తిరుకుటుంబ మహోత్సవము, Year B

తిరుకుటుంబ మహోత్సవము, Year B
సీరా 3:2-6, 12-14; కొలొస్సీ 3:12-27; లూకా 2:22-40

 

ఈ రోజు తిరుకుటుంబ పండుగ. ఇది అందరి కుటుంబాల పండుగ. తిరుకుటుంబం ప్రతీ క్రైస్తవ తిరుకుటుంబానికి ఆదర్శం. కాలం మారింది. పరిస్థితులు మారాయి. ఆశలు, ఆలోచనలు, అంతిమ లక్ష్యాలు మారాయి. జీవిత ప్రయాణం వేగవంతం అయింది. వైజ్ఞానిక పురోగమనంలో జీవితం ఓ యాంత్రికంగా మారింది. వ్యక్తుకు చూపించవసిన గౌరవం, ఇవ్వవసిన విలువ, వస్తువులలోకి మారిపోయింది. స్నేహితునికంటే, సెల్‌ఫోన్‌ ముఖ్యమైంది. మిత్రుడు క్రిందపడిపోతే లేవనెత్తే సమయం లేదుగాని, మత్తుమైకంలో, వస్తువ్యామోహంలో పడిపోవడానికి సమయాన్ని వెదుకుతున్నాడు ఈనాటి మానవుడు. కుటుంబంలోని పరిస్థితులు ఇందుకు భిన్నమేమి కావు. అలా అని అన్ని కుటుంబాలు ఇటువంటి దుర్భర స్థితిలో ఉన్నాయని కాదు. అయితే, కుటుంబ విలువలు మారుతున్నాయని, ఆప్యాయత అనురాగాలు సన్నగిల్లుతున్నాయని, పరస్పర అవగాహన, అంగీకారం చేజారిపోతున్నాయని మాత్రం మనం నేటి ప్రస్తుత కాలమాన పరిస్థితులను గమనిస్తే అర్ధం అయ్యే ఒక నిజ సత్యం! మరి, ఈ తరుణంలో మన కుటుంబాలు నజరేతు పవిత్ర కుటుంబమును పోలిజీవించడం ఎంతో ఆవశ్యకమైనది, ఉత్తమమైనది.

దేవుని ప్రియమైన కుమారుడు ఈ లోకంలో ప్రవేశించిన మరుక్షణమే మనకిచ్చిన వెలకట్టలేని, అత్యంత విలువైన, అమరమైన బహుమానం: తిరుకుటుంబం. ఈ భువిలో దివ్యమైన దేవుని ఉచితమైన, ఉదారమైన ఓ కానుక: పవిత్ర కుటుంబం. ప్రియ కుమారుని అత్యంత ప్రియమైన మొట్టమొదటి బహుమానం, ముచ్చటైన బహుమానం మహిమగల బహుమానం: యేసు, మరియ, యోసేపు నజరేతు కుటుంబం. పరస్పర విశ్వాసమున్న సభ్యుల మధ్య ఏర్పడే ఘనమైన అనురాగమే కుటుంబం. ఆ కుటుంబానికి ప్రేమ, ప్రతీక, విశ్వాసం పునాది. క్రీస్తు ప్రభువు మత్తయి 7:24లో ఇలా తెలియ జేశారు: ‘‘తన ఇంటిని (కుటుంబాన్ని) రాతి పునాదిపై (విశ్వాసం) నిర్మించుకున్నవాడే బుద్ధిమంతుడు (ఆత్మ స్వరూపుడు). అటువంటి కుటుంబాన్ని ఇటుక గోడలు ఆపలేవు, ఇసుక పునాదుల ఆదుకోలేవు. యేసు, మరియ, యోసేపు కుటుంబం ఓ పవిత్ర కుటుంబం. కారణం, వారు ఇహలోక నివాసముపై ఆధారపడలేదు. కాని, పరలోక విశ్వాసంపై తమ జీవితాన్ని నిర్మించుకున్నారు. అదేవిధంగా, కుటుంబం ఒక ప్రార్ధనా సమాజం. ప్రార్ధన చేసుకోవడమే కాదు, కాని, కలిసి ప్రార్ధించడం ముఖ్యం. దివ్యబలి పూజముందు, దివ్య సత్ప్రసాదమందు, ఇతర సంస్కారాల యెడల ముఖ్యముగా ఆదివారాలలో కుటుంబ సమేతంగా పాల్గొనాలి. నైతిక విలువలు, ఆధ్యాత్మిక ప్రభావాలు, సాంఘిక పుణ్యక్రియలు వంటివి మొదట నేర్చుకొనేది కుటుంబంలోనే! విశ్వమానంగ శక్తి, చనువుగ ప్రేమ కుటుంబంలోనే తప్ప ఆ అనుభవాన్ని మరెక్కడ పొందలేరు. ఇక్కడే వ్యక్తిగత, సాంఘిక కోణాలలో జీవితం మొదవుతుంది, పడుతుంది. ఇక్కడనే బిడ్డలు ఆరోగ్యకరమైన ఆత్మగౌరవాన్ని నేర్చుకుంటారు. తమ భావాలను ఎలా వ్యక్తం చేయాలోనన్న తర్ఫీదు పొందేది, ఆధ్యాత్మిక సత్యాలు జీర్ణించుకొని, వంటబట్టించు కొనేది, దేవునితో సత్సంబంధం ఏర్పరచుకొనేది ఇక్కడే!

ప్రతి క్రైస్తవ కుటుంబం తిరుకుటుంబాన్ని ఆదర్శముగా తీసుకోవాలి. భర్త యోసేపుగా, భార్య మరియగా, పిల్లలు యేసుగా ప్రవేశం చేయాలి. అనేక సమస్యలు, అవరోధాలు తిరుకుటుంబంలో వచ్చినట్లే మనం కుటుంబంలో కూడా వస్తాయని ఈ సందర్భంలో గుర్తించాలి. అనాడు ఏ కుటుంబం అనుభవించని కష్టనష్టాలను పవిత్ర కుటుంబం అనుభవించినది. ఒక నిండుచూలాలు, అప్పుడే ప్రసవించిన స్త్రీ, ఎముకలు కొరికే చలిలో బెత్లెహేము పురినుండి ఐగుప్తు దేశానికి ప్రయాణమై పోతున్నారు. ఎందుకంటే, హేరోదు రాజు తన సామ్రాజ్యంలో పుట్టిన మగ బిడ్డలను చంపమని ఆజ్ఞ జారిచేసినప్పుడు, మరియ, యోసేపు లోకరక్షకుడైన క్రీస్తుని సంరక్షించి, మనకు రక్షణను ప్రసాదించడానికి దోహదపడ్డారు. కనుకనే, నజరేతు కుటుంబం ఒక వర్ణనాతీత కుటుంబం, ఒక సువర్ణ కుటుంబం! దాని క్షణం - విశ్వాసం, దాని లక్ష్యం - ఆత్మీయం, ఎందుకంటే, ఇహలోక కష్టాలు, ఇబ్బందులు, అలజడు, అపార్ధాలు, ఆ కుటుంబంలోని విశ్వాసాన్ని విచ్చిన్నం చేయలేవు. ఇహలోక ఆలోచనలు, ఆరాటాలు, అంతస్తు, అపవిత్రత, ఆశుద్ధత, ఆ కుటుంబంలోని ఆత్మీయతను అపహరించలేవు. తద్వారా, మన కుటుంబాలు ఈ తల్లియైన శ్రీసభలో నజరేతు కుటుంబంవలె విశ్వాస - ఆత్మీయతకు ఆలయంగా నివాలి.

తిరు కుటుంబ పండుగ

క్రీస్తు జయంతి పండుగ వెలుగులో, శ్రీసభ తిరుకుటుంబ పండుగను కొనియాడుతూ ఉన్నది. క్రీస్తు జననం ద్వారా, దేవుడు గొర్రెల కాపరులకు చీకటిలో ఒక చిహ్నాన్ని ఇచ్చి యున్నాడు. తన ఏకైక కుమారున్ని, ఈ ప్రపంచానికి వెలుగు చిహ్నముగా ప్రసాదించాడు. అయితే, ఈ కుమారుని కర్తవ్యం, తండ్రి దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడం.  ఈ పనిని యేసు ప్రభువు ఈ రోజు ప్రారంభిస్తున్నాడు.

లూకా సువార్తీకుడు మాత్రమే యేసు కుటుంబం గూర్చి చెప్పియున్నాడు. మనం ఈనాటి సువిషేశములో వింటున్నాము. ఈ సంఘటన ఒక చరిత్ర ట్టముగా మనం చెప్పుకోవచ్చు. ఈ సంఘటన క్రీస్తు ప్రభువులో దాగియున్న వ్యక్తినిగూర్చి తెలియ జేస్తుంది. అయితే, ఈ సంఘటన, క్రీస్తు జయంతి పండుగకు సంబంధించినది కాదు. ఇది పాస్కా పండుగ సందర్భములో చోటు చేసుకొన్నటువంటి ఘటన. మోషే ఆజ్ఞానుసారము, యూదా మతానికి చెందిన ప్రతి మగ బిడ్డ సం.నికి కనీసం మూడుసార్లు, యెరూషలేము దేవాలయాన్ని సందర్శించుకోవాలి. అది ఒక ఆచారము. యోసేపు ప్రతి సం.ము ఈ యాత్రకు మరియమ్మతో వెళ్ళాడు. అయితే ఈ సారి మాత్రం తన కుమారుడైన యేసును కూడా వెంట తీసుకొని వెళ్ళాలి, ఎందుకన, యేసుకు 12 సం.లు వచ్చాయి. మోషే ఆజ్ఞ ప్రకారం, 12 సం.లు దాటిన ప్రతి మగబిడ్డకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ కారణం చేత, యేసు, యోసేపు, మరియమ్మలు కుటుంబ సమేతముగా వెళ్ళారు.

సువిషేశములో వింటున్న విధముగా, బాలయేసు ఆయన తల్లిదండ్రులతో కలసి యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ జరిగే ప్రార్ధనలో పాల్గొన్నాడు. దేవుని వాక్యాన్ని విన్నాడు. కాని పండుగ తరువాత, తన తల్లిదండ్రులతో తిరుగు ప్రయాణం కాలేదు. అక్కడే దేవాలయములో ఉండిపోయాడు. యోసేపు మరియమ్మలు ఎంతగానో కలవరపడ్డారు, ఆయన కోసం ఎంతగానో వెదికారు. చివరికి మూడవ రోజు, దేవాలయములో ఆయనను కనుగొన్నారు. ఈ మూడు రోజులు కూడా ఆయన మరణ పునరుత్థానములను సూచిస్తుంది. యేసు సిలువపై మరణించి, సమాధి చేయబడి, మూడవ దినమున ఉత్థానం అయ్యాడు. కనుక, బాలయేసు తప్పిపోయిన మూడు రోజులను కూడా ఆయన జీవితములో రాబోయే సంఘటనలను సూచిస్తుంది.

బాలయేసును దేవాలయములో చూడగానే, మరియమ్మ, "కుమారా! ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు, నేనును విచారముతో నిన్ను వెతుకుచుంటిమి" (లూకా 2:48) అని ప్రశ్నించినది. అందుకు యేసు, "మీరు నాకొరకు ఎలా వెదికితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలయునని మీకు తెలియదా? (లూకా 2:49) అని సమాధానం ఇస్తూ తను వచ్చిన దైవకార్యము గూర్చి తన తల్లి దండ్రులకు తెలియ జేసియున్నాడు. గబ్రియేలు దూత మరియమ్మతో, యేసు ఈలోకానికి ఎందులకు వస్తున్నాడో ముందుగానే తెలియజేయడం జరిగింది, "ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరి పాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు" (లూకా 1:33). అదే విధముగా, కలలో దూత యోసేపుతో, "ఏలయన, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును" (మత్త 1:21). అయితే ఈ రోజు దేవాలయములో, యేసు స్వయముగా తన గూర్చి, తన దైవ కార్యము గురించి తెలియ జేస్తున్నాడు.

యేసు ఈ లోకములో తన తల్లి దండ్రులకు విధేయుడై జీవించాడు. వారి అడుగు జాడలలో నడిచాడు. ఆయన యోసేపు మరియమ్మల కుమారుడుగా గుర్తించ బడ్డాడు. అయితే ఆయన దేవుని కుమారుడుకూడా! ఆయన నిజ దేవుడు. ఈ నాడు, యేసు మాటల ద్వారా తండ్రి దేవుడు సంకల్పించిన కార్యాన్ని కొనసాగించాలని యోసేపు మరియమ్మలు గుర్తించారు. రక్షణ కార్యములో వారి సహకారం కొనసాగాలని గుర్తించారు. మనము కూడా ఈ రక్షణ కార్యములో సహకరించాలి. మరియ యోసేపులు మన ఆదర్శం!

మన సహకారం లేకుండా మనలను సృష్టించిన దేవుడు, మన సహకారం లేకుండా మనలను రక్షించలేడు. మన రక్షణ నిమిత్తమై తండ్రి దేవుడు తన కుమారున్ని ఈ లోకానికి పంపాడు. ఈ రక్షణ కార్యములో మరియ యోసేపులు పాలుపంచుకున్నారు. వారి ఆదర్శాన్ని మనము పాటించాలి. అందుకే ప్రభువు మరియను మనందరికీ ఆధ్యాత్మిక తల్లిగా ఒసగాడు. మన కొరకు ఒక తల్లిగా తండ్రి దేవునికి ప్రార్ధన చేస్తుంది.

తిరు కుటుంబం, మనకు ముఖ్యముగా మూడు విషయాలను భోధిస్తుంది:

1. ప్రతీ విశ్వాసి, క్రీస్తు రక్షణలో భాగస్తులు కావాలి. ఆయన కార్యాన్ని ఈ లోకములో కొనసాగించాలి. దానిని కాపాడాలి. క్రీస్తు విశ్వాసాన్ని పొంది, దానిని ఇతరులతో పంచుకోవాలి, ఆయన రక్షణలో పాల్గొనే విధముగా చూడాలి. ఇది మన భాద్యత, కర్తవ్యం!

2. ఈ రక్షణ కార్యములో తిరుకుటుంబం, మనకు ఆదర్శముగా నిలుస్తుంది. ప్రతీ కుటుంబములో, సంతోషాలు, కష్టాలు, భాదలు, సహజం. తిరుకుటుంబం ఎన్నో కష్టాలను అనుభవించినది. అయితే, ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు. వారు ప్రార్ధనలో గడిపారు. వారి విశ్వాసమే వారిని ముందుకు నడిపించింది. మనం కష్టములో ఉన్నప్పుడు, తిరు కుటుంబాన్ని ఆదర్శముగా తీసుకొందాం. అదే స్పూర్తితో, ప్రార్ధనలో, విశ్వాసములొ ముందుకు సాగుదాం.

3. "నేను నా తండ్రి పని మీద ఉండవలయునని మీకు తెలియదా?" ఈ లోకములో తండ్రి పని ఏమిటి? తన ప్రేమను, వాక్కును, రక్షణము, శాంతిని స్థాపించడం. తిరుకుటుంబం ప్రేమలో జీవించింది. దేవుని వాక్యాన్ని విని ధ్యానించింది. ఆ వాక్కు ద్వారా జీవాన్ని, శాంతిని పొందింది.

ఈనాడు శాంతి లేక, మనస్పర్ధలతో ముక్కలైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. తిరు కుటుంబ ఆదర్శముగా, ఆ కుటుంబాలన్నీ ఒకటి కావాలని, తిరిగి ప్రేమలో, శాంతితో జీవించాలని ప్రార్ధన చేద్దాం! ఒకరి నొకరు అర్ధం చేసుకోవాలని, ఒకరి నొకరు మన స్పూర్తిగా అంగీకరించాలని ఆ తిరుకుటుంబాన్ని వేడుకొందాం!

1 comment: