33వ సామాన్య ఆదివారము, Year A
సామె. 31:10-13, 19,20, 30-31, 1 తెస్స. 5:1-6, మత్త. 25:14-30
ప్రభువుపై మన నమ్మకం (కర్తవ్యము)
క్రీస్తునందు ప్రియ సహోదరీ సహోదరులారా! ఈ రోజు దైవార్చన కాలములో 33వ సామాన్య ఆదివారములోనికి ప్రవేశించి యున్నాము.
యేసు ప్రభువు యెరూషలేము పుర ప్రవేశమునకు ముందు, యూదమత నాయకులు ఆయన పట్ల అసంతృప్తితో ఉండిరి (మత్త. 21:1-11). పుర ప్రవేశమున ప్రజలు ప్రభువునకు ఇచ్చిన ప్రశంసలు, ఆ తరువాత దేవాలయములో వ్యాపారులను వెడల గొట్టుట (“శుభ్రము” చేయుట) వలన, ప్రభువు పట్ల వారి విరోధం ఇంకా కఠినతరమయ్యింది. కఠినమైన ప్రశ్నలతో ప్రభువును ఇబ్బంది పెట్టడానికి అనేకసార్లు ప్రయత్నం చేసారు (21:23, 22:15, 22:23-28, 22:34-36) కాని వారు విఫలమయ్యారు.
మత్తయి 23-25 అధ్యాయాలలో ప్రభువు సుదీర్ఘమైన చివరి ఉపదేశమును చూస్తున్నాము. నేపధ్యము: యెరూషలేము దేవాలయము - పవిత్రవారము.
23వ అధ్యాయములో యేసు ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను గద్దించి, యెరూషలేము పురము పట్ల విలపించి యున్నాడు. 24-25 అధ్యాయాలు ప్రభువు రాకడ (పునరాగమనము, తుదితీర్పు) గురించి ప్రస్తావిస్తున్నాయి. రాకడకై సంసిద్ధత గురించి యేసు ఎన్నో ఉపమానములను బోధించాడు: “నమ్మినబంటు-నమ్మనిబంటు (24:45-51), పదిమంది కన్యలు (25:1-13), సేవకుని కర్తవ్యము - నిర్వహణ విధానము (25:14-30). చివరిగా, తుది తీర్పు (25:31-46) గురించిన బోధనతో ప్రభువు ఉపదేశం ముగుస్తుంది. ప్రభువు రాకడ ఎప్పుడు వచ్చునో ఎవరికీ తెలియదు, కాని, ఎల్లప్పుడు సిద్ధముగా ఉండాలి అనేది ఈ ఉపదేశ సారాంశము. ఈ నేపధ్యములో నేటి సువార్త పఠనమును అర్ధము చేసుకొనవలెను.
దేవుడు మనందరికీ ఎన్నో అనుగ్రహాలను ఒసగాడు. కొంతమందికి ధనం, ఆస్థులు, అంతస్థులు, కొంతమందికి తెలివితేటలు, అలాగే వివిధ ప్రతిభను...మొ.వి. ఈనాటి ఉపమానములో యజమాని (యేసు ప్రభువు) దూరదేశమునకు ప్రయాణమై పోవుచూ (ప్రభువు మోక్షారోహణము), తన ముగ్గురు సేవకులను (ప్రభువు రాకడ కొరకై ఎదురు చూచుచున్న క్రైస్తవులు) పిలచి, వారివారి సామర్ధ్యమును బట్టి, తన (భారీ) ఆస్తిని (దేవుడు ఒసగు ఆర్ధిక, సామాజిక, మేధాపరమైన, ఆరోగ్యపరమైన... వరములు, సామర్ద్యములు) వారికి అప్పగించి యున్నాడు. దేవుని దృష్టిలో అందరమూ సమానమే! అనుగ్రహాలను ఇచ్చుటలో హెచ్చుతగ్గులు ఉన్నను, బహుమతి (పరలోక రాజ్యము) మాత్రము అందరికి ఒకేరకముగా ఉండునని మనం గుర్తించాలి. దేవుడు ఇచ్చిన అనుగ్రహాలను, అవకాశములను మనం సద్వినియోగ పరచుకొని, తన రెండవ రాకడకై సంసిద్ధపడాలన్నదే నేడు ప్రభుని సందేశం. ఆయనపై సంపూర్ణమైన నమ్మకాన్ని కలిగి యుండాలి. ఎందుకన, ముందుగా దేవుడు మనపై నమ్మకాన్ని ఉంచాడు. ఉపమానములో యజమాని తన సేవకులపై నమ్మక ముంచాడు కాబట్టే, వారికి భారీ సొమ్మును అప్పజెప్పాడు.
మన సామర్ధ్యములను దేవుని మహిమ కొరకు, ఇతరుల ఉపయోగార్ధమై వినియోగించవలెను. ముందుగా, దేవుడు మనకు దానం చేసిన సామర్ధ్యాలను, నైపుణ్యాలను మనలో కనుగొందాం. మనలో ఎన్నో శక్తిసామర్ధ్యాలు ఉంటాయి, కాని అనేకసార్లు వాటిని బయటకు వెలికితీసి, వినియోగించక, మనలోనే పూడ్చివేస్తూ ఉంటాము, మనలోనే దాచిపెడుతూ ఉంటాము. మన సామర్ధ్యాలను పూర్తిగా వినియోగించుటలో ఎన్నో ఇబ్బందులను, అడ్డంకులను, ఆపదలను ఎదుర్కోవలసి ఉంటుంది. వీటికి భయపడుతూ ఉంటాము. వీటిని ఎదుర్కోవడానికి ఎంతమాత్రము ఇష్టపడము. అందుకే మనం ధైర్యం చేయము. కాని, దేవుని చిత్తప్రకారం మన సామర్ధ్యాలను వినియోగించుటకు మనం భయపడ కూడదు. సాహసం చేయాలి. దేవునిపై నమ్మకమున్నప్పుడు ఇది సాధ్యపడుతుంది.
ఉపమానములో మూడవ సేవకుడు తాను పొందిన వరహాలను తీసుకొని వెళ్లి నేలను త్రవ్వి దాచిపెట్టాడు (ఆ కాలములో చాలా సాధారణమైన భద్రతా విధానం). అతను ఎందుకు అలా చేసాడు? బహుశా! భయపడి ఉంటాడు. ఒక లక్ష్య వరహాలే కదా! ఒక వేళ ఏదైనా వ్యాపారము చేసి నష్టపోతే! అని అనుకొని ఉండవచ్చు (లక్ష వరహాలు కూడా భారీ సంపదే అని గుర్తించాలి. ఆ కాలములో సాధారణ కార్మికుడు లక్ష వరహాలు సంపాదించడానికి పదిహేను సంవత్సరాలు పట్టేది. కనుక మూడవ సేవకుడుకూడా మంచి అదృష్టాన్నే పొందియున్నాడు). నేడు ఇలాంటి మనస్తత్వముతో చాలామందిమి ఉన్నాము. కొంతమందికి పాటలు పాడటం అంటే చాలా ఇష్టం, కాని విచారణ పాటల బృందములో చేరడానికి వెనకాడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. వారికి మంచి గాత్రం లేదని అనుకుంటారు! కొంతమందికి, దేవుని వాక్యమును బోధించాలి అనే కోరిక బలముగా ఉంటుంది కాని, ధైర్యము చేయరు. వారికి బైబులు గురించి, దేవుని గురించి సరిగా తెలియదు అని అనుకుంటారు! చివరికి ఏమీ చేయకుండానే, ఏమీ సాధించకుండానే ఉండిపోతారు. ఇలాంటి వారు, ఈ మూడవ సేవకుని పోలియున్నారు.
“చాలకాలము గడచిన తరువాత” - ఆనాటి ప్రజలు ప్రభువు రాకడ “వెమ్మటే” వస్తుందని భావించారు. చాలకాలము అన్నది ప్రభువు రాకడలో జాప్యము ఉన్నట్లుగా కనిపిస్తుంది, కాని తప్పక సంభవించును అని అర్ధమగుచున్నది - యజమానుడు తిరిగి వచ్చి (యేసు ప్రభువు రెండవ రాకడ), ఆ సేవకులతో లెక్కలు సరిచూసుకొనడానికి (ప్రభువు తీర్పు) వారిని పిలిచాడు. మొదటి ఇద్దరు వారికి ఇవ్వబడిన వరహాలను రెండింతలు చేసి యజమాని మన్ననలను పొందియున్నారు, “మంచిది. నీవు ఉత్తముడవు. నమ్మినబంటువు. స్వల్పవిషయములందు శ్రద్ధవహించితివి. కనుక అనేక విషయములను నీకు అప్పగింతును. నీ యజమానుని ఆనందములో నీవు పాలుపంచుకొనుము” (మత్త. 25:21, 23). ఇద్దరికీ ఒకే ప్రశంస, ఒకే బహుమానం. మూడవ సేవకుడు కూడా తన కర్తవ్యమును నెరవేర్చియుంటే, అదే ప్రశంస, బహుమానాన్ని పొందేవాడు. బహుశా! తననుతాను తోడి సేవకులతో పోల్చుకొని యుంటాడు. తనకన్నా ఎక్కువ వరహాలను పొందారని నిరాశచెంది యుంటాడు. ఆ ఒకే ఒక్క వరహముతో ఇంకొక వరహాన్ని సంపాదిస్తే ఇతరులు పొందిన బహుమతినే సమానముగా అతను పొందేవాడని గుర్తించలేక పోయాడు. మనం ఎన్ని వరాలను పొందియున్నా (ఐదు, రెండు, ఒకటి), అలాగే ఫలితం ఎలా ఉన్నా, మనం చేసే ప్రయత్నం, కృషిని దేవుడు లెక్కలోనికి తీసుకుంటాడు.
నేడు తల్లి తిరుసభలో మనమందరం విశ్వాస వరమును పొందియున్నాము. ఆ విశ్వాసాన్ని మనం దాచిపెట్ట కూడదు, దానిని పెంపొందిస్తూ, ఇతరులకు అందించగలగాలి. అలా చేయని యెడల, ఆ మూడవ సేవకునివలె, మనము పొందిన ఆ విశ్వాస వరాన్ని కోల్పోతాము. కనుక మన విశ్వాసం (అలాగే ఇతర వరాలు) ఫలించేలాగున చూడాలి.
ఉపమానములో మూడవ సేవకుడు యజమానునితో, ‘అయ్యా! నీవు కఠినుడవని నేను ఎరుగుదును. నీవు నాటనిచోట కోయువాడవు. విత్తనములను చల్లనిచోట పంటకూర్చుకొనువాడవు. కనుక నేను భయపడి, వెళ్లి నీ లక్ష వరహాలను భూమిలో దాచితిని. ఇదిగో నీ ధనమును నీవు తీసికొనుము’ (25:24-25) అని పలికాడు. యజమానుని కఠినుడని ఎందుకు ప్రస్తావించాడో మనకు తెలియదు. అలాంటి మనస్తత్వాన్ని మనం ఇప్పటివరకు యజమానిలో చూడలేదు. మొదటినుండి కూడా సేవకుల పట్ల ఎంతో ఉదారస్వభావమును కలిగియున్నాడు. వారిని మెచ్చుకున్నాడు. దీనినిబట్టి, అతనికి యజమానిపై ఎంతమాత్రము నమ్మకం లేదని స్పష్టమగుచున్నది. అయితే, మూడవ సేవకుడు తాను భయపడ్డానని చెప్పాడు. భయము మనలను అసక్తులుగా (ఏమీ చేయలేనివారిగా) చేస్తుంది. “భయపడకుడు” (మత్త. 10:26, 31, 28:5, 10). “భయపడవలదు. విశ్వసింపుము” (లూకా. 8:50) అని యేసు పలికాడు. భయాన్ని మనంతట మనం జయించలేము. యేసునందు విశ్వాసముతో భయాన్ని జయించవచ్చు. అలాగే మూడవ సేవకుడు స్వార్ధముగా ఆలోచించాడు, తన భద్రతను మాత్రమే చూసుకున్నాడు. తన యజమానిపట్ల తన కర్తవ్యాన్ని నెరవేర్చలేదు. ధనమును భూమిలో దాచిపెట్టడముతో తన బాధ్యత తీరిపోయిందని భావించాడు. కనుక, యజమాని, ఆ లక్ష వరహాలను అతని వద్దనుండి తీసుకొని మొదటి వానికి ఇచ్చాడు. అలాగే అతడు చీకటిలోనికి త్రోసివేయ బడ్డాడు.
“ఉన్న ప్రతివానికి ఇంకను ఈయబడును. అపుడు అతనికి సమృద్ధి కలుగును” (25:29). ధనవంతులు ఇంకా ధనవంతులు అగుదురు, పేదవారు ఇంకా పేదవారు అగుదురు అని భావించరాదు. ప్రభువు ఉద్దేశము అది కాదు. దేవుడు మనకు ఇచ్చిన సంపదతో (అవకాశము) విశ్వాసముగా, నమ్మకముగా మన కర్తవ్యాన్ని నెరవేర్చాలి.
ప్రభువు శిష్యులు తమకు ఇవ్వబడిన అవకాశములను (పెద్దవైన, చిన్నవైన) సద్వినియోగ పరచుకొని ప్రజలను దైవరాజ్యములోనికి నడిపించవలయును. మానవాళి రక్షణకై, దేవుడే తన కుమారుడి ప్రాణమును పణంగా పెట్టాడు. కనుక మనం కూడా మనకివ్వబడిన అవకాశములను బట్టి మన కర్తవ్యాన్ని నెరవేర్చాలి: మన బాధ్యతలను సక్రమముగా నెరవేర్చాలి, సువార్తను బోధించాలి... క్రైస్తవులమైన మనము, అన్యాయాన్ని ఖండించి, నీతిన్యాయాల కోసం పాటుబడాలి. మనం ఏమీ చేయలేము అనుకొనేవారు దేవునియందు విశ్వాసము, అలాగే ఆత్మగౌరవము లేనివారు. పౌలు అన్నట్లుగా, “క్రీస్తు అనుగ్రహించు శక్తిచే నేను అన్నిటిని చేయగలను” (ఫిలిప్పీ. 4:13) అన్న విశ్వాసం మనలో బలంగా ఉండాలి.
మనం చేసే ప్రతీ కార్యానికి, దేవునికి లెక్కలు అప్పజెప్పవలసి యున్నదని ఉపమానం తెలియజేయు చున్నది. దేవుడు తన దయతో పాటు తన తీర్పును కూడా విధిస్తాడు. దేవుడు మన జీవిత విజయాన్నిగాక, మన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోరుకుంటాడు. మనలో దేవుని పట్ల విశ్వాసం, నమ్మకం బలపడాలని ప్రార్ధిద్దాం.
No comments:
Post a Comment