తపస్కాల నాలుగవ ఆదివారము, 14-03-2021

 తపస్కాల నాలుగవ ఆదివారము, 14-03-2021
2 రా.ది.చ. 36:14-16, 19-23, ఎఫే 2: 4-10, యోహాను 3: 14-21

నిర్లక్ష్యం చేస్తే...

జపాను దేశములోని పుకుషిమా పట్టణములో వచ్చిన భూకంపం, సునామీ కారణముగా గొప్ప అణువిస్ఫోటనం జరిగింది. ఎందరినో నిరాశ్రయులను చేసింది. ఈ దుర్ఘటనములో మానవ తప్పిదము ఏమీ లేదని చెప్పవచ్చు. కాని దాదాపు 25 సం.ల క్రితం ఉక్రెయిన్ దేశములోని (అప్పటి రష్యా) చెర్నోబిల్ లో జరిగిన అణువిస్ఫోటనం మాత్రం ఖచ్చితముగా మానవ తప్పిదమే! ఏమరుపాటుతనముతో, నిర్లక్ష్యముతో చేసిన పని. రోజూ చేసే పని కదా అనే చులకనభావం. ఈ ఏమరుపాటుతనముతో, చులకన భావముతో, నిర్లక్ష్యముగా, ఒక మీటను వత్తబోయి ఇంకో మీటను వత్తాడు అక్కడ భాద్యతలు నిర్వహిస్తున్న కార్మికుడు. ఆ నిర్లక్ష్యము వలన ఎంతో మంది మరణించారు, బాధ పడ్డారు, పడుతూనే ఉన్నారు.

‘నిర్లక్ష్యం' - ఇది ఒక చిన్న పదమే కాని, దీని ఫలితం మాత్రం చాలా పెద్దది. దీనిని అలవాటు చేసుకొన్నవారు, ఎంత గొప్ప వారైనా సర్వనాశనం చేస్తుంది. వారిని మాత్రమే కాకుండా, చుట్టు ప్రక్కల ఉన్న వారిని కూడా.

నిర్లక్ష్యం= నిర్+లక్ష్యము. ‘నిర్' అనగా వదిలి వేయడం, దూరముగా ఉండటం. అనగా లక్ష్యమును వదలి వేయడము లేదా దూరముగా ఉండటం. ఇదే మాటకు సాధారణ పరిభాషలో, 'లెక్క చేయక పోవడం', 'మాట వినక పోవడం', 'పెడ చెవినపెట్టడం' అనే అర్ధాలు ఉన్నాయి. ఇంకా వివరముగా చెప్పాలంటే, మనకు ఎవరన్నా ఏదైనా చెబుతూ ఉంటే, మాటలు వినబడుతున్నా, వినబడనట్లు ప్రవర్తించడం. మనుషులు కనబడుతున్న, కనబడనట్లు ప్రవర్తించడం. అన్ని కలిపి, మన ప్రక్కన ఉన్న మనిషిని, అతని ఉనికిని, మనిషిని మనిషిగా గుర్తించక పోవడం.

ఈనాటి మొదటి పఠనములో, నిర్లక్ష్యము వలన ఇస్రాయేలుకు కలిగిన ఫలితం గురించి మనకి వివరించబడినది. ఇస్రాయేలీయుల రాజులు, యాజకులు, మరియు ప్రజలు ( 2 రా.ది.చ. 36:14-16). దేవున్ని, దేవుని మందిరమును, దేవుని మాటను (ప్రవక్తలను), దేవుని బాటను నిర్లక్ష్యము చేసారు. దేవుడు వారికి ఏర్పరచిన ప్రణాళికను అనగా, ఇతర జాతుల, జనుల మధ్య, నిజ దేవుడైన యావేకు, ప్రతీకలుగా, నీతి న్యాయము చొప్పున నడచుకొను వారిగా ఉండాలని, వారు నిర్లక్ష్యము చేసారు. దేవాలయమును అమంగళము చేసారు (36:14), దేవుని ప్రవక్తలను ఎగతాళి చేసారు (36:16), ప్రవక్తలను, ప్రభువు వాక్యమును, దేవుని స్వరమును తృణీకరించారు (36:16).

ఎప్పుడైతే వారు దేవున్ని తృణీకరించారో, అప్పటినుండే వారి పతనం ఆరంభమయ్యింది. ఏ అధికారమును, ప్రతిభను, ఏ సంపదను, ఏ భూమిని, ఏ మందిరమును, చూసి వారు మురిసి పోయారో, గర్వపడ్డారో, వాటన్నింటిని ప్రభువు వారినుండి దూరం చేసారు. సింహాసనమునుండి రాజులు త్రోసివేయయ బడ్డారు. దేవాలయమునుండి యాజకులు వెలివేయ బడ్డారు (చంప బడ్డారు). ప్రజల సంపద అంతా దోచుకొన బడినది. నాది, మాది అనుకున్నవాటినుండి దూరం చేయబడ్డారు, వేరు చేయబడ్డారు. అన్నీ కోల్పోయి మిగిలియున్నవారిని, బాబిలోనియా రాజు తనకు తన ప్రజలకు, దాసులుగా, దాసీలుగా ఊడిగం చేయించు కొనుటకు తీసుకొని వెళ్ళాడు. దాసులుగా, బానిసలుగా, పేరులేని వారిగా, గౌరవములేని వారుగా, బాబిలోనియాలో జీవించారు.

తాము ప్రభువునుండి వేరు చేయబడ్డామని, ప్రభువుకు దూరముగా ఉన్నామని, ప్రభువు మాకు కావాలి, మా జీవితములోనికి రావాలి, మాతో ఉండాలి, మమ్ము నడిపించాలి అని తెలుసుకోవడానికి, కనువిప్పు కలుగడానికి వారికి పట్టిన సమయం 70 సం.లు.

నిర్లక్ష్యము మారి, నిజ లక్ష్యము ప్రభువేనని తెలుసుకోవడానికి పట్టిన మనస్థాప కాలం. దేవునితో ఉండాలని, ఆయన తోడుకావాలని, సాన్నిధ్యం, సహవాసం, స్నేహం, అనుభవించాలని ఆయన కీర్తనలు పాడి స్తుతించాలనే కోరిక వారిలో రగులుతుంది (చూడుము 137:5-6).

వారి దు:ఖమును, పశ్చాత్తాపమును, కోరికను గుర్తించిన ప్రభువు, పారశీక రాజు కోరేషు ద్వారా, మందిర నిర్మాణమును పూనుకొంటున్నాడు. ఇది నిశ్చయముగా ప్రభువు కార్యమేనని రెండవ పఠనం స్పష్టం చేసింది. ఇది ప్రభువు స్వయముగా, స్వతహాగా, కలుగజేసుకొంటున్న కార్యం. ఎందుకంటే, ఆయన కృప అపారం. తన ప్రజల పట్ల ఆయన ప్రేమ అమితం (ఎఫే 2:4). అది మన ప్రతిభ కాదు, దేవుని కృపయే (ఎఫే 2:8).

ఎందుకన, ప్రభువింత కరుణను ప్రేమను చూపుచున్నాడు? మన తప్పులను సరిదిద్ది తన వైపునకు మరల్చు కుంటున్నాడు? కారణ మొక్కటే: ఆయన మనలను క్రీస్తు యేసు ద్వారా, సత్కార్యములు చేయు జీవితమునకై సృజించెను (ఎఫే 2:10). సత్కార్యములు చేయుటయే మన లక్ష్యము, లక్ష్యమార్గము.

ఎక్కడికి వెళ్తున్నదీ మార్గము:

వెలుగును సమీపించుటకు, వెలుగులో జీవించుటకు, వెలుగుతో జీవించుటకు, వెలుగై జీవించుటకు...
సద్వర్తనుడు తన కార్యములు దేవుని చిత్తాను సారముగా చేయబడినవని ప్రకటితమగుటకు వెలుగును సమీపించును.

మనలను మనం ప్రశ్నించు కొందాం:

ఈ సమయమున నేను గాని, నా కుటుంబము గాని, బాధలలో గాని, భయములో గాని జీవిస్తున్నానా/దా? ఆర్ధిక సమస్యలలోగాని, అనుబంధ సమస్యలలోగాని సతమత మవుతున్నదా?

కుటుంబమునుండిగాని, కుటుంబ సమస్యలనుండిగాని, స్నేహితుల నుండిగాని, వేరుచేయబడ్డానా?
ఒంటరిగా, దిక్కులేని వానిగా, ఆప్యాయత లేనివానిగా ఉన్నానా? ఆలోచించు! కారణం ఏమై ఉండవచ్చు?
గతమున పనే లోకముగా జీవించానా? పదవే లక్ష్యముగా, డబ్బే ముఖ్యమని, ఆ తరువాతే అన్నీ అని అనుకొన్నానా?
నా ప్రతిభ ద్వారా, నా బలం ద్వారా, అన్నీ చేయగలనని అనుకొన్నానాడబ్బు ద్వారా అన్నీ కొనగలను అని అనుకొన్నానా?

ఇవే లక్ష్యముగా చేసికొని, రోజూ చేసే ప్రార్దనే కదా! ప్రతీ ఆదివారం పాల్గొనే పూజే కదా! ఎప్పుడూ చదివే బైబులే కదా! ఎప్పుడూ వినే (చెప్పే) ప్రసంగమే కదా! ఎప్పుడూ చేసే సేవే కదా! ఎప్పుడూ ఉండే కుటుంబమే కదా! అని ఏమరుపాటుతనముతో, నిర్లక్ష్యముతో ఉన్నానా?

అలాగయితే, ఇలా ప్రతిబబూనుదాం:

ప్రభువు ఈనాటి నుండి నిన్నే లక్ష్యముగా చేసికొని,
నీ తరువాతే అన్నీయని, నీ తోటే అంతటయని,
నీ కొరకే నాకున్నదంతయని, జీవిస్తా!
నీ వైపే నా పయనం సాగిస్తా!
నీ దగ్గరికే అందరిని నడిపిస్తా!

సువిశేష పఠనము: నికోదేము పరిసయ్యుడు. రాత్రిలో యేసును కలుసుకోవడానికి వచ్చాడు. నికోదేము యేసును దేవుని యొద్దనుండి వచ్చినవానిగా విశ్వసించాడు. జ్ఞానస్నానము గురించి బోధించిన తరువాత, యేసు మోషే ఎడారిలో ఎట్లు సర్పమెత్తేనో చెప్పెను. కంచు సర్పమువైపు [విశ్వాసముతో] చూసినవారు బ్రతికిరి (సంఖ్యా 21:8). ఈ వృత్తాంతమును గుర్తుచేయుట ద్వారా, యేసు తన మరణ ఉత్థానాల ద్వారా రక్షణ పరిపూర్తి యగునని గుర్తుకు చేయుచున్నారు. “ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను” (యోహాను 3:16). మన రక్షణ కొరకు మనము యేసువైపుకు విశ్వాసముతో చూడాలి. యేసు ఒక వెలుగుగా ఈ లోకములో అవతరించెను. కాని ప్రజలు వారి పాపములను కప్పిపుచ్చుకొనుచూ, చీకటిలో జీవించడానికే ఇష్టపడు చున్నారు.  అయితే శుభవార్త ఏమనగా, ప్రభువు, మన పాపములను బయల్పరచి, మనలను క్షమించును. అందుకే, ఈ తపస్కాలములో మనం చేసిన పాపాలను ప్రభువు సమక్షములో ఒప్పుకొని పాపమన్నింపును కోరుకుందాం. విశ్వాసములోను, ప్రేమలోనూ జీవించుదాం. క్రీస్తు వెలుగులో పయనిద్దాం.

No comments:

Post a Comment