యేసుక్రీస్తు ఉత్థాన మహోత్సవము,

 యేసుక్రీస్తు ఉత్థాన మహోత్సవము, 3 ఏప్రిల్ 2021
(
అర్దరాత్రి పూజ)

జయహో! యేసు నేడు లేచెను, జయహో!
'రణం' అనేది ఓ యుద్ధం.
ఆ యుద్ధాన్ని గెలవడమే ఉత్థానం.
ఆ యుద్ధాన్ని గెలిచాడు ఓ సమర యోధుడు
ఆ సమర యోధుడే ... యేసు.
అల్లెలూయ!!!
నలభై రోజుల కఠోర ఉపవాస ప్రార్ధనలు...
సైతానుచే శోధింపులు...
క్రూరమైన బాధలు...
సిలువపై ఘోరమైన మరణం...
మూడవ రోజు ఉత్థానం.

అదే క్రీస్తు పునరుత్థాన పండుగ సారాంశం. విశ్రాంతి దినము గడచి పోగానే యేసుకు సుగంధ ద్రవ్యములను పూయడానికి మగ్దల మరియమ్మతోపాటు మరో ఇద్దరు స్త్రీలు యేసు సమాధి వద్దకు బయలుదేరారు. కాని, అప్పటికే, ఆ పెద్ద సమాధి రాతి తొలగించ బడటము చూసి వారు ఆశ్చర్యచకితులయ్యారు. అక్కడే తెల్లదుస్తులతో ఉన్న ఓ వ్యక్తి వారిని గమనించి వారితో “కలవర పడకుడి. మీరు వెదకుచున్న యేసు ఉత్థానమయ్యాడు. మీరు వెళ్లి ఈ వార్తను వారి శిష్యులకు తెలియ జేయుడు” అని అనెను (మార్కు 16:1-7).

సిలువపై యేసు మరణం ఎవరికోసం? ఎందుకీ త్యాగం? నీ కోసం - నా కోసం - యావత్ మానవాళి పాప ప్రక్షాళన కోసం! ఒక్క మాటలో చెప్పాలంటే మానవాళిపై తనకెంత ప్రేమ ఉందో తన రెండు చేతులు చాచి సిలువపై మరణిస్తూ మనకు చూపించాడు క్రీస్తు ప్రభువు. ఇంతకన్న గొప్ప నిదర్శనం వేరొకటి మనకు అవసరం లేదు.

సిలువను మోస్తున్నప్పుడు అతనిపై వేసిన నిందలు, శారీరక వేదన వర్ణింపతరం కానివి. “అతనిని సిలువ వేయుడు, సిలువ వేయుడు” అని బిగ్గరగా వినిపించిన కేకలు అతని గుండెల్లో గునపములా గుచ్చుకొన్నాయి. ఇన్ని వేదనలను, చీవాట్లను భరించడం ఎవరితరం అవుతుందో చెప్పండి! ఆ నిందలన్నింటినీ భరిస్తూ, ఆకాశానికి భూమికి మధ్య సిలువపై రక్తపు మరకలతో వ్రేలాడుతూ “తండ్రీ, వీరిని క్షమింపుము. వీరు చేయుచున్నదేదో వీరికి తెలియదు” (లూకా 23:34) అని తన తండ్రికి మొరపెట్టుకొన్నాడు. అల్లెలూయ! ప్రేమంటే ఇదే!

యెష 54:10, “పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లినను నా కృప నిన్ను విడచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు” అని యావే ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఈ వచనం దైవప్రేమకు ఓ చక్కటి ప్రతిరూపం. మరణం అనేది సమాప్తం కాదు. అది ఓ క్రొత్త జీవితానికి ఆరంభం మాత్రమే! ఈనాటి పఠనంలో పునీత పౌలు రోమీయులకు వ్రాసిన లేఖలో ఇలా అంటున్నారు: “ఆయన మరణములో మనము ఆయనతో ఏకమై ఉండినచో, ఆయన పునరుత్థానములో కూడా మనము తప్పక ఆయనతో ఏకమై ఉందుము. మనము క్రీస్తుతో మరణించి యున్నచో ఆయనతో జీవింతుమని విశ్వసింతుము. మీరును మీ విషయమున అట్లే పాపమునకు మరణించితిమనియు, క్రీస్తు యేసుతో ఏకమై దేవుని కొరకై జీవించుచున్నామనియు తలంపవలెను” (రోమీ 6:5,8-11).

క్రీస్తు తన ఉత్తానము ద్వారా యావత్ మానవాళికి రక్షణను ప్రసాదించాడు. తన ఉత్థానం ద్వారా పాపాన్ని పటాపంచలు చేశాడు. “మానవాళి యొక్క రక్షణకై దేవుని కృప ప్రత్యక్ష మయ్యెను” (తీతు 2:11). ఉత్తాన క్రీస్తు యొక్క ప్రేమ, దీవెనలు మనందరితో ఉండునుగాక!

యేసు మృత్యుంజయుడు

ప్రియ సహోదరీ, సహోదరులారా! మీ అందరికి ప్రభువు ఉత్థాన మహోత్సవ శుభాకాంక్షలు! ఈ పవిత్ర రాత్రియందు మనము క్రీస్తు ఉత్థాన మహోత్సవాన్ని కొనియాడు చున్నాము. పాపము, మరణముపై క్రీస్తు విజయాన్ని కొనియాడు చున్నాము. ఈ రాత్రి చాలా అద్భుతమైన రాత్రి, ఎందుకన, ఈ రాత్రిన మనం విజయం, విముక్తి, రక్షణ, స్వతంత్రం, స్వస్థత పొందిన రాత్రి. 

క్రీస్తు ఉత్థాన (ఈస్టర్) పండుగ మనందరికీ, ఆనందకరమైన, సంతోషకరమైన, ఆశీర్వాదకరమైన మహోత్సవం. ఇది అన్ని పండుగలలో కెల్ల గొప్ప పండుగ. ఈ పండుగను మనం అర్ధవంతముగా జరుపుకొనని యెడల, మనం కొనియాడే మిగతా పండుగలన్నీ కూడా వృధాయే! ఎందుకన,
(1).
మన క్రైస్తవ విశ్వాసానికి క్రీస్తు ఉత్థానం మూలాధారం. యేసు దేవుడని చెప్పడానికి సాక్ష్యం. అందుకే, పౌలుగారు ఇలా అంటున్నారు, “క్రీస్తే లేవనెత్తబడనిచో మా బోధనా వ్యర్ధమే! మీ విశ్వాసమును వ్యర్ధమే!” (1కొరి 15:14). కనుక మనం చేయవలసినది ఏమిటంటే, “నీ నోటితో యేసు ‘ప్రభువు’ అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తెనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింప బడుదువు” (రోమీ 10:9).
(2). క్రీస్తు ఉత్థానం మన ఉత్థానానికి హామీ. లాజరు సమాధివద్ద యేసు మార్తమ్మకు ఈవిధముగా హామీ ఇచ్చాడు, “నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును” (యోహాను 11:25). కనుక, "ఆయన మరణములో మనము ఆయనతో ఏకమై యుండినచో. ఆయన పునరుత్థానములో కూడా మనము తప్పక ఆయనతో ఏకమై యుందుము" (రోమీ 6:5). 
(3). క్రీస్తు ఉత్థానం ఈలోక శ్రమలలో, బాధలలో, మనకు ఆశను మరియు ప్రోత్సాహాన్ని కలిగించును. 
క్రీస్తు ఉత్థానం జీవితముపై ఓ గొప్ప నమ్మకాన్ని మనకు కలిగిస్తుంది. ఉత్థాన క్రీస్తు సాన్నిధ్యం మనలో, శ్రీసభలో, సంఘములో, దివ్యసత్ప్రసాదములో ఉన్నదని నమ్ముచున్నాము కనుక మన జీవితాలకు అర్ధం చేకూరుతుంది.
(4). ఈరోజు మనం దేవుని కృపలోనికి తిరిగి పునరుద్దరింప బడినాము. ఈరోజు ప్రభువు మరణపు సంకెళ్ళను తెంచి ఈ లోకానికి వెలుగును, జీవమును ఒసగిన రోజు! మరణించిన యేసు పునరుత్థానమైన రోజు! అందుకే ఈరోజు, దేవుని చేత ఎన్నుకొనబడిన ఆశీర్వాదకరమైన రోజు ఈ ఈస్టర్ రోజు!

మనం ప్రభువును ఎక్కడ వెదుకుచున్నాము? ఖాళీ సమాధిలోనా? సువార్తలో వింటున్నట్లుగా స్త్రీలు సమాధిని చూచుటకై వచ్చిరి, కాని వారికి ఖాళీ సమాధి కనబడెను. “భయపడకుడు. మీరు సిలువ వేయబడిన యేసును వెదుకుచున్నారు. ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లు సమాధినుండి లేచెను. ఆయన మృతులలో నుండి లేచెనని శిష్యులకు తెలుపుడు” (మత్త. 28: 5-7) అని దూత వారికి చెప్పెను. ప్రభువునకు సమాధి అవసరము లేదు, ఎందుకన ఆయన మృత్యుంజయుడు. ఆ సమాధి ఆయనది కూడా కాదు. తన శిష్యుడు, ధనికుడు అయిన అరిమత్తయియవాసి యోసేపు సమాధి! సమాధి ప్రభువును కలిగియుండలేక పోయింది, ఎందుకన, ఆయన పునరుత్థానమై బయటకు వచ్చాడు. మార్గమధ్యలో ఆ స్త్రీలకు ఉత్థాన క్రీస్తు దర్శనమిచ్చెను. “మీకు శుభము. భయపడవలదు. మీరు వెళ్లి, నా సోదరులతో గలిలీయకు పోవలయునని చెప్పుడు. వారచట నన్ను చూడగలరు” (మత్తయి 28:9-10) అని వారితో చెప్పెను.

మనం విన్నటువంటి పఠనాలు మానవ చరిత్రలో దేవుడు తన రక్షణ ప్రణాళికను ఎలా కొనసాగించాడో అన్న విషయాన్ని తెలియజేయు చున్నాయి. దేవుడు తరతరాలుగా తన ప్రజల పట్ల నమ్మకపాత్రుడుగా ఉన్నాడు. ప్రజల అవిశ్వాస సమయములో, కష్ట సమయములో వారి వెన్నంట ఉండి వారిని నడిపించాడు. ఈ రక్షణ ప్రణాళిక క్రీస్తు ఉత్థానములో అంతిమ ఘట్టానికి చేరుకుంటుంది. కనుక, మనం ప్రభువును వెదకవలసినది ఖాళీ సమాధిలో కాదు! చారిత్రాత్మకమైన ఘట్టాన్ని కొనియాడటం కాదు! క్రీస్తు ఉత్థానాన్ని విశ్వాస దృక్పధముతో చూడాలి. కనుక, ఉత్థాన క్రీస్తును వెదకవలసినది నీలోనే! ఆయన నీలోనే కొలువై యున్నాడు. ఉత్థాన ఆనందము, సంతోషము, ఆశీర్వాదము మనలోనే ఉన్నది. సువార్తానందము మనలోనే ఉన్నది. ఆ ఆనందాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని ఇతరులతో పంచుకోవాలి. ఇతరులకు ప్రకటించాలి.

ఈరోజు, మరణం జీవానికి గుర్తుగా మారింది! సిలువ లేనిది కిరీటం లేదు, మరణం లేనిది జీవం లేదు, నిరాశ లేనిది ఆశ లేదు, చీకటి లేనిది వెలుగు లేదు. అందుకే ఈ రోజు వెలుగు క్రీస్తు జ్యోతిపండుగగా కొనియాడు చున్నాము. నేనే వెలుగు” (యోహాను 8:12) అని క్రీస్తు పలికిన పలుకులే ఈరోజు పండుగ సారాంశం!

కనుక, మనం ఉత్థాన క్రీస్తు ప్రజలుగా జీవించాలి. అనగా పాపము అనే సమాధిలో ఉండక సంతోషము, సమాధానముతో జీవించాలి. ఉత్థాన క్రీస్తు సాన్నిధ్యాన్ని అంతటా చూడగలగాలి. ఉత్థాన క్రీస్తు వెలుగును, ప్రేమ, దయ, కరుణ, త్యజింపు, సేవతో కూడిన మన జీవితాలద్వారా మనచుట్టూ ప్రసరింప జేయాలి.

ఈరోజు మనం కొనియాడే పండుగలో, నాలుగు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి: 1. అగ్ని లేదా వెలుగు, 2. నీరు, 3. దైవవాక్కు మరియు 4. రొట్టె. వీటిని ధ్యానించుదాం!

1. అగ్ని/వెలుగు: ఈస్టర్ జాగరణ సాంగ్యాన్ని చీకటిలో - నూతన అగ్నితో ప్రారంభించాము. ఆ అగ్నినుండి ఈస్టర్ - పాస్కా క్రొవ్విత్తిని వెలిగించాము. ఈ ఈస్టర్ క్రొవ్విత్తి లేదా పాస్కా క్రొవ్వొత్తి ఉత్థాన ప్రభువును సూచిస్తుంది. “లోకమునకు వెలుగును నేనే. నన్ను అనుసరించు వాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును (యోహాను 8:12) అని యేసు చెప్పి యున్నాడు. అందుకే ఈస్టర్ క్రొవ్విత్తి నుండి వెలుగును మన క్రొవ్వొత్తులను వెలుగించు కున్నాము. అనగా, క్రీస్తు మన జీవితాలను ప్రకాశింప జేయుచున్నాడు. క్రీస్తు వెలుగును మనం పొందు చున్నాము. “మీరు లోకమునకు వెలుగై యున్నారు” (మత్తయి 5:14) అని ప్రభువు శిష్యులతో చెప్పియున్నాడు. మన వెలుగు క్రీస్తు నుండి వచ్చును, మన జీవితం క్రీస్తు నుండి వచ్చును. క్రీస్తు ఈ వెలుగును తన మరణ, పునరుత్థానాల ద్వారా కొనివచ్చాడు.

వెలుగు (క్రీస్తు) మన హృదయాలను, జీవితాలను ప్రకాశింప జేయును, వెలుగింప జేయును, జ్ఞానోదయం కలుగ జేయును. మనలోనున్న అంధకారమును తొలగించును. మనలోనున్న అజ్ఞానమును తీసివేయును. దేవుడు మనలను తన రూపములో, పోలికలో సృష్టించాడు. అదే దేవుడు మనలను తన వారిగా పిలుచుకున్నాడు. ఈలోకము మనలను ఎన్నుకొన లేదు, పిలువ లేదు. దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువు ద్వారా ఎన్నుకున్నాడు, పిలుచు కున్నాడు. క్రీస్తు జ్యోతి వలన, మనం అసత్యము నుండి సత్యమునకు, అంధకారము నుండి వెలుగునకు, మరణము నుండి జీవమునకు నడిపింప బడినాము.

వెలుగు (క్రీస్తు) విశ్వాసానికి, నమ్మకానికి సూచన. చీకటి అంటే మనందరికి భయం. అందుకే దీపాలను వెలిగిస్తాము. యేసు మనందరికీ నిజమైన వెలుగు. ఆయన మనకు ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తాడు. వెలుగుగా ఆయనే మన మార్గ చూపరి. ఆయననే మనం అనుసరించుదాం. ఆయన ఎప్పటికి మనలను అంధకారము లోనికి త్రోసి వేయడు. ఆయనే మన వెలుగు, నమ్మకము.

వెలుగు (క్రీస్తు) ఆనందానికి సూచన. “ప్రభువు నందు ఎల్లప్పుడును ఆనందింపుడు. మరల చెప్పుచున్నాను. ఆనందింపుడు!” (ఫిలిప్పీ 4:4) అని పౌలుగారు చెప్పియున్నారు. యేసు ప్రభువే మన ఆనందం, సంతోషం. ఈలోకం మనకు ఏవిధముగను ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వలేదు. డబ్బు, పదవి, ప్రతిష్ట, గొప్పతనం, అధికారం... ఏదీ కూడా నిజమైన సంతోషాన్ని ఇవ్వలేవు. నిత్యమైన, నిజమైన ఆనందమును యేసు ప్రభువు మాత్రమే ఇవ్వగలడు. “మీ హృదయములు సంతోషించును. మీ సంతోషమును మీ నుండి ఎవడును తీసివేయడు” (యోహాను 16:22) అని ప్రభువు చెప్పి యున్నారు.

2. నీరు: రోమీయులకు వ్రాసిన పత్రిక 6:3-11లో జ్ఞానస్నానము గురించి వింటున్నాము. “మనము అందరమూ క్రీస్తు యేసు నందు జ్ఞానస్నానము పొందాము. ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలుపంచు కున్నాము. తద్వారా, ఒక క్రొత్త జీవితమును గడుపుచున్నాము. మనలో పాత స్వభావము, పాపము నశించినది.” మన జ్ఞానస్నానము ద్వారా, మనము రక్షింప బడినాము మరియు రూపాంతరము చెందినాము, పునరుద్దరింప బడినాము. యిస్రాయేలు బానిసత్వము నుండి వాగ్ధత్త భూమికి ఎర్ర సముద్రము గుండా నడిపింప బడినారు. అలాగే ఈరోజు మనము క్రీస్తు మరణము, ఉత్థానము ద్వారా స్వతంత్రము లోనికి నడిపింప బడుచున్నాము. మనము ఇక పాపమునకు బానిసలము కాము. క్రీస్తు నందు మనము స్వతంత్రులము. పాపమునకు మరణించి క్రీస్తుతో సజీవులము అయ్యాము.

నీరు శుభ్రపరచే స్వభావము కలది. మనము నీటితో చేతులను శుభ్ర పరచు కుంటాము. నిత్య జీవజలమైన క్రీస్తు మనలను పవిత్ర పరచును. మన జ్ఞానస్నానమందు మనము పవిత్ర పరచ బడినాము. ఆదిపాపము మనలో నుండి తీసివేయ బడినది.

నీరు మన దాహమును తీర్చును. దాహము గొన్నప్పుడు, ఏ యితర పానీయాలు మన దాహాన్ని తీర్చలేవు. ఒక్క గ్లాసు మంచి నీరు కోసం చూస్తూ ఉంటాము. ఈరోజు మనం దేనికోసం దాహంకలిగి యున్నాము? డబ్బు, అధికారం, పదవి కోసమా? ఇవి ఏవియు కూడా మన దాహాన్ని తీర్చలేవు. ఎప్పుడైతే ప్రభువు కోసం దాహమును కలిగి ఉంటామో, ఆయన మన దాహాన్ని తీరుస్తాడు. కనుక ఈ లోక ఆశల వెనుక, శోధనల వెనుక పరుగులు తీయక ప్రభువు కోసం పరుగులు తీద్దాం.

నీరు తాజాదనమును ఇచ్చును. పూలు వాడిపోకూడదని వాటిపై నీళ్ళను చల్లుతూ ఉంటారు. నీరు ఆ పూవులను తాజాదనముగా ఉంచుతాయి. యేసు ప్రభువు మన జీవితాలను తాజాదనముగా ఉంచువాడు. ఆధ్యాత్మికముగా, బుద్ధివికాసములో, మానసికంగా, భౌతికముగా అన్ని విధాలా ప్రభువు మనలను తాజాదనముగా, తేజోవంతముగా చేయును.

నీరు ఏ ఆకారమునైనా తీసుకొనును. నీటిని ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారములో ఇమిడి పోతుంది. నీటికి సులువుగా ఇమిడిపోయే స్వభావం ఉన్నది. అలాగే, ప్రభువు ఈ లోకములోనికి వచ్చి, ఒక్క పాపము విషయములో తప్ప, అన్నీ విషయాలలో మానవ స్వభావాన్ని కలిగి జీవించాడు. ఆయన ఇమ్మానుయేలు, 'మనతో ఉన్నాడు'. మనము కూడా మనతో మరియు ఇతరులతో ఇమిడిపోయే, వారితో కలిసిపోయే సర్దుబాటు స్వభావాన్ని కలిగి యుండాలి.

3. దైవవాక్కు: ఇది దేవుని శక్తి. మనం దేవుని వాక్కుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం లేదని అంటూ ఉంటారు. కాని అది అవాస్తవం. వాస్తవం ఏమిటంటే, మనము ఏ కార్యము చేసినను దేవుని వాక్కుతోనే ప్రారంభిస్తాము. వాక్కు లేనిచో మన జీవితాలు శూన్యమే! దైవవాక్కు, మనలను మార్చును, నడిపించును, రక్షణ ఒసగును. దైవవాక్కు మనకు బలమును, ధైర్యమును ఒసగును. “భూమ్యాకాశములు గతించి పోవును. కాని నా మాటలు ఎన్నటికిని గతించి పోవు” (లూకా 21:33) అని ప్రభువు పలికి యున్నారు. మన ప్రతీ సమస్యకు పరిష్కారం బైబులులో దొరుకుతుంది. నమ్ముదాం! విశ్వసించుదాం! బైబులు గ్రంథ పుటలను తిరగ వేద్దాం. దేవుని వాక్కును చదివి, ధ్యానించి, మన జీవితాలకు అన్వయించు కుందాం! దేవుని వాక్కును గౌరవించుదాం. దైవవాక్కు అనగా స్వయాన క్రీస్తు ప్రభువే! “ఆ వాక్కు మానవుడై మనమధ్య నివసించెను” (యోహాను 1:14).

4. రొట్టె: ప్రతీ రోజు మనం దివ్య పూజా బలిలో పాల్గొను చున్నాము. కాని, ఈరోజు, దివ్యపూజాబలి ప్రత్యేక మైనది. ఈరోజు రొట్టె విరవడం చాలా అర్ధవంత మైనది. శిష్యులు ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచుండగా వారితో కలిసి ప్రయాణం చేయుచున్న ఉత్థాన ప్రభువును వారు గుర్తించలేక పోయారు. తోటి ప్రయాణికినిగా మాత్రమే భావించారు. కాని ఎమ్మావు గ్రామములో ప్రభువు రొట్టెను తీసుకొని ఆశీర్వదించి, విరచినప్పుడు వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించారు (లూకా 24:30-31). ఈనాడు ప్రభువు రొట్టె విరువగనే, శిష్యులలో కనువిప్పు కలిగి ప్రభువును గుర్తించారు. ఈనాడు గురువు దివ్యపూజా బలిలో రొట్టె విరచినప్పుడు, మన కన్నులు, హృదయాలు తెరువబడును. చాలాసార్లు ఈ మహిమను, బహుమానమును గుర్తించలేక పోవుచున్నాము. మన కన్నులను తెరువాలని ప్రార్ధన చేద్దాం. భౌతిమైన చూపు కాదు, ఆధ్యాత్మిక కన్నులను తెరువమని ప్రార్ధన చేద్దాం (not sight to the body, but insight to the soul). అంత:ర్గత / ఆధ్యాత్మిక చూపు సరిగా నున్నప్పుడు, భౌతిక చూపు దానంతట అదే బాగుంటుంది. రొట్టె విరచినప్పుడు, ప్రభువు ఉత్థానమైనాడని గుర్తించుతాము.

ప్రియ సహోదరీ సహోదరులారా! ఈ నాలుగు అంశముల ద్వారా ప్రభువు మనతో ఉన్నాడని మనకు తెలియజేయు చున్నాడు. మనం ఏమి చేయాలి? యోహాను వ్రాసిన మొదటి లేఖలో ఇలా చదువు చున్నాము: ప్రియులారా! మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కాని, ఇక ఏమి కానుంటిమో ఇంకను స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనము ఇచ్చునప్పుడు ఆయన యాదార్ధ రూపమును మనము చూతము. కనుక, ఆయనవలె అగుదుము అని మాత్రము మనకు తెలియును” (1 యోహాను 3:2). "దివినుండి మన రక్షకుడు ప్రభువు అగు యేసుక్రీస్తు రాకడకై మనము ఆతురతతో వేచి యున్నాము" (ఫిలిప్పీ 3:20). కనుక, ప్రభువును కలుసు కొనుటకు మనం సిద్ధపడాలి. అదే మన జీవిత ఆశయం! దీనికి మనము అనునిత్యము ప్రార్ధన చేయాలి. దేవునకు మనలను అర్పించుకుందాం. క్రైస్తవులుగా, ఆనందదాయకమైన వారిగా ఉందాం. ఉత్థాన క్రీస్తు మనలను ఆశీర్వదించునుగాక!

1 comment: