మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవం - జనవరి 1

జనవరి 1వ తేదీ
(మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవం)

*◾◾ భౌతికంగా మరియ తల్లి క్రీస్తుకు మాత్రమే తల్లి. కానీ ఆధ్యాత్మికంగా క్రీస్తు బాటలో నడిచే ప్రతి ఒక్కరికీ ఆమె తల్లి..*
.............................‌...........
*◾ మరియమాత కన్న ఏకైక కుమారుడు యేసు ప్రభువైతే మరియ మాతృత్వం యేసు ప్రభువు ద్వారా ఆయన రక్షించబోయే మానవులందరికీ సంక్రమిస్తుంది, తన ప్రియ కుమారుడు యేసు నామమున ముక్తి భాగ్యాన్ని పొందే భక్త జనులందరూ ఆ మాతృమూర్తికి కుమారులు, కుమార్తెలు అవుతారు*
.......................................
క్రీస్తునందు మిక్కిలి ప్రియ విశ్వాసులందరికీ నూతన సంవత్సర మరియు మరియ దివ్య మాతృత్వ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం రోజున మన యావత్ విశ్వ శ్రీసభ మరియమాత దివ్యమాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుతూ ఆ తల్లి మాతృత్వంలో దాగి ఉన్న గొప్పతనాన్ని గూర్చి, పరిశుద్ధతను గూర్చి మరియు మరియతల్లి సకల మానవాళికి తల్లి అనే సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నది. ఈ మేరకు మరియ తల్లిని గూర్చి ఈ వ్యాసం ద్వారా కొన్ని విషయాలను తెలుసుకుందాం-:

*దేవుని మాత మరియ-:*
మరియ తల్లి సాక్షాత్తు దేవుని తల్లి.... దేవమాత అని అంటే మనలో కొందరికి ఆశ్చర్యం కలగొచ్చు. మన తోటి ప్రొటెస్టెంట్ మిత్రులు అయితే ఏకంగా మరియతల్లి ఒక సాధారణమైన మానవమాత్రురాలు గదా, దేవుని చేత సృష్టింపబడిన ఒకానొక స్త్రీ మూర్తే గదా, ఆవిడ మనలాంటి మనిషే కదా తనను సృష్టించిన దేవునికి తల్లి ఎలా కాగలుగుతుంది?! మరి అలాంటప్పుడు మరియ తల్లిని "దేవమాత" అని పిలవటం వాక్యానుసారం కాదు గదా! ఇలా అనేక ప్రశ్నలు వాళ్ళు కతోలికులను అడుగుతూ ఉంటారు. నిజానికి ఇవన్నీ సహేతుకమైన ప్రశ్నలే. అంతవరకు ఎందుకు తొలిదశలో కొన్ని శతాబ్దాల పాటు అటు పాశ్చాత్య శ్రీసభలలోనూ ,ఇటు ప్రాచ్య శ్రీసభలలోనూ కతోలిక విశ్వాసులెందరో ఇలాంటి సంశయాలతోనే సతమతమయ్యేవారు. మానవమాత్రులు మరియ దేవమాత ఎలా అవుతారు అనే అంశం మీద ఎన్నో తర్జనభర్జనల కూడా జరిగాయి. చివరికి క్రీస్తు శకం 431లో ఎఫెసు పట్టణంలో శ్రీసభ నిర్వహించిన మహాసభల్లో ఈ ప్రశ్నలను క్షుణ్ణంగా పరిశీలించి, ధ్యానించి వేదాంత పరమైన హేతువులను చూపుతూ జూన్ 22వ తేదీన అవును మరియ మాత ముమ్మాటికీ దేవమాత ఆంగ్ల భాషలో (Theotokos, birth giver of God) అన్న సత్యాన్ని శ్రీసభ నిర్ద్వందంగా ప్రకటించింది. ఎఫేసు నగరంలో జరిగిన శ్రీసభ మహాసభలు ఇలా ప్రకటించాయి: క్రీస్తు ప్రభువు ఈ రెండు స్వభావాలు కలిగిన వ్యక్తి 1. మానవ స్వభావం 2. దైవ స్వభావం నూటికి నూరుపాళ్లు ఆయన మానవుడు మరియు నూటికి నూరుపాళ్ళు ఆయన దేవుడు అలా సంపూర్ణ మానవుడు, పరిపూర్ణుడైన దేవుడునైన యేసు క్రీస్తు సాక్షాత్తు త్రిత్వం లోని రెండవ వ్యక్తి అలాంటి భగవాన్మూర్తికి జన్మనిచ్చిన తల్లి - మరియ అలా పరిపూర్ణమైన దైవ-మానవ స్వభావాలు మూర్తిభవించిన యేసుప్రభువును కన్నతల్లిని దేవుని తల్లి - దేవమాత అనటం ఎంత మాత్రము ఆక్షేపణీయం కాదు. గనక మరియతల్లిని దేవమాత అని సంబోధించడం సమంజసమే. ఇకపోతే మరియతల్లి దేవుని తల్లి,దేవమాత అనటానికి పరిశుద్ధ గ్రంధం నూటికి నూరుపాళ్లు సాక్ష్యంగా నిలుస్తున్నది. చదవండి లూకా 1:43

పవిత్రాత్మ ప్రేరితురాలైన ఎలిజబేతమ్మ సాక్షాత్తు మరియతల్లిని "నా ప్రభుని తల్లి" అని సంబోధిస్తున్నారు. పవిత్రాత్మ ప్రేరణతో ఎలిజబేతమ్మ పలికిన మాట అక్షరాలా సత్యం. పవిత్రాత్మ అనుగ్రహంతో, దివ్య శక్తితో తాను గర్భాన దాల్చిన వ్యక్తి, తన రక్తమాంసాలను ఇచ్చి జీవం పోసిన వ్యక్తి సాక్షాత్తు తండ్రి దేవుని జనితైక కుమారుడు, త్రిత్వంలోని రెండవ వ్యక్తి-: పుత్ర భగవానుడు అలాంటి కుమార దేవుని కన్న మరియమాత దేవమాత కాదా?! కన్న ప్రేవుల సాక్షిగా మరియ తల్లి దేవమతే ఇదే సత్యాన్ని నిర్ధారిస్తూ శ్రీసభ మరియ యదార్ధంగా దేవుని తల్లి దేవమాతేనని ప్రకటిస్తోంది.... (CCC  No. 495)

*మరియ మాతృత్వం-: దైవ మాతృత్వం*
మాతృత్వం అనునది ఆడ జన్మకు దేవుడిచ్చిన గొప్ప వరం. సాధారణంగా మాతృత్వం అనునది దాంపత్య జీవితం ద్వారా కలుగుతుంది. అది సహజం కానీ మరియతల్లి మాతృత్వం దీనికి భిన్నమైనది, గొప్పది, పవిత్రమైనది ఎందుకు అంటే మరియ మాతృత్వం దాంపత్య జీవితం వలన కలిగినది కాదు. సాక్షాత్తు పవిత్రాత్మ ప్రభావంతో ఆమె గర్భం దాల్చారు క్రీస్తుకు జన్మనిచ్చారు... (లూకా 1:34,35) "యువతి గర్భవతియై ఉన్నది. ఆమె కుమారుని కని, అతనికి యిమ్మానువేలు అని పేరు పెట్టును (యెషయా 7:14) అను ప్రవచనాన్ని మరియ తల్లి నెరవేర్చి "అనుగ్రహ పరిపూర్ణ రాలుగా" ధన్యురాలుగా చరిత్రకెక్కారు...

*కన్యత్వం చెడని మాత-:*
దేవమాత ప్రార్థనలో మరియ తల్లిని "కన్యశుద్దము చెడని మాతా, అని మనము సంబోధిస్తూ ఉన్నాము. ఇక్కడ చాలా మందికి ఒక సందేహం రావచ్చు అది ఏమనగా ఒక స్త్రీ బిడ్డకు జన్మనిస్తే ఆమె కన్యాత్వం పోతుంది కదా? మరియతల్లి నిత్య కన్య ఎలా అవుతారు అని? మరియతల్లి పురుషుని సహకారంతో బిడ్డను కన్న లేదు. సాక్షాత్తు పవిత్రాత్మ ప్రభావముతో కన్నారు అని బైబిల్ గ్రంధము బోధిస్తూ ఉన్నది.(లూకా 1:34,35) మరియ తల్లి నిత్య కన్య అని, కన్యగానే దైవ కుమారుడికి జన్మనిచ్చింది అని మన తల్లి శ్రీ సభ తొలి దశ నుంచి విశ్వసిస్తూనే వస్తోంది. శ్రీసభ విశ్వాసానికి మూలం సువార్త ప్రబోధం. దైవకుమారుడు యేసుక్రీస్తు పవిత్రాత్మ వలననే కన్య మరియతల్లి గర్భాన శిశువుగా జన్మించారని. ప్రభు జననానికి పురుష సాంగత్యం కారణం కాదని శ్రీసభ ప్రగాఢ విశ్వాసం (CCC No. 496) అంతేకాదు క్రీస్తు భగవానుడు ఇలా ఒక కన్య గర్భాన నరావతారుడై జన్మించటం మానవ మేధస్సుకు, మానవ తర్కానికి అతీతమైన దివ్యశక్తి ప్రభావంతో జరిగిన దైవ కార్యమని కూడా శ్రీసభ విశ్వసిస్తుంది. ఈ సందర్భంలోనే మనము (werfeld) అనే కతోలిక వేదాంతి చెప్పిన మాటలను మననం చేసుకోవాలి-:
"విశ్వసించే వాళ్లకు వివరణ అక్కరలేదు; విశ్వసించని వాళ్లకు వివరించడం సాధ్యం కాదు"

*మానవుల మాత మరియ-:*
మరియ తల్లి మనందరికీ తల్లి! క్రీస్తు భగవానుడు సిలువ మీద మరణించే ముందు. అనాధైన తన మాతృమూర్తిని తనకు అత్యంత ప్రియశిష్యుడు యోహాను గారి చేతులకు తల్లిగా అప్పగించారు.(యోహాను 19:27) దీని ద్వారా మరియమాత మానవులందరికీ తల్లి అని క్రీస్తు భగవానుడు అధికారికంగా యోహాను చేతులకు తన తల్లిని ఇచ్చి ప్రకటించారు. ఆ క్షణం నుండి మరియమాత అపోస్తులకు, యావత్ మానవజాతికి తల్లి అయ్యారు. క్రీస్తును గురించి ప్రకటిస్తే కచ్చితంగా మరణ శిక్ష విధిస్తామని రోమన్లు ప్రకటించారు. ప్రాణభయంతో అపోస్తులు క్రీస్తు అప్పచెప్పిన బాధ్యతను మరచి పారిపోతుంటే. వారందర్నీ మేడగదికి చేర్చి "ఎడతెగక ప్రార్ధనలో చేర్చారు". వారందరినీ చైతన్యపరచి పవిత్రాత్మను వారిపై కురిపించారు. వారిలో ఉన్న పిరికితనాన్ని సమాధి చేశారు. శిష్యులు అడుగులు బయటపడ్డాయి. సువార్తను ప్రకటించారు. చివరికి క్రీస్తుకోసం మరణించటానికి సైతం వాళ్లు సిద్ధపడ్డారు, ప్రాణత్యాగం కూడా చేశారు. ఆనాడు కనుక శిష్యులు మేడ గదికి రాకపోయి ఉన్నట్లయితే ఈనాడు శ్రీసభ ఇంతగా అభివృద్ధి చెంది ఉండేది కాదేమో? అసలు శ్రీసభ ఉండేది కాదేమో? మరియతల్లి కాపాడింది అపోస్తులను మాత్రమే కాదు. కతోలిక విశ్వాసాన్ని కాపాడారు. ఇప్పటికీ ,ఎప్పటికీ మరియ తల్లి శ్రీసభకు సకల మానవాళికి తల్లిగా కొనసాగుతుంది..

*చివరి పలుకులు-:*
కంటికి కనిపించని ఒక వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. దీనిబారిన పడి ఎందరో అసువులు బాశారు. కరోనా సంక్షోభం వలన మనం ఎన్నో నష్టపోయాము. మరియ తల్లిని మనమందరం కూడా మన ఆధ్యాత్మిక తల్లిగా నెలకొల్పుకుందాం. మరియతల్లి పుట్టిందే ఇతరులకు సహాయం చేయటానికి ఆ తల్లి మనకు సహాయం చేయటానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. మనం చేయవలసింది ఒక్కటే భక్తిశ్రద్ధలతో జపమాలను ధ్యానం చేయటం, ఆ తల్లి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని జీవించటం. పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేసినట్లైతే మరియతల్లి ఎందరికో సహాయం చేశారు. ఉదాహరణకి కానాపల్లెలో ద్రాక్షరసం కొరత ఏర్పడితే తన ప్రియ కుమారుని ద్వారా ఆ కుటుంబానికి సహాయం చేయించారు, తన బంధువు ఎలిజబేతమ్మ కడువృద్ధాప్యంలో గర్భం ధరించినప్పుడు మూడు నెలలు సేవలు చేశారు.వెళాంగణి అనే ఊరిలో ఒక అవిటి బాలుని స్వస్త పరిచారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రియ విశ్వాసులారా! యోహాను గారు స్వీకరించినట్లు గా మనం కూడా మరియతల్లిని మన అమ్మగా స్వీకరిద్దాం. మన ప్రార్ధన అవసరతలను మరియమాత మధ్యస్థ ప్రార్థనా సహాయము ద్వారా ఆ క్రీస్తుభగవానుడికి సమర్పించుకుందాం. ఈ నూతన సంవత్సరం మీకు ఎన్నో దీవెనలు తెచ్చిపెట్టాలని ప్రార్థిస్తూ మరోమారు మీ అందరికీ నూతన సంవత్సర మరియు మరియ దివ్య మాతృత్వ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..

జోసెఫ్ అవినాష్ సావియో✍️
( పెదవడ్లపూడి విచారణ)

No comments:

Post a Comment