ప్రభువుని జ్ఞానస్నాన (బాప్తిస్మ) పండుగ, Year B

ప్రభువుని జ్ఞానస్నాన (బాప్తిస్మ) పండుగ, Year B
పఠనాలు: యెషయ 42:1-4, 6-7, అ.కా. 10:34-38, మార్కు 1:7-11

"జనులందరు బప్తిస్మము పొందిన పిదప యేసు కూడ బప్తిస్మము పొంది, ప్రార్ధన చేయుచుండగా ఆకాశము తెరువబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురమువలె ఆయనపై దిగివచ్చెను. ఆ సమయమున "నీవు నా ప్రియమైన కుమారుడవు. నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను" అని దివ్యవాణి వినవచ్చెను (లూకా 3:21-22).యేసు బప్తిస్మం గురించి నాలుగు సువార్తలలో చూస్తాము.

ఈరోజు యావత్‌ కతోలిక శ్రీసభ యేసుప్రభుని జ్ఞానస్నాన పండుగను జరుపుకొను చున్నది. ఈ పండుగతో క్రిస్మస్ కాలాన్ని ముగించుకొని, సామాన్య కాలములోనికి ప్రవేశిస్తున్నాము. నేటి పండుగతో, ఇన్ని యేళ్ళు నిగూఢముగా సాగిన యేసు జీవితం, బహిరంగ మవుచున్నది. యేసు బప్తిస్మ పండుగ కూడా సాక్షాత్కార పండుగవలె, ఆయన దైవత్వమును విశ్వాసులకు, యోహాను శిష్యులకు ప్రదర్శింప బడుచున్నది.

యేసుక్రీస్తు జ్ఞానస్నాన పండుగ సందర్భమున, ఆయన పొందిన జ్ఞానస్నానముయొక్క అంతరార్ధమును పరిశీలించుదాము. యేసు బప్తిస్మమునకు, మన క్రైస్తవ జీవితానికి మధ్యనున్న సన్నిహిత సంబంధమును గ్రహించుదాము. జ్ఞానస్నానములోని దైవానుగ్రహమును, దైవకృపను, అలాగే మన భాధ్యతలను గుర్తెరుగుట చాలా ముఖ్యము!

జ్ఞానస్నానము

జ్ఞానస్నానమును తపోస్నానమని, బప్తిస్మమని కూడా పిలుస్తాము. జ్ఞానస్నానము అనగా ‘‘జన్మపాపమును మరియు ఇతర పాపమును పోగొట్టి మనలను సర్వేశ్వరునికి తిరుసభ బిడ్డలుగా చేయు దేవద్రవ్యానుమానము. జన్మపాపము ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వ  నుండి సంక్రమిస్తుంది. ఇతర పాపము స్వయం కృతాపరాధము వలన జరుగుతుంది. "జ్ఞానస్నానం క్రైస్తవ జీవనానికి పునాది. పవిత్రాత్మయందు జీవానికి సింహద్వారం. ఇతర సంస్కారాలకు మార్గం చూపే ద్వారం. జ్ఞానస్నానం వల్ల పాపం నుంచి విముక్తలమయ్యాం. దేవుని పుత్రులముగా మళ్ళీ జన్మించాం. క్రీస్తు సభ్యులమయ్యాం. శ్రీసభలో చేర్చబడినాం. శ్రీసభ ప్రేషిత కార్యంలో భాగస్తులమయ్యాం. వాక్కునందు నీళ్ళద్వారా సంభవించే పునర్జీవన సంస్కారమే జ్ఞానస్నానం (సత్యోపదేశం 1213).

యేసు క్రీస్తు జ్ఞానస్నానము

జన్మపాపమును, ఇతర పాపమును పోగొట్టి ప్రజలను, విశ్వాసులను దేవుని బిడ్డలుగా చేయు దేవద్రవ్యానుమానమే జ్ఞానస్నానము. మరి క్రీస్తులో ఏపాపమును లేదు (హెబ్రీ 4:15, యోహాను 18:38, 19:4,6) ఆయన దేవుని కుమారుడు (లూకా 1:32, 35, మత్తయి 3:17). మరి యేసు క్రీస్తుకి జ్ఞానస్నానము అవసరమేనా? ఎందుకు, ఆయన జ్ఞానస్నానమును స్వీకరించారు? యోహాను అంత:రంగిక పశ్చాత్తాపమునకు,  మారుమనస్సుకు గురుతుగా బప్తిస్మమును ఇచ్చియున్నాడు (లూకా 3:3, మార్కు 1:4). 

మెస్సయ్య రాకకొరకు ప్రజలను సంసిద్ధం చేయుచున్నాడు: "పరలోక రాజ్యము సమీపించినది. హృదయపరివర్తనము చెందుడు" (మత్తయి 3:2). యేసులో ఏ పాపము లేదు కనుక, ఆయనకు పశ్చాత్తాపపడే అవసరం లేదు. అయినను, ఆయన యోహాను వద్దకు వచ్చారు. యోహాను యేసును అడ్డుకోవాలని ప్రయత్నించాడు, కాని యేసు జ్ఞానస్నానమివ్వమని పట్టుబట్టాడు. యేసు ఎందులకు జ్ఞానస్నానము స్వీకరించారు? 

మొదటిగా, దేవుని ప్రణాళికను నెరవేర్చుటకు: అందుకు యేసు యోహానుతో, "ఇపుడిట్లే జరుగనిమ్ము. దేవుని ప్రణాళిక అంతటిని మనము ఈ రీతిగా నెరవేర్చుట సమంజసము" (మత్తయి 3:15) అని పలికాడు. 

రెండవదిగా, లోకరక్షకుని మార్గమును సుగమము చేయు క్రమములో బప్తిస్మ యోహాను చెప్పినది (ప్రవచించినది), చేసినది అంతయు యధార్ధమని చెప్పుటకు. ఈవిధముగా, పాతనిబంధన ప్రవక్తల ప్రవచనాలను ప్రభువు సంపూర్ణం చేయుచున్నాడు. 

మూడవదిగా, పాపములోనున్న మానవాళితో తన సంఫీుభావమును తెలియజేయు నిమిత్తము, దేవుని సేవకులను, సేవకుల మాటలను గౌరవించాలని మనందరికీ ఒక సుమాతృకను ఇచ్చుటకు ఆయన జ్ఞానస్నానము స్వీకరించారు: "నేను చేసినట్లు మీరును చేయవలయునని మీకు ఒక ఆదర్శమును ఇచ్చితిని" (యోహాను 13:15).

నాలుగవదిగా, యేసు క్రీస్తు జ్ఞానస్నానములో ఇమిడియున్న పరమ రహస్యము ఏమనగా, యేసు నీటిలోనికి ప్రవేశించుట వలన, నీటిని పవిత్ర పరచాడు. ఆ నీటిద్వారా (జ్ఞానస్నానము) ఎంతోమంది రక్షణను సుగమం చేసాడు. యేసు బప్తిస్మం (నీటిలోనికి ప్రవేశం) సిలువ మరణానంతరం ఆయన సమాధి చేయబడుటను సూచిస్తున్నది. నీటిలోనుండి బయటకు వచ్చుట ఆయన మరణమును సమాధిని జయించుటను సూచిస్తున్నది, ఇచ్చట జ్ఞానస్నాన సమయములో పవిత్రాత్మను స్వీకరించిన ఆయన, మృత్యుంజయుడైన తరువాత పవిత్రాత్మ వరప్రదాతగా సూచిస్తున్నది. ఆదితల్లిదండ్రుల పాపఫలితముగా మూయబడిన స్వర్గద్వారము, క్రీస్తు జ్ఞానస్నాన సమయములో తెరువబడింది (మత్తయి 3:16). "ఆయన (క్రీస్తు) మిమ్ము పవిత్రాత్మతో స్నానము చేయించును" (మార్కు 1:8).

క్రీస్తు బప్తిస్మం -  క్రీస్తు అభిషేకం

యేసు యోర్దాను నదిలో జ్ఞానస్నాన మొందినప్పుడు, నీటితో గాక, దేవుని పవిత్రాత్మతోను, శక్తితోను, అభిషేకింప బడినాడు (మత్తయి 3:16, నేటి రెండవ పఠనం, అ.కా. 10:38). 

తండ్రి దేవుడు కుమార క్రీస్తు ప్రభువును అభిషేకించాడు (యెషయా 42:1, 6. 61:1-2, లూకా 4:18). ప్రధమ సృష్టి సమయములో నీళ్ళపై తిరుగాడిన ఆత్మ క్రీస్తుపై దిగివచ్చాడు. ఇది నూతన సృష్టి ప్రారంభానికి నాంది (సత్యోపదేశం 1224).

పూర్వవేదములో ఎవరైనా ఒక వ్యక్తి ప్రముఖమైన పనికి లేదా పదవికి నియమింప బడినప్పుడు దేవుని ఆత్మ ఆ వ్యక్తిపై దిగివచ్చేది. ఉదా: కాలేబు తమ్ముడైన కనసు కుమారుడు ఒత్నీయేలును ఇస్రాయెలీయులకు, న్యాయాధిపతిగా నియమించ బడినప్పుడు యావే ఆత్మ అతనిని ఆవేశించెను (న్యాయా. 3:9-10). శతృవులు యావేప్రజలపై  యుద్ధానికి సిద్ధమైనప్పుడు, గిద్యోనును దేవుని ఆత్మ ఆవేశింపగా అతడు బూరనూదెను (న్యాయా. 6:34). యోఫ్తా విషయములోను దేవుని ఆత్మ అతనిని ఆవేశించెను (న్యాయా. 11:29), యావే సౌలును తన ప్రజలకు రాజుగా అభిషేకించినప్పుడు (1 సమూ. 10:1), సౌలు రాజు యుద్ధమునకు పోవునప్పుడు (1 సమూ. 11:6), ప్రవిత్రాత్మ ప్రేరణముచే ప్రజలు ప్రవచనము పలుకుట చూస్తున్నాం. 

క్రీస్తు బప్తిస్మం - దైవ సాక్షాత్కారం

యేసు బప్తిస్మం ఒక సాక్షాత్కారం. "ఆయన నీటి నుండి వెలుపలికి వచ్చిన వెంటనే పర మండలము తెరువ బడుట, పవిత్రాత్మ పావుర రూపమున తనపై దిగి వచ్చుట చూచెను. అప్పుడు పరలోకము నుండి ఒక వాణి, 'నీవు నా ప్రియమైన కుమారుడవు. నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను' అని వినిపించెను" (మార్కు 1:10-11). ఈవిధముగా, తండ్రి దేవుడు, తన కుమారుడిని ఈలోకమున సాక్షాత్కరింప జేశాడు. అలాగే తన కుమారుని ప్రేషిత కార్యమును వెల్లడి చేసాడు. జ్ఞానస్నానం తరువాత తన జీవితాన్ని జనం మధ్య ప్రారంభించాడు. ఉత్థానం పిమ్మట శిష్యులతో, "మీరు వెళ్లి, సకల జాతి జనులకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నాన మొసగుచు, వారిని నా శిష్యులను చేయుడు" అని చెప్పాడు (మత్తయి 28:19). తండ్రి దేవుని వాక్కు, నేటి మొదటి పఠనములోని యెషయ ప్రవక్త ప్రవచనాలను ధ్వనిస్తుంది: "ఇదిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాడ్యుని చేసితిని. ఇతడినెన్నుకొంటిని. ఇతని వలన ప్రీతీ చెందితిని. ఇతనిని నా ఆత్మతో నింపితిని" (42:1). నేటి సంఘటన, త్రిత్వైక దేవుని సాక్షాత్కారం. క్రిస్మస్ యూదులకు సాక్షాత్కారం అయితే, ముగ్గురు జ్ఞానుల యేసు సందర్శన అన్యులకు సాక్షాత్కారం. అలాగే, నేటి యేసు బప్తిస్మ పండుగ పశ్చాత్తాప పడే పాపాత్ములందరికి ఓ గొప్ప సాక్షాత్కారం.

యేసు క్రీస్తు బప్తిస్మ పండుగను కొనియాడుచున్న మనము, నేడు దేవుడు తన దైవకుమారుని గురించి నీతో మాట్లాడటం నీవు వినాలి. నిన్ను, నన్ను మనలనందరినీ తండ్రి దేవుని వద్దకు చేర్చుటకే ఈ లోకమునకు పంపబడినాడు. అవును! దేవుడు ప్రాయశ్చిత్త బలిగా తన కుమారున్ని పంపాడు. మనలను రక్షించి దేవునితో సఖ్యపరచుటకు వాక్కు మానవుడైనది! (సత్యోపదేశం 457). కనుక, ఆ దైవకుమారున్ని నీ రక్షకుడిగా అంగీకరించు! నీ రక్షణకై ఆయనతో సహకరించు!

నేడు దేవునికి కృతజ్ఞతలు తెలుపుదాం. ఎందుకన, మనం పొందిన జ్ఞానస్నానము ద్వారా, ఆదిపాపమునుండి శుద్దులము గావింపబడినాము, దేవుని కృపను పొందియున్నాము, పవిత్రాత్మ వరమును పొందియున్నాము, దేవుని బిడ్డలమైనాము మరియు తల్లి శ్రీసభలో సభ్యులమైనాము. అలాగే, క్రైస్తవులముగా, మన ప్రేషితకార్య బాధ్యతను గుర్తించుదాం! ఎందుకన, యేసు ప్రేషితకార్యం, ఆయన జ్ఞానస్నానముతో ప్రారంభమైనట్లే, మన ప్రేషితకార్యము కూడా మన జ్ఞానస్నానంతో ప్రారంభమైనది. మన ప్రధాన బాధ్యత: మన జీవితాల ద్వారా క్రీస్తుకు సాక్షులుగా జీవించడం - క్రైస్తవ నైతిక విలువలుగల జీవితమును జీవించడం.

ప్రభువా! నీవు సృష్టికర్తయైన తండ్రి దేవుని కుమారుడవని, లోకరక్షకుడవని విశ్వసించు చున్నాను. తండ్రి కృపను, సత్యమును లోకమునకు తీసుకొని వచ్చితివని విశ్వసించుచున్నాను. మిమ్ములను నిత్యమూ అనుసరిస్తూ, ఆ కృపను, సత్యమును మేము పొందునట్లుగా మాకు మీ కృపను అనుగ్రహించండి!

No comments:

Post a Comment