బ్రదర్ జోసఫ్ తంబిగారి మహోత్సవములు 15 జనవరి 2021
బ్రదర్ జోసఫ్ తంబిగారికి చాలా
ఇష్టమైన బైబులు వాక్యమును చదువుకొని, ఈ వాక్యపరిచర్యను ప్రారంభించుకుందాం. 1 పేతురు 1:24-25: “మానవులందరు గడ్డిమొక్కల
వంటివారు; వారి వైభవము గడ్డిపూల వంటిది; గడ్డి నశించును, పూలు రాలిపోవును, కాని
దేవుని వాక్కు ఎల్లప్పుడును నిలుచును.” జోసఫ్ తంబిగారు ఉత్తరభారత దేశములోని ‘ఝాన్సి’
అను ప్రాంతములో ఉండగా, పర్యటించుచుండగా, సువార్తాపరిచర్య చేయుచుండగా, అక్కడ తోమాసు
అనే వ్యక్తితో పరిచయం, స్నేహం ఏర్పడింది. ఈ తోమాసు అనే వ్యక్తి వ్రాతపూర్వకముగా
ఇచ్చిన సాక్ష్యములో, బ్రదర్ జోసఫ్ తంబిగారు తనకు ఇచ్చిన ఆధ్యాత్మిక సలహా ఈ బైబులు
వాక్యం అని సాక్ష్యమియ్యడం జరిగింది.
ప్రభువునందు ప్రియ సహోదరీ
సహోదరులారా! దైవసేవకుడు బ్రదర్ జోసఫ్ తంబిగారి 76వ వర్ధంతి మహోత్సవాల సందర్భముగా,
9 రోజుల ప్రార్ధనలు, 3 రోజుల మహోత్సవాలను ఘనముగా, భక్తియుతముగా పూర్తిచేసుకొనియున్నాము.
కనుక, ఈ సాయంసమయమున, పెద్దవుటపల్లిలోని బ్రదర్ జోసఫ్ తంబి ఆశ్రమం గురువులందరం
కలిసి ఈ కృతజ్ఞతా సమిష్టి దివ్యబలి పూజను అర్పిస్తున్నాం. నవదిన ప్రార్ధనల ఆరంభమునుండి
ఈసమయము వరకు కూడా బ్రదర్ జోసఫ్ తంబిగారి మధ్యస్థ ప్రార్ధనలద్వారా దేవుని నుండి మనం
ఎన్నో మేలులను, అనుగ్రహాలను పొందియున్నాము. కనుక, ఈ కృతజ్ఞతాబలిని
అర్పిస్తున్నాము.
మన జీవితములో కృతజ్ఞతాభావం ఎంతో
అవసరం. మన హృదయాలు కృతజ్ఞతాభరితం కావాలి. కృతజ్ఞతలేని హృదయాలు ఎప్పుడూ సంతోషముగా
ఉండలేవు. కృతజ్ఞత అనేది కేవలం కొన్నిపరిస్థితులకు ప్రతిస్పందించడం కాదు. ఎదో
నోటిమాటగా, “వందనాలు” లేదా “Thank You” అని చెబితే సరిపోదు. అలా స్పందిస్తే అది
చంచల మనస్తత్వం అవుతుంది. గుండె లోతుల్లోనుండి వస్తేనే అది నిజమైన కృతజ్ఞత
అవుతుంది. అలాగే, మనకు అనుకూల పరిస్థితులు కలిగినప్పుడు మాత్రమే కృతజ్ఞత కలిగి యుండటం
కాదు. ప్రతికూల పరిస్థితులలోకూడా కృతజ్ఞతాభావమును కలిగి యుండాలి.
ముందుగా,
మనం దేవుని పట్ల కృతజ్ఞతాస్తుతిభావాన్ని కలిగి యుండాలి: దేవుడు
స్తోత్రార్హుడు. మన స్తుతికి పాత్రుడు. కనుక ఆయనను మనం స్తుతించాలి. దేవుడు చేసిన
ఉపకారములను బట్టి, ఆయన అనుగ్రహాన్ని బట్టి, ఆయన పరాక్రమ కార్యాలను బట్టి, ఆయనను
స్తుతించాలి. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి.
దేవుడు మన జీవితములో ఎన్నో
మేలులు చేయుచున్నాడు. మనలను కంటికి రెప్పలా కాచికాపాడుతున్నాడు. కనుక, ప్రతీదినం
మనం దేవున్ని స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. “మీరు ప్రభువును
స్తుతింపుడు. భక్త సమాజమున అతనిని స్తుతింపుము” అని కీర్తన 149:1లో చదువుచున్నాము.
దేవుడు మన ప్రభువు కనుక ఆయనను స్తుతించాలి. ఆయన సర్వాధికారి, సర్వశక్తుడు, రాజులకు
రాజు, ప్రభువులకు ప్రభువు. సర్వసృష్టికి మూలము. అన్నింటికన్న మహోన్నతుడు కనుక మనం
దేవున్ని స్తుతించాలి.
దేవున్ని స్తుతించడంద్వారా ఆయనను
మహిమపరుస్తున్నాము... ఘనపరుస్తున్నాము. కీర్తన 50:23లో ఇలా చదువుచున్నాం: కృతజ్ఞతాస్తుతి
అను బలి అర్పించువాడు నన్ను గౌరవించును. ఆయనను మహిమ పరచడమే నిశ్చయముగా దేవుని
ప్రజల గొప్ప కోరికగా ఉండాలి.”
దేవుడు మనలను ఆజ్ఞాపిస్తున్నాడు
కనుక మనం ఆయనను స్తుతించాలి. ప్రభువును స్తుతించుట ఒక సలహానో, విన్నపమో కాదు అదొక
ఆజ్ఞ. కీర్తన 117:1లో ఇలా చదువుచున్నాం: “ఎల్లజాతులారా! ప్రభువును స్తుతింపుడు.
ఎల్లప్రజలారా! అతనిని కీర్తింపుడు.”
తంబిగారి
జీవితం కృతజ్ఞతాస్తుతి ప్రార్ధనా జీవితం:
తంబిగారి జీవితం దేవునిపట్ల
కృతజ్ఞతతో కూడినటువంటి జీవితం. సూర్యోదయమునుండి సూర్యాస్తమయము వరకు, రోజంతా, ఆయన
జీవించినంతకాలం, సర్వవేళలయందు, సమస్తమునుగూర్చి ఆయన దేవునికి కృతజ్ఞతలు
చెల్లించాడు. కీర్తన 113:3లో “తూర్పునుండి పడమరవరకును ప్రభువు నామము
వినుతింపబడునుగాక!” అని చదువుచున్నట్లుగా, తంబిగారు తన జీవితముతో దేవున్ని
స్తుతించాడు. ఎఫెసీ పత్రిక 5:20లో చదువుచున్నట్లుగా, “మన ప్రభువగు యేసుక్రీస్తు
ద్వారా ప్రతి విషయమును గూర్చి తండ్రియగు దేవునకు సర్వదా కృతజ్ఞతలను అర్పించుకొనుడు”
అని చదువుచున్నట్లుగా, తంబిగారు తన జీవితములోని సమస్తమునుగూర్చి, ప్రతి
విషయమునుగూర్చి దేవున్ని స్తుతించాడు.
తంబిగారు గొప్ప ప్రార్ధనాపరుడు.
ఆయన “ప్రార్ధనకు ప్రతిరూపం” అని చెప్పవచ్చు. మనకు తెలిసినది తంబిగారికి జపమాల
ప్రార్ధన అంటే చాలా ఇష్టం అని. విశ్వాసులను ప్రార్ధన కూటాలకు నడిపించి జపమాలను
చెప్పించేవాడు. ప్రార్ధన కూటాలను నడిపించేవాడు. బైబులును వివరించేవాడు. అలాగే,
దివ్యబలిపూజ అన్నను, దివ్యసత్ప్రసాద ఆరాధన అన్నను, తంబిగారికి ఎంతో ఇష్టం, ప్రేమ.
భక్తిగా పాల్గొని ఆ ప్రార్ధనలలో పరవశుడై పోయేవాడు.
అలాగే, తంబిగారు గంటలు తరబడి వ్యక్తిగత
ప్రార్ధనలో గడిపేవాడు. ఆయన రాత్రంతయు మోకరిల్లి, చేతులెత్తి మౌనస్తుతిప్రార్ధన
చేసేవాడని చెప్పడానికి మనకు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మానికొండ గ్రామ
వాస్తవ్యులైన గుత్తికొండ దోమినిక్ గారు అలాగే వేమూరి పరంధామయ్యగారు బ్రదర్ జోసఫ్
తంబిగారితో చాలా సన్నిహితముగా ఉండేవారు. తరుచుగా, మానికొండనుండి అవుటపల్లికి వచ్చి
తంబిగారిని కలిసి ఇక్కడే ఆయన గదిలోనే బసచేసేవారు. వారు ఇచ్చిన సాక్ష్యం ప్రకారం,
అర్ధరాత్రి సమయములో లేచి చూడగా, జోసఫ్ తంబిగారు మోకరించి, చేతులు పైకెత్తి
ప్రార్ధిస్తూ కనిపించేవారు. చాలా రాత్రులు ఒక గంట మాత్రమే పడుకునే వారని సాక్ష్యాలను
బట్టి మనకు తెలియుచున్నది. బోయపాటివారి యింటిలో జోసఫ్ తంబిగారు, క్లారమ్మగారు
కలిసి దివారాత్రులు ప్రార్దిచేవారని ఇప్పటికి ఆ కుటుంబ సభ్యులు
సాక్ష్యమిచ్చుచున్నారు. తెలగతోటి ప్రభుదాసుగారి సాక్ష్యం ప్రకారం, రాత్రంతయు గంటల
తరబడి ఎడతెగక ప్రార్ధించేవాడు తంబిగారు. ప్రార్ధనలో తంబిగారి ముఖము తేజోవంతముగా
వెలిగేదని సాక్ష్యమిచ్చాడు. ఈవిధముగా, తంబిగారి జీవితం ఒక ప్రార్ధనా మారింది.
తంబిగారు అన్ని సమయాలలో
దేవున్ని స్తుతించాడు, కృతజ్ఞతలు చెల్లించాడు. కృతజ్ఞతా స్తుతిప్రార్ధన చేసాడు. అనుకూల
పరిస్థితులలోను, ప్రతికూల పరిస్థితులలోను దేవున్ని స్తుతించాడు. ఆయనను ప్రజలు
అర్ధం చేసుకున్నప్పుడు, అద్భుతాలు చేసినప్పుడు, ఇతరులకు సహాయం చేసినప్పుడు
దేవున్ని స్తుతించాడు. అలాగే, ప్రతికూల పరిస్థితులలో దేవున్ని స్తుతించాడు. తనను
దొంగస్వామిగా భావించినప్పుడు దేవున్ని స్తుతించాడు. పిచ్చోడని భావించి తనపై రాళ్ళు
విసిరినప్పుడు ఆయన దేవున్ని స్తుతించాడు. ఎటు వెళ్ళాలో తెలియక దిక్కుతోచని
పరిస్థితులలో ఆయన దేవున్ని స్తుతించాడు. తన బాధలలో, శ్రమలలో దేవున్ని స్తుతించాడు:
తాను పంచాగాయాలను పొందినప్పుడు పొందిన వేదనలో, ఆవేదనలో, బాధలో, శ్రమలో దేవున్ని
స్తుతించాడు.
దైవసేవకుడైన బ్రదర్ జోసఫ్
తంబిగారి కృతజ్ఞతా ప్రార్ధన జీవితం మనకు ఎంతో ఆదర్శం. మన జీవితములో కూడా ఎన్నో
ఎత్తుపల్లాలు ఉన్నాయి. అన్ని సమయాలలో దేవున్ని స్తుతించుదాం.
మనం అన్నివేళలా దేవున్ని
స్తుతించకపోవడానికి కారణాలు: మనలోనున్న అనుమానం, స్వార్ధం, లోకవ్యామోహాలు,
అన్నింటిని చెడుగా చూడటం (మంచిని చూడకపోవడం), అసహనం లేదా ఓపిక లేకపోవడం, గోరువెచ్చతనముగా
జీవించడం మరియు కోపం. జోసఫ్ తంబిగారి మధ్యస్థ ప్రార్ధనద్వారా ఈ దుష్టశక్తులనుండి విముక్తిని
పొందుదాం. దేవున్ని ఎల్లప్పుడూ స్తుతించుదాం. కృతజ్ఞతాభావముతో నిండిన హృదయాలతో
జీవించుదాం.
నేటి
సువిశేష పఠనాన్ని ధ్యానించుదాం: పదిమంది కుష్టరోగుల గురించి
ఉన్నాము. పదిమందిలో ఒకడు తాను స్వస్థుడగుట గమనించి, ఎలుగెత్తి దేవుని స్తుతించుచు
తిరిగివచ్చి, యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. కుష్టరోగులు అనగానే,
జోసఫ్ తంబిగారి జీవితములో కూడా ఒక కుష్టరోగితో అనుభవం పొందాడు. తంబిగారి ద్వారా
దేవుడు అద్భుతకార్యాన్ని చేసాడు. తంబిగారు కేసరపల్లిలో ఉండగా జరిగిన యధార్ధ సంఘటన.
ఒకరోజు సాయంత్రం, తంబిగారు గన్నవరం వెళుతూ, పుల్లెల్లి అంథోని మరియు జోజప్ప అను ఇద్దరు
పిల్లలు గుడిదగ్గర ఆడుకొనుచుండగా, వారిని పిలిచి, అప్పట్లో కేసరపల్లికి, గన్నవరంకి
మధ్యన ఉన్న పెద్ద మర్రిచెట్టు వరకు తనతో రమ్మన్నాడు. అక్కడ ఆ కాలములో కుష్టరోగులకు
ఒక ఆసుపత్రి ఉండేది. ఒక కుష్టరోగి ఆ చెట్టుకింద కూర్చొని ఉండటం చూసారు.
కప్పుకోవడానికి సరియైన బట్టలుకూడా లేకపోవడముతో ఆ కుష్టరోగి చలికి బాగా
వణికిపోతున్నాడు. తంబిగారు అతనిదగ్గరకు వెళ్ళగా, ఆ వ్యక్తి తంబిగారివంక దీనముగా
చూసాడు. అప్పుడు జోసఫ్ తంబి తాను కట్టుకున్న లుంగీని తీసి ఆతనిపై కప్పాడు. వెంటనే,
అద్భుతరీతిన ఇంకొక లుంగీ వచ్చి జోసఫ్ తంబిగారిని కప్పివేసింది.
ప్రియ సహోదరీ సహోదరులారా! ఆనాడు
కుష్టరోగం. నేడు కరోన రోగం. ఇంకా ఎన్నో రోగాలతో బాధపడుతున్నాం. అన్నింటికన్న పెద్ద
రోగమైన పాపరోగముతో బాధపడుచున్నాము. కుష్టరోగికి సహాయం చేసిన అదే తంబిగారు నేడు మన
మధ్యలోనే ఉన్నారు. తన ప్రార్ధన ద్వారా మనకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నారు.
మనపై పవిత్రత అనే వస్త్రమును కప్పుటకు సిద్ధముగా ఉన్నారు.
1. మన
పాపము వలన ఈ కుష్టరోగులవలె మనము కూడా దేవుని ఎదుట ఆశుద్దులమే! కనుక మొదటిగా మనము దేవున్ని
ప్రార్ధించాలి. దేవుని కనికరము కొరకు ప్రార్ధించాలి. వారివలె మనము కూడా “ఓ
యేసుప్రభువా! మమ్ము కనికరింపుము” అని గొంతెత్తి కేకలు పెట్టాలి, గొంతెత్తి
ప్రార్ధించాలి. యేసుప్రభువు తప్పక ఆలకిస్తాడు. వారు స్వస్థత కొరకు ప్రార్ధన చేయలేదు.
అద్భుతం కొరకు ప్రార్ధన చేయలేదు. దేవుని కనికరము కొరకు ప్రార్ధన చేసారు. స్వస్థతకు
అర్హులని వారు భావించారు. పాపముతో నిండిన మనం ఇదే వైఖరితో దేవుని యొద్దకు రావాలి.
దేవుడు మనపై కనికరం చూపుతాడు. ఆయన కనికరముగల దేవుడు. రోమీ 10:12-13లో ఇలా
చదువుచున్నాము: “తనను ప్రార్ధించు వారిని అందరిని ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును.
ఏలయన, ప్రభు నామమున ప్రార్ధించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును.”
2. మన
విశ్వాసం పరీక్షింప బడును: యేసు
వారిని చూచి, “మీరు వెళ్లి యాజకులకు కనిపింపుడు” అని చెప్పాడు. వారి విశ్వాసానికి
పెద్ద పరీక్ష. ఆ పదిమంది పది రకాలుగా ఆలోచించి ఉండవచ్చు. స్వస్థత లేకుండా, అసలు యాజకులు
మమ్ములను కలువనిస్తారా అని ఒకరు, ఇదే మనకున్న చివరి అవకాశం, ఆశ అని ఇంకొకరు
అనుకోవచ్చు! రెండవ రాజుల గ్రంధములో చూస్తున్నాము (5వ అధ్యాయం).
సిరియారాజు సైన్యాధిపతి అయిన
నామాను మహాశూరుడు, కాని కుష్టరోగి. ఎలీషా వద్దకు రాగా, “నీవు వెళ్లి యోర్దాను
నదిలో ఏడు సార్లు స్నానము చేయుము. నీ శరీరమునకు మరల ఆరోగ్యము చేకూరును” అని
చెప్పాడు. అందుకు నామాను ఉగ్రుడయ్యాడు. మా దేశములో నదులు లేవా? అక్కడ మునిగి
ఆరోగ్యము పొందలేనా? అని ప్రశ్నించాడు. ఆయన విశ్వాసానికి పరీక్ష. ప్రవక్తను
ప్రశ్నించాడు. కాని, తరువాత నామాను ఎప్పుడైతే, తన తప్పును తెలుసుకొని, యిశ్రాయేలు
దేవుడు తప్ప మరియొక దేవుడు లేడని అంగీకరించినప్పుడు, ఆయన స్వస్థత పొందాడు.
మరి ఈ పదిమంది కుష్టరోగులు
ప్రభువు చెప్పింది చేసారు. అందుకే వారు మార్గ మధ్యముననే శుద్ధి పొందారు. వారు
అడుగకపోయినను యేసు వారిని స్వస్థపరచాడు.
3. యేసు
స్వస్థతను గమనించాలి: దేవుడు మన
జీవితములో ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. స్వస్థతలు చేస్తున్నాడు. మనం గమనించడం
లేదు. అందుకే మనం దేవున్ని స్తుతించలేక పోవుచున్నాము. ఆరాధించలేక పోవుచున్నాము. ఘనపరచలేక
పోవుచునన్నాము. మహిమపరచలేక పోవుచున్నాము.
అద్భుత వ్యక్తి అయిన
బ్రదర్ జోసఫ్ తంబిగారి మధ్యస్థ ప్రార్ధనల ద్వారా మనం ఎన్నో మేలులు పొంది ఉంటాము. ఆ
కుష్టరోగివలె మనం గమనించాలి. గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి,
యేసు పాదములవద్ధ సాగిలపడి కృతజ్ఞత తెలిపాడు. యాజకుల వద్దకు వెళ్ళకుండా, యేసు
ప్రభువే యాజకులకు యాజకుడని గుర్తించి తిరిగి ఆయన వద్దకు వచ్చాడు. ఈరోజు మనం
చేయవలసినది అదే. దేవుడు మన జీవితములో చేసిన అద్భుత కార్యాలను గమనించి దేవునికి
కృతజ్ఞతలు తెలుపుకుందాం.
దైవసేవకుడు బ్రదర్ జోసఫ్
తంబిగారి మహోత్సవాలను ముగుంచుకొను మనము కృతజ్ఞత కలిగిన హృదయాలతో దేవున్ని
స్తుతిస్తూ తిరిగి వెళదాం. జోసఫ్ తంబి గారు మనకోసం ఎల్లప్పుడూ ప్రార్ధన చేయుగాక!
దేవుడు మనలనందరినీ దీవించుగాక!
No comments:
Post a Comment