మరియమ్మ దివ్యమాతృత్వ మహోత్సవము (1 జనవరి)

మరియమ్మ దివ్యమాతృత్వ మహోత్సవము (1 జనవరి) 
సంఖ్యా. 6:22-27, గలతీ. 4:4-7, లూకా. 2:16-21 

ఈ రోజు మనం మరియమ్మగారి దివ్యమాతృత్వ పండుగను కొనియాడుచున్నాము. కన్యక అయిన మరియ దేవునితల్లి (Theotokos). గ్రీకు భాషలో Theotokos అనగా దేవున్ని మోసేవారు లేక దేవునికి జన్మనిచ్చేవారు అని అర్ధము. 431వ సం.లో “ఎఫెసుస్ కౌన్సిల్” నందు మరియ దేవునితల్లి అని అధికారికముగా ప్రకటించియున్నారు. ఎందుకన, ఆమె కుమారుడు యేసుక్రీస్తు, దేవుడు - మానవుడు, మరియు దైవ స్వభావమును - మానవ స్వభావమును కలిగియున్న ఒకే వ్యక్తి కనుక. ఈ పరమరహస్యాన్ని ధ్యానిస్తూ మరో నూతన సం.రమును ఆరంభిస్తున్నాము. మరియ దేవునితల్లి, మరియు మనందరికీ తల్లి కూడా. మరియతల్లిపై భక్తివిశ్వాసాలను పెంపొందిచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 

దేవునితల్లియైన మరియమ్మకు మనం ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకోవాలి. దేవదూత అందించిన సందేశానికి వినయ పూర్వక హృదయముతో 'అవును' అని చెప్పుటవలన, మనకి జీవితాన్ని, రక్షణను తన గర్భములోని శిశువుద్వారా తీసికొని వచ్చింది. ఈ రక్షణకార్యమునకై దేవుడు మరియమ్మను ప్రత్యేకవిధముగా, జన్మపాపరిహితగా ఎన్నుకొన్నాడు. ఈనాటి రెండవ పఠనములో పౌలుగారు చెబుతున్నట్లు కాలము పరిపక్వమైనప్పుడు దేవుని కుమారున్ని మోయుటకు, దేవునికి తల్లిగా మారుటకు ఆమెను ఎన్నుకొని యున్నాడు (గలతీ 4:4). 

గతమున దేవుడు తనప్రజలతో, ప్రవక్తలద్వారా మాట్లాడియున్నాడు (హెబ్రీ 2). తన యాజకులద్వారా దేవుడు తనప్రజలను దీవించియున్నాడు. ఈనాటి మొదటి పఠనములో, యాజకులైన ఆహారోను, అతని పుత్రులు ఏవిధముగా ప్రజలపై దీవెనలు పలుకవలెనో యావే మోషేకు తెలియజేసి యున్నాడు (సంఖ్యా కాం. 6:22-27). కాని, ఇప్పుడు దేవుడు తన కుమారుని పంపియున్నాడు. ఆయన రాజ్యమును, మహిమను తన కుమారునిద్వారా బయలుపరచి యున్నాడు. మరియు సకలమానవాళికి తన రక్షణప్రణాళికను ఎరుకపరచి యున్నాడు. (చదువుము యో 14:8-9). 

యేసు, సృష్టి ఆరంభమునుండి ఎన్నుకొనిన, నడిపింపబడిన దేవుని ప్రజలనుండి ఉద్భవించినవాడు. సువిశేష పఠనములో విన్నవిధముగా (లూకా 2:21) శిశువుకు సున్నతి చేయడము ద్వారా (ఆ.కాం. 17:1-14) అబ్రహాముతో దేవుడు చేసిన ఒడంబడికకు వారసుడు. మనము క్రీస్తునందు జ్ఞానస్నానము పొందుటద్వారా దేవునికి దత్తపుత్రులుగా మారియున్నాము (కొలస్సీ 2:11; ఫిలిప్పీ 3:3). దేవుని బిడ్డలముగా, అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానములకు (ఆ.కాం. 12:3; 22:18) మనమును వారసులమగు చున్నాము (గలతీ 3:14). యాజకుడైన ఆహారోను ఈ దీవేనలనే దైవప్రజలపై అందించి యున్నాడు. ఈనాడు ఈ దీవెనలను మనముకూడా మరియ తల్లిద్వారా, రక్షకుడైన యేసుక్రీస్తుద్వారా పొందుచున్నాము. ఈ గొప్ప ఆనందదాయకమైన శుభసందేశమే, దేవదూత ద్వారా గొల్లలకు తెలియజేయడమైనది (లూక 2:10). 

యేసు బెత్లేహేములో జన్మించాడు. యోసేపు, మరియమ్మలకు తప్ప ఆ విషయం ఎవరికినీ తెలియదు. కాని, వేగముగా గొల్లలకు ఆ శుభసందేశం, లోకరక్షకుని జననపరమరహస్యం తెలియజేయడమైనది. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమై ''మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభసమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదునగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తుప్రభువు. శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువులతొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు (లూక 2:10-12). దేవుడు తెలియజేసిన ఆ పరమరహస్యాన్ని గాంచుటకు గొల్లలు వెమ్మటే బెత్లేహేమునకు వెళ్ళిరి. అక్కడ పశువులకొట్టములో మరియమ్మను, యోసేపును, తొట్టిలో పరుండియున్న శిశువును కనుగొనిరి. 

గొల్లలవలె మనముకూడా వేగముగా మరియ యోసేపులతో యేసును కనుగొనుటకు త్వరపడుదాం. గొల్లలు తాము వినినవానిని, చూచినవానిని గురించి దేవునివైభవమును శ్లాఘించిరి (లూ 2:20). దేవుడు ఇచ్చిన ఈ గొప్ప దీవెనలకి మనముకూడా ఆయనను మహిమపరచుదాం. మరియతల్లి వలె, దేవుని వాక్యమును మనస్సున పదిలపరచుకొని ధ్యానించాలి. క్రీస్తుసందేశము మన హృదయాలలో సమృద్ధిగాఉండాలి (కొలస్సీ 3:16). అప్పుడే దేవదూతవలె, గొల్లలవలె, జ్ఞానులవలె మనుమును ఈ గొప్ప సందేశాన్ని, దీవెనని, పరమరహస్యాన్ని ఇతరులకు ఇవ్వగలం. 

దేవుడు మనకి ఒసగిన మరో గొప్ప వరం 'మరో నూతన సంవత్సరం'. 2021వ సం.న్ని ఒక గొప్ప నమ్మకము, ఆశతో చూద్దాం. మన సమాజములో అభివృద్దితో పాటు, చెడుకూడా పెరుగుతూ ఉంది. భయము, ఆధ్యాత్మికలేమి పెరగుతూ ఉన్నాయి. స్వార్ధము రోజురోజుకి పెరుగుతుంది. రాజకీయ అంధకారం, పేద-ధనిక భేదం, వ్యభిచారం, మాదక ద్రవ్యాలు, కుల వర్గ భేదాలు మొ.గు సమస్యలతో సతమతమగు చున్నాము. ఇలాంటి పరిస్థితులలో గొప్ప ఆశగల నమ్మకముతో ముందుకు సాగాలి. దేవునిపై ఆధారపడాలి. ఆయనవైపు చూడాలి. మన సమస్యలన్నింటికీ ఆయనే పరిష్కారం. ఈ నమ్మకానికి గొప్ప ఆశ మన యువత. సమాజానికి వారు ఎంతో అభివృద్ధిని తేగలరు. తల్లిదండ్రులు, భోదకులు, యువతపై దృష్టి సారించి విద్యావంతులను చేయడానికి కృషి చేయాలి. ప్రభుత్వము, మీడియా, సంస్థలు యువత అభివృద్ధికి తోడ్పడాలి. అలాగే, పాశ్చాత్య దేశాలలో ఆర్ధికసమస్యలు ఉన్న సమయములో మన భారతదేశ ఆర్ధిక పరిస్థితి చాలా మెరుగుపడి ఉంది. అయితే, అధికశాతం అభివృద్ధి వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నదని మరచిపోరాదు. కొంతకాలముగా, వ్యవసాయదారులు ఎన్నోకష్టాలను ఎదుర్కొంటున్నారు. నూతన సంవత్సరములో వారి మంచి కోసం ప్రార్ధన చేద్దాం. 

అన్నింటికన్నా ఎక్కువగా, మనమందరం మంచి మానవతాసంబంధాలను కలిగి జీవించాలి. ఒకరినొకరు అర్ధంచేసికొంటూ, సహాయం చేసికొంటూ ముందుకు సాగాలి. నిజమైన స్వేచ్చ, సత్యములను కనుగొని జీవించుదాము. న్యాయముతో, సామాజిక, నైతికవిలువలతో జీవించుదాము. శాంతిస్థాపన మరో ముఖ్యఅంశం, ధ్యేయం. “శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని బిడ్డలనబడుదురు” (మ 5:9).

1 comment:

  1. Thank you so much for the nice reflections . Very helpful for priests. God bless your work & ministry

    ReplyDelete