ఆగమనకాల నాలుగవ ఆదివారము

ఆగమనకాల నాలుగవ ఆదివారము 
2 సమూ. 7: 1-11, 16, రోమీ. 16:25-27, లూకా 1:26-38 

ఈనాటి పఠనాలు ఒక గొప్పవిషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దేవుడు మనందరికీ ఒక్కొక్క ప్రణాళికను ఈర్పాటు చేసియున్నాడు. ఆ ప్రణాళిక తప్పక నెరవేరుతుంది. మన హృదయాలలో నిజమైన శాంతి నెలకొనాలంటే, దేవుని ప్రణాళిక, మన ప్రణాళిక కావాలి – ఈ విషయం గురించే మనం “పరలోక జపము”లో, ''మీ చిత్తము నెరవేరును గాక” అని ప్రార్ధిస్తున్నాము. 

దావీదు మాహారాజు దేవాలయమును నిర్మించుటకు నిర్ణయించుకున్నాడు. అది తన ఆలోచనగా, ప్రణాళికగా భావించాడు. కాని, అది దైవ ప్రణాళిక: ''ప్రభువు ఇల్లు కట్టని యెడల దానిని కట్టినవారి శ్రమ వ్యర్ధమగును'' (కీర్తన. 127:1). దావీదును, అతని వంశమును నిత్యకాలము నిలచే ఆలయముగా, మెస్సయ్య జన్మించే ఆలయముగా నిర్మించాలనేది దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక! దేవుని ''మాస్టర్ ప్లాన్'' విశ్వసృష్టితోనే ఆరంభమైనదని మనందరికి తెలుసు! రక్షణ ప్రణాళికను ''స్త్రీ మరియు ఆమె సంతతి'' ద్వారా ఏదేను తోటలోనే ఏర్పాటు చేసియున్నాడు (ఆది. 3). ఈ ప్రణాళిక పరిపూర్తికి ఆరంభం. 

సువిశేష పఠనములో చూస్తున్నట్లుగా, ''దావీదు వంశస్తుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక మరియమ్మయొద్దకు దేవుడు గబ్రియేలు దూతను పంపెను'' (లూకా. 1:26-27). దేవుని ప్రణాళిక సారాంశం లూకా. 1: 31-33 వచనాలలో చూస్తున్నాము. 

లూకా. 1:26-27: ఈ ఆలోచనే అప్పటి వారికి ఒక పరిహాసముగా తోచియుండవచ్చు. ఎందుకనగా, గలిలీయ తృణీకరించబడిన పట్టణము. “గలిలీయనుండి ఏ ప్రవక్తయు రాడు” (యోహాను. 7:52) అని ఆనాటి ప్రజలు నమ్మారు. అందుకే, “నజరేతునుండి ఏదైనా మంచి రాగలదా?” అని యోహాను. 1:46లో చదువు చున్నాము. దేవుని ఆలోచనలు, ప్రణాళికలు వేరుకదా! ఆయన గలిలీయ పట్టణమునుండియే, ప్రవక్తలందరిలో గొప్పప్రవక్తను ఎన్నుకొంటున్నాడు. ఈ విధముగా, ప్రవక్తల ప్రవచనాలు, ముఖ్యముగా యెషయ ప్రవక్త ప్రవచనాలు నేరవేర్చ బడుతున్నాయి. దావీదు వంశస్తుడగు యోసేపునకు 'ప్రధానము' చేయబడిన మరియమ్మ అను కన్యకకు శుభసందేశాన్ని అందించుటకు గబ్రియేలుదూత పంపబడెను. ఇక్కడ గమనించవలసిన విషయం: మరియమ్మ కన్యక. ‘ఆమె ఏ పురుషుని ఎరుగకపోవడం’ (లూకా. 1:34). ఆమె ప్రధానము (engagement) చేయబడిన కన్యక. ఇంకను వివాహము జరగలేదు. చట్టప్రకారముగా, భవిష్యత్తులో తన భర్తతో ఉండవలసినది. ఈ పరిస్థితినుండి బయటపడాలంటే విడాకులు అవసరం (మత్త. 1:19). ఆ కాలములో ప్రధానము జరిగిన తర్వాత, ఇరువురు శారీరక సంబంధమును కలిగియుండవచ్చు. కాని, మరియ యోసేపుల విషయములో అలా జరగలేదు. దేవునియందు పరిపూర్ణముగా, పరిశుద్ధముగా జీవించుటకు నిర్ణయించుకొని యున్నారు. సాధారణముగా, 'ప్రధానము' సమయం పన్నెండ్రు మాసాలు ఉండేది. ‘ఆరవమాసము’ యోహాను గర్భమందు పడిన తర్వాత ఆరవమాసము. ఇశ్రాయేలు ప్రజలు, మెస్సయ్యకోసం, ఎంతోకాలము ఎదురుచూపు తర్వాత, దేవుని ప్రణాళిక ఇప్పుడు వేగముగా జరగడం చూస్తున్నాం. దేవుని శుభసందేశం గబ్రియేలు దూతద్వారా పంపడుతుంది. గబ్రియేలు దూత, గలిలీయలోని నజరేతు నగరమునకు పంపబడెను. 

లూకా. 1:28: “అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ప్రభువు నీతో ఉన్నారు.” మరియ 'అనుగ్రహ పరిపూర్ణురాలు'. ప్రతీ స్త్రీ మెస్సయ్యకు తల్లి కావాలని కోరుకొనేది. కాని, అందరి స్త్రీలలోకెల్ల మారుమూల నజరేతులోనున్న మరియను దేవుడు ఎన్నుకున్నాడు. భర్తను ఎరుగక జన్మనివ్వడం సమాజములో అవమానకరమని మనందరికీ తెలిసిన విషయమే! ఆ అవమానాన్ని భరించుటకు 'ప్రభువు ఆమెతో ఉన్నారు'. ఆమె గర్భమునుండి సంపూర్ణ మానవత్వం-దైవత్వం కలిగిన దేవుని కుమారుడు జన్మించవలసి యున్నది. మరియ జీవితములో జరగబోయే ప్రతీకార్యములో ఆమెతో ఉంటాడని, దేవుడు అభయాన్ని ఇస్తున్నాడు. 

లూకా. 1:29: ''మరియ కలత చెందినది.'' దేవుని శుభవచనాలకు అర్ధమేమిటోయని ఆలోచించినది. తననుండి దేవుడు ఏదో గొప్ప విషయాన్నే కోరుతున్నాడని ధ్యానించి ఉంటుంది. ఇంతకుముందు ఇలాంటి దర్శనాలను పొందిన సంఘటనలు ఆమె మదిలో మెదలి ఉంటాయి (ఆది. 18:10-15; న్యాయా. 13:3-5, 9). 

లూకా. 1:30: ''మరియమ్మా! భయపడకుము. నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో! నీవు గర్భమును ధరించి కుమారుని కనిదెవు. ఆ శిశువునకు 'యేసు' అని పేరు పెట్టుము. దేవుని అనుగ్రహమనేది మనపైగాని, మన కార్యాలపైగాని ఆధారపడదు. దేవుని అనుగ్రహం ఒక వరం. ఆ వరాన్ని, అనుగ్రహాన్ని మరియమ్మ పొందియున్నది. మరియ ఒక కన్యకగా గర్భము ధరించవలసి యున్నది. ఎందుకన, పవిత్రాత్మ ఆమెపై వేంచేయును. యెషయ 7:14 వచనం గుర్తుకు వస్తుంది: ''యువతి గర్భవతియై యున్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు (“దేవుడు మనతో ఉన్నాడు”) అని పేరు పెట్టును. ‘యేసు’ అనగా ‘ప్రభువు రక్షణ’. 

లూకా. 1:32-33: గబ్రియేలుదూత జన్మించబోయేవాడు ఎలాంటివాడో తెలియపరుస్తుంది: ''మహనీయుడు, మహోన్నతుని కుమారుడని పిలువబడును, ప్రభువగు దేవుడు, తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును, ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును, మరియు ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు.'' 

లూకా. 1:34: ''నేను పురుషుని ఎరుగనుకదా! ఇది ఎట్లు జరుగును?'' మరియమ్మ అమాయకత్వం కనిపిస్తుంది. ఇదంతయు కూడా పవిత్రాత్మ దేవుని శక్తివలన జరుగును. 

లూకా. 1:35: పవిత్రాత్మ వలన గర్భము! మానవుని ఆలోచనలకు అందనటువంటిది. ఇది మానవ శక్తితో జరిగేది కాదు. కాని, దేవుని మహోన్నతమైన పవిత్రాత్మ శక్తివలన జరిగెడి రక్షణ ప్రణాళిక. అందుమూలముననే, జన్మించేవాడు, మహోన్నతుని కుమారుడు, దేవుని కుమారుడు అని పిలువబడును. ఈవిధముగా, రాబోవువాని జన్మ అద్భుతమైనదని, ఆ రాబోవువాడు మెస్సయ్య అని తెలియుచున్నది. 

లూకా. 1:36-37: ఎలిశబేతమ్మ ముసలి ప్రాయములో గర్భము ధరించడముగూర్చి వింటున్నాం. ఇప్పుడు ఆరవమాసము. గబ్రియేలు దూత దీనిని కేవలం ఒక వార్తగా కాకుండా, ఆ ఇరువురి (యోహాను, యేసు) జన్మల ప్రాముఖ్యతనుగూర్చి తెలియ పరస్తుంది. దేవుని వాక్యము శక్తివంతమైనది, ఫలవంతమైనదని తెలుస్తున్నది. మరియమ్మకు దూతద్వారా అందిన దేవుని వాక్యముకూడా తప్పక నేరవేరునని నిరూపితమగు చున్నది. యుక్తవయస్సులోనున్న మరియకు ఇది ఒక పెద్ద విధియే! అందుకే ఎలిశబేతమ్మను గూర్చి చెప్పడము వలన మరియపట్ల దేవుని కరుణ, దయ, స్పష్టమగుచున్నది. ''దేవునికి అసాధ్యమైనది ఏదియు లేదు'' అని ధ్యానించుదాం! 

లూకా. 1:38: ''ఇదిగో! నేను ప్రభువు దాసిరాలను. నీ మాటచొప్పున నాకు జరుగునుగాక!'' దేవుడు తనని ఎందుకు ఎన్నుకున్నాడో మరియ పత్యుత్తరంద్వారా నిరూపితమగుచున్నది. దేవుడు మరియను అనుగ్రహించాడు; ఆమె ప్రభువు దాసిరాలు. మరియ దేవుని చిత్తానికి తననుతాను పరిపూర్ణముగా సమర్పించుకొన్నది. పరిపూర్ణమైన విధేయతను చూపించింది. అసాధ్యమైనది తననుండి కోరబడినది. కాని, దేవునికి అసాధ్యమైనది ఏదియు లేదని మరియమ్మ విశ్వసించినది. దేవుని ప్రణాళికయే, తన ప్రణాళికగా భావించినది. మరియ గర్భం నిత్యకాలము నిలచే, దేవుడే స్వయముగా ఏర్పాటుచేసికొన్న దేవాలయము. దేవుని ఆలోచన, ప్రణాళిక సజీవమైనది! ఇదంతయు మనరక్షణ నిమిత్తమేనని మనం మరువకూడదు సుమా! 

మనముకూడా మరియవలె క్రీస్తుకు ఈ లోకములో జన్మనివ్వాలి. మన హృదయాలు ఆయనకు ఆలయాలు కావాలి. ఆయన నిత్యకాలము మనలో నివసించాలి. పునీత పౌలు వాక్యాలను గుర్తుకు చేసుకొందాం: “ఆయనతో ఏకత్వము వలన మీరును అందరితో కలసి ఒక గృహముగా నిర్మింపబడు చున్నారు. అందు దేవుడు తన ఆత్మద్వారా నివసించును” (ఎఫెసీ. 2:22). “మనము ఈ భూమిమీద జీవించు ఈ గుడారము, అనగా మన భౌతిక దేహము శిధిలమగును. అప్పుడు మన జీవమునకై దేవుడు పరలోకమున ఒక గృహమును ఒసగును. అది చేతులతో చేసినది కాదు. అది ఆయనచే నిర్మింపబడినదే. పైగా నిత్యమైనది” (2 కొరి. 5:1).

3 comments:

  1. Very nice. Wish I could read telugu. Would be happy to get English version.
    Thank you for the effort.
    God bless you

    ReplyDelete
  2. Praise lord fr ... message. Good

    ReplyDelete
  3. Good message Father. Thank you

    ReplyDelete