28వ సామాన్య ఆదివారము [YEAR A]

 28వ సామాన్య ఆదివారము [YEAR A]
యెషయ 25:6-10; ఫిలిప్పీ. 4:12-14, 19-20; మత్తయి 22:1-14
దేవుని విందు


ఉపోద్ఘాతము: క్రీస్తు నందు ప్రియ సహోదరీ సహోదరులారా! ఈ రోజు దైవార్చన కాలములో మనం 28వ సామాన్య ఆదివారములోనికి ప్రవేశించి యున్నాము.

మొదటి పఠనము – నేపధ్యము: యెషయ 24-27 అధ్యాయాలు ఒకే భాగముగా చూడవచ్చు. 24వ అధ్యాయపు సారాంశమును 24:1లో చూడవచ్చు: “ప్రభువు భూమిని శూన్యము చేసి నాశనము చేయును. నేల ఉపరిభాగమును వంచి, దానిమీది ప్రజలను చెల్లాచెదరు చేయును.” ఈ అధ్యాయము ఈ లోకముపై దేవుని తీర్పు [దైవశిక్ష, లోకాంతము, కడగతులు] గురించి తెలియజేయు చున్నది. ఇలాంటి తీర్పు ఎందుకన, “లోకము నరుల వలన కలుషితమైనది. వారు శాసనములను పాటింపరైరి. శాశ్వతమైన నిబంధనమును మీరిరి” (24:5). అలాగే, భయానకరమైన విషయములు పలుకబడినవి: “భయము, గొయ్యి, ఉరులు” (24:17) – అనగా, భూమి బ్రద్ధలగును, బీటలు వారును, గడగడ వణుకును” (24:19); “ఆ దినమున ప్రభువు, ఆకాశమునందలి శక్తులను, భూమిమీది రాజులను శిక్షించును. వారిని బంధీలుగా చెరలో పడవేయును, వారిని దండితును” (24:21-22). ఇలాంటి విపత్తు సంఘటనలకు కారణం 24:23వ వచనములో చెప్పబడింది:

“అప్పుడు చంద్రుడు ప్రకాశింపడు,
సూర్యుడు కాంతినీయడు.
సైన్యములకధిపతియగు ప్రభువే రాజై
యెరూషలేమున సియోను కొండపై
పరిపాలనము చేయును.
ప్రజానాయకులు ఆయన తేజస్సును దర్శింతురు.

అలాగే, దేవుని తీర్పును గురించిన విషయం 25వ అధ్యాయములో కూడా కొనసాగుచున్నది (మొదటి పఠనము). ప్రభువు “నగరములను శిధిలము గావించును. సురక్షిత నగరములను దిబ్బలు చేయును (25:2); “మోవాబును ఎరువు దిబ్బలో చెత్తనువలె త్రొక్కివేయును” (25:10). అయితే ఇదే అధ్యాయములో, ప్రభువు చేసిన గొప్ప కార్యాలకు స్తుతి కీర్తనలు పాడటం చూస్తున్నాము (25:1): “ప్రభువు పేదలకు, ఆపదలోనున్నవారికి ఆశ్రయ మిచ్చును, ఎండవేడిమిలో నీడనొసగును” (25:4); ఇశ్రాయేలు ప్రజలతోపాటు, “సకలజాతులకు” ప్రభువు నమ్మకము నిచ్చును (25:6); విచారమును, దు:ఖమును తొలగించును (25:7); మృత్యువును నాశనము చేయును. కన్నీళ్లను తుడిచి వేయును (25:8).

26వ అధ్యాయము ఒక విజయగీతము: దీనిని యూదాలో పాడుదురు (26:1). ఈ అధ్యాయము “ఉత్థానము” గురించి ప్రస్తావించు చున్నది: “మృతులైన ప్రజలు మరల జీవింతురు. వారి మృతశరీరములు జీవముతో లేచును. మట్టిలో కలిసిపోయిన వారందరు మరల లేచును” (26:19).

27వ అధ్యాయము ప్రభువు వాగ్దానముతో ప్రారంభమగుచున్నది: “ఆ దినమున ప్రభువు మహాసర్పమును, మకరమును దండించును; సముద్రముననున్న ఘటసర్పమును శిక్షించును” (27:1). ఆ విధముగా, ఆ దినమున ప్రభువు తన ద్రాక్షాతోటయైన ఇశ్రాయేలు ప్రజల గురించి పాట పాడును. అలాగే ప్రజలు ప్రభువు విజయము గురించి పాటలు పాడుదురు. అలాగే, ఈ అధ్యాయము ఇశ్రాయేలు ప్రజలకు ఒక వాగ్దానముతో ముగుస్తుంది: “అస్సిరియాలో నాశనముకానున్న ప్రజలును, ఐగుప్తున చెల్లాచెదరైయున్న జనులును తిరిగి వత్తురు. వారు యెరూషలేమున పవిత్ర పర్వతముపై ప్రభువును ఆరాధింతురు” (27:13).

ఈవిధముగా, ఈ అధ్యాయాలు (24-27) చెడుపై ప్రభువు విజయము గురించి మరియు ఇశ్రాయేలు ప్రజలకు, అలాగే సకలజాతులకు కూడా పభువు ఆశీర్వాదములు వచ్చుట గురించి ప్రవచిస్తున్నాయి.

మొదటి పఠనము 25:6-10: “ప్రభువు పర్వతముమీద సకలజాతులకును విందు సిద్ధము చేయును” (25:1). ఆమోసు కుమారుడైన యెషయ, యూదా, యెరూషలేములను గూర్చి చూచిన దర్శనములో ఇలా చూస్తున్నాము: “కడవరి దినములలో ప్రభువు మందిరమున్న పర్వతము, ఉన్నతమైనదగును, ఎత్తైనదగును. సకలజాతి జనులును ప్రవాహమువలె దానిచెంతకు వత్తురు” (2:2). ఇచ్చట పర్వతము పేరు చెప్పబడలేదు. కాని, “యెరూషలేము సియోను కొండ” అని 24:23వ వచనములో చూస్తున్నాము.

25:1వ వచనం ఒక క్రొత్త దర్శనముగా చూస్తున్నాము. సైన్యములకధిపతియైన ప్రభువు అందరికి విందును ఏర్పాటు చేయుచున్నాడు. ప్రభువు ముందుగా ఈ లోకమును చెడునుండి [శత్రువులు, పాపము] విముక్తి గావించి, ఆ తరువాత గొప్ప విందును ఏర్పాటు చేయు చున్నాడు. ఈ విందుకు కేవలం ఇశ్రాయేలు ప్రజలను మాత్రమేగాక, సకలజాతి జనులను ప్రభువు ఆహ్వానించు చున్నాడు. పాత నిబంధనములో ఇశ్రాయేలు ప్రజలను మాత్రమే దైవప్రజగా చూస్తున్నాము, కాని, దేవుడు ఇతరులపై [అన్యులపై] కూడా ప్రభువు తన వెలుగును ప్రకాశింప జేయుచున్నాడు.

ఆ విందు “ప్రశస్త మాంసభక్ష్యములతోను, మధువుతోను కూడియుండును. తేరుకొనిన ద్రాక్షరసముతోను నిండియుండును” (25:6). ఆ కాలములో ప్రజలు చాలా సాధారణమైన భోజనమును భుజించెడివారు. రొట్టెలు వారి అనుదిన ప్రధానమైన భోజనం; మాంసమును కూడా అప్పుడప్పుడు మాత్రమే భుజించేవారు. కూరగాయలు ఉండటం పాత నిబంధనములో అరుదుగా చూస్తాము. వారు ఒలీవు చెట్లను పెంచేవారు; వానిద్వారా నూనెను చేసేవారు; ద్రాక్షాతోటలు సమృద్ధిగా ఉండేవి; తాజా మరియు ఎండుద్రాక్షలను ఆరగించేవారు. అలాగే ద్రాక్షారసము త్రాగేవారు. ప్రశస్త విందు వారి జీవితాలలోచాలా అరుదుగా ఉండేది; ఉదాహరణకు, వివాహ విందు ప్రశస్తముగా ఉండేది. ఎంతో ఖర్చుతో కూడుకొని ఉంటిది కనుక ఇలాంటి సందర్భాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు. ఉదాహరణకు, యేసు కానా పల్లెలో నీటిని ద్రాక్షారసముగా మార్చినప్పుడు, విందు నడిపెడి పెద్ద పెండ్లి కుమారునితో, “ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇచ్చును. అందరు మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కాని, నీవు శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇప్పటివరకు ఉంచితివి” అని అన్నాడు (యోహాను 2:10). అనగా, ఖర్చు ఎక్కువ కాబట్టి, తక్కువ రకపు ద్రాక్షారసమును కూడా ఇచ్చేవారు.

రాజులు, ధనికులు ఇలాంటి విలాసవంతమైన విందులను ఏర్పాటు చేసేవారు కాని, అదికూడా వారి స్నేహితులకు, సహచరులకు మాత్రమే! ధనికుడైన సోలోమోను రాజుకూడా “అందరికి” విందును ఏర్పాటు చేయలేక పోయాడు.

అయితే, ఇక్కడ చెప్పబడినటువంటి విందు ఈ లోకములో ఏర్పాటు చేయబడు విందు వంటిది కాదు. ఈ విందును స్వయముగా ప్రభువే సిద్ధము చేయుచున్నాడు. ప్రభువు మాత్రమే ఈ ప్రశస్తమైన విందును “అందరికి” ఏర్పాటు చేయగలడు.

ప్రభువు ఏర్పాటు చేయు విందు (25:7-9):

-       సకల జాతి జనుల విచారమును తొలగించును; సకల ప్రజల దు:ఖమును తొలగించును

-       మృత్యువును నాశనము చేయును: చూడుము. 26:19; క్రీస్తు ద్వారా మరణఉత్థానముల ద్వారా ఇది నెరవేరెను; 1 కొరి 15:54 “మృత్యువు నాశనము చేయబడినది; విజయము సంపూర్ణము.”

-       ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయును: అనారోగ్యము, ఆర్ధిక సమస్యలు, ప్రకృతి వైపరిత్యాలు, వివాహ సమస్యలు, పిల్లల వలన కలుగు కన్నీళ్లు, ఉద్యోగ సమస్యలు, నిరాశ, నిస్పృహలు...

-       అవమానమును తొలగించును

-       ప్రభువు ప్రజలను కాపాడును, రక్షించును.

“క్రొత్త దివి, క్రొత్త భువి”ని గూర్చి దర్శన గ్రంథములో ఇలా చదువుచున్నాము: “దివి యందలి దేవునినుండి దిగివచ్చుచున్న పవిత్ర నగరమగు నూతన యెరూషలేమును కాంచితిని. ఆమె తన భర్తను చేరబోవుటకు వస్త్రధారణము ఒనర్చుకొని సిద్ధపడిన వధువువలె ఉండెను.... వారి నేత్రముల నుండి వెలువడు కన్నీటిని ఆయన తుడిచి వేయును. ఇక మృత్యువుగాని, దు:ఖముగాని, ఏడుపుగాని, బాధగాని, ఏ మాత్రము ఉండబోదు. పాత విషయములు గతించినవి” (21:2-4).

యెషయ ఈ ప్రవచనాలను (25:6-9) ఇశ్రాయేలు ప్రజలు 50 సం.ల. బాబిలోనియ బానిసత్వములో నుండగా వ్రాసాడు (ప్రభువు స్వయముగా పలికిన పలుకిది). కాని ఇప్పుడు ప్రవక్త ఈ ప్రవచనాల ద్వారా దేవుని రక్షణ గూర్చి, ఆయన ప్రశస్త విందు గురించి తెలియజేయు చున్నాడు. “ఆ దినము” (9 వచనం) ప్రభువు విందు సిద్ధము చేయు దినము, అనగా రక్షణ దినము [దేవుడు తన కుమారుని ద్వారా ఏర్పాటు చేయబోవు రక్షణ విందు].

సువిశేష పఠనము - నేపధ్యము:

ప్రధానార్చకులు పెద్దలు, “ఏ అధికారముతో నీవు ఈ పనులు చేయుచుంటివి? నీకు ఈ అధికారమిచ్చిన వాడెవడు?” (21:23) అని యేసును ప్రశ్నించిరి. దానికి బదులుగా యేసు వారిని ఉద్దేశించి మూడు ఉపమానములను బోధించాడు. గడచిన రెండు వారాలు రెండు ఉపమానములను ధ్యానించాము (ఇద్దరు కుమారుల ఉపమానము, భూస్వామి-కౌలుదార్లు ఉపమానము). ఈరోజు “పెండ్లి పిలుపు” (లూకా 14; 15-24 విందు-పరమ రాజ్యము) ఉపమానము గూర్చి ధ్యానిస్తున్నాము.

యేసు “వారికి” [ప్రధానార్చకులు, పరిసయ్యులు, 21:45] మరల ఉపమాన రీతిగా ప్రసంగింప ఆరంభించెను (22:1). ఉపమానములో: రాజు = దేవుడు; కుమారుడు = యేసు [పెండ్లి కుమారుడు; పెండ్లి కుమార్తె = ఈ లోకములో దైవరాజ్యము]; ఆహ్వానింపబడిన వారు = ఇశ్రాయేలు ప్రజలు; సేవకులు = యూద ప్రవక్తలు, [క్రైస్తవ] బోధకులు; తగులబెట్టబడిన పట్టణము =  యెరూషలేము; మంచి, చెడు వారు = సంఘస్తులు, నీతిమంతులు, అన్యాయము చేయువారు; వివాహ వస్త్రము = క్రీస్తునందు విశ్వాసము, నీతి, న్యాయములు కలిగి జీవించడం.

ఈ ఉపమానము కేవలము రాజు, విందు గురించి మాత్రమే కాదు! ఇది ‘ప్రజల’ రక్షణ చరిత్ర. ఈ చరిత్రలో ప్రభువు తన ప్రవక్తలు, బోధకుల ద్వారా తన సందేశమును [సువార్త] పంపగా, కొందరు అంగీకరించారు, ఇతరులు నిరాకరించారు (లక్ష్యపెట్టక తమతమ పనులకు పోయారు).

ఈ ఉపమానము పరలోక రాజ్యము గూర్చి మరియు పరలోక రాజ్యములోనికి ఎవరు అర్హులు అని బోధించు చున్నది. వివాహ విందు మెస్సయ్య విందు [రక్షణ]ను సూచిస్తున్నది. అచట క్రీస్తుతో ప్రజలు ప్రమోదము చెందెదరు (చూడుము యెషయ 25:6-8).

స్వయముగా దేవుడే [రాజు] తన ప్రజలను, తన రాజ్యములోనికి [కుమారుడు క్రీస్తు] అనగా, ప్రేమ-సేవా జీవితమునకు ఆహ్వానించుటకు ఆసక్తిని చూపుచున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను స్వయముగా దేవుడే ఎన్నుకొని, వారిని నడిపించాడు. కాని ప్రజలు ఆహ్వానాన్ని నిరాకరించారు. ఇది దేవున్ని అగౌరవ పరచడమే! దేవుని పిలుపుకు ప్రతిపిలుపు ఇవ్వలేక పోయారు. కొంతమంది వారివారి పనులకు వెళ్ళిపోయారు. ఇంకొంతమంది రాజు పంపిన సేవకులను (ప్రవక్తలను) కొట్టి చంపారు.

అప్పుడు ప్రభువు మండిపడి తన సైన్యమును పంపి ఆ హంతకులను హతమార్చి వారి పట్టణమును తగుల బెట్టించెను (22:7). క్రీ.శ. 70వ సం.లో యెరూషలేము పట్టణము నాశనం చేయబడింది. ఇది ఇశ్రాయేలు ప్రజలపై దేవుని తీర్పుగా మత్తయి సువార్తీకుడు చిత్రీకరించు చున్నాడు.

తరువాత రాజు, “నా విందు సిద్ధముగా ఉన్నది. కాని, నేను ఆహ్వానించిన వారు దానికి యోగ్యులుకారు” అని అంటున్నాడు (22:8). మత్తయి తన సువార్తను యూద-క్రైస్తవులకు వ్రాసియున్నాడు కనుక, “ఆహ్వానింప బడిన వారు” యూదులు అని వారికి సులువుగా అర్ధమగును. యూదులు దేవుని రాజ్యమును నిరాకరించినందున దేవుడు అన్యులను ఆహ్వానిస్తున్నాడు: మంచి చెడు [ఆనాటి క్రైస్తవ సంఘాన్ని; దేవుని కరుణ, దయను సూచిస్తుంది] తేడా లేక తమ కంటబడిన వారినందరును తీసుకొని వచ్చిరి. వీరు అన్యులు, పేదలు, సాధారణ ప్రజలు, సుంకరులు, పాపులు...

దేవునితో మనకు ఉండవలసిన సంబంధం గురించి ఈ ఉపమానము తెలియజేయుచున్నది. దేవుడు మనలనందరిని తన దరికి, సన్నిధికి, రాజ్యములోనికి ఆహ్వానిస్తున్నాడు. దేవుని పిలుపును స్వీకరించని యెడల, ఆ రాజ్యమును, సంతోషమును, ఆనందమును కోల్పోతాము. ఈ ఉపమానము మనకి ఒక హెచ్చరిక కూడా! ఎందుకన, ఉపమానములో ఆహ్వానాన్ని స్వీకరించని వారు ఖఠీనముగా శిక్షింప బడినారు. వివాహ వస్త్రము లేనివానిని చీకటి లోనికి త్రోసివేసెను (22:11-13). “వివాహ వస్త్రము” అనగా “క్రీస్తును ధరించడం.” ఒకరి గతము ఏదైనను, ప్రస్తుతం, ఇప్పుడు హృదయ పరివర్తన చెంది, క్రీస్తును విశ్వసించి ఉండవలయును. జ్ఞానస్నానము పొందియుండ వలయును. క్రీస్తు బోధనలను పాటించ వలయును. క్రీస్తు నందు ప్రేమ-సేవా జీవితమును జీవించ వలయును. సువార్తా విలువలకు సాక్ష్యమిస్తూ జీవించ వలయును. సంఘములో బాధ్యతలు కలిగి జీవించ వలయును. కనుక, కేవలము శారీరకముగా ఉంటే [నామ మాత్రపు క్రైస్తవులుగా] చాలదు. నిజమైన మారుమనస్సు, హృదయ పరివర్తనము, మంచి కార్యములు... లేనిచో, దేవుని విందులో పాల్గొనలేము లేదా దేవుని రాజ్యములో భాగస్తులము కాలేము! “పిలువబడిన వారు అనేకులు, కాని, ఎన్నుకొనబడిన వారు కొందరే” (22:14).

దేవుడు మనకు గొప్ప వాటిని సిద్ధము చేసాడని అర్ధమగుచున్నది. ఎవరి గతం ఎలా ఉన్న దేవుడు అందరిని ఆహ్వానిస్తున్నాడు. “దేవునకు పక్షపాతము లేదు” (రోమీ 2:11). అయితే, ఆహ్వానాన్ని స్వీకరించిన వారు, దేవుని విందులో (రాజ్యము) పాల్గొనుటకు ఉండవలసిన అర్హత - క్రీస్తు నందు విశ్వాస జీవితము. అర్హతలేని వారు శిక్షింపబడును. దేవుడు తన కృపను [క్రీస్తు] అందరికి ఒసగాడు. ఆ కృపతో మనం సహకరించ వలయును. సహకరించనిచో దేవుని రాజ్యములో చేరలేము. కనుక, మన “వివాహ వస్త్రము”ను నిర్మలముగా, పవిత్రముగా ఉంచుటకు ప్రయత్నం చేయాలి.

పౌలు ఈ విషయాన్ని చక్కగా తెలుసుకున్నాడు. ఈనాటి రెండవ పఠనములో ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖలో ఇలా తెలియజేయు చున్నాడు: ఆకలిగా ఉన్నను, కడుపు నిండినను, కొద్దిగా లభించినను, ఎక్కువగా లభించినను, సంతృప్తిగా ఉండు రహస్యమును నేర్చుకొంటిని, అదియే క్రీస్తు అనుగ్రహించు శక్తి – క్రీస్తు నందు సంపూర్ణ విశ్వాసం. కలిమిలేములలో క్రీస్తు తన వెన్నంటి ఉంటాడనే విశ్వాసం. అలాగే ఫిలిప్పీయులకు కావలసిన అవసరములన్నింటిని దేవుడు తీర్చును అనే విశ్వాసం. మనకు కూడా కావలసిన దృఢ విశ్వాసమును, నమ్మకమును ఒసగుమని ప్రభువును ప్రార్ధిద్దాం. తండ్రియైన దేవునికి సదా మహిమ కలుగునుగాక! ఆమెన్.

No comments:

Post a Comment