మ్రానికొమ్మల ఆదివారము - క్రీస్తు పాటుల స్మరణోత్సవము

 మ్రానికొమ్మల ఆదివారము - క్రీస్తు పాటుల స్మరణోత్సవము, 28-03-2021
యెరుషలేములో క్రీస్తు విజయ ప్రవేశ స్మరణ దినము
యెషయ 50:4-7, ఫిలిప్పి 2:6-11, మార్కు 15:1-39

“దావీదు పుత్రునకు హోసాన్న (ఇప్పుడు మమ్ములను రక్షించు). ఏలినవారి నామమున వేంచేయువారు ఆశీర్వదింప బడినవారు, ఇశ్రాయేలు రాజునకు మహోన్నతమున హోసాన్న” (మ 21:9).

పాస్కాయత్తకాల ప్రారంభమునుండి మన హృదయాలను పశ్చాత్తాపము, తదితర ప్రేమపూరిత క్రియలద్వారా ఆయత్తము చేసుకుంటూ, ఈ దినము తిరుసభయంతటితో కలిసి మన రక్షకుని పాస్కా పవిత్ర కార్యమును స్తుతించుటకు సమావేశమై యున్నాము. ఈ రక్షణ కార్యమును నెరవేర్చుటకై క్రీస్తు యెరుషలేము నగరమును ప్రవేశించారు. ఆకారణమున మన సంపూర్ణ భక్తి, విశ్వాసమునుబట్టి, ఈ రక్షణాయుత ప్రవేశమును స్మరించుకొనుచు రక్షకుని వెంబడించి, సిలువ ఫలిత కృపయందు భాగస్తులమై, ఆయన పునరుత్థానమందును భాగమును పొందుటకు యోగ్యులమగుదము.

నేటి మ్రానికొమ్మల (శ్రమల) ఆదివారముతో పవిత్రవారములోనికి ప్రవేశించియున్నాము. పవిత్రవారము మనకి ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకన, ఈ వారములో క్రీస్తుప్రభువుని భూలోక జీవిత చివరి ఘట్టాలను ధ్యానిస్తూ ఉన్నాము. ముఖ్యముగా, దివ్యసత్ప్రసాద స్థాపన, శ్రమలు, సిలువమరణం, ఉత్థానం అను పరిశుద్ధ కార్యాలతో, ప్రభువు దేవునికి-మానవునికి మధ్య సఖ్యతను, సమాధానమును కలుగజేసియున్నారు. పవిత్ర వారములోని సాంగ్యాలద్వారా, మన రక్షణ కార్య ఘట్టాలను అనుభవించుదము, మన విశ్వాసాన్ని నూత్నీకరించుదము, మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచుదము. మన విశ్వాస యాత్రలో ఓ నూతన జీవితాన్ని, ఆధ్యాత్మిక కన్నులతో చూచుదము. ఈ యాత్ర ఈనాటి మ్రానికొమ్మల ఆదివారముతో మొదలవుతుంది. ఇది రక్షణకార్య పరమరహస్యాలను చేరుటకు తోడ్పడుతుంది. తద్వారా, విశ్వాసములో ఎదిగి క్రీస్తుకు దగ్గర కాగలము.

ఈ రోజు మ్రానికొమ్మలను ఆశీర్వదించి, వాటితో ప్రదక్షిణలో దేవాలయములోనికి ప్రవేశించుటద్వారా [4వ శతాబ్దం నుండే ఈ ఆచారం ఉన్నది], యేసుక్రీస్తు యెరుషలేము విజయ పురప్రవేశమును గుర్తుకు చేసుకొంటున్నాము (లూకా 19:28-40, మార్కు 11:1-11, మత్తయి 21:1-15). ప్రజలు ప్రభువును ఒక మెస్సయ్యగా, రాజుగా ఆహ్వానించారు. ఆయన గాడిద పిల్లపై ముందుకు సాగిపోవుచుండగా, దారిలో తమ వస్త్రములను పరిచారు, మ్రానికొమ్మలతో జేజేలు పలుకుతూ స్వాగతించారు [జెకర్యా 9:9 ప్రవచానాలు]. తాను ఆరంభించిన దైవరాజ్యమునకు, శక్తికన్న వినయము గొప్పదని యేసు చాటారు. గాడిద శాంతికి సూచన. “ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక! పరలోకమున శాంతియు, మహోన్నతమున మహిమయు కలుగునుగాక” అని దేవుని స్తుతించారు. కొంతమంది పరిసయ్యులు స్తుతించడం ఆపివేయాలని కోరారు. అప్పుడు యేసు వారితో, “వారు మౌనము వహించిన యెడల ఈ రాళ్ళు ఎలుగెత్తి చాటగలవు” అని పలికారు. ప్రభువును సంతోషముగా ఆహ్వానించినను, నేడు ప్రభువు శ్రమలు, పాటుల గురించి పఠనాల ద్వారా ధ్యానిస్తున్నాం.

నేడు ప్రభువును స్తుతించిన ప్రజలే కొన్ని రోజుల తర్వాత ప్రభువును సిలువ వేయుడుఅని, బరబ్బాను విడుదల చేయుడుఅని అరిచారు. దీనినిబట్టి వారు హృదయాలతో ప్రభువును స్తుతించలేదు అని స్పష్టమగుచున్నది. ఈ రోజు ప్రభువును స్తుతించిన వారిలో ఎంతమంది ప్రభువుతో సిలువ చెంత ఆయనతో ఉన్నారు? గుంపులో ఉండటం చాలా సులువు. కాని, వ్యక్తిగతముగా ప్రభువుతో ఆయన శ్రమలలో, సిలువ ప్రయాణములో ఉన్నవారు ఎంతమంది? ప్రభువునకు వారి అవసరం ఉన్నప్పుడు వారు ఆయన సిలువ చెంతకు వెళ్ళలేదు.

కడరాభోజన సమయములో పేతురుగారు ప్రభువుతో చెఱసాలకు పోవుటకు, మరణించుటకు సైతము సిద్ధముగా ఉన్నానని (లూకా 22:33) చెప్పాడు. కాని కొన్ని గంటల తరువాత అదే రోజు రాత్రి ప్రభువును ఎరుగనని బొంకాడు (లూకా 22:56-62). ఎంత త్వరగా అతను తన మనసును మార్చుకొన్నాడు! మనము కూడా ప్రభువుతో ఎన్నో వాగ్దానాలు చేస్తాం. కాని, శోధనలకు, బలహీనతలకు, పాపమునకు దాసులమై, చేసిన వాగ్దానాలను మరచిపోతూ ఉంటాం. మనము కూడా నేడు మన వద్దనున్న ఈ మ్రానికొమ్మల వంటివారమే. నేడు అవి పచ్చగా, అందంగా ఉన్నాయి, కాని కొన్నిరోజుల తరువాత వాడిపోయి, ఎండిపోతాయి. కనీసం పేతురుగారు కోడికూతతో(లూకా 22:60), ప్రభువు మాటలు గుర్తుకు రాగానే వెక్కివెక్కి ఏడ్చాడు. పశ్చాత్తాప పడ్డాడు. కాని, మనం జీవిస్తున్న ఈ లోకములో, ఏ స్వరాన్ని, ఏ కూతని మనం వినలేక పోతున్నాం. అంతగా, పాపములో కూరుకొని పోయియున్నాము. మన అంతరాత్మ ఘోషను మనం వినలేక పోతున్నాము. ప్రభువు శ్రమలగూర్చి ధ్యానిస్తూ ఎందుకు మన హృదయాలు చలించడములేదు?

ఈనాటి మొదటి పఠనములో, ప్రభువు శ్రమలను గూర్చిన ప్రవచనాలను వినియున్నాము: “నేను అతనికి అడ్డు చెప్పలేదు. అతని మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించితిని. వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేనూరకొంటిని. నా మొగము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమియు చేయనైతిని” (యెష 50:5-6). బాధామయ సేవకుడు, మెస్సయ్య తండ్రి దేవుని సందేశాన్ని బోధించుటకు పంపబడ్డాడు. కాని ఆ సందేశము కొరకు ఆయన బాధలను అనుభవించవలసి ఉంటుందని యెషయ తెలియజేయుచున్నాడు. ఆయన శ్రమలను మౌనముతో భరించును. ఎందుకన, అది తండ్రి చిత్తమని ఎరిగియున్నాడు.

ఈనాటి కీర్తనలోకూడా ప్రభువు శ్రమలగూర్చిన ప్రవచనాలను వినియున్నాం: “నా వైపు చూచిన వారెల్ల నన్ను గేలిచేయు చున్నారు. ఇతడు ప్రభువును నమ్మెను. అతడు ఇతనిని రక్షించునేమో చూతము. ఇతడు ప్రభువునకు ఇష్టుడైనచో, అతడు ఇతనిని కాపాడునేమో చూతము. శునకములు నన్ను చుట్టుముట్టినవి. దుష్టబృందము నా చుట్టు క్రమ్ముకొనినది. వారు నా కాలు చేతులను చీల్చుచున్నారు. నా ఎముకలన్నింటిని లెక్క పెట్టుచున్నారు. శత్రువులు సంతసముతో నావైపు చూచుచున్నారు. వారు నా బట్టలను తమలోతాము పంచుకొను చున్నారు. నా దుస్తుల కొరకు చీట్లు వేసికొను చున్నారు” (కీర్తన 22:7-8, 16-18).

మనము కూడా క్రీస్తు స్వభావము కలిగి జీవించాలని పౌలుగారు నేటి రెండవ పఠనములో తెలియజేయు చున్నారు. దైవస్వభావమును కలిగి ఉన్నాను, తననుతాను రిక్తునిగా చేసుకున్నాడు. సేవకరూపం దాల్చాడు. వినయముగలవాడై మరణము వరకు విధేయుడై యున్నాడు. ఇది దేవుని ప్రేమకు తార్కాణం. క్రీస్తువలే మనం కూడా రిక్తులను చేసుకొని దేవుని ప్రేమలో, తోటివారి సేవలో జీవించాలి. క్రీస్తును అనుసరించడానికి పిలువబడియున్నాము. కనుక ఆయనే మన ఆదర్శం.

నేటి సువిషేశములో యేసు వేదన, శ్రమలు, మరణం గురించి వింటున్నాం. స్వంత శిష్యుడే గురువును శత్రువులకు అప్పజెప్పాడు. ఇంకొక శిష్యుడు తానెవరో తెలియదని బొంకాడు. గెత్సేమని తోటలో మహావేదనలోకూడా తండ్రి చిత్తాన్నే నెరవేర్చాడానికి సిద్ధపడ్డాడు. బంధింప బడిన తరువాత, ఎన్నో అవమానాలకు గురి అయ్యాడు. ఆయనకు వ్యతిరేకముగా అబద్దసాక్ష్యములు పలికారు. కొరడాలతో కొట్టారు, ఉమిసారు, ముళ్ళకిరీటం తలపై పెట్టారు. సిలువను మోయించి దానిపై దొంగల మధ్యన సిలువ వేసారు. సైనికులు ఆయన వస్త్రాలను చీట్లువేసి పంచుకున్నారు. తన శ్రమల, బాధల మధ్యన యేసు మాత్రం మౌనముగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తన ఆత్మను దేవునికి అప్పజెప్పి ప్రాణం విడిచాడు.

ఒక పట్టణములో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. చిన్నవాడు ఎప్పుడూ జులాయిగా తిరుగుచూ, త్రాగుచూ రోజూ ఇంటికి ఆలస్యముగా వచ్చేవాడు. అన్న ఎన్నిసార్లు చెప్పినా తన పద్ధతిని మార్చుకోలేదు. ఒక రోజు చేతిలో పిస్తోలు, రక్తపు మరకలతో రాత్రి ఇంటికి వచ్చాడు. ‘నేను ఒక వ్యక్తిని చంపాను... నేను కావాలని చంపలేదు. నాకు చావాలని ఇష్టము లేదుఅన్నాడు. అప్పుడే పోలీసులు ఇంటిని చుట్టుముట్టి తలుపులు తట్టారు. తమ్ముడి కోసం అన్న తమ్ముడి బట్టలు వేసికొని పోలీసులకు లొంగిపోయాడు. అతన్ని విచారించి, మరణ దండన విధించారు. తమ్ముడి కోసం అన్న మరణించాడు. తమ్ముడు జీవించాడు. ఇదంతా ప్రేమకోసమే! అలాగే క్రీస్తుకూడా మన మీద ప్రేమ వలన మనకోసం మరణించాడు. మన శిక్షను ఆయన భరించాడు. మన పాపభారం ఆయన మోసాడు. ఈ అనంతమయిన ప్రేమకు మనం ఎలా స్పందించాలి. పైన సంఘటనలో తమ్ముడు అన్నపట్ల ఎంతో కృతజ్ఞుడై ఉండవచ్చు. అలాగే మనము కూడా దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. అంతేగాక, మన పాతజీవితానికి, పాపజీవితానికి స్వస్తి చెప్పాలి. క్రీస్తులో నూతన జీవితాన్ని జీవించాలి. తమ్ముడు తన జీవితాన్ని మార్చుకోకపోతే, అన్న మరణానికి అర్ధమే ఉండదు. అలాగే క్రీస్తు మరణం కూడా. క్రీస్తు మరణములో మనం జీవిస్తున్నాము. కనుక, దానిని సమృద్ధిగా, పవిత్రముగా జీవించుదాం. మన ఈ జీవితం, క్రీస్తు మరణము వలన పొందిన భిక్ష అని ప్రతీ క్షణం జ్ఞప్తియందు యుంచుకొందాం.

క్రీస్తు శ్రమలు మనలను కదిలించాలి, ఎందుకన ఆయన శ్రమలకు కారణం మనమే కాబట్టి. ఆయన శ్రమలకు పెద్దలు, రోమను సైనికులు మాత్రమే కాదు, మన పాపజీవితం కూడా. “అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను. మన పాపముల కొరకు నలిగి పోయెను. అతడు అనుభవించిన శిక్షద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బలద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను” (యెష 53:5).

మనం పాపం చేసినప్పుడెల్ల, ప్రభువును సిలువ వేస్తున్నాము. ఈ రోజు, క్రీస్తు పాటుల స్మరణోత్సవ దినము. క్రీస్తు శ్రమల స్మరణ వలన మన జీవితాలు చలించాలి. మన హృదయాలు కరగాలి. మనం పాపజీవితాన్ని విడచి పెట్టాలి. పవిత్ర వారములో పాపసంకీర్తనము ద్వారా మరల మనం ప్రభువు చెంతకు తిరిగి రావాలి. దేవునితో పశ్చాత్తాప పడాలి, సఖ్యత పడాలి. క్రీస్తు శ్రమలు మనకు స్వస్థతను చేకూర్చునుగాక! ఈ పవిత్ర వారాన్ని మనం వృధాచేయ కూడదు. క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ ఆయనతో గడుపుదాం. పవిత్ర గురువారమున ప్రభువు ఏర్పాటు చేసిన సత్ప్రసాద విందులో పాల్గొందాం. పవిత్ర శుక్రవారమున, ప్రభువు శ్రమలలో పాల్గొందాం. అలాగే పవిత్ర శనివారమున పాస్కా జాగరణలో పాల్గొందాం!.

క్రీస్తు శ్రమలతో పోలిస్తే, మన బాధలు, కష్టాలు ఏపాటివి? యేసుక్రీస్తు, తండ్రి చిత్తమును నెరవేర్చుటకు మనలో ఒకనిగా జీవించాడు. మన కష్టాలను, బాధలను ఆ ప్రభువునకు అర్పించుదాం. వాటినుండి పారిపోక (ఆత్మహత్య), ఎదుర్కొను శక్తినివ్వమని, దైవచిత్తమే జరగాలని ప్రార్ధిద్దాం. దేవుని కుమారుడే శ్రమలను పొందవలసి వచ్చింది. కనుక, మనముకూడా మన జీవితములో వచ్చే కష్టాలను, బాధలను ఎదుర్కొనుటకు దేవుని సహాయమును కోరుదాం.

ప్రార్ధన: సర్వ శక్తిగల ఓ నిత్య సర్వేశ్వరా! మానవ జాతికి దైన్య పుణ్యమునకు ఆదర్శముగా మా రక్షకుడు మనుష్యావతార మెత్తెను. సిలువ బాధలను పొందను మీరు చిత్తగించితిరి. ఆయన వేదనలను స్మరించుచు ఆయన పునరుత్థాన భాగ్యములో భాగస్తుల మగునట్లు మాకు అనుగ్రహింపుడు. ఆమెన్.

2 comments: