32వ సామాన్య ఆదివారము, Year A

32వ సామాన్య ఆదివారము, Year A
సొ. జ్ఞాన. 6:12-16; 1 తెస్స. 4:13-18; మత్త. 25:1-13
ప్రభువు రాకడ – మన సంసిద్ధత


క్రీస్తునందు ప్రియ సహోదరీ సహోదరులారా! ఈ రోజు దైవార్చన కాలములో 32వ సామాన్య ఆదివారములోనికి ప్రవేశించి యున్నాము. 

దేవుని కుమారుడైన క్రీస్తుప్రభువు, రక్షకుడిగా ఈలోకమునకు ఇప్పటికే వచ్చియున్నాడు. లోకరక్షణార్ధమై అనగా లోకపాపాల పరిహారార్ధమై, ఆయన మరణించి ఉత్థానమయ్యాడు. అయినప్పటికిని ప్రభువు మరల తిరిగి వచ్చును అన్నది మన విశ్వాసము. ఇప్పుడు మనము ప్రభువు మోక్షారోహణము - ప్రభువు రెండవ రాకడ మధ్య కాలములో జీవిస్తున్నాము. ఈ కాలములో మనము చేయవలసినది ప్రభువు రాకడకై సంసిద్ధ పడటం. దేవుని ప్రేమ అనంతమైనదని మనందరికీ తెలుసు, అయినప్పటికిని మనవంతుగా అన్ని కాలాలలోనూ, సమయాలలోనూ మనుష్య కుమారుడి రాకకై మనం సిద్ధపడాలి. మనము మెలకువతో ఉండాలి అనగా దేవుని ఆజ్ఞలకు, వాక్కుకు విశ్వాసపాత్రులముగా జీవించాలి. “పదిమంది కన్యలు” ఉపమానము (మత్త. 25:1-13) ఫలవంతమైన జీవితమును జీవించుటకు నేడు మనలను సవాలు చేయుచున్నది. 

అంతిమ దినమున ప్రభువు వచ్చినప్పుడు ఆయనను కలుసుకొనడం, ఆయనతో ఉండటం మన క్రైస్తవ జీవిత ధ్యేయం. అదే మన విశ్వాసం, మన పిలుపు. మనం మన స్వార్ధము కొరకుగాక, దేవుని మహిమ కొరకై జీవించాలి. మన అనుదిన జీవితం దేవుని వాక్కుతో పొందికయై ఉండాలి. వివేకవంతులైన కన్యకలవలె వెలుగుచున్న కాగడాలతో ప్రభువునందు విశ్వాసము కలిగిన జీవితముతో సిద్ధపడి ఉండాలి, జీవించాలి. వారివలె మెలకువతో ఉండాలి. పునీత పౌలుగారు కూడా “ప్రభువు రాకడకు సంసిద్ధత” గురించి తెస్సలోనిక ప్రజలకు ఇలా గుర్తుచేసియున్నారు: “ఇతరులవలె, మనము నిద్రించుచుండరాదు. మేల్కొని జాగరూకులమై ఉండవలెను” (1 తెస్స. 5:6). 

యూద వివాహ నేపధ్యము: నూతన నిబంధన కాలములో, వివాహ మహోత్సవం రాత్రివేళలో జరిగెడిది. వివాహము రోజున, పెండ్లికుమారుడు తన స్నేహితులతో వెళ్లి పెండ్లి కుమార్తెను అతని ఇంటికి తీసుకొని వచ్చేవారు. వారు మామూలుగా సూర్యాస్తమయ సమయం తరువాత కొద్దిసేపటికి చేరుకొనేవారు. వారు దగ్గరలోకి చేరుకున్నప్పుడు, కన్యకలు వెలుగుతున్న కాగడాలతో, ప్రేమగీతాలు పాడుతూ, ప్రదక్షిణగా యింటివరకు వారిని సాదరముగా ఆహ్వానించేవారు. ఉపమానములో పెండ్లి కుమారుని రాక ఆలస్యము అయ్యింది. అర్దరాత్రి సమయములో రావడం జరిగింది. అప్పుడు కాగడాలతో అదనపు నూనెను తెచ్చుకున్నవారు [పూర్తిగా సిద్ధపడినవారు], పెండ్లికుమారునికి స్వాగతం పలకగలిగారు. ఇతరులు [సిద్ధపడనివారు] నూనెకోసం అంగడికి వెళ్లివచ్చేలోపు, వివాహ మహోత్సవం ప్రారంభమైనది. తలుపులు మూయబడినవి. ‘ప్రభూ! ప్రభూ! తలుపుతీయుడు’ అని మొరపెట్టినను ఫలితం లేకపోయినది. వారి నిర్లక్ష్యం, సంసిద్ధత లేమి వలన వారు నిరాకరింపబడి యున్నారు. 

ఉపమానములో పెండ్లికుమారుడు క్రీస్తు ప్రభువు. కాగడ మన జీవితానికి సూచిక. ‘మేల్కొనడం’ ‘నిద్రపోవడం’కు వ్యతిరేకం. ‘మేల్కొని ఉండటం’ వెలుగును, ‘నిద్రపోవుట’ చీకటిని సూచిస్తున్నాయి. చీకటి లేదా అంధకారం నమ్మకలేమిని, అస్పష్టతను సూచిస్తుంది. విశ్వాసం, నమ్మకం లేనివారు [అవివేకవతులు] ప్రభువు సాంగత్యములో ఉండలేరు. సిద్ధముగనున్నవారు [వివేకవతులు], అనగా విశ్వాసమను వెలుగులో జీవిస్తున్నవారు వివాహోత్సవమునకు వెళ్ళిరి. అనగా, ప్రభువు సాంగత్యములో, ఆనందములో, సంతోషములో పాలుగొనిరి. 

అవివేకవతులకు [పరలోక రాజ్యపు] తలుపులు మూయబడెను. ప్రభువు వారితో ‘నేను మిమ్ము ఎరుగనని’ నిశ్చయముగా చెప్పును. ఇదే విషయాన్ని, మత్తయి 7:23లో చూస్తున్నాము: “దుష్టులారా! నానుండి తొలగిపొండు. మిమ్ము ఎరుగనే ఎరుగను” అని ప్రభువు వారిని నిరాకరింతురు (చదువుము: లూకా. 13;25-27). ఇది వారి వినాశనాన్ని సూచిస్తుంది. 

ఈ ఉపమానము మెస్సయ్య రాకడను, రక్షణను సూచిస్తుంది. ఈ రక్షణ సంసిద్ధపడిన వారికి, అనగా విశ్వాసపాత్రులకు, పేదవారికి, నీతిమంతులకు, తండ్రి దేవుని చిత్తానుసారముగా వర్తించువారికి ఒసగబడును. “తలుపు మూయబడుటయనగా, రక్షణకు దూరమవడమే! 

కనుక, ఎల్లప్పుడు మనం మన జీవిత కాగడాలను ప్రేమయను నూనెతో నింపుకొనవలయును. నూనెలేని కాగడ జీవములేని దానితో [మరణము] సమానము. అలాగే, ప్రేమలేని [విశ్వాసము, మంచి కార్యములు] జీవితము నిర్జీవమే కదా! కనుక ఎల్లప్పుడు అప్రమత్తముగా ఉండవలయును: “మీ దీపములు వెలుగుచుండనిండు. యజమానుడు వివాహ మహోత్సవమునుండి తిరిగివచ్చి తట్టగనే తలుపు తీయుటకు ఎదురుచూచు వారివలె ఉండుడు. మేల్కొని సిద్ధముగా ఉన్నవారు ధన్యులు” అని లూకా. 12:35-27లో చూస్తున్నాము. 

అవును! మనము తప్పక జాగరూకులై ఉండవలయును. ఎందుకన ప్రభువు దినము [ఆగమనము, పునరాగమము] అనూహ్యమైనది, ఏ దినము వచ్చునో మనకు తెలియదు. మనుష్యకుమారుడు మనము ఊహింపని గడియలో వచ్చును (చదువుము: మత్త. 24:36-44). ప్రభువు దినము రాత్రివేళ దొంగవలె వచ్చును. అది అకస్మాత్తుగా వచ్చును: ఉపమానములో పెండ్లి కుమారుడు “అర్దరాత్రి సమయమున” వచ్చెను అని చెప్పబడింది. గర్భిణియగు స్త్రీ ప్రసవవేదనవలె వచ్చును. దానినుండి ఎవరును తప్పించుకొనలేరు (చదువుము 1 తెస్స. 5:1-6). అనగా ప్రభువు రాకడ తప్పక సంభవించును అని అర్ధం. 

ప్రభువు రాకడను రెండు విధాలుగా చెప్పుకోవచ్చు: ఒకటి, అర్దరాత్రి సమయములో ప్రభువు వచ్చినప్పుడు, అనగా మన మరణం సంభవించినప్పుడు, ప్రభువును స్వీకరించుటకు, ఆయనను కలుసుకొనుటకు, మనం జాగరూకులై, మెలకువ కలిగి ఉండవలయును. మన మరణ సమయం సంతోషకరమైనది, ఎందుకన, సిద్ధపడినచో, దేవుని ముఖాముఖి గాంచెదము. రెండవది, క్రీస్తు మన జీవితాలలోని అనుదిన సంఘటనలద్వారా, మనం కలిసే వ్యక్తులద్వారా వచ్చినప్పుడు, ఆయనను స్వీకరించుటకు మనము సిద్ధముగా ఉండాలి. 

ఈ విధముగా, దైవార్చన కాలము చివరిలోనున్న మనలను తల్లి శ్రీసభ ప్రభువు రాకడను గురించి ధ్యానించమని కోరుచున్నది. ప్రభువు రాకడకు సిద్ధపడమని కోరుచున్నది. అనగా భయాందోళనతో ఉండటం కాదు. లోకాంత్యము ఎప్పుడు వచ్చునాయని లెక్కలు వేయడం కాదు. మనుష్యకుమారుడు వచ్చినప్పుడు మరణించిన వారికిని, ఇంకను జీవించుచున్న వారికిని తీర్పు విధించును అని యేసు చెప్పియున్నాడు. కనుక ప్రభువు రాకడ కొరకు ఎలా సిద్ధపడుతున్నామో, ఆత్మపరిశీలన చేసుకోవాలని తిరుసభ కోరుచున్నది. నేటి ఉపమానముద్వారా వివేకవతులవలె సిద్ధపడాలని ప్రభువు మనలను కోరుచున్నారు. సంసిద్ధ పడటం [ఆయత్తపడటం] చాలా ముఖ్యమని అర్ధమగుచున్నది. ఇది ముసలి ప్రాయములోనున్న వారికి మాత్రమే కాదు సుమా! ‘ప్రభువు రాకడ ఎప్పుడు?’ అన్నది ఇక్కడ ప్రశ్న కాదు! ‘మనము సిద్ధపడియున్నామా?’ అన్నది ప్రశ్న! కనుక ప్రభువు ఈరోజు మనలనందరినీ మారుమనస్సు పొందమని, పునరుద్ధరణ చెందమని ఉపమానముద్వారా బోధిస్తున్నాడు. 

కనుక మనం వివేకము, జ్ఞానము కలిగి జీవించాలి. మొదటి పఠనములో చూస్తున్నట్లుగా, జ్ఞానము [యేసు] తనను వెదుకువారికి దొరుకును. తనను [యేసు] ప్రేమించువారికది సులువుగనే లభించును. తనను [యేసు] అభిలషించు వారికది వెంటనే సాక్షాత్కరించును. దానికొరకు [యేసు] గాలించినచో, తనంతట తానే వచ్చి మీ తలుపుచెంత కూర్చుండును. విజ్ఞానమును [యేసు] కోరుట అనగా దానిని ప్రేమించుటయే. విజ్ఞానమును [యేసు] ప్రేమించుట అనగా దాని ఆజ్ఞలను పాటించుటయే. విజ్ఞానపు [యేసు] ఆజ్ఞలను పాటించినచో అమరత్వము కలుగును. కనుక దేవునకు మన జీవితములో ప్రధమ స్థానమును, ప్రాముఖ్యతను ఇవ్వాలి. 

జ్ఞానస్నానము పొందినప్పుడు, వెలుగుచున్న క్రొవ్వొత్తిని [క్రీస్తుజ్యోతి] స్వీకరించాము. గురువు వెలుగుచున్న క్రొవ్వొత్తిని ఇస్తూ ఇలా పలికారు: ‘తల్లిదండ్రులారా! జ్ఞాన తల్లిదండ్రులారా! ఈ దీపికను ఎల్లప్పుడు వెలుగుచుండనిండు. మీ బిడ్డలు క్రీస్తునాధుని వెలుగు పొందియున్నారు. వీరు ప్రకాశపుత్రులుగా జీవింపవలెను. విశ్వాసమునందు స్థిరపడి పునరాగమమున క్రీస్తునాధుని సకల పునీతులతో ఎదురేగి వారిని కలిసికొందురుగాక. 

మనము పవిత్రతలో ఎదిగే కొలది క్రీస్తుజ్యోతి మన జీవితములో ఇంకా ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ క్రీస్తుజ్యోతిని ఈ లోకములో వెలిగింప జేయాలని ప్రార్ధిద్దాం.

4 comments:

  1. ❤️❤️❤️❤️❤️❤️❤️

    ReplyDelete
  2. Thank you very much Rev. Father. For your valuable thoughts.

    ReplyDelete
  3. God bless you dear Father. Your reflections are faith enriching

    ReplyDelete