“పునీత యోసేపుగారి సంవత్సరము”
(8 డిసంబరు 2020 నుండి 8 డిసంబరు
2021)
అపోస్తోలిక లేఖ “పాత్రిస్
కోర్ధేస్” సారాంశము:
అపోస్తోలిక లేఖ “పాత్రిస్
కోర్ధేస్” సారాంశము:
ఒక తండ్రి హృదయముతో పునీత యోసేపుగారు యేసును ప్రేమించారు. యోసేపుగారు
వండ్రంగి వృత్తి చేస్తూ జీవనాన్ని కొనసాగించాడు (మత్తయి 13:55). మరియమ్మతో యోసేపుగారికి
వివాహము నిశ్చయమైనది (మత్తయి 1:18, లూకా 1:27). యోసేపు నీతిమంతుడు (మత్తయి 1:19). మోషే
చట్టముద్వారా (లూకా 1:22,27,39) మరియు తాను పొందిన నాలుగు కలల ద్వారా (మత్తయి 1:20,
2:13,19,22), తనకు బయల్పరప బడిన దేవుని చిత్తమును నెరవేర్చుటకు ఎల్లప్పుడూ
సిద్ధముగా ఉండేవారు. నజరేతు నుండి బెత్లెహేము వరకు దూర ప్రయాణము తరువాత కూడా,
సత్రములో చోటు దొరకనప్పుడు, పశువుల తొట్టిలో మరియ యేసులను కంటికి రెప్పలా
చూసుకున్నారు (లూకా 2:7). గొల్లలు (లూకా 2:8-20) మరియు జ్ఞానులు (మత్తయి 2:1-12) బాల
యేసును సందర్శించి ఆరాధించినప్పుడు సాక్షిగా నిలిచారు. దేవదూత సూచించిన విధముగా బాలునకు
“యేసు” అని పేరు పెట్టారు (మత్తయి 1:21).
యేసు జన్మించిన నలుబది రోజుల తర్వాత యెరూషలేము దేవాలయములో,
మరియ యోసేపులు బాలయేసును దేవాలయములో కానుకగా అర్పించినప్పుడు, యేసు మరియమ్మల గురించి
పలికిన సిమియోను ప్రవచనాలను యోసేపు ఆలకించారు (లూకా 2:22-35). హేరోదు నుండి
బాలయేసును రక్షించుటకు ఐగుప్తులో పరదేశీయుడిగా జీవించారు (మత్తయి 2:13-18).
తప్పిపోయిన బాలయేసును గురించి విచారముతో వెదకారు (లూకా 2:41-50).
9వ భక్తినాధ పోపుగారు యోసేపుగారిని శ్రీసభకు పాలకునిగా 8
డిసంబరు 1870న ప్రకటించారు. 12వ భక్తినాధ పోపుగారు యోసేపుగారిని కార్మికులకు
పాలకునిగా 1 మే 1955న ప్రకటించారు. ఆనందముగా మరణించుటకు పునీత యోసేపుగారిని
పాలకునిగా శ్రీసభ అంతయుకూడా ప్రార్ధిస్తూ యున్నది (సత్యోపదేశం, 1040). పాలక
పునీతులైన యోసేపుగారు మనకు ఎంతో ఆదర్శం.
ప్రేమగల తండ్రి: యోసేపు మరియకు భర్తగా, యేసుకు
తండ్రిగా దేవుని రక్షణ ప్రణాళికకు తన సేవలను అందించారు (పునీత జాన్ క్రిసోస్తమ్).
దీని నిమిత్తమై తన జీవితాన్ని త్యాగము చేసియున్నారు. తిరు కుటుంబమునకు తననుతాను అంకితము
చేసుకున్నారు. మెస్సయ్యకు సంరక్షకునిగా ఉన్నారు (పునీత పాల్ VI). యోసేపులో తండ్రి
దేవుని ప్రేమను యేసు చవిచూసారు. మన అనుదిన జీవితాలలో కూడా, ముఖ్యముగా పాపసంకీర్తన
దివ్యసంస్కారములో దేవుని కరుణకు, కనికరమును, ప్రేమను చవిచూడాలి.
విధేయతగల తండ్రి: యోసేపు విధేయతగల తండ్రి. దేవుడు
తన రక్షణ ప్రణాళికను యోసేపుకు కలల ద్వారా తెలియ జేసారు. మరియ గర్భము ధరించినదని
తెలిసి మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు
నిశ్చయించుకున్నారు (మత్తయి 1:19). తన మొదటి కలద్వారా ఈ సంశయానికి పరిష్కారాన్ని
దేవుడు చూపారు. మరియమ్మ పవిత్రాత్మ వలన గర్భము ధరించినదని తెలియజేసారు. ఆమె ఒక
కుమారుని కనును. ఆయనకు ‘యేసు’ అను పేరు పెట్టుము. ఏలయన, ఆయన, తన ప్రజలను వారి
పాపములనుండి రక్షించును అని తెలియజేసెను (మత్తయి 1;20-21). యోసేపు వెంటనే
స్పందించారు: “నిదుర నుండి మేల్కొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన
భార్యను స్వీకరించెను” (మత్తయి 1:24). విధేయత తన సమస్యలను జయించులాగా చేసినది.
రెండవ కలలో దూత యోసేపుతో, “శిశువును చంపుటకు హేరోదు వెదక
బోవుచున్నాడు. కావున నీవు లేచి, బిడ్డను తల్లిని తీసికొని, ఐగుప్తునకు పారిపోయి,
నేను చెప్పు వరకు అచటనే యుండుము” (మత్తయి 2:13) అని చెప్పెను. యోసేపు ఆ పలుకులను
విధేయించుటకు వెనుకాడలేదు: “అంతట యోసేపు లేచి ఆ బిడ్డను, తల్లిని తీసికొని, ఆ
రాత్రియందు ఐగుప్తునకు వెళ్లి, హేరోదు మరణించు నంతవరకు అచటనే ఉండెను” (మత్తయి
2:14-15). ఐగుప్తులో యోసేపు తిరిగి తన యింటికి సురక్షితముగా చేరడానికి ఓపికగా
ఎదురు చూసారు. మూడవ కలలో, దూత కనిపించి బిడ్డను చంప వెదకిన వారు మరణించిరి.
బిడ్డను, తల్లిని తీసికొని యిస్రాయేలు దేశమునకు తిరిగి పొమ్ము అని చెప్పెను
(మత్తయి 2:19-20). మరొకసారి, యోసేపు మారుమాటాడకుండా దూత మాటలను విధేయించారు: “యోసేపు
లేచి, ఆ బిడ్డను, తల్లిని తీసికొని యిస్రాయేలు దేశమునకు తిరిగి పోయెను” (మత్తయి
2:21). తిరుగు ప్రయాణములో హేరోదు స్థానమున అర్కెలాసు యూదయా దేశాధిపతి అయ్యెనని
విని అచటికి వెళ్ళుటకు యోసేపు భయపడ్డాడు. కలలో హెచ్చరింప బడిన ప్రకారము, యోసేపు
గలిలీయ సీమకు పోయి, నజరేతు నగరమున నివాస మేర్పరచు కొనెను (మత్తయి (2:22-23).
ఈ విధముగా, ప్రతీ సమయములో, యోసేపు దేవుని మాటను, చిత్తమును
విధేయించాడు. కుటుంబానికి అధిపతిగా, తల్లిదండ్రులకు విధేయుడై యుండాలని యేసుకు కూడా
నేర్పించారు (లూకా 2:51). యోసేపు కాపుదలలో, తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చడం యేసు
నేర్చుకున్నాడు. యేసు ప్రేషిత కార్యములో భాగస్థుని చేయుటకు దేవుడు యోసేపును పిలచి
యున్నాడు.
స్వీకరించు తండ్రి: యోసేపు స్వీకరించు తండ్రి. మరియను
షరతులు లేకుండా స్వీకరించాడు. స్త్రీలను గౌరవించాడు. మరియ పేరును, గౌరవాన్ని,
జీవితాన్ని కాపాడ చూసాడు. కష్టాలు, అనుమానాలు, భయము, వైరుధ్యాలు, నిరాశలు ఉన్నను
దేవుడు చూపించిన తన జీవితాన్ని యోసేపు మనస్పూర్తిగా స్వీకరించాడు. “యోసేపూ!
భయపడవలదు” (మత్తయి 1:20) అని దేవుడు యోసేపుతో చెప్పిన విధముగా, యోసేపు మనతో కూడా
‘భయపడవలదు’ అని చెప్పుచున్నాడు. ఆశతో, ధైర్యముతో ముందుకు సాగాలి. “దేవుడు మన
హృదయముల కంటే అధికుడు, సర్వజ్ఞుడు” (1 యోహాను 3:20). “దేవుని ప్రేమించు వారికి, అన్నియు
మంచికే సమకూరును” (రోమీ 8:28). విశ్వాసము ప్రతీ విషయానికి అర్ధమొసగును. యోసేపు
విశ్వాసమును మనము కలిగి యుండాలి. వాస్తవాలను అంగీకరించి బాధ్యతాయుతముగా యోసేపు
జీవించారు.
ధైర్యముగల తండ్రి: యోసేపు ధైర్యముగల తండ్రి.
కష్టాలను, సవాళ్ళను ధైర్యముగా ఎదుర్కొన్నారు. తన ద్వారా దేవుడు ఆ బిడ్డను, తల్లిని
కాపాడారు. దేవుడు యోసేపు ధైర్యాన్ని నమ్మారు. సత్రములో స్థలము లేనప్పుడు, పశువుల
పాకనే అందముగా తయారుచేసి దేవుని కుమారునకు స్వాగతం పలికారు. హేరోదు నుండి వారిని కాపాడారు.
కష్టపడే తండ్రి: యోసేపు కష్టపడే తండ్రి. అతను
వండ్రంగి. దానితోనే తన కుటుంబాన్ని పోషించారు. యేసు కూడా, కష్టపడి సంపాదించి
భుజించడం గురించి నేర్చుకున్నారు. పని కూడా దేవుని రక్షణ ప్రణాళికలో పాల్గొనుటకు
ఒక మార్గము. పని లేకుండా ఏ కుటుంబము కూడా ముందుకు సాగదు. పని ద్వారా దేవుని సృష్టి
కార్యములో భాగస్తులము అగుచున్నాము. నిరుద్యోగము రూపుమాపాలని యోసేపును
ప్రార్ధించుదాం.
తండ్రి దేవుని నీడ: యోసేపు తండ్రి దేవుని నీడగా ఈ
లోకములో చూడవచ్చు. యేసును కంటికి రెప్పలా కాచి కాపాడాడు. ఇచట మోషే మాటలను
గుర్తుచేసుకోవచ్చు: ‘మీరు ఎడారిలో ఉండగా, తండ్రి కుమారునివలె ఆయన మిమ్ము మోసికొని
వచ్చెను” (ద్వితీయో 1:31). అదేవిధముగా యోసేపు తన జీవితాంతం ఒక తండ్రిగా జీవించారు.
ఎవరైనా, కేవలం పిల్లలను కంటే తండ్రి అవరు. ఒకరి పట్ల, ఒకరి జీవితం పట్ల బాధ్యతలు
తీసుకొన్నప్పుడు ఆ వ్యక్తికి తండ్రి అవుతారు.
యోసేపు పట్ల ప్రేమను పెంచుకుందాం. ఆయన మధ్యస్థ ప్రార్ధనలు
వేడుకుందాం. ఆయన జీవితాన్ని అనుసరించుదాం.
No comments:
Post a Comment