27వ సామాన్య ఆదివారము [YEAR A]

 27వ సామాన్య ఆదివారము [YEAR A]
యెషయ 5:1-7; ఫిలిప్పీ. 4:6-9; మత్తయి 21:33-43
దేవుని తోటలో ఫలించాలి

ఉపోద్ఘాతము: క్రీస్తు నందు ప్రియ సహోదరీ సహోదరులారా! ఈ రోజు దైవార్చన కాలములో మనం 27వ సామాన్య ఆదివారములోనికి ప్రవేశించి యున్నాము.

సువార్తా పఠన నేపధ్యము: ఈనాటి సువిశేష పఠనము మత్తయి సువార్త 21 అధ్యాయము 33వ వచనము నుండి 43వ వచనం వరకు వింటున్నాము. ఈ సువార్తా పఠన నేపధ్యము ఏమనగా, యేసు యెరూషలేము దేవాలయములో ప్రవేశించి, అక్కడ వ్యాపారము చేయుచున్న వారిని వెడల గొట్టెను. అక్కడ ఆయన అనేకమందిని స్వస్థత పరచెను. అక్కడనుండి యేసు బెతానియాకు వెళ్లి అచట ఆ రాత్రి గడిపెను (మత్తయి 21:12-17). మరునాటి ఉదయమున పట్టణమునకు తిరిగి వచ్చు సమయములో ఫలింపని అంజూరపు చెట్టును యేసు శంపించెను (మత్తయి 21:18-22). అటుపిమ్మట యేసు యెరూషలేము దేవాలయములో ప్రవేశించి బోధించుచుండగా, ప్రధానార్చకులు, పెద్దలు వచ్చి, “ఏ అధికారముతో నీవు ఈ పనులు చేయుచుంటివి? నీకు ఈ అధికారము ఇచ్చిన వాడెవడు?” అని ప్రశ్నించిరి. యూదానాయకులు [ధర్మశాస్త్రబోధకులు, పెద్దలు, సద్దుకయ్యులు, పరిసయ్యులు] సర్వ హక్కులు కలిగిన వారిగా భావించేవారు. ఇతరులు ఏది చేయాలన్న వారి అనుమతి పొందాలని భావించేవారు. వారి ప్రశ్నకు సమాధానము ఇచ్చుటకు బదులుగా యేసు, “యోహాను బప్తిస్మము ఎచట నుండి వచ్చినది? పరలోకము నుండియా? లేక మానవుని నుండియా?” అని వారిని తిరిగి ప్రశ్నించెను. వారు ఏ సమాధానము చెప్పక పోవుటచే, యేసు కూడా వారి ప్రశ్నకు ఏ సమాధానము ఇవ్వలేదు. అటుపిమ్మట, వారిని ఉద్దేశించి మూడు ఉపమానములను బోధించెను: ఇద్దరు కుమారుల ఉపమానము (మత్తయి 21:28-32), భూస్వామి-కౌలుదార్లు ఉపమానము (మత్తయి 21:33-46), వివాహపు విందు ఉపమానము (మత్తయి 22:1-14). ఈ ఉపమానముల ద్వారా వారి ప్రశ్నలకు సమాధానములను ఇచ్చుచున్నాడు. అలాగే వారి మారుమనస్సును, హృదయ పరివర్తనను ఆశిస్తున్నాడు.

భూస్వామి-కౌలుదార్లు ఉపమానము (మత్తయి 21:33-46): ఇదే ఉపమానాన్ని మార్కు 12:1-12; లూకా 20:9-19లలో కూడా చూడవచ్చు. ప్రభువు ఈ ఉపమానము, ఉపమానములోని వ్యక్తులు, వస్తువులు, సంఘటనలు ద్వారా నిగూఢమైన అర్ధాన్ని బయలుపరుస్తున్నాడు:

యజమానుడు = దేవుడు; ద్రాక్షాతోట = ఇశ్రాయేలు జాతి [నేడు నూతన ఇశ్రాయేలు అయిన మనము = శ్రీసభ]  భూలోకములోని దైవరాజ్యము; కౌలుదారులు = ఇశ్రాయేలు ప్రజలు లేదా మత నాయకులు/పెద్దలు; సేవకులు = ప్రవక్తలు; [యజమాని] కుమారుడు = యేసు; ఇతర కౌలుదార్లు = అన్యులు, క్రైస్తవ సంఘము, శ్రీసభ లేదా క్రీస్తానుచారులు/క్రీస్తు విశ్వాసులు.

దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒడంబడిక చేసుకొనెను, అనగా దేవుడు ద్రాక్షాతోటను నాటెను [ధర్మశాస్త్రము, వాగ్ధత్తభూమి ఒసగబడెను]. ఇశ్రాయేలు ద్రాక్షాతోటతో పోల్చబడినది: “ఐగుప్తు నుండి నీవొక ద్రాక్షతీగను గొనివచ్చితివి. అన్యజాతులను వెళ్ళగొట్టి వారి దేశమున దానిని నాటితివి” (కీర్తన 80:8). దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము నుండి వాగ్ధత్తభూమికి నడిపించిన విషయం మనందరికీ తెలిసినదే! “యిస్రాయేలీయులు విస్తారముగా పండిన ద్రాక్షతీగ వంటివారు” (హోషేయ 10:1). “మంచి విత్తనము నుండి మొలకెత్తిన శ్రేష్టమైన ద్రాక్షతీగగా నేను మిమ్ము నాటితిని” (యిర్మియా 2:21).

మత్తయి 21:33 [ఆనాటి శ్రోతలు, ముఖ్యముగా యూదనాయకులు] వినినప్పుడు, యెషయ 5:1-2ను గుర్తుచేసుకొన వచ్చును [ద్రాక్షాతోట పాట యెషయ 5:1-7]. ఈ ఉపమానము ఇశ్రాయేలు ప్రజల చరిత్ర సారాంశముగా ఉన్నది. యెషయ ప్రవచనాలలో యజమాని [దేవుడు] ద్రాక్షాపండ్ల కొరకు ఎదురు చూచెను. కాని ఆ తోట పుల్లని కాయలు [ఇశ్రాయేలు పాపము] కాచెను. చాలా నిరాశ పరచేటటువంటి విషయం. పుల్లని కాయలు ఇశ్రాయేలు ప్రజల ఫలాల్ని [వారి అవిశ్వాసం, విగ్రహారాధన, దేవునిపై తిరుగుబాటు... మొ.వి.] సూచిస్తుంది. హోషేయ ప్రవక్త అంటున్నాడు: “యిస్రాయేలీయులు విస్తారముగా పండిన ద్రాక్షతీగ వంటివారు. కాని సంపదలు పెరిగిన కొలది వారు బలిపీఠములను అధికముగా నిర్మించిరి. పంట విస్తారముగా పండిన కొలది దేవతా స్తంభములను ఎక్కువ సుందరముగా తయారు చేసిరి” (10:1). యిర్మియా అంటున్నాడు: “కాని మీరిపుడు నిష్ప్రయోజకమైన భ్రష్టజాతి ద్రాక్షలుగా మారిపోతిరి” (యిర్మియా 2:21).

అందుకు దేవుడు ఆ ద్రాక్షాతోటను [ఇశ్రాయేలు] నాశనము చేసెను; కంచెను కొట్టి వేసెను. ప్రాకారమును పడగొట్టెను, వాన కురువ వలదని మబ్బులను ఆజ్ఞాపించెను (యెషయ 5:5-6). యెహెజ్కేలు అంటున్నాడు: “యావే ప్రభువు పలుకులివి: నరులు అడవిలో ద్రాక్షకొయ్యను కాల్చివేసినట్లే, నేను యెరూషలేము ప్రజలను దండింతును” (15:6).

అయితే, యేసు చెప్పిన ఉపమానములో, ద్రాక్షాతోట నాశనం చేయబడలేదు, కాని దానిని ఇతర కౌలుదార్లకు ఇవ్వబడెను. అలాగే, కౌలుదార్ల ప్రయోజనమునకై సమస్తమును సిద్ధపరచెను: చుట్టు కంచె వేయించెను, గానుగ కొరకు గోతిని త్రవ్వించి, గోపురము కట్టించెను (21:33). తోటను కాపాడుకొనుటకు కంచె ఎంతగానో తోడ్పడును. గానుగ ద్రాక్షారసము చేయుటకు ఉపయోగించెదరు. బైబులులో ద్రాక్షారసము సంతోషమును సూచిస్తుంది. గోపురము తోటను కాపలా కాయుటకు ఉపయోగపడును. ఇవన్నియు కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేసిన ఏర్పాట్లను తెల్పుచున్నాయి. అదేవిధముగా, దేవుడు ఇశ్రాయేలు ప్రజల ప్రయోజనము కొరకు, వారు మంచి ఫలాలను ఫలించుటకు సమస్తమును సిద్ధపరచాడు; వారితో ఒడంబడిక చేసుకున్నాడు, మంచి-చెడు సమయాలలో వారిని నడిపించాడు, వాగ్ధత్త భూమిని వారసత్వముగా వారికి ఒసగాడు, వారికి మార్గదర్శకముగా ధర్మశాస్త్రమును, ప్రవక్తలను ఇచ్చాడు... ఉపమానములో యజమానుడు “దూరదేశమునకు వెడలిపోయాడు.” అనగా, దేవుడు తన ప్రజలను వదిలి వెళ్ళాడని అర్ధము కాదు. మత్తయి 25:14 మరియు మార్కు 13:34 ప్రకారం, సేవకులకు బాధ్యతలను లేదా ఆస్తిని వారికి అప్పజెప్పడం అని అర్ధం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను [నేడు మనము] ఎప్పుడు ఎడబాయలేదు, విడనాడలేదు. వారిని కంటికి రెప్పల కాచుకున్నాడు. వారికి సమస్తమును చేకూర్చి వారికి అప్పజెప్పాడు. కనుక, ప్రజలు మంచి ఫలాలను ఫలించని యెడల అది యజమాని తప్పుగాని, ద్రాక్షతోట తప్పుగాని కాదు, ఎందుకన, అంతయు చక్కటి ప్రణాళికతో సిద్ధము చేయబడెను. సర్వమును సిద్ధము చేసిన యజమాని మంచి ఫలాన్ని ఆశించడంలో ఎంతమాత్రము అతిశయోక్తి లేదు!

“ద్రాక్షాపండ్లు కోతకు వచ్చినప్పుడు, తన భాగమును [ఫలాలను] తెచ్చుటకై, కౌలుదార్ల యొద్దకు తన సేవకులను పంపెను. కాని వారు ఒకనిని కొట్టిరి; ఒకనిని చంపిరి; మరియొకనిని రాళ్ళదెబ్బలకు గురిచేసిరి” (21:35). వారు ఎందుకు ఇలా చేసారు? కౌలుదార్లు ద్రాక్షాతోటను స్వంతం చేసుకోవాలని అనుకున్నారు [స్వార్ధం, అత్యాశ, పరుల సొమ్ముపై ఆశ...]. అనగా, వారి ఇష్టము వచ్చినట్లుగా ప్రవర్తించ వచ్చని భావించారు. ఇది ప్రవక్తల పట్ల ఇశ్రాయేలు ప్రజల తీరును జ్ఞప్తికి తెస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఆధ్యాత్మికముగా ఫలించాలని, వారుదేవుని ప్రజలని, వారు దేవుని తోటలోనున్నారని, దేవుడు ఆశించే ఫలాలను ఫలించాలని ప్రవక్తలు పదేపదే వారికి గుర్తుచేశారు. అయితే వారు ప్రవక్తలపట్ల ఎలా ప్రవర్తించారు? వారిని విస్మరించారు, తిరస్కరించారు. జెకర్యా ప్రవక్తను రాళ్ళతో కొట్టి చంపారు (2 రా.ది.చ. 24:21); యిర్మియాను కొట్టి బొండలో వేసారు (యిర్మీయా 20:2; చదువుము. 38:4-10); ఊరియా ప్రవక్తను చంపారు (యిర్మీయా 26:21-23); “ప్రభువును సేవింపుడని తమను మందలించిన ప్రవక్తలను పట్టి చంపి వేసారు అని నెహెమ్యా 9:26లో చదువుచున్నాము. (చదువుము. మత్తయి 5:12; 23:29-37); బప్తిస్మ యోహాను పట్ల వారు ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించిరి (మత్తయి 17:12-13). ఎవరి ఇష్టము వచ్చినట్లుగా వారు ప్రవర్తించడం [వ్యక్తివాదం, స్వార్ధవాదం, స్వీయకేంద్రీకృతం] నేడు పెద్ద సమస్యగా మారింది. ఇలాంటి వైఖరి చాలా ప్రమాదకరం. ఇలాంటి వైఖరితో, ధోరణితో మనం మంచి ఫలాలను ఇవ్వలేము.

“యజమానుడు [దేవుడు] చివరకు తన కుమారుని [యేసు] వారు అంగీకరింతురని తలంచి, అతనిని వారి యొద్దకు పంపెను” (21:37). ఇదే విషయాన్ని హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో చూడవచ్చు: “గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడెను. కాని, ఈ కడపటి దినములలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను” (1:1-2). కుమారుడు తండ్రికి వారసుడు. కనుక అతనిని చంపి ఆస్తిని దక్కించు కోవాలని తలంచి ద్రాక్షాతోట వెలుపల పడద్రోసి చంపిరి. యేసును యెరూషలేము బయట ‘గొల్గొతా’ కొండపై సిలువవేసిరి (మత్తయి 27:33). “తన రక్తముచే ప్రజలను పాపములనుండి శుద్ధి యొనర్చుటకు యేసు గూడ నగర ద్వారమునకు వెలుపలనే మరణించెను” అని హెబ్రీ 13:12లో చదువుచున్నాము. ఇచట యేసు తాను ఈలోకమును రక్షించుటకు వచ్చిన దేవుని కుమారుడని, యూదానాయకులు అతనిని చంపబోవుచున్నారని తెలియజేయు చున్నాడు. అలాగే, ఏ అధికారముతో ఈ పనులు చేయుచున్నావు అని యూదానాయకులు అడిగిన ప్రశ్నకు, దేవుని కుమారునిగా తన అధికారము గురించి స్పష్టము చేయుచున్నారు. 

ఈవిధముగా, ఫలాలను ఇవ్వలేని వారిని దేవుడు ఏమి చేయును అన్నదానికి సమాధానం 41వ వచనములో చూడవచ్చు: ప్రధానార్చకులు, పెద్దలు, “ఆ దుష్టులను మట్టుపెట్టి [దయనీయమైన చావు], కోతకాలమున తన భాగమును చెల్లింపగల [మంచి ఫలములను ఇచ్చు] ఇతర కౌలుదార్లకు ఆ భూమిని గుత్తకిచ్చును” అని సమాధానం ఇచ్చారు. అందుకు యేసు 43వ వచనములో, వారినుద్దేశించి, “అందువలన దేవుని రాజ్యము మీనుండి తొలగింపబడి తగిన ఫలములనిచ్చు వారికి ఈయబడునని నేను మీతో చెప్పుచున్నాను” అని చెప్పెను. అయినను వారు మారుమనస్సు చెందలేదు. బదులుగా, దేవుని కుమారున్ని చంపుటకు సన్నాహాలు చేసారు. “మూలరాయి”ని త్రోసివేసారు. ఆమోసు 3:2వ వచనాన్ని గుర్తుచేసుకుందాం: “భూమిమీద జాతులన్నింటిలోను నేను మిమ్ము మాత్రమే ఎరిగి యుంటిని. కావున మీ పాపములన్నింటికిగాను నేను మిమ్ము దండింతును”.

దేవుడు మనలనుండి ఎలాంటి ఆధ్యాత్మిక ఫలాన్ని ఆశిస్తున్నాడు?
మొదటగా, యేసునందు సంపూర్ణ విశ్వాసము కలిగి జీవించడం.  లూకా 18:8: మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఈ భూమిమీద ఆయన అట్టి విశ్వాసమును చూడగాలుగునా? 
రెండదిగా, నీతి, న్యాయపరమైన జీవితము. “దేవుడు న్యాయమును ఆపేక్షించెను, నీతిని కాంక్షించెను” (యెషయ 5:7). కనుక, మనము నీతిగా, నిజాయితీగా జీవించ వలెను.
మూడవదిగా, మీకా 6:8లో చదువుచున్నాము. ప్రభువు కోరునది ఇదియే: “నీవు న్యాయమును పాటింపుము, కనికరముతో మెలుగుము. నీ దేవుని పట్ల వినయముతో ప్రవర్తింపుము. ఇదియేగదా! ప్రభవు నీ నుండి కోరుకొనునది.” 
నాలుగవదిగా, ఆత్మఫలము కలిగి జీవించ వలెను [గలతీ 5:22-23; ఫలము ఏకవచనములో వాడబడింది: “fruit of the spirit” తొమ్మిది ఫలాలు కలిగిన ఒకే ద్రాక్ష గుత్తి – ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము].
ఐదవదిగా, 1 తెస్స 4:3లో చూడవచ్చు: “మీరు పవిత్రులై ఉండవలెననియు దేవుని సంకల్పం”.

కనుక, మంచి జీవితమును జీవించడం, దేవునికి ఆమోదయోగ్యమైన జీవితమును జీవించడం, దేవుని చిత్తానుగుణముగా జీవించడం, పశ్చాత్తాపము, మారుమనస్సు కలిగి జీవించడం, యేసు బోధనల, ఆజ్ఞల ప్రకారం జీవించడం, మన అనుదిన బాధ్యతలను సక్రమముగా నెరవేర్చడం... ముఖ్యమని అర్ధమగుచున్నది. మన భాగమును దేవునికి చెల్లించడం అంటే ఇదే కదా! “భాగము” [ఫలాలు] కేవలము మన చందాలు, అర్పణలు మాత్రమే కాదు; దీనికన్నా ముందుగా మన జీవితం: “కానుకను పీఠము చెంతనే వదలిపెట్టి, పోయి, మొదట నీ సోదరునితో [సోదరితో] సఖ్యపడి, తిరిగివచ్చి నీ కానుకను చెల్లింపుము” (మత్తయి 5:24). కనుక, “మంచి ఫలము” అనగా దేవునితో మరియు తోటివారితో మన ‘మంచి జీవితము’. మంచి ఫలాలు అనగా, “హృదయ పరివర్తనమునకు తగిన పనులు చేయుట” (మత్తయి 3:8) అని కూడా అర్ధమగుచున్నది. ఇంకొక విషయం: ఫలాలను దేవుడు ఆశిస్తున్నాడు నిజమే! కాని, ఆ ఫలాలే మనకు మరియు ఇతరులకు ఆశీర్వాదకరమైనవిగా మారతాయని తెలుసుకుందాం!

ఫలాలను ఇచ్చుటలో ఎవరు విఫలమైనారు? అన్యులు కాదు. దైవప్రజలే! విషాదకరమైన విషయం కదా! యూదానాయకులు మంచి జీవితమును జీవించుటలో విఫలమయ్యారు. హృదయ పరివర్తనమునకు తగిన పనులు చేయుటలో  విఫలమయ్యారు. అందువలన, వారు దేవునిచేత నిరాకరింప బడినారు. ఫలితముగా, ద్రాక్షాతోట ఇతరులకు ఇవ్వబడినది. దేవుని రాజ్యము వారినుండి తొలగింపబడి తగిన ఫలములనిచ్చు వారికి ఈయబడినది. అప్పుడు యూదులు. ఇప్పుడు క్రైస్తవులు! మంచి ఫలాలను ఫలించు మన మంచి జీవితము ద్వారా, నేడు మనము దైవరాజ్యమును కాపాడుకొను చున్నామా? లేదా ఆనాటి యూదనాయకుల వలె ప్రవర్తించి దానిని మనం కోల్పోవు చున్నామా? ఆత్మపరిశీలన చేసుకుందాం.

ద్రాక్షాతోటను ఇశ్రాయేలు ప్రజలనుండి తీసివేయబడి నూతన ఇశ్రాయేలు అయిన శ్రీసభకు [మనకు] ఇవ్వబడినది. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనకు అప్పజెప్పబడిన దానిని సక్రమముగా, బాధ్యాతాయుతముగా నిర్వహిస్తున్నామా? కనుక, ఈ ఉపమానము నేడు మనకు ఒక హెచ్చరికగా ఉన్నది.

ప్రతి ఒక్కరికి దేవుడు ద్రాక్షాతోటను ఒసగాడు: మన కుటుంబము, సంఘము, పని, ఉద్యోగము...మొ.వి. అన్నియు ఈ ద్రాక్షాతోటలో భాగమే. ఈ ద్రాక్షాతోటలో పనిచేస్తూ, మనం మంచి ఫలాలను ఫలించాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని రాజ్యములో మనలను వారసులను చేయుటకే ప్రభువు వచ్చియున్నాడు. మనం బలవంతముగా తీసుకోవలసిన అవసరము లేదు. యేసు వాగ్ధానమును మనము విశ్వసింప వలెను. దేవుని రాజ్యములో బాధ్యతాయుతముగా మనం పనిచేస్తూ ముందుకు సాగిపోవలెను. కోతకాలమున మనం దేవునకు జవాబు చెప్పవలసి యున్నది.

ఈ ఉపమానము యూదులకు మాత్రమేగాక, నేడు నాకు/నీకు చెప్పబడుచున్నది. నేడు ద్రాక్షాతోటలో కౌలుదారుడను నేను/నువ్వు. నా/నీకోసం ప్రభువు అన్ని సిద్ధం చేసాడు, కనుక నేను/నీవు మంచి ఫలాలను ఫలించి దేవునకు అర్పించవలెను. మనము దేవునకు అర్పించుటకు ఎలాంటి ఫలాన్ని ఫలించు చున్నాము? నేడు శ్రీసభ ఎలాంటి ఫలాలను ఫలిస్తుంది? దైవరాజ్య అనుగ్రహాలను ఇతరులతో పంచుకుంటున్నామా?

ద్రాక్షాతోట ఫలించడానికి సమయం పడుతుంది; బహుశా మూడు-నాలుగు సంవత్సరాలు పట్టవచ్చు. మనము నూతనముగా క్రైస్తవ విశ్వాసులుగా మారినచో, దేవుడు మనలనుండి కొద్దిగానే ఆశించును. కాని, కాలము గడచు కొద్ది, దేవుడు మనలనుండి ఎక్కువగా ఆశించును. దైవాంకిత జీవితములో నున్న వారి నుండి [గురువులు, మఠవాసులు, మఠకన్యలు], ఉపదేశకులనుండి, గుడి/సంఘ పెద్దలనుండి దేవుడు ఎక్కువ ఫలాలను ఆశిస్తాడని అనడములో అర్ధం ఉంది కదా! “ఎవనికి ఎక్కువగా అప్పగింతురో, వానినుండి మరి ఎక్కువగా అడుగుదురు” (లూకా 12:48). యాకోబు 3:1వ వచనాన్ని గుర్తుచేసుకుందాం: “బోధకులమగు మనము ఇతరులకంటె తీవ్రముగా న్యాయవిచారణకు గురి అగుదమని మీకు తెలియును గదా!” అందుకే పౌలు, “భయముతోను, వణుకుతోను మీ రక్షణముకై శ్రమింపుడు” (ఫిలిప్పీ 2:12) అని చెప్పియున్నాడు. దేవుడు దయ, కనికరము, ఒర్పుగలవాడే. కాని ఆయన తీర్పు కూడా అలాగే ఉంటుందని గ్రహించుదాం. అలాగే, మనకు కావలసిన సమస్తమును దేవుడు ముందుగానే సిద్ధము చేసాడని మరువరాదు.

కనుక ప్రియ సహోదరీ, సహోదరులారా! దేవుని రాజ్మయములో మన మంచి క్రైస్తవ జీవితము, ప్రవర్తన ద్వారా, మంచి ఫలాలను దేవునికి కానుకగా, అర్పణగా అర్పించుదాం. దైవరాజ్యము గురించి తెలియని వారికి తెలియచేద్దాం. “మీరు పరస్పరము ప్రేమ కలిగియున్నచో, దానిని బట్టి మీరు నా శిష్యుల్ని అందరు తెలిసి కొందురు” (యోహాను 13:35).

దేవుడు మిమ్ము ఆశీర్వదించును గాక!

వీడియో ప్రసంగము

1 comment: