ఆగమన
కాలము – మొదటి ఆదివారము
పఠనములు:
యెషయ 63:16-17,19, 64:2-7, 1 కొరి 1:3-9, మార్కు 13:33-37
“జాగరూకులై
ఉండుడు!”
ఆగమనకాల ప్రారంభముతో, ఆగమనకాల మొదటి ఆదివారమున, దైవార్చన కాలములో మరో నూతన సంవత్సరాన్ని (2వ సంవత్సరము B) ప్రారంభిస్తున్నాము. ఆగమనకాలము ఒక కొత్త ఆరంభానికి నాంది, సూచిక. కొత్త ప్రారంభం అనగా పాతవి (గడచిన కాలము) దేవునికి వదిలేసి, యేసుక్రీస్తును మన జీవితాలలోనికి ఆహ్వానించడం. ఒక నూతన ఆరంభానికి, నూతన జీవితానికి ప్రభువు వైపునకు మరలడం. ఆగమనకాలాన్ని ప్రభవురాకకై ఎదురుచూచు కాలముగా, నిరీక్షణ కాలముగా కూడా పిలుస్తూ ఉంటాము. అనగా, ఈ కాలములో ఒక గొప్ప నమ్మకముతో, మనలను మనము ఆధ్యాత్మికముగా సిద్ధపరచుకుంటూ, అనగా ‘జాగరూకులై, మెలకువతో’ ఉంటూ, ప్రభువురాకకై, ప్రభువు జన్మదినోత్సవము కొరకై అలాగే అతని రెండవ రాకడ కొరకై, ఎదురుచూచే కాలము. ఆగమన కాలము, ప్రభువు రెండవ రాకడ కొరకు ఎదురుచూసే కాలము ఎందుకనగా, ప్రభువు తప్పక తన మహిమతో తీర్పుదినమున తిరిగి వచ్చును. ఈ మన విశ్వాసాన్ని “విశ్వాస ప్రమాణము”లో ప్రకటిస్తున్నాము. కనుక, ఆగమన కాలము ప్రభువు మొదటి రాకడ సంస్మరణకు ఆయత్తము అయినప్పటికిని, తన మొదటి రాకడ, తన రెండవ రాకడతో పరిపూర్ణమగునని గుర్తించుదాం. అందుకే, ప్రభువు రెండవ రాకడ కొరకై కూడా నమ్మకముతో సంసిద్ధ పడాలి.
ఆగమనకాలమును ప్రారంభిస్తున్న
సందర్భముగా, ప్రభువురాకకై మనం ఎంత వరకు సిద్ధపడి యున్నామని ఆలోచన చేద్దాం. బాహ్యసంసిద్ధతకు
(క్రిస్మస్ కొరకు చేసే షాపింగ్, వంటలు, అలంకరణలు...) చూపించెడు ఆసక్తిని అంతర్గత సంసిద్ధత (ఆధ్యాత్మిక) పట్ల ఆసక్తిని చూపుచున్నామా?
అనుదిన జీవిత సంఘటనలద్వారా, వ్యక్తులద్వారా, ప్రభువురాకడను గుర్తించగలుగుచున్నామా? లేనిచో, ఇదిగో ప్రియ సోదరా! సోదరీ! ఆగమనకాలం మన ముంగిట ఉన్నది. హృదయ
సంసిద్ధతకు ఈ ఆగమనకాలాన్ని సంపూర్ణముగా ఉపయోగించుకుందాం.
ఆగమానకాలములో మొత్తం నాలుగు
వారాలు ఉంటాయి. ఈ కాలములో గురువు పశ్చాత్తాప స్వభావమును సూచించు ఊదారంగుగల
వస్త్రాలను ధరిస్తారు. అలాగే, క్రిస్మస్ రోజున ప్రభువు రాకడ గూర్చిన ఆశను,
సంతోషమును కూడా సూచిస్తున్నాయి. నేడు మొదటి ఆగమన ఆదివారమున, “ఆగమన పుష్పగుచ్చము”న
‘ఆశ’ అనెడు క్రొవ్వొత్తిని వెలిగిస్తాము. ప్రభువు రాకకై ‘ఆశ’తో ఎదురు చూచుటను ఈ
క్రొవ్వొత్తి సూచిస్తుంది. నిరాశలోనున్న ఈ లోకానికి ప్రభువు ఒక గొప్ప “ఆశ”ను కల్పించడానికి
వస్తారని ఆశిస్తున్నాము. నిరాశ స్థితి నుండి ఆశ స్థితికి మారునని మన ఆశ!
మొదటి
పఠనము: నేటి మొదటి పఠనము “మూడవ యెషయ” గ్రంథము
నుండి తీసుకొనబడింది. బాబిలోనియా (70 సంవత్సరముల) బానిసత్వము నుండి ఇశ్రాయేలు ప్రజలు
విముక్తిని పొందుట, వారికి నూతన జీవితమును
వాగ్ధానము చేయబడుట, వారు “పవిత్ర నగరము”నకు (యెరుషలేము) తిరిగి వచ్చుట అను నేపధ్యములో
ఈ గ్రంథము వ్రాయబడినది. ఇశ్రాయేలు ప్రజలు వాగ్ధత్త భూమికి తిరిగి వచ్చుటకు
సంతసించుచుంటిరి. రాబోవు రోజులలో గొప్ప ఆశతో జీవించునట్లుగా ఆశిస్తున్నారు. బానిసత్వపు
చీకటినుండి వెలుగులోనికి నడిపించు ప్రభువురాకకై గొప్ప ఆశతో, నమ్మకముతో ఎదురుచూచు చుంటిరి.
నేడు ఈ ఆగమనకాలములో పాపపు బానిసత్వములోనున్న మనలను పుణ్యజీవితములోనికి నడిపించు
ప్రభువురాకకై ఎదురుచూచు చున్నాము. కనుక ప్రభువు రాకడ కొరకు వేచియుండు ఈ కాలములో,
అర్ధవంతమయిన సంసిద్ధత ఎంతో అవసరము!
సువిశేష
పఠనము: ప్రభువు ఆగమనమునకు సంబంధించిన సంసిద్ధతను
గురించి నేటి సువిశేష పఠనములో ధ్యానిస్తున్నాము. “జాగరూకులై ఉండాలి” అని
బోధిస్తుంది. ఎందుకన, “ఆ దినము, ఆ ఘడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోక
దూతలుగాని, కుమారుడుగాని, మరెవ్వరుగాని ఎరుగరు. ఆ సమయము ఎప్పుడు వచ్చునో మీకు
తెలియదు” (మార్కు 13:32-33) అని ప్రభువు స్పష్టముగా తెలియ జేశారు. అందుకే మనం
స్థిరముగా అప్రమతముగా ఉండాలి. సిద్ధపడుతూ ఉండాలి. మెలకువగా, జాగరూకులమై ఉండాలి. ఈ
విషయమును యేసుప్రభువు ఒక సంఘటనద్వారా వివరిస్తున్నాడు (మార్కు 13:34-36).
ఈ సంఘటన కొన్ని సత్యాలను
వెల్లడిస్తుంది. మొదటగా, “ఒకానొకడు (ఒక యజమాని) దేశాటనమునకు వెళ్ళుచూ, తన
సేవకులను, ఆయా కార్యములందు నియమించి, మెలకువతో ఉండుమని ద్వారపాలకుని
హెచ్చరించెను.” ఇచ్చట ఆ ఒకానొక వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువే! ఆయన 33 సంవత్సరాలు
మానవునిగా మనతో ఈ లోకములో జీవించాడు. ఆ తరువాత తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు.
తాత్కాలికముగా భౌతికముగా ఆయన మన మధ్యన లేక, మోక్షారోహణము అయ్యాడు. పరలోకమునకు
కొనిపోబడి దేవుని కుడిప్రక్కన కూర్చుండెను. అయితే, ఆయన ఏ సమయములోనైనా తిరిగి
రావొచ్చు.
రెండవదిగా, సేవకులకు ఆయా
బాధ్యతలను అప్పగించడం చూస్తున్నాము. ఇచ్చట సేవకులు అనగా క్రీస్తు శిష్యులు,
అనుచరులు. ఒక్కొక్కరికి ఒక్కొక బాధ్యతను, విధులను అప్పగించడం జరిగింది. మనము
విశ్వాసముగా, నమ్మకముగా మన బాధ్యతలను, విధులను నిర్వహించవలసి యున్నది. బాధ్యత కలిగి యుండాలి. ఒకరిపట్ల ఒకరము బాధ్యత కలిగి జీవించాలి. ఎందుకన, “యజమానుడు
సంధ్యాసమయముననో, అర్ధరాత్రముననో, కోడికూయు వేళనో, ప్రాత:కాలముననో, ఎప్పుడు వచ్చునో
మీకు తెలియదు.” ఎలాంటి హెచ్చరిక లేకుండా ప్రభువు
వచ్చునని అర్ధమగుచున్నది. ఆయన వచ్చినప్పుడు మనం బాధ్యతారాహిత్యముగా ఉన్నచో మనం
చాలా దురదృష్టవంతులము. ఆకస్మాత్తుగా వచ్చి మనం నిద్రించుట ఆయన చూడకూడదు.
మూడవదిగా, యజమానికి సేవకులకు
మధ్యనున్న సంబంధం ‘నమ్మకం’పై ఆధారపడి యున్నది. ఇది మనకు (క్రీస్తు శిష్యులు,
అనుచరులు) ప్రభువుకు ఉన్న సంబంధాన్ని తెలియజేయు చున్నది. మనం పాపాత్ములమైనను,
అయోగ్యులమైనను ప్రభువు మనకు ఎన్నో అనుగ్రహాలను, ప్రతిభను ఒసగాడు. మనలను ఎంతగానో
నమ్మియున్నాడు. ఆ నమ్మకముతోనే ఈ లోకములో ఆయన మరల వచ్చువరకు బాధ్యతలను, విధులను
మనకు అప్పగించాడు. పూర్తి బాధ్యతలను మనకు అప్పజెప్పాడు. మనము నమ్మకమైన సేవకులముగా
ఉండాలని ప్రభువు ఆశిస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు మన శిష్యరికానికి జవాబు
చెప్పవలసి ఉంటుంది. దీని నిమిత్తమే మన సంసిద్ధత ఎంతో ముఖ్యము! మన అనుదిన జీవితములో
మన బాధ్యతలను సక్రమముగా నెరవేర్చడములో మన సంసిద్ధత యున్నదని తెలుసుకుందాం. ప్రభువు
రెండవ రాకడ ఎప్పుడో భవిష్యత్తులో జరిగే సంఘటన కాదు. అది “ఇప్పుడు-ఇక్కడే” జరిగే
సంఘటన కనుక, మనం మెలుకవతో, జాగరూకులై ఉంటూ సిద్ధపడుతూ ఉండాలి.
ప్రభువు మన గృహాలను, హృదయాలను
సందర్శించడానికి సిద్ధపడుటకు ఈ ఆగమనకాలము దైవానుగ్రహ కాలము. కనుక ఆత్మపరిశీలన
చేసుకుందాం. మనం మాట్లాడే మాటలను, చేసెడు కార్యాలను పరిశీలించుకొని పునరుద్దరించు
కుందాము. అలాగే మన వైఖరిని (ధోరణి) పునరుద్దరించు కుందాము (గర్వం, స్వార్ధం,
ప్రగల్భాలు, ఎదుటివారిలో తప్పులు వెదకడం... మొ.నవి).
“మెలకువగా ఉండటం” అనగా
కలలలోగాక వాస్తవములో జీవించడం. అలాగే ఆధ్యాత్మిక మెలకువ (ఆత్మసంసిద్ధత) ద్వారా
ఆధ్యాత్మిక వాస్తవములో జీవించగలము.
No comments:
Post a Comment