దివ్యసత్ప్రసాద సంధింపు - ఆరాధన

 దివ్యసత్ప్రసాద సంధింపు - ఆరాధన

గీతము – దివ్యసత్ప్రసాద స్థాపన:

గురువు: దివ్యసత్ప్రసాదములో వేంచేసియుండు దివ్య యేసువా!

అందరు: మిమ్ము ఆరాధించి, మీకు వందనములు తెలుపుచున్నాము (3 సార్లు).

ఆరంభ వాక్యములు: దేవుడు మనలను దీవించుటకు, ఆశీర్వదించుటకు, మనకు కావలసిన వరములను ఒసగుటకు, తన అనంతమైన ప్రేమతో దివ్యసత్ప్రసాదమందు వేంచేసియున్నారు. కనుక, దివ్యసత్ప్రసాదములో వేంచేసిన దివ్య యేసును కలుసుకుందాం. ఆయనతో మాట్లాడుదాం. ఆయనను ఆరాధించుదాం. స్తుతించుదాం. ఘనపరచుదాం. మహిమపరచుదాం. ఈ గంట సమయము ఆ ప్రభువు దివ్యమైన, అద్భుతమైన, కృపగల సన్నిధిలో గడుపుదాం. “నాతో జాగరణ చేయుడు” (మత్తయి 26:38) అని శిష్యులను ఆహ్వానించిన విధముగా, “మీరు నాతో ఒక గంటయైనను మేలుకొని ఉండలేరా?” (26:40) అని ప్రభువే స్వయముగా మనలను ఆహ్వానిస్తున్నారు. కనుక, శోధనలకు గురికాకుండా మేలుకొని ప్రార్ధనలో నిమగ్నమై, దివ్యసత్ప్రసాద ప్రభువుతో ఈ పరిశుద్ధ సమయాన్ని గడుపుదాం.

దివ్యసత్ప్రసాద ఆరాధన ప్రార్ధన: (మోక్షపువాకిలి పేజి 171)

పఠనము: యోహాను 6:53-58

ధ్యానాంశం - దివ్యసత్ప్రసాద ఆరాధన గురించి బైబులు ధ్యానాంశములు: దివ్యసత్ప్రసాద ఆరాధనమీద మన విశ్వాసాన్ని, భక్తిని, ప్రేమను పెంపొందించడానికి ఒక ముఖ్యమైన మార్గము బైబులు వాక్యాలను చదువుకొని ధ్యానించడం. అలాంటి కొన్ని ముఖ్యమైన బైబులు పఠనాలను ధ్యానించుదాం. పాత నిబంధన గ్రంథములో దివ్యపూజ, దివ్యసత్ప్రసాదము, గురుత్వమునకు సంబంధించిన చిహ్నాలను, గురుతులను మనం ముందుగా ధ్యానిద్దాం. ఆ తరువాత, అవే నూతన నిబంధనలో వాస్తవాలుగా మారటాన్ని ధ్యానిద్దాం.

1. ఆదికాండము 3వ అధ్యాయము: మన ఆదితల్లిదండ్రులు ఆదాము, ఏవలు తినవద్దన్న పండును తిని, దేవున్ని అవిధేయించడం చూస్తున్నాము. దీనినే మనం ‘ఆదిపాపము’ అని అంటున్నాము. తినవద్దన్న పండును తినుట వలన, అనగా దేవున్ని అవిధేయించుట  అను పాపము వలన మరణము ఈ లోకమునకు వచ్చినది.

2. యోహాను 6వ అధ్యాయము – జీవాహారము గురించి బోధన: తినుటవలన, మరియు అవిధేయత వలన మరణము ఈ లోకానికి వచ్చినదని ఆ.కాం. 3వ అధ్యాయములో ధ్యానించాం. అయితే, దీనికి విరుద్ధముగా, తినుటవలన మరియు విధేయత వలన నిత్యజీవము లభిస్తుందని యోహాను 6వ అధ్యాయములో చూస్తున్నాం. ఈసారి మనం తినేది కల్వరి చెట్టు పండ్లు అయిన క్రీస్తు శరీరము మరియు క్రీస్తు రక్తము. దైవకుమారుడైన క్రీస్తు ప్రభువే స్వయముగా నొక్కిచెప్పారు: యోహాను 6:54 - “జీవాహారమును నేనే. నా శరీరమును భుజించి, ఆయన రక్తమును పానము చేయువాడు నిత్యజీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును.” మన రక్షణ ఆయనను భుజించుట వలన లభించునని ప్రభువు స్పష్టం చేయుచున్నారు.

3. ఆదికాండము 14:18-20 / హెబ్రీ 4:14-15: ఆదికాండము 14వ అధ్యాయములో పూజారి అయిన మెల్కీసెదెకును గురించి వింటున్నాం. మెల్కీసెదెకు ప్రధాన యాజకుడైన యేసును సూచిస్తున్నాడు. పూజారి లేదా యాజకుడు లేకుండా దివ్యసత్ప్రసాదము లేదా జీవాహారము వాస్తవికతలోనికి రాదు. కనుక, దివ్యపూజ, ఆరాధన, దివ్యసత్ప్రసాద వాస్తవికతకు గురుత్వము ఎంతో అవసరము, ముఖ్యము అని మనకు అర్ధమగుచున్నది.

4. నిర్గమకాండము 16వ అధ్యాయము – ఎడారిలో మన్నా: ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో దూరప్రయాణము వలన ఆకలితో అలమటించారు. అప్పుడు దేవుడు మోషే నాయకత్వ సాధనముద్వారా వారికి ఆకాశమునుండి అద్భుతరీతిన ఆహారమును (‘మన్నా’) కురిపించారు. మనము ఆహారము భుజించనిచో చనిపోతాము. అదేవిధముగా, జీవాహారముతో మన ఆత్మలను పోషించనిచో మనం శాశ్వతముగా నశించిపోతాము. ఎడారిలోని ఆ ‘మన్నా’ భోజనము దివ్యసత్ప్రసాదమును సూచిస్తుంది. యేసు ప్రభువు కూడా మోషే గురించి, ‘మన్నా’ గురించి చెప్పియున్నారు: యోహాను 6:49-50 - “మీ పితరులు ఎడారిలో ‘మన్నా’ను భుజించియు మరణించిరి. పరలోకమునుండి దిగి వచ్చిన ఆహారమిదే. దీనిని భుజించువాడు మరణింపడు.”

5. నిర్గమకాండము 14వ అధ్యాయము – ఎర్ర సముద్రమును దాటుట: మోషే నాయకత్వములో, ఎర్ర సముద్రమును దాటుటవలన ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు బానిసత్వము నుండి స్వేచ్చలోనికి నడిపింపబడ్డారు. మన జీవితములో పాపము అనేది బానిసత్వము. పాపము వలన దానికి దాసులమవుతున్నాం. కల్వరి కొండమీద సిలువపై తన రక్తమును చిందించి, మనకు నిజమైన స్వతంత్రమును ఒసగి, మనలను దేవునికి బిడ్డలుగా చేసాడు. క్రీస్తు శరీర రక్తములను స్వీకరించుట వలన, ఈ లోకమునుండి పరలోకమునకు దాటుటకు మనము బలమును, శక్తిని పొందుతున్నాము, శుద్ధిని పొందుచున్నాము.

6. రాజులు మొదటి గ్రంథము 16వ అధ్యాయము – యాజకుడైన ఏలియా: యెసెబెలు రాణి ఆహాబు రాజు దుష్టత్వమునుండి ప్రాణములు దక్కించుకోగోరి పారిపోయి, ఒకరోజు ప్రయాణము తరువాత ఏలియా నిరాశలో ప్రాణములు విడవ గోరాడు. అప్పుడొక దేవదూత ఏలియాను తట్టి లేపి, రెండుమారులు అతనికి రొట్టెను, నీళ్ళను ఒసగెను. ఏలియా ఆ రొట్టెను తిని, నీళ్ళు త్రాగి, ఆ ఆహార బలముతో నలుబది రోజులు నడచి దేవుని కొండయైన హోరేబు చేరుకున్నాడు. ఆ కొండపైనే ఏలియా దేవున్ని కలుసుకున్నాడు. మన పరలోక ప్రయాణము కూడా సుదీర్ఘమైనది, ప్రమాదకరమైనది, కష్టతరమైనది, అలసిపోయేటటు వంటిది. ఈ ప్రయాణమును కొనసాగించడానికి మనకు శక్తి, బలము అవసరము. ఆ శక్తి, బలము మనకు జీవాహారము అయిన, మన ప్రయాణానికి పోషణ అయిన యేసు ప్రభువు నుండి వస్తుంది. అదియే ఆయన శరీరరక్తములు.

7. కీర్తన 23 – మంచి కాపరి: 23వ కీర్తనలో దివ్యసత్ప్రసాదమునకు సబంధించిన సూచనలను మూడింటిని చూడవచ్చు: 5-6 వచనములు - “పరిమళ తైలముతో నా తలనభిషేకము చేయుదువు. నా పాన పాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది... నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును.” మొదటిగా, “అభిషేకము” గురుత్వమును సూచిస్తుంది. గురువు మాత్రమే దివ్యపూజా బలిని అర్పిస్తాడు. రెండవదిగా, “పాత్రము” క్రీస్తు రక్తమును సూచిస్తుంది. మూడవదిగా, “ప్రభు మందిరము” పరలోకమును సూచిస్తుంది. దీని అర్ధం ఏమిటంటే, జీవాహారముతో, రక్షణ పాత్రముతో మనము పోషించబడినచో, శాశ్వతమైన నివాసమగు పరలోకమునకు చేరుకుంటాము.

8. యోహాను 6: మరల యోహాను 6వ అధ్యాయమును ధ్యానిద్దాం. దీనిలో మూడు ముఖ్యమైన ధ్యానాంశములను చూడవచ్చు:

1. ఐదువేల మందికి ఆహారమును పంచుట – ప్రభువు సహజమైన అద్భుతమును చేసాడు. ఇది అద్భుతమైన దివ్యసత్ప్రసాదమునకు సూచనాగా, గురుతుగా ఉన్నది.

2. ప్రభువు నీటిపై నడచుట – ప్రభువును నమ్ముకున్నచో, మన జీవితములో కూడా అద్భుతాలు జరుగుతాయి. “నేను నమ్ముచున్నాను. నాకు అవిశ్వాసము లేకుండునట్లు తోడ్పడుము” అని మార్కు 9:24లో మూగదయ్యము పట్టిన కుమారుని తండ్రివలె మనము కూడా ప్రార్ధించుదాం.

3. జీవాహారము గురించిన యేసు బోధన: మనము శాశ్వతముగా జీవించాలంటే, ప్రభువు ఒసగు జీవాహారముతో పోషింప బడాలి. ఆ జీవాహారమే దివ్యసత్ప్రసాదము.

9. మత్తయి 26 - దివ్యసత్ప్రసాదము స్థాపించుట: పవిత్ర గురువారమున, కడరాత్రి భోజన సమయములో, యేసు మొట్టమొదటి దివ్యబలి పూజను అర్పించి దివ్యసత్ప్రసాదమును మరియు గురుత్వమును స్థాపించారు. ఈ గొప్ప వరమునకు మన హృదయ కన్నులను పైకెత్తి దేవున్ని స్తుతించుదాం. దివ్యసత్ప్రసాదము పట్ల ఎనలేని భక్తిని దయచేయమని ప్రార్ధన చేద్దాం. అలాగే గురువుల కొరకు ప్రార్ధన చేద్దాం.

10. దర్శన గ్రంథము 3వ అధ్యాయము – యేసు తలుపు తట్టును: 3:20 - “నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరచిన లోనికి వత్తును. వారితో భుజింతును. వారు నాతో భుజించును.” దివ్యసత్ప్రసాద ప్రభువు నీ హృదయ తలుపులను తడితే ఏమి చేస్తావు? నీ స్పందన ఏమిటి? అని ఆత్మపరిశీలన చేసుకుందాం.

11. 1 కొరి 11 - దివ్యసత్ప్రసాదము పట్ల దుర్వినియోగం: అనాది క్రైస్తవ సంఘములో ప్రభు భోజనము పట్ల జరుగుచున్న దుర్వినియోగం గురించి, సమావేశములో జరుగుచున్న చెడును, అవకతవకలను గురించి పౌలు తెలియజేయు చున్నాడు. అవి ఏమిటంటే, వారిలో విరుద్ధ వర్గములు ఉన్నవి. కొందరు ఆకలితో ఉండగా, కొందరు త్రాగి తూలుచున్నారు. పేదవారిని నిర్లక్ష్యం చేస్తున్నారు... అనగా, వారు అయోగ్యముగా ప్రభు భోజనములో పాల్గొంటున్నారు. అయోగ్యముగా, సరియైన సిద్ధపాటు లేకుండా, దివ్యసత్ప్రసాదమును స్వీకరించరాదని మనము తెలుసుకోవాలి.

12. లూకా 24 – ఎమ్మావు మార్గము: యేసు సిలువ మరణము తరువాత, ఇద్దరు శిష్యులు బాధతో, నిరాశతో యెరుషలేము నుండి ఎమ్మావునకు వెళ్ళుచుండగా ఉత్థాన క్రీస్తు వారితో కలిసారు. మొదటిగా, క్రీస్తును వారు గుర్తించలేదు, కాని ఆయన మాటలను ఆలకించారు. ఇది దివ్యపూజలోని గ్రంథపనాలకు సూచనగా ఉన్నది. ఎమ్మావు చేరుకున్నాక, ఉత్థాన క్రీస్తు వారితో రొట్టెను విరచినప్పుడు, వారు ఆయను గుర్తించారు. రొట్టె విరచుట దివ్యబలినిపూజను, దివ్యసత్ప్రసాదమును సూచిస్తుంది. క్రీస్తుతో మనము నడవనప్పుడు, అనగా ఆయన వాక్యమును ఆలకింపనపుడు, మనము అంధకారములో, నిరాశలో, విచారములో ఉంటాము. ఎప్పుడైతే క్రీస్తుతో నడుస్తామో, నిజమైన ఆనందానుభూతిని పొందుతాము. శిష్యులు ఒకరితో ఒకరు, “ఆయన మార్గములో మనతో మాట్లాడునపుడు, లేఖనములన్నియు మనకు వివరించునపుడు మన హృదయములు ప్రజ్వరిల్ల లేదా?” అని అనుకున్నారు (24:32).

13. పరలోక ప్రార్ధన: పరలోక ప్రార్ధనలో ఏడు విన్నపాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మత్తయి 6:11 - “నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయుము.” ఇది దివ్యసత్ప్రసాదమును సూచిస్తుంది. కనుక, ప్రతీరోజు దివ్యబలి పూజలో పాల్గొని, దివ్యసత్ప్రసాదమును స్వీకరించాలని అర్ధము. మరి ప్రభువు చెప్పినట్లుగా ప్రయత్నం చేద్దాం!

14. లూకా 1:37 – మరియమ్మవలె యేసును స్వీకరించుదాం: “ఇదిగో నేను ప్రభువు దాసురాలను. నీ మాట చొప్పున నాకు జరుగును గాక!” అని మరియమ్మ తన సంపూర్ణ అంగీకారాన్ని తెలిపియున్నది. లోకరక్షకుడిని తనలోనికి ఆహ్వానించుటకు తన సమ్మతిని వెల్లడించినది. యేసును తన హృదయములోనికి, ఆత్మలోనికి, శరీరములోనికి ఆహ్వానించినది. కనుక, మనము దివ్యసత్ప్రసాదమును స్వీకరించునపుడు, “ఆమెన్” అని చెబుతూ మన అంగీకారాన్ని తెలియజేయుచున్నాము. తద్వారా, దివ్యసత్ప్రసాద ప్రభువును మనలోనికి ఇష్టపూర్తిగా ఆహ్వానించుచున్నాము.

15. లూకా 1 – మరియమ్మ స్తోత్ర గీతము: దివ్యసత్ప్రసాదమును స్వీకరించిన పిదప, దేవునకు కృతజ్ఞతలు తెలుపుటకు ఉత్తమమైన ప్రార్ధన “మరియమ్మ స్తోత్ర గీతము”. “నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడగు దేవుని యందు నా యాత్మ ఆనందించుచున్నది...”

ముగింపు: మరియ తల్లి మధ్యస్థ ప్రార్ధనల ద్వారా, మనమందరము కూడా దివ్యపూజలో పాల్గొని, దివ్యసత్ప్రసాదమును స్వీకరించి, క్రీస్తునందు విశ్వాసము, నమ్మకము, ప్రేమలో ఫలించాలని ప్రార్ధించుదాం.

దివ్యసత్ప్రసాదమును ఆరాధించుట: (మోక్షపువాకిలి పేజి 177)

విశ్వాసుల ప్రార్ధనలు:

శిరమును వంచుడి (గీతము):

ప్రార్ధించుదము:

దైవస్తుతులు:

ముగింపు గీతము:

No comments:

Post a Comment