 2011), p.
364.
[16] Michael Glazier and Monika K.
Hellwig, Ed., The Modern Catholic Encyclopedia (Minnesota, Liturgical
Press, 2004), p. 732.
[17] Paul J. Glenn, A Tour of the
Summa of St. Thomas Aquinas, p. 364.
[18] Paul J. Glenn, A Tour of the
Summa of St. Thomas Aquinas, p. 365.
[19] See St. Thomas Aquinas, Summa Theologiae, III,
q. 60. 3.
[20] తీర్దాలు, జపమాల, సిలువ, ఉత్తరీయాలు, అందమైన దేవాలయాలు,
చిత్రాలు, పటాలు, స్వరూపాలు, ఆశీర్వదింపబడిన క్రొవ్వొత్తులు, ప్రకరణ వస్త్రాలు,
పుస్తకాలు, పవిత్ర తైలాలు...మొ.వి. ఉపసంస్కారాలు బైబులు గ్రంథమూలాలు: జలం –
నిర్గమ. 14:15-22, 17:6-7, యెహోషు 3:14-17, 2 రాజు. 5:10, యెహెజ్కె 47:1-12, మత్త.
3:13-17, యోహాను. 19:34, 3:5; తైలాలు – యాకో 5:14,15, మత్త. 6:13; పునీతులు,
వస్తువులు – 2 రాజు. 13:20-21, అ.కా. 15:5, 19:11-12, మార్కు. 9:20, 6:56,
లూకా. 8:44, మత్త. 14:36.
[21] మఠాధిపతి, మఠాధిపతురాలు, పాఠకులు, బలి పీఠ౦ పరిచారకులు,
ఉపదేశులు...మొ.గు వారు.
[22] పునీతుల పట్ల వస్తువుల పట్ల గౌరవ భావం, పుణ్యక్షేత్ర
దర్శనం, తీర్ధయాత్రలు, ప్రదక్షణలు, శిలువ మార్గం...మొ.వి.
[23] Michael Glazier and Monika K.
Hellwig, Ed., The Modern Catholic Encyclopedia, p. 733.
[24] బోధించడం, సలహాలివ్వడం, ఒదార్చటం, ఊరడించడం, క్షమించటం,
ఇతరుల తప్పులను ఓపికతో భరించడం ఆధ్యాత్మిక పరోపకార క్రియలు. ఆకలితోనున్న వారికి
అన్నం పెట్టడం, ఇల్లులేని వారికి ఆశ్రయం కల్పించటం, బట్టలులేని వారికి
వస్త్రాలివ్వడం, రోగులను, ఖైదీలను సందర్శించడం, మరణించిన వారికి సమాధి చేయడం
లాంటివి శారీరక పరోపకారం. చూడుము. కతోలిక శ్రీసభ సత్యోపదేశం 2447.
[25] చూడుము. కతోలిక శ్రీసభ సత్యోపదేశం 1804-1832. మానవ సుగుణాలు
మౌలిక సుగుణాలు అని కూడా పిలువబడుచున్నవి. ఇవి నాలుగు: వివేకం, న్యాయం, స్థైర్యం,
సంయమనం (ఆత్మ నిగ్రహం). వేదాంత సుగుణాలు: విశ్వాసం, ఆశాభావం (నిరీక్షణం), ప్రేమ.
పవిత్రాత్మ వరాలు, ఫలాలు ఏడు: జ్ఞానము, అవగాహనము, సదూపదేశము, స్థైర్యము, తెలివి,
భక్తి, దైవభయము.
[26] Raj Bali Pandey, Hindu Saṁskāra: Socio-Religious Study of the
Hindu Sacraments (Delhi, Motilal Banarsidass,
1969), p. 15.
[27] Raj Bali Pandey, Hindu Saṁskāra, p.
16.
[28] See for further details and description of these
varied Saṁskāra, Raj Bali Pandey, Hindu Saṁskāra, pp.
48-274.
[29] Raj Bali Pandey, Hindu Saṁskāra, p. 9.
[30] Raj Bali Pandey, Hindu Saṁskāra, pp.
26-34.
[31] Raj Bali Pandey, Hindu Saṁskāra, pp. 38-47.
[32] “క్రైస్తవ ప్రార్ధనా లక్ష్యం ఈ కృపావరాలు, ప్రయోజనాల సాధనయే.
యోగ్యమైన చర్యలకు అవసరమైన కృపావరాన్ని ప్రార్ధన అందిస్తుంది” (కతోలిక శ్రీసభ
సత్యోపదేశం 2010).
No comments:
Post a Comment