నూతన సం.ర సందేశము

నూతన సం.ర సందేశము


కాలం ఎవరికోసం ఆగదు. క్షణాలు, రోజులు గడుస్తూనే ఉంటాయి. 2020ని పూర్తి చేసుకొని, 2021వ సం.లోనికి అడుగిడుతూ ఉన్నాము. 2020లో ఎన్నో చేయాలని అనుకున్నాము. కొన్ని సాధించాము. కొన్ని చేయలేక పోయాము. కొన్ని తీపిజ్ఞాపకాలు, కొన్ని చేదు అనుభవాలు. కనుక, 2021ని గొప్ప ఆశతో, నమ్మకంతో ప్రారంభిద్దాం. 2021లో కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవలసి ఉంటుంది - ఆధ్యాత్మిక, భౌతిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక మొ.గు విషయాలలో… 

క్రైస్తవులముగా, నూతన సం.న్ని ఎలా జీవించుదాం? దైవార్చన కాలెండర్ నూతన సం.మును మరియ మాతృత్వ మహోత్సవముతో ఆరంభిస్తుంది. రక్షణ ప్రణాళికలో మరియ పాత్ర గురించి ధ్యానిస్తాము. అలాగే, ఈరోజు, యేసు జన్మించి 8వ రోజు, కనుక దివ్య బాలునికి పేరు పెట్టిన రోజు (లూకా 2:21) ఆయన పేరు. ‘యేసు’, అనగా, “దేవుడు రక్షిస్తాడు.” మన రక్షణను గురించి ధ్యానిద్దాం.

2021వ సం.ను విజయవంతముగా మనము జీవించాలంటే, క్రైస్తవులుగా మొట్టమొదటిగా మనము క్రీస్తునందు జీవించాలి. క్రీస్తునందు జీవించడము లేదా క్రీస్తునందు ఉండుట అనగా ఏమిటి?

“క్రీస్తు యేసునందు” దేవుడు మనకు ఇచ్చిన అనుగ్రహములు:
1. క్రీస్తునందు ఉండుట అనగా అనాది కాలముననే క్రీస్తుయేసునందు అనుగ్రహమును మనకు ప్రసాదించెను. “మనము చేసిన కార్యముల వలనగాక, అనుగ్రహపూర్వకముగా తన సొంత ఉద్దేశంతోనే ఆయన మనలను రక్షించి, పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచెను. అనాది కాలముననే క్రీస్తుయేసునందు దేవుడు అనుగ్రహమును మనకు ప్రసాదించెను” (2 తిమో 1:9).

2. క్రీస్తునందు దేవుడు మనలను తన వారిగా ఎన్నుకొ నెను. “ఆయన ఎదుట మనము పవిత్రులను నిర్దోషులను ఉండుటకు లోకసృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారిగా ఎన్నుకొనెను” (ఎఫె 1:4).

3. క్రీస్తు యేసునందు మనము దేవుని చేత ప్రేరేపింపబడుచున్నాము. “మన ప్రభువైన క్రీస్తు యేసుద్వారా మనకు లభించిన దేవుని ప్రేమనుండి మనలను మృత్యువుగాని, జీవముగాని, దేవదూతలుగాని, లేక ఇతర పాలకులుగాని, ఇక్కడ ఉన్నదిగాని, రానున్నవిగాని, శక్తులుగాని, పైలోకముగాని, అదోలోకముగాని, సృష్టిలో మరి ఏదియు వేరు చేయ జాలదు” (రోమీ 8:38-39).

4. క్రీస్తు యేసునందు మనము క్షమించబడి రక్షించబడ్డాము. “క్రీస్తు రక్తం వలన మనము విముక్తులమైతిమి. ఆయన కృప ఐశ్వర్యములచే మన పాపములు క్షమింపబడినవి” (ఎఫె 1:7).

5. క్రీస్తునందు మనము దేవునితో ఏకమై ఉన్నాము. “క్రీస్తు పాపరహితుడు. కాని, దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగ చేసెను. ఎలయన, ఆయనతో ఏకమగుటవలన, మనము దేవుని నీతిగా రూపొందింపవలెనని అట్లు చేసెను” (2 కొరింతు 5:21).

6. క్రీస్తు యేసునందు మనము నూతన సృష్టిగా మారియున్నాము మరియు దేవుని బిడ్డలమైనాము. “ఎవ్వరైనను క్రీస్తునందున్న యెడల అతడు నూతన సృష్టి! పాత జీవితము గతించినది. కొత్త జీవితము ప్రారంభమైనది” (2 కొరింతు 5:17). “క్రీస్తు యేసునందు విశ్వాసము వలన మీరు అందరును దేవుని పుత్రులు” (గలతీ 3:26).

క్రీస్తునందు జీవించిన యెడల దేవుడు మనకు ఇన్ని ప్రయోజనాలను కలుగజేసియున్నాడు. కనుక 2021వ సంవత్సరం మనకు శుభదాయకంగా ఉండాలంటే, క్రీస్తునందు మనము జీవించాలి. పునీత పౌలుగారన్నట్లు, “ఆయన యందే మనము జీవించుచు, సంచరించు చున్నాము! ఉనికిని కలిగి ఉన్నాము” (అ.కా. 17:28).

అలాగే, క్రీస్తునందు జీవించుట అనగా “క్రీస్తు సాన్నిధ్యము”ను మనతో తీసుకెళ్లడం. క్రీస్తు సాన్నిధ్యము అనగా మనము క్రీస్తుతో జీవించటం, క్రీస్తుతో ఉండటం. క్రీస్తు అనుభవాన్ని కలిగి జీవించటం. విశ్వాసంలో నమ్మకముతో జీవించటం. దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని చిత్తాన్ని తెలుసుకుని దాని ప్రకారం జీవించటం. దివ్య సంస్కారాలలో క్రీస్తు సన్నిధిని క్రీస్తు అనుభవాన్ని, దేవుని అనుగ్రహాలను పొందటం. ప్రార్థన జీవితానికి విశ్వాసముగా ఉండటం.

మన జీవితములో, మన బంధాలలో, క్రీస్తు యేసు సర్వం అయి ఉండాలి. మన క్రైస్తవ విశ్వాసాన్ని యేసులో, ఆయన వాక్కులో బలపరచు కొందాం.

క్రైస్తవులముగా, 2021 లో ఈ క్రింది విషయాలను గుర్తుంచు కొందాం:
1. దేవుడు నిన్ను సృష్టించాడని, ఈ లోకానికి నిన్ను ఒక అందమైన కానుకగా ఇచ్చాడని మరువకు. నిన్ను తన అర చేతులలో మోస్తూ కాపాడుచున్నాడు. ఆయన లేనిది, నీవు లేవని మరువకు.
2. నీతో, నీకున్న దానితో సంతోషముగా ఉండు. నిన్ను చేసిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు (ద్వితీయ. 23:5). ఆయన సహాయం కోరుకో.
3. నీవు తీసుకొనే నిర్ణయాలకు, నీవే బాధ్యుడవు. కొన్నిసార్లు, మన నిర్ణయాలు బాధిస్తాయి. నిరాశ చెందక, నేర్చుకొని ముందుకు సాగిపో! నీ అనుభవానికి, దేవునికి కృతజ్ఞతలు తెలుపు (1 కొరి. 16:8).
4. కొన్ని సార్లు, మనం అనుకున్నవి, ఆలోచించినవి, ఊహించినవి, జరగకపోవచ్చు! దీనిని ఒక ఆశీర్వాదముగా భావించండి. ఒక తలుపు మూసుకుంటే, మరో తలుపు మన కోసం తెరచుకుంటుంది. జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకో!
5. నీ కష్టాలను, బాధలను లెక్కింపక, నీవు పొందే వరాలను లెక్కింపు (రోమీ 8:18). దేవుడు నీకు ఇచ్చే వరాలను నీవు లెక్కించు!
6. ఎల్లప్పుడూ, నీకు సాధ్యమైనది, మనస్ఫూర్తిగా చేయి. దేవుడు నీ నుండి ఆశించేది అదే!
7. నీ జీవితములో వచ్చే ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో!
8. ప్రార్థన, శక్తిగల ఆయుధమని, నీకు సహాయంగా ఉండునని మరువకు! (ఫిలిప్పీ 4:6).
9. నిజమైన సంతోషం పొందుటలో కన్న, ఇవ్వడంలో ఉంటుందని తెలుసుకో!
10. అద్భుతాలు జరుగుతాయి: నీవు, నేను ఒక అద్భుతమే!
11. శోధనలు అన్ని చోట్ల ఉంటాయి, వాటికి ‘కాదు’ అని చెబితే సరిపోతుంది.
12. నీ పొరుగువారికి, తెలియనివారికైనా, సహాయం చేయడం మరచిపోకు. అన్నింటికన్నా ఎక్కువగా మనందరం మంచి మానవతా బంధాలను కలిగి జీవించుదాం. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, సహాయం చేసుకుంటూ ముందుకు సాగుదాం. నిజమైన స్వేచ్ఛ సత్యములను కనుగొని జీవించుట న్యాయం సామాజిక నైతిక విలువలతో జీవించుట శాంతి స్థాపన మరో ముఖ్య అంశం కనుక అది మన ద్యేయం అయి ఉండాలి.

ప్రతి ఒక్కరం కూడా, జీవితములో ఎగుడుదిగుడులను, ఒడిదుడుకులను ఎదుర్కొంటాము. మనుము తల్లి శ్రీసభ ఒడిలో పదిలంగా ఉంటాము; దేవదూతలు, పునీతులు మనకు సహాయము చేయుదురు; మరియ తల్లి మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది; దివ్య సంస్కారాలు మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడును.

నూతన సం.న ధ్యానమునకు, బైబుల్ వాక్యాలు: 2 కొరి. 5:17; ఎఫే 4:22-24; యెషయా 43: 18-19; యిర్మీయా 29:11.

అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!

No comments:

Post a Comment