ఆగమనకాల మూడవ ఆదివారం, Year B
యెషయ 61:1-2, 10-11, 1 తెస్స. 5: 16-24, యోహాను. 1 : 6-8, 19-28
మొదటి పఠనములో, శుభవార్తప్రకటన, బంధీలకు విముక్తి అను దైవకార్యమును కల్గియుండి రాబోవువానిని గూర్చి యెషయప్రవక్త ప్రవచిస్తున్నాడు. సువిశేష పఠనములో ఈ లోకమునకు వెలుగైనున్నవాని రాకనుగూర్చి బప్తిస్మ యోహానుగారు ప్రవచిస్తున్నారు.
గత ఆదివారముకూడా యోహానుగూర్చి, అతని జీవితము, బోధనలగూర్చి ధ్యానించి యున్నాము. ఈ రోజుకూడా, బప్తిస్మ యోహానుగూర్చి సువిషేశములో వింటున్నాము. అతను ఎవరో, ఎవరు కాదో సుస్పష్టముగా ఈరోజు తెలుసుకోవచ్చు. మొదటిగా, ఎలియావలె దుస్తులు ధరించినప్పటికినీ (మా 1:6, 2 రాజు 1:8), ఎలియావలె పశ్చాత్తాపము, తీర్పుగురించి ప్రకటించినప్పటికిని (1రా. 18:21, 2 రా.ది. 21:12-15), యోహాను పరలోకమునుండి తిరిగివచ్చిన ఎలియా కాదు (2 రా. 2:11). అయితే, యోహాను శారీరకముగా ఎలియా కానప్పటికిని, అతడు ఎలియా ఆత్మయును, శక్తియును కలిగి (లూకా 1:17; మలాకి 3: 23-24) దైవకార్యమును పరిపూర్ణము చేయుటకు పంపబడినవాడు. యోహాను దేవుని వాక్యమును ప్రకటించినప్పటికిని, ద్వి.కాం. 18: 15-19 లో మోషే ప్రవచించిన ప్రవక్తయును కాదు. తల్లిగర్భమునుండియే పవిత్రాత్మతో అభిషిక్తుడైనప్పటికిని, అతను మెస్సయ్య కాదు (లూకా 1: 15,44).
మరి యోహాను ఎవరు? యోహాను ప్రభువుమార్గమును సిద్ధముచేయుటకు ఎడారిలో ఎలుగెత్తి పలుకు స్వరము (యోహా 1:23). ఎవరిపై అయితే పరమండలము నుండి ఆత్మదిగివచ్చినదో (యోహాను 1:32), మరియు మొదటి పఠనములో విన్న వాగ్దానములను పరిపూర్ణము చేయుటకు వచ్చియున్నాడో (లూకా 4:16-21) అతనిని మనకు పరిచయం చేయుటకు పంపబడినవాడు.
క్రిస్మస్ దినమునవచ్చు మెస్సయ్యను విశ్వసించుటకు బాప్తిస్మ యోహాను మనకు 'వెలుగు'ను చూపించుటకు వచ్చినవాడు. యోహాను ఆ వెలుగు కాదు. కాని, ఆ వెలుగునకు సాక్షమీయ వచ్చెను. ఈ వెలుగు కోసమే మనం ఈ ఆగమన కాలమంతయు ఆయత్తపడుతూ, విశ్వాసముతో, నమ్మకముతో, గొప్పఆశతో ఎదురు చూస్తున్నాము. వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది. వెలుగు వచ్చినపుడు మనలో, మన చుట్టూ ఉన్న అంధకారము పటాపంచలు అవుతుంది.
మనందరికి తెలిసినవిధముగా, వెలుగు చీకటి రెండు ఏకకాలములో విమడలేవు. చీకటివున్నచోట వెలుగు ఉండదు. వెలుగుఉన్నచోట చీకటి ఉండదు. ఆ వెలుగు పేదలకు సువార్తను భోదించుటకు, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలిగించుటకు, పీడితులకు విమోచనము కలుగజేయుటకు మరియు ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు పంపబడెను (లూకా 4:18-19). క్రీస్తు వచ్చినప్పుడు మనలోని అంధకారము పటాపంచలు అవుతుంది. ఆయన రాకతో మనజీవితాలు ప్రకాశవంతమవుతాయి. ఆ వెలుగు ఈ లోకమున ఉండెను. ఆ వెలుగు మూలమున ఈ లోకము సృజింపబడెను.
ఈనాటి రెండవ పఠనములో, పౌలుగారు ''సర్వదా సంతోషముగా ఉండుడు'' అని చెప్పుచున్నారు. ఒకరు ఆదిశిస్తే వచ్చేది కాదు సంతోషం. అది ఒక అనుభూతి. కాని, పౌలు గారు చెప్పిన విధముగా, మనం ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి, ఉండగలం. ఎందుకన, మన సంతోషానికి మూలాధారం మన ప్రభువు. మన బాధలలో కూడా, మనం సంతోషముగా ఉండవచ్చు. మనం ఎంత సంతోషముగా ఉన్నామనేది, మనం ప్రభువునకు ఎంత దగ్గరగా ఉన్నామో, ప్రభువు మనకి ఎంత దగ్గరగా ఉన్నాడో అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, మనం ప్రభువునకు ఎంత దగ్గరగా ఉంటె, అంత సంతోషముగా ఉండగలం. ప్రభువు శిలువలోనున్న, బాధలలోనున్న ఆయన ప్రభువే. శిలువనుండి కూడా మనకి సంతోషాన్ని ఇవ్వగలడు. 'కష్టాలు వచ్చినప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు' అని అంటాము కదా! మరి అలాంటప్పుడు, మన బాధలో, దుఃఖంలో, వ్యాధిలో కూడా మనం ప్రభువుతో ఉన్నప్పుడు సంతోషముగా ఉండగలం. ప్రతీ పునీతుని సంతోష రహస్యం అదే! బాధలు వారి సంతోషాన్ని అధికమే చేసాయి. ఎందుకన, వారు ఎల్లప్పుడూ ప్రభువుతో ఉన్నారు కనుక! ఇదీ మన సంతోష రహస్యముకూడా కావాలి!
ప్రభువునకు చేరువ కావాలంటే, మనకి, మన ప్రభువునకు మధ్య ఉన్న ఆటంకాలను తొలగించాలి. ఇంకో మాటలో చెప్పాలంటే, మన జీవితము నుండి, మన పాపాలను తీసివేయాలి. మన పాపమే ప్రభువునుండి మనలను దూరం చేస్తుంది. దీనికి, మొట్టమొదటి మెట్టు 'పాప సంకీర్తనము'.
ప్రతీదినం, ప్రతీక్షణం, ప్రభువు మనలను ఎక్కడ ఉండమని నిర్దేశిస్తే అక్కడ ఉండాలి. మన బాధ్యతలను సక్రమముగా నిర్వహించాలి. ఆదివార దివ్యపూజలో విశ్వాసముగా పాల్గొనాలి. అప్పుడే, ప్రభువునకు విశ్వాసముగా ఉండగలం, ఆయనకీ దగ్గర కాగలం.
''సదా ప్రార్దింపుడు'' (1 తెస్స 5:17). ప్రార్దన అనగా ప్రభుతో సంభాషించడం. ఆయనతో ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా, మాట్లాడవచ్చు. ''పొరుగు వారిని ప్రేమింపుడు''. క్షమా, అర్థంచేసుకోవడం, అంగీకారం, ప్రోత్సాహం అను గుణాలను అలవర్చుకొందాం. ఈ విధముగా, ప్రభువునకు ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండగలం. ''అన్ని వేళల యందును కృతజ్ఞులై ఉండుడు (1 తెస్స 5:18).
ఇలా ప్రభువునకు చేరువ అయినప్పుడే, పరిపూర్ణమైన ఆనందముతో, సంతోషముతో క్రిస్మస్ పండుగను కొనియాడగలము. ప్రభుహితమైన సంవత్సరమును కొనియాడుటకు క్రిస్మస్ రోజు మనదరికి చాల ప్రత్యేకమైనది. యెషయ ప్రవక్తద్వారా, పౌలుగారి లేఖద్వారా, మరియు బాప్తిస్మ యోహానుగారి ద్వారా, ప్రభుహితమైన సంవత్సరమును కొనియాడుటకు, సంతోషముతో, ఆనందముతో మనల్ని మనం సిద్ధపరచు కోవాలని ప్రభువు ఆదేశిస్తున్నారు.
No comments:
Post a Comment