పవిత్ర గురువారము, Year B
నిర్గమ 12:1-8, 11-14, భక్తి కీర్తన 116:12-13,
15-16,17-18,
1 కొరి 11:23-26, యోహాను 13:1-15
పవిత్ర గురువారము, పవిత్ర
శుక్రవారము మరియు పవిత్ర శనివారము పాస్కా త్రయము అంటాము. తల్లి తిరుసభ దైవార్చన
కాలములో చాలా ప్రాముఖ్యమైన రోజులు. ఈ రోజు మనము పవిత్ర గురువారమును కొనియాడు
చున్నాము. ఈ రోజు ప్రభువు కడరా భోజనమును, ఆ భోజన సమయములో జరిగిన సంఘటనలను
జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నాము. ప్రభువు జీవితములో “ప్రభువు భోజనము” లేదా “కడరాత్రి భోజనము” అత్యంత ముఖ్యమైన మరియు
ప్రాముఖ్యమైన ఘట్టము అని చెప్పడములో ఎలాంటి సందేహము లేదు! ఇది ‘వీడ్కోలు భోజనము’, ‘కడరా భోజనము’. పై గదిలో ప్రభువు తన
శిష్యులతో కలిసి పంచుకున్న ‘కడరా భోజనము’.
ఈరోజు, ఇశ్రాయేలు ప్రజల పాస్కా
పండుగకు నూతన అర్ధాన్ని ఇచ్చినరోజు. ప్రభువు దివ్యసత్ప్రసాదమును, గురుత్వమును స్థాపించిన రోజు.
నూతన ఆజ్ఞను ఇచ్చిన రోజు. ప్రభువు తన శిష్యుల పాదాలను కడిగిన రోజు. దేవుని రక్షణ
ప్రణాళికలో జరిగిన ఈ ముఖ్యమైన ఘట్టాల గురించి ఈరోజు మనం లోతుగా ధ్యానిద్దాం.
1. పాస్కబలి – నియమములు (నిర్గమకాండము
12:1-8, 11-14)
ఈ పఠనముద్వారా యావే
దేవుడు ఇస్రాయేలీయులతో పాస్కాబలి ఒప్పందము చేసుకొనుటను చదువుచున్నాము. పాస్కా అనగా
“దాటిపోవుట” అని అర్ధము. ఈజిప్టు దేశమునుండి వెళ్ళిపోయే ముందురోజు ఇస్రాయేలీయులు
పరిశుద్ధమైన మగ గొర్రెపిల్లను చంపి, దాని రక్తమును వారి ఇంటి గుమ్మములకు పూయవలెనని దేవుడు
ఆజ్ఞాపించాడు. అప్పుడు తాను ఐగుప్తు దేశమునందు జనుల తొలిచూలు పిల్లలను చంపునపుడు
ఇస్రాయేలీయుల పిల్లలు క్షేమంగా ఉండెదరు. ఇది దేవుని పాస్కబలి అని, పాస్క నియమములను, పాస్క ఒప్పందము గురించి
ప్రభువు విడమరచి చెప్పియున్నారు. పాత నిబంధనలో పాస్కా పండుగ సందర్భమున, ప్రతీ యిస్రాయేలు
కుటుంబము ఒక గొర్రె పిల్లను బలిగా అర్పించారు. వధింప బడిన గొర్రెపిల్ల రక్తమును
కొంత తీసుకొని ఇంటి వాకిళ్ళ కమ్ముల మీద పూయవలయునని నియమమును పొందిరి. బలిగా
అర్పించబడిన గొర్రెపిల్ల రక్తము ప్రతీ యిస్రాయేలు కుటుంబమును మరణము నుండి కాపాడినది
(నిర్గమ. 12).
ఈ పాస్క గొర్రెపిల్లను ఏ
విధముగా తినవలెనో కూడా వారికి చెప్పబడింది. ఆ నియమములు ఏమనగా: - తినునపుడు వారి
నడుముకు దట్టి యుండవలెను, - కాళ్ళకు చెప్పులు తొడుగుకొనవలెను, - చేతిలో కర్ర ఉండవలెను, - మాంసమును త్వరగా
తినవలెను. ఈ నియమములను మనము గమనించినట్లయితే, ఇవన్ని ఎవరో ముఖ్యమైన వారు వచ్చునపుడు మనలను మనము
త్వరితగతిన తయారు చేసుకొంటున్నట్లు గోచరించును. ఆవిధముగా మనము ఎంత ఉత్కంట భరితముగా
దేవుని పాస్కగురించి తయారు కావలెనో మనము అర్ధము చేసుకొనవచ్చును. ఏవిధముగానైతే ఒక
పాలనాధికారి వచ్చినపుడు మనము ఎంత ఉత్కంట భరితముగా ఉంటామో అంతకన్నా ఎక్కువగా దేవుని
పాస్కగురించి ఉత్కంటగా తయారు కవాలనేది దేవుని ఉద్దేశ్యము. అంటే దేవుని పాస్క బలిని
ఎంతో ఉత్కంటతోను, దీక్షతోను, ఎదురుచూచు గుణముతోను
జరుపుకొనవలెను.
ఈ పాస్కబలి ఐగుప్తీయుల
చెరనుండి ఇస్రాయేలీయులను విడుదల చేయుటకు సూచికగా అర్ధమగుచున్నది. అదేవిధంగా ఈ
పాస్కబలి ఎన్నో సంవత్సరముల తరువాత వచ్చు క్రీస్తుబలికి సూచికగాను జరిగినట్లుగా
కూడా అర్ధము చేసుకొనవచ్చును.
ఇక్కడ మనం గమనించ వలసిన
విషయం ఏమిటంటే, ప్రభువు ‘కడరా భోజనము’ కూడా
యిస్రాయేలు పాస్కా పండుగ దినములలోనే జరిగింది. కనుక, గొర్రెపిల్ల రక్తము
క్రీస్తు రక్తముతో భర్తీ చేయబడునని సూచిస్తున్నది. క్రీస్తు “లోక పాపములను పరిహరించు
దేవుని గొర్రెపిల్ల” అని, అనేకుల రక్షణకై ఆయన రక్తము చిందించ బడెను అని యోహాను.
1:29,36లో చూస్తున్నాము. అలాగే, ‘కడరావిందు’ ప్రభువును నూతన మోషేగా సూచిస్తున్నది. మోషే ద్వారా దేవుడు ‘మన్నా’ను కురిపిస్తే (నిర్గమ. 16), క్రీస్తు ద్వారా ‘జీవాహారము’ను ఇచ్చియున్నాడు
(యోహాను. 6).
క్రీస్తు తాను కొనియాడిన పాస్కాద్వారా పాపము అనే బానిసత్వము నుండి మనలను
వాగ్ధత్తభూమి అను పరలోకమునకు దాటవేస్తారు.
పాత నిబంధన పాస్కా, యిస్రాయేలు ప్రజలకు
జ్ఞాపక మహోత్సవమైతే, నూతన నిబంధన పాస్కా, నిత్య నూతన నిబంధన జ్ఞాపక మహోత్సవము, అదియే “దివ్యబలి పూజ”, కృతజ్ఞాతార్చన బలి.
పాస్కావలె సంవత్సరములో ఒకసారి గాక, “దివ్యబలి పూజ”ను అనుదినం కొనియాడు చున్నాము. దీనికి కారణం మనం పొందిన
అనంతమైన రక్షణకు కృతజ్ఞతా భావము. “దీనిని నా జ్ఞాపకార్ధము చేయుడు… ఈ రొట్టెను
భుజించునపుడెల్ల, ఈ
పాత్రము నుండి పానము చేయునప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు మీరు ఆయన మరణమును
ప్రకటింతురు” (1
కొరి. 11:23-26) అని
ప్రభువు పలికి యున్నారు. ఈ కృతజ్ఞతా బలిని అర్పించునప్పుడు, రొట్టె, ద్రాక్ష సారాయమును అర్పించిన
మెల్కీసెదెకు పూజారి (ఆ.కాం. 14:18) పాత్రను క్రీస్తు పోషిస్తున్నాడు.
2. దివ్య సత్ప్రసాద
స్థాపనము, పవిత్ర యాజక అంతస్తు స్థాపన (1కొరి 11:23-26)
ఏవిధముగానైతే మొదటి
పఠనములో యావే దేవుడు తన పాస్కబలి నియమములను చెప్పియున్నారో అదేవిధముగా రెండవ
పఠనములో పునీత పౌలుగారు దివ్యసత్ప్రసాద బలి స్థాపన గురించి, బలి ఏవిధముగా జరపాలనే
నియమముల గురించి, పవిత్ర
యాజక అంతస్తు స్థాపన గురించి మనకు తెలియ జేయుచున్నారు.
2.1. దివ్యసత్ప్రసాద
స్థాపనము
యేసుప్రభువు తాను
అప్పగింప బడనున్న రాత్రి దివ్యసత్ప్రసాద బలిద్వారా తనను ఏవిధముగా జ్ఞాపకము
చేసుకోవలెనో చెప్పియున్నారు. ఈ దివ్యసత్ప్రసాద బలి యేసుప్రభువు యొక్క నిజమైన
ప్రాణబలికి గుర్తుగా పౌలుగారు చెప్పుచున్నారు. ఈ దివ్యసత్ప్రసాద బలి ద్వారానే మనము
ప్రతిదినము ప్రభువు చెప్పిన నియమానుసారముగా ఆయన మరణమును స్మరించుకొంటున్నాము. ఈ
బలిలో ముఖ్య అంశములు ఏమనగా:
(అ). కృతజ్ఞతాబలి: యేసుప్రభువు
దివ్యసత్ప్రసాద స్థాపనలో మొదటగా దేవునకు కృత్ఞతలు చెల్లించారు. తాను
పొందవలసినటువంటి బాధలు తనకు తెలిసినప్పటికీ తాను ముందుగా దేవునకు కృత్ఞతలు
చెప్పియున్నారు. అనగా దివ్యసత్ప్రసాద బలి యేసుక్రీస్తు ప్రాణబలిని సూచించినప్పటికీ
దేవునికి కృత్ఞతలు చెప్పడము ఎంత ముఖ్యమో తెలుస్తున్నది. అందుకే దివ్యసత్ప్రసాద
బలిని కృత్ఞతాబలిగను చెప్పుకుంటున్నాము.
(ఆ). దివ్య(ప్రాణ)బలి: దేవునికి కృత్ఞతలు
తెలిపిన తరువాత రొట్టెను తుంచడము ద్వారా తన మరణమును గురించి సంకేతమును యేసుప్రభువు
తన శిష్యులకు ఇచ్చియున్నారు. ఈవిధముగా ప్రభువు తీసుకొన్న రొట్టె తనకే సూచికగా
నిలుచుచున్నది. తాను రొట్టెను తుంచడము ద్వారా తననుతాను ఇష్టపూర్తిగా దేవునికి
అర్పిస్తున్నట్లు, తాను
ఇష్టపూర్తిగా తన ప్రాణమును ధారపోస్తున్నట్లుగా తన మనస్సును తేటతెల్లము
చేసియున్నాడు.
(ఇ). దివ్యరక్తము: భోజనము తరువాత
యేసుప్రభువు ద్రాక్షరసపు పాత్రను తీసుకొని, అది తాను చిందబోవు రక్తమునకు చిహ్నముగా చెప్పియున్నారు
(లూకా.22:20). ఈ
రక్తపు చిహ్నము నూతన ఒడంబడికగా యేసుప్రభువు చెప్పినవిధముగా పునీత పౌలుగారు
అభివర్ణించారు. అందువలన ప్రతి దివ్యబలిపూజలో ద్రాక్షరసము అర్పింపబడునప్పుడు
ప్రభువు మనందరి పాపములను శుద్ధిచేయుటకు చిందిన దివ్యరక్తమును జ్ఞాపకము
చేసుకొనుచుందుము. అంతేకాకుండా, ఈనాటి రెండవ పఠనములో పునీత పౌలుగారు మనకు యేసుప్రభువుని
రక్తముద్వారా నిత్యమరణమునుండి విముక్తి కలిగినదని చెప్పుచున్నారు. ఎందుకనగా, ఇస్రాయేలు సంస్కృతిలో
రక్తము జీవమునకు చిహ్నము. యేసుప్రభువు తన రక్తమును చిందించుట ద్వారా తన జీవమును
స్వచ్చందముగా అర్పించి, తద్వారా మనందరిని నిత్యమరణమునుండి శాశ్వత విముక్తులను
చేసారు. యేసుప్రభువు రక్తము చిందించుట మనకు మొదటి పఠనములో గొర్రె పిల్లను
వధించుటను గుర్తుకు తెచ్చును. ఏవిధముగానైతే గొర్రె రక్తము గుమ్మములకు పూయడము
ద్వారా ఇస్రాయేలీయుల తొలిచూలు బిడ్డలు రక్షించబడ్డారో అదేవిధముగా క్రీస్తు యొక్క
రక్తము ద్వారా మనందరము రక్షించపడ్డామని తెలుస్తున్నది.
(ఈ). నూతన నిబంధన: మనందరికోసం యేసుప్రభువు
చిందించిన రక్తము దేవుడు మనతో చేసుకొన్న నూతన ఒడంబడికగా ప్రభువు చెప్పినట్లుగా
పునీత పౌలుగారు తెలియజేయు చున్నారు (1కొరి. 11:25). ఈ సమయములో పాత ఒడంబడిక
గురించి ఆలోచించ వలసిన అవసరం ఎంతైనా ఉన్నది. సినాయి కొండపై యావే ప్రభువు ఇశ్రాయేలు
ప్రజలతో ఒడంబడిక చేసుకొని యున్నాడు. కాని తరువాత ఎన్నోసార్లు ఇస్రాయేలీయులు
ప్రభువు మాట మీరి, ఒడంబడిక
మీరి తప్పు చేయుచుంటిరి. ఐనప్పటికి ప్రభువు తనదైన కరుణతో ఎన్నోమార్లు వారిని
క్షమించారు. చివరికి తన కుమారుడైన క్రీస్తు రక్తమును చిందించి వారితో శాశ్వత నిత్య
నిబంధనను చేసుకొని యున్నారు. ఐతే ఈ శాశ్వత నిత్యనిబంధన ఇస్రాయేలీయులకే కాక
మానవజాతి అంతటికీ వర్తిస్తుంది. అందువలన, ఎవరైతే ఈ నూతన నిత్యనిబంధనలో బాప్తిస్మము ద్వారా
భాగస్తులగుదురో వారందరితోనూ ప్రత్యేకముగా నిబంధనను చేసుకొంటూ ప్రతిఒక్కరికి నిత్య
జీవభాగ్యమును ఒసగుచున్నారు.
2.2. పవిత్ర యాజక /
గురుత్వ అంతస్తు స్థాపన
ఈ రోజు కడరాత్రి భోజన
సమయములో, ఇంకొక మహత్తర ఘట్టాన్ని కూడా ప్రభువు ఆవిష్కరించిన రోజు. అదే పవిత్ర యాజక
అంతస్తు / గురుత్వ స్థాపన. ఈ గొప్ప వరానికి, భాగ్యానికి, మనం దేవునికి ఎంతగానో
కృతజ్ఞులమై ఉండాలి. పాత నిబంధనలో అనేక యాజకులు ఉన్నారు, కాని నూతన నిబంధనలో ఒకే
యాజకుడు క్రీస్తు ఉన్నారు. యేసు ప్రభువు
తాను ఆదినుండి యావే దేవుని ప్రధాన యాజకుడైనను, తననుతాను బలిగా అర్పించు
కోవడం ద్వారా, యాజకునిగా ఈ లోకానికి పరిచయం చేసుకున్నాడు. ఆవిధముగా, తననుతానే అర్పించుకొని, తనే అర్పకుడుగాను, తనే బలి వస్తువుగాను మారారు.
తద్వారా,
తన
శ్రమల పర్వాన్ని తనదైన మేలి అర్పణద్వారా మొదలుపెట్టారు. అయితే, తన యాజకత్వాన్ని,
గురుత్వాన్ని అభిషేకించబడిన గురువులతో పంచుకున్నాడు. ఎప్పుడైతే యేసుప్రభువు, “దీనిని నా జ్ఞాపకార్ధము
చేయుడు”
(1కొరి.11:24-25, లూకా.22:19) అని శిష్యులను
ఆజ్ఞాపించాడో, అపోస్తలులందరు యేసు ప్రభువు వాక్యములద్వారా గురువులుగా అభిషక్తులయ్యారు.
యోహాను 17:17లో యేసు “సత్యమునందు వారిని ప్రతిష్టింపుము” అని తన శిష్యుల కొరకు
తండ్రిని ప్రార్ధించాడు. శిష్యులు క్రీస్తు యాజకులుగా అభిషేకించ బడినారని
అర్ధమగుచున్నది. పాత నిబంధనలో యాజకులను నీటితో శుద్ధిచేయు ఆచారము ఉండేది (నిర్గమ
29:4, లేవీ 8:6). అందుకే, దివ్యసత్ప్రసాదమును స్థాపించిన కడరాత్రి భోజన సమయములో
ప్రభువు నీటితో శిష్యుల పాదాలను కడిగి, నూతన నిబంధన యాజకులుగా వారిని
శుద్ధిగావించాడు.
గురువు బలిని
అర్పించేవాడు. క్రీస్తు కలువరి సిలువపై ఒకేఒక్క సంపూర్ణమైన బలిని అర్పించాడు
(చదువుము ఎఫే 5:2, 1పేతురు 1:18-19). నేడు గురువులు ఆ బలిని జ్ఞాపకార్ధముగా కొనియాడటం
జరుగుతుంది. అందుచేత, ఈరోజు యాజకులందరికి పండుగ రోజు. ఈరోజు వారికోసం
ప్రత్యేకముగా ప్రార్ధన చేద్దాం. గురువులు క్రీస్తు యొక్క ప్రేషితకార్యాన్ని
కొనసాగించాలి. దివ్యబలిపూజ, సేవ రెండు ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి యున్నాయి.
దివ్యపూజ ఇతరులను ప్రేమించడానికి ప్రోద్భలాన్ని ఇవ్వాలి. అందుకే ప్రభువు నూతన
ఆజ్ఞను ఇచ్చియున్నారు..
3. నూతన ఆజ్ఞ - శిష్యుల
పాదాలను కడుగుట (యోహాను 13:1-15)
పవిత్ర గురువారమున
ప్రభువు మనకు నూతన ఆజ్ఞను ఇచ్చి యున్నాడు, “మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము
ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించు కొనుడు.” ప్రభువే స్వయముగా ఇచ్చిన
ఈ నూతన ఆజ్ఞను “శిష్యుల
కాళ్ళు కడుగుట” ద్వారా
చేసి చూపించాడు. ఆయన ఆజ్ఞను ఇవ్వడం మాత్రమేగాక, దానిని ముందుగా చేసి మనకు
ఆదర్శముగా ఉన్నారు. “యేసు భోజన పంక్తి నుండి లేచి, తన పై వస్త్రమును తీసివేసి, నడుమునకు తుండు గుడ్డ
కట్టుకొని, ఒక
పళ్ళెములో నీరు పోసి, తన శిష్యుల పాదములు కడిగి, నడుమునకు కట్టుకొనిన
తుండు గుడ్డతో తుడచెను” (చదువుము. యోహాను 13:1-15), ఇది ఆ ప్రేమాజ్ఞకు
నిజమైన అర్ధం.
ప్రభవు కడరా భోజన సమయములో
అసాధారణమైన దానిని చేసియున్నాడు, ఎవరూ ఊహించనిదానిని చేసి చూపించాడు, అదియే ప్రభువు శిష్యుల
పాదాలను కడగడం. ప్రభువు మనలను ఎంతగా ప్రేమిస్తున్నారో అన్నదానికి ఇది ఓ గొప్ప
నిదర్శనం! యేసు సేవకరూపం దాల్చి శిష్యుల పాదాలు కడిగాడు.
తనను అప్పగించిన యూదా
పాదాలను కడిగాడు, అలాగే
తనను ఎరుగనని బొంకిన పేతురు పాదాలు కడిగాడు. తనను బంధించినప్పుడు పారిపోయిన మిగతా
శిష్యుల పాదాలను కడిగాడు. దీనిని బట్టి మనకు అర్ధం అయ్యే విషయం ఏమిటంటే, ప్రభువును విశ్వసించువారు, తన వారికి (బంధువులు, స్నేహితులు) మాత్రమే
సేవలు చేయక, తమను
వ్యతిరేకించే వారిని, తమకు ద్రోహం చేసేవారికి కూడా సేవలు చేయాలి! ప్రభువు
శిష్యులతో ఇలా పలికారు, “ప్రభువును, బోధకుడను అయిన నేను మీ పాదములు కడిగినట్లే
మీరు కూడా ఒకరి పాదములు మరియొకరు కడుగవలయును (యోహాను 13:14).
పాదాలు కడుగు సాంగ్యం, జ్ఞానస్నానమును మరియు జ్ఞానస్నానములో మనం పొందే
అనుగ్రహాన్ని గుర్తుకు చేస్తుంది, ఆ అనుగ్రహమే మన పరిశుద్ధత, మన రక్షణ, దేవుని
బిడ్డలమగు భాగ్యము! ప్రభువు ఎందుకు పాదాలు కడుగుచున్నారో మొదటగా, పేతురుకు అర్ధం
కాలేదు. అందుకే పేతురు బిగ్గరగా, “నీవు నా పాదములు ఎన్నటికిని కడుగరాదు” అని అన్నాడు. అప్పుడు
పభువు,
“నేను
నిన్ను కడుగని పక్షమున నాతో నీకు భాగము ఉండదు” అని చెప్పాడు. అందుకు
పేతురు,
“అట్లయిన
ప్రభూ! నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను, నా తలను కూడ కడుగుము” (యోహాను 13:8-9). కనుక, క్రీస్తులో భాగస్తులము కాగోరినచో, తప్పక జ్ఞానస్నాన నీటితో
పరుశుద్దులము గావింప బడవలెను.
పునీత పౌలుగారు
ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖలోని రెండవ అధ్యాయములో చెప్పిన విధముగా దైవప్రతినిధిగా, దైవసేవకునిగా, ప్రజాసేవకునిగా, దైవకుమారునిగా తన
శిష్యులకు దర్శనమిచ్చాడు. ఆ మహాత్కార్యమే శిష్యుల పాదాలను కడుగుట. “నేను నిన్ను
(నీ పాదములను) కడుగనియెడల నాతో నీకు భాగము ఉండదు” (యోహాను 13:8) అని చెప్పుటద్వారా
శిష్యులందరు తన యొక్క కార్యములోను, శ్రమలలోను, మహిమలోను భాగము పంచుకుంటారని చెప్పకనే చెప్పారు. అందువలననే
యేసు ప్రభువు తన శిష్యులను సేవకులుగా పరిగణింపక స్నేహితులని పిలిచెను (యోహాను 15:15).
మీరందరు శుద్ధులు కాదని
చెబుతూనే యూదా ఇస్కరియోతు కాళ్ళను కూడా యేసు ప్రభువు కడిగారు. ఎందువలననగా, తాను యుదాతోసహా
శిష్యులందరినీ చివరిదాకా ప్రేమించెను (యోహాను 13:1). యుదా తనను అప్పగిస్తాడని
తెలిసికూడా అతనిని ప్రేమించెను. యుదా కాళ్ళు కడగడము ద్వారా తనలో యుదాకి కూడా
భాగముందని చెప్పకనే చెప్పారు. కాని యుదా, ప్రభువు మనస్సుని అర్ధము చేసుకోలేక ఆ భాగమును నిరాకరించి
యేసును రోమను సైనికులకి అప్పగించాడు. ఈ కార్యముద్వారా యేసుక్రీస్తు యొక్క షరతులు
లేనటువంటి నిష్కల్మషమైన ప్రేమను మనం అర్ధము చేసుకొన వచ్చు. ఈ విధముగా, ప్రభు ప్రేమకు మంచివారు
చెడ్డవారు అను తారతమ్యములు లేవని నిరూపించు చున్నారు.
అంతేకాకుండా యేసుప్రభువు, తాను ఏవిధముగా చేసెనో తన
శిష్యులను కూడా అనగా మనందరినీ అదేవిధముగా చేయుమని ఆజ్ఞను, ఆదర్శమును ఇచ్చెను.
తద్వారా మనందరికీ ఒకరిలో ఒకరికి క్రీస్తునందు భాగము కలదని తెలియు చున్నది.
ఈవిధముగా, ఈ
వినమ్ర కార్యం పరుల ప్రేమకు తార్కాణముగా నిలుస్తుందని యోహానుగారు మనకు ఈనాటి
సువార్తలో చెప్పుచున్నారు.
ముగింపు: క్రీస్తు మొదటి
పఠనములోని ప్రజలకోసం చనిపోవు గొర్రెగా సూచించ బడగా, రెండవ పఠనంలో యాజకుడిగాను, బలిఅర్పణగాను సూచించబడగా, సువార్తలో వినమ్ర
హృదయుడిగా వర్ణించ బడ్డాడు. ఈవిధముగా ఈనాటి పఠనాల ద్వారా తిరుసభ మనకు క్రీస్తుని
గురించి,
క్రీస్తుని
ప్రేమ గురించి విపులముగా వివరిస్తున్నది. అనగా యేసుని ప్రేమను ఒకవైపు నాణెముగా
పరిగణిస్తే, యేసుని
యొక్క స్వచ్చంద బలి అర్పణ మరియు సేవాపూరిత ప్రేమలను చెరొక పార్శ్వముగా అర్ధము
చేసుకొన వచ్చును. అంతేకాకుండా ఈనాటి పఠనాలు, దేవుడు ఇచ్చిన పాస్క పండుగ నియమాలు, దివ్య సత్ప్రసాద క్రమము, క్రీస్తు ఇచ్చిన వినయాదర్శము
ఏవిధముగా ఆచరించవలెనో, ఏవిధముగా జ్ఞాపకము చేసుకోవలెనో సూచనా ప్రాయముగా తెలియ జేయుచున్నాయి.
ఈవిధముగా, ఈనాటి
పఠనాలు ఈ పవిత్ర గురువారము ప్రాముఖ్యత గురించి, ఈపవిత్ర గురువారమును
ఎందుకు భక్తిశ్రద్ధలతో జరుపుకొనవలెనో తెలియచేయు చున్నవి.
-
దివ్యబలి పూజలో పాల్గొను మనము, సేవా భావముతో జీవించాలి. ఇతరుల
అవసరాలను గుర్తించి, ఏమీ ఆశించకుండా సహాయం చేయాలి.
-
ప్రభువు తన శరీర రక్తాలనే మనకు జీవాహారముగా, పానముగా
ఇచ్చియున్నాడు. కనుక మనము కూడా ప్రభువువలె మనకున్నవి ఇతరులతో పంచుకోవాలి: మన సమయం,
మాట, సంపద, ఇతర వరాలు... అప్పుడే మనం క్రీస్తుకు నిజమైన శిష్యులముగా జీవించగలం.
Beautiful and inspiring homily Rev. Fr.Praveen, Gopu...
ReplyDelete