ఇరాక్ అపోస్తోలిక పర్యటనపై జగద్గురువులు పోపు ఫ్రాన్సిస్ వారి ఉపదేశం, బుధవారము 10 మార్చి 2021

ఇరాక్ అపోస్తోలిక పర్యటనపై జగద్గురువులు పోపు ఫ్రాన్సిస్ వారి ఉపదేశం, 
బుధవారము 10 మార్చి 2021

ప్రియ సహోదరీ సహోదరులారా! శుభోదయం!

పునీత రెండవ జాన్ పాల్ పోపుగారి యొక్క ఆశయాన్ని నిర్వహించ తలపెట్టిన సందర్భముగా, ప్రభువు నన్ను ఇరాక్ దేశాన్ని సందర్శించడానికి అనుమతించాడు. ఇంతకు ముందు ఎప్పుడూ ఏ జగద్గురువుకూడా అబ్రాహాము నివసించిన ఈ దేశాన్ని సందర్శించ లేదు. అనేక సంవత్సరాల యుద్ధం, ఉగ్రవాదం తరువాత, మరియు తీవ్రమైన ఈ మహమ్మారి సమయంలో, ఆ ఆశయం ఇప్పుడు ఇలా నెరవేరాలని దేవుడు ఈవిధముగా తలపెట్టాడు. ఈ సందర్శన తరువాత, నా హృదయం కృతజ్ఞతతో నిండియున్నది, ఆనందముతో ఉప్పొంగుచున్నది - దేవునికి మరియు దీనిని సాధ్యం చేసిన వారందరికీ, ముఖ్యముగా, రిపబ్లిక్ ఇరాక్ అధ్యక్షులకు మరియు ఇరాక్ ప్రభుత్వానికి, దేశపితరులకు, పీఠాధిపతులకు, మంత్రులకు, సంబంధిత సంఘవిశ్వాసులకు. మతాధికారులకు, ముఖ్యముగా, గ్రాండ్ అయతోల్లా అల్-సిస్తానీ, నజాఫ్‌లోని, తన నివాసములో మరపురాని సమావేశమును ఏర్పాటు చేసినందులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయు చున్నాను.
ఈ పర్యటనలో, పశ్చాత్తాప భావనను నేను అమితముగా అనుభవించాను: ఒక పెద్ద శిలువను, ఉదాహరణకు ఖరాకోష్ ప్రవేశద్వారం చెంత ఉంచబడిన పెద్ద శిలువ లాంటిదానిని, కతోలిక శ్రీసభ పేరిట, నేనే స్వయముగా మోయకుండా, హింసించబడిన ఆ ప్రజల యొద్దకు, వేదసాక్షి మరణం పొందిన స్థలమైన ఆ దేవాలయము వద్దకు, నేను రాలేక పోయాను. మరీ ముఖ్యముగా, ఆ విధ్వంసకర గాయాలను కన్నులారా చూచినప్పుడు, హింస, విధ్వంసం, బహిష్కరణ కొలిమిలో నుండి బయటపడిన వారి ప్రత్యక్ష సాక్ష్యాలను చెవులారా విన్నప్పుడు, పశ్చాత్తాప భావనను పొందాను. అదే సమయంలో, క్రీస్తు దూతను స్వాగతిస్తూ ఉన్న ప్రజల ఆనందాన్ని నా చుట్టూ చూశాను. శాంతి, సోదరభావము కొరకు తెరచియున్న వారి హృదయాశను నేను చూచాను. క్రీస్తుమాటలలో ఇమిడియున్న సందేశమే, ఈ అపోస్తోలిక పర్యటన యొక్క ఉద్దేశ్యం: “మీరందరు సోదరులు” (మత్తయి 23:8). ఈ ఆశయాన్ని రిపబ్లిక్ ఇరాక్ అధ్యక్షులతో మాట్లాడుచుండగా గ్రహించాను. మరల ప్రజల శుభాకాంక్షలలో, సాక్ష్యాలలో, పాటలలో, హావభావాలలో ఆ ఆశను కనుగొన్నాను. అదే ఆశను వెలుగుచున్న యువత ముఖాలలో, వయసుమళ్ళిన వారి ఉత్సాహభరితమైన కళ్ళలో చూడగలిగాను. పోపుగారి కొరకు వారు ఐదు గంటలపాటు ఎదురుచూశారు. వారిలో ఎంతోమంది తల్లులు చంకలో పిల్లలను ఎత్తుకొని ఉన్నారు. వారందరి కళ్ళలో అదే ఆశను చూసాను.
ఇరాక్ ప్రజలు శాంతియుతముగా జీవించే హక్కును కలిగియున్నారు. వారి గౌరవాన్ని తిరిగి కనుగొనే హక్కు వారికి ఉన్నది. వారి మత, సాంస్కృతిక మూలాలు వేల సంవత్సరముల క్రితం నాటివి. మెసొపొటేమియా నాగరికతకు మూల స్థానము. చారిత్రాత్మకంగా, బాగ్దాద్ అత్యంత ప్రాముఖ్యత కలిగిన నగరం, ఇది శతాబ్దాలుగా ప్రపంచంలోనే అత్యంత గొప్ప లైబ్రరీని కలిగి ఉండేది. యుద్ధము దానిని ధ్వంసము చేసింది. యుద్ధము తననుతాను కాలానుగుణముగా మార్చుకొని మానవాళిని ఎప్పటికప్పుడు మ్రింగజూసే రాక్షసుడు. అయితే యుద్ధానికి ప్రతిస్పందన యుద్ధము కాదు. ఆయుధాలకు ప్రతిస్పందన ఆయుధాలు కాదు. ఉగ్రవాదులకు మారణాయుధాలను ఎవరు విక్రయిస్తున్నారని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఇతర ప్రదేశాలలో, ఉదాహరణకు ఆఫ్రికాలో ఊచకోతలు కోయుచున్న ఉగ్రవాదులకు మారణాయుధాలను ఎవరు విక్రయిస్తున్నారు? దీనికి ఎవరైన నాకు సమాధానం చెప్పగలరు. దీనికి ప్రతిస్పందన యుద్ధం కాదు, కాని సోదరభావము. సోదరభావముతో ప్రతిస్పందించడం ఇరాక్ కు మాత్రమేగాక, ప్రపంచం మొత్తానికే అతి పెద్ద సవాలు! మనలో సహోదరభావాన్ని నిర్మించుకోగలమా? లేక యుద్ధముతోనే సాగిపోదామా?
ఈ కారణంచేతనే, నాలుగు వేల సంవత్సరముల క్రితం అబ్రహాము దైవపిలుపును అందుకున్న ఊరు అను పట్టణములో క్రైస్తవులు, ముస్లింలు, ఇతర మతాల ప్రతినిధులతో కలిసి ప్రార్ధనలు చేసాము. అబ్రహాము విశ్వాసములో మన తండ్రి, ఎందుకన వారసులను వాగ్దానం చేసిన దేవుని స్వరమును ఆలకించాడు. అబ్రహాము అన్నింటినీ వదిలి బయలుదేరాడు. దేవుడు తన వాగ్దానాలకు విశ్వాపాత్రుడిగానే ఉన్నాడు, నేటికీ శాంతి పధములో మనలను నడిపిస్తున్నాడు. భూలోకములో అడుగులువేస్తూ, చూపును పరలోకముపై ఉంచు వారి అడుగులను దేవుడు నడిపిస్తాడు. ఊరు పట్టణములో అబ్రహాము చూసిన అదే ప్రకాశవంతమైన ఆకాశము క్రింద ఉన్నప్పుడు, మన హృదయాలలో “మీరు అందరు సోదరులు” అన్న సందేశం ప్రతిధ్వనించినది.
బాగ్దాదులో 2010వ సం.లో దివ్యబలిపూజ సమయములో జరిగిన దాడులలో ఇరువురు గురువులతో కలిసి మొత్తం 48 మంది ప్రాణాలు కోల్పోయారు. కనుక ఇరాక్ సంఘం వేదసాక్షుల సంఘం. మేము మోసుల్, ఖరాకోష్ నుండి, టైగ్రిస్ నది వెంట, పురాతన నినెవె శిధిలాల దగ్గర, సోదరభావము గురించి సందేశాన్ని ప్రకటించాము. ఐసిస్ ఆక్రమణలు, వేలాది మంది నివాసితులు పారిపోవడానికి కారణమైంది, ఇందులో అనేకమంది క్రైస్తవులు వివిధ మతాలవారు, హింసించబడిన మైనారిటీలు, ముఖ్యంగా యాజిదిలు ఉన్నారు. ఈ నగరాల ప్రాచీన గుర్తింపు నాశనం చేయబడింది. ఇప్పుడు వారు పునర్నిర్మించడానికి తీవ్రముగా ప్రయత్నం చేస్తున్నారు. ముస్లింలు క్రైస్తవులను తిరిగి రావాలని ఆహ్వానిస్తున్నారు, కలిసి దేవాలయాలను, మసీదులను పునరుద్ధరించాలని కోరుచున్నారు. సోదరభావము ఉన్నది. కనుక, గాయపడిన సహోదరీ సహోదరుల కొరకు, తిరిగి వారు నూతన జీవితాన్ని ప్రారభించడానికి బలాన్ని కలిగియుండాలని ప్రార్ధన చేద్దాం. వలస వచ్చిన అనేక మంది ఇరాకీలను జ్ఞాపకం చేసుకుందాం. నేను వారితో ఇలా చెప్పాలని అనుకుంటున్నాను: మీరు అబ్రహాములాగా అన్నింటినీ విడిచి పెట్టారు. అతనివలె విశ్వాసమును, ఆశను కాపాడు కొనండి. మీరు ఎక్కడ ఉన్నను, స్నేహం, సోదరభావముతో జీవించండి. మీకు వీలైతే, తిరిగి వెళ్ళండి.
సోదరభావము అను అంశముపై బాగ్దాదులోను మరియు ఏర్బిల్ లో రెండు దివ్యసత్ప్రసాద వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ ప్రాంత అధికారులు, ప్రజలు నన్ను ప్రేమపూర్వకముగా ఆహ్వానించి నందులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయు చున్నాను. అబ్రహాము, అతని వారసుల ఆశ, మనము కొనియాడిన పరమరహస్యము ద్వారా నెరవేర్చబడింది. తండ్రి దేవుడు, తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా అందరికి రక్షణను ఒసగియున్నాడు. తన మరణ ఉత్థానముల ద్వారా, కన్నీరు ఎండిన, గాయాలు మానిన, సహోదరీ సహోదరులు సఖ్యత పడిన వాగ్ధత్త భూమికి మార్గాన్ని సుగమం చేసాడు.
ప్రియమైన సహోదరీ సహోదరీలారా, ఈ చారిత్రాత్మక పర్యటనను బట్టి దేవున్ని స్తుతించుదాం మరియు మధ్య-తూర్పు దేశాల కొరకు ప్రార్థన కొనసాగిద్దాం. ఇరాక్‌లో, విధ్వంసం మరియు ఆయుధాల గర్జన ఉన్నప్పటికీ, దేశానికి చిహ్నంగా, దాని ఆశకు సూచనగానున్న తాటి చెట్లు పెరుగుతూ, ఫలాలను అందిస్తూనే ఉన్నాయి. సోదరభావం కూడా, తాటి చెట్ల పండ్ల వలె, ఫలించాలి. శాంతికరుడైన దేవుడు ఇరాక్‌కు, మధ్య-తూర్పు దేశాలకు, ప్రపంచానికి సోదరభావముతో కూడిన భవిష్యత్తును దయచేయును గాక!

No comments:

Post a Comment

Pages (150)1234 Next