పోపుగారి సందేశం మీ కోసం ... తెలుగులో...
జగద్గురువులు
పోపు ఫ్రాన్సిస్ గారి సందేశము
వేదవ్యాపక
ఆదివారము 2020
“నేనున్నాను,
నన్ను పంపుడు” (యెషయా 6:8)
ప్రియ సహోదరీ సహోదరులారా,
గత సంవత్సరం
[2019] ప్రత్యేకముగా ప్రకటింపబడిన విశిష్ఠ సువార్తా బోధక అక్టోబరు మాసమును, ప్రపంచ
వ్యాప్తముగా కొనియాడుటకు శ్రీసభ చూపించిన నిబద్ధతకు నేను దేవునకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను.
విశిష్ఠ సువార్తా బోధక మాసమునకు ఎన్నుకొనిన, “బప్తిస్మము పొంది పంపబడినవారు:
క్రీస్తునిచే స్థాపించబడిన శ్రీసభ యొక్క సువార్తా బోధక ఆవశ్యకత” అను అంశము ద్వారా
సూచింపబడిన మార్గము, అనేక సంఘాలను ఉత్తేజ పరచినదని నేను దృఢముగా నమ్ముచున్నాను.
ఈ సంవత్సరము,
కరోన వైరస్ మహమ్మారి వలన, ఎన్నో శ్రమలను, సవాళ్ళను ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట
సమయములో “నేనున్నాను, నన్ను పంపుడు” (యెషయా 6:8) అను యెషయా పిలుపులో పలికిన పలుకులను
ఆదర్శముగా తీసుకొని శ్రీసభ ముందుకు కొనసాగుచున్నది. ఇది “నేనెవరిని పంపుదును?” (యెషయా
6:8) అన్న ప్రభువు ప్రశ్నకు సరికొత్త ప్రత్యుత్తరమై యున్నది. ప్రస్తుతము ఈ ప్రపంచము
ఎదుర్కొంటున్న క్లిష్ట సమయములో, ప్రభువు దయగల హృదయము నుండి వెలువడిన ఈ ఆహ్వానం,
శ్రీసభకు అలాగే సర్వమానావాళికి ఓ పెద్ద సవాలే! “సువార్తలో శిష్యులవలె మనము కూడా
ఊహించని అల్లకల్లోలమగు తుఫానును ఎదుర్కొంటున్నాము. బలహీనులముగా, దిక్కుతోచని వారముగా,
మనమందరము ఒకే పడవలో ఉన్నామని గ్రహించుచున్నాము. అయితే, అదే సమయములో, ముఖ్యమైన
విషయం ఏమిటంటే, ఒకరిని ఒకరము ఓదార్చుకుంటూ, ధైర్యము చెప్పుకుంటూ, ఆ పడవను మనమందరము
కలిసి నడపవలసి యున్నది. శిష్యులవలె ఎంతో ఆతృతతో ఏక కంఠముతో, “మేము
చనిపోవుచున్నాము” (మార్కు 4:38) అని అరుస్తూ, ఒకే పడవలో... మనమందరము కూడా ఉన్నాము.
అలాగే మన గురించి మాత్రమే ఆలోచిస్తే సరిపోదని, అందరము కలిసి చేయగలము, సాధించగలము అని
గుర్తించ గలిగాము” (ధ్యానాంశం, పునీత పేతురు బసిలిక, 27 మార్చి 2020). మనము
నిజముగానే భయపడి పోయాము. బాధ, మరణం మానవాళి బలహీనతను అనుభవించునట్లు చేయును. అదే సమయములో
బ్రతకాలి అనే మనలోని లోతైన కోరిక, చెడునుండి విముక్తిని పొందాలనే ఆశను మనకు
గుర్తుకు చేయుచున్నది. ఈ నేపధ్యములో, సువార్తను బోధించాలి అనే పిలుపు మరియు దైవప్రేమ-సోదరప్రేమను
జీవించాలి అనే ఈ ఆహ్వానం - ఇతరులతో పంచుకొనుటకు, ఇతరులకు సేవచేయుటకు, ఇతరుల కొరకు
ప్రార్ధన చేయుటకు ఇదొక గొప్ప అవకాశముగా మారియున్నది. మనలను మనము ఇతరులకు
ఒసగినప్పుడు, దేవుడు తాను ఒక్కొక్కరికి అప్పజెప్పు ప్రేషితకార్యం మనలను భయమునుండి నడిపించును,
ఆత్మపరిశీలన ద్వారా పునరుద్దరించ బడిన వారముగా మారునట్లు చేయును.
యేసు తన సిలువ
బలి అర్పణ ద్వారా, తన ప్రేషిత కార్యమును పరిపూర్తి చేసి యున్నాడు (చూడుము. యోహాను
19:28-30). దేవుని ప్రేమ మనందరిపై ఉండునని తెలియజేయు చున్నాడు (చూడుము. యోహాను
19:26-27). దేవుడు ప్రేమ స్వరూపి. ఈ ప్రేమ ఎప్పుడు కూడా ఇతరులకు జీవము నొసగును.
కనుక మనము కూడా వ్యక్తిగతముగ సువార్తా బోధనకై ఇష్టపూర్తిగా పంపబడుటకు సిద్ధముగా
ఉండాలని దేవుడు కోరుచున్నారు. దేవుడు మనలను ఎంతగానో ప్రేమించుచున్నాడు కనుక తన
ఏకైక కుమారుడైన యేసును మన మధ్యకు పంపి యున్నాడు (చూడుము. యోహాను 3:16). తండ్రి
ప్రేషిత కార్యమునకై యేసు పంపబడెను. యేసు బోధనా జీవితము, తండ్రి దేవుని చిత్తమునకు
సంపూర్ణ విధేయతను ప్రదర్శిస్తున్నది (చూడుము. యోహాను 4:34; 6:38; 8:12-30; హెబ్రీ
10:5-10). సిలువలో మరణించి ఉత్థానమైన యేసు తన ప్రేషిత కార్యమునకు లేదా సువార్తా
బోధనకు మనలనందరిని ఆకర్షిస్తున్నాడు. శ్రీసభను జీవించునట్లుగా చేయు తన ఆత్మద్వారా,
తన శిష్యులుగా చేసుకొని, ఈ లోకమునకు, తన ప్రజలకు సువార్తా బోధనకై [వేదవ్యాపకము] మనలను
పంపును.
ఈ వేదవ్యాపకము
ఒక ప్రదర్శన లేక ఒక వ్యాపారము వంటిది కాదు. బలవంతముగా చేయునది ఎంత మాత్రము కాదు.
క్రీస్తు శ్రీసభను ముందుకు నడిపించును. వేదవ్యాపకములో, నీవు పవిత్రాత్మచేత నడిపింప
బడుచున్నావు (నేడు లోకములో సువార్తా బోధకులుగా ఉండాలంటే, క్రీస్తు లేకుండా మనము
ఏమీ చేయలేము). దేవుడు మొదటగా మనలను ప్రేమించును. ఈ ప్రేమతో ఆయన మన వద్దకు వచ్చును
మరియు మనలను పిలుచును. దేవుని కుటుంబమైన శ్రీసభలో దేవుని బిడ్డలము అను వాస్తవము
నుండి మన వ్యక్తిగత పిలుపు సంభవించును.
మన జీవితము
దేవుని ఉదారమైన వరము. ఒక విత్తనమువలె ఈ జీవితము దేవుని రాజ్యము కొరకు
వివాహములోగాని, బ్రహ్మచర్యములోగాని దేవుని ప్రేమకు ప్రత్యుత్తరముగా వికసించును.
మానవ జీవితము దేవుని ప్రేమనుండి ఉద్భవించునది, ప్రేమలో ఎదుగునది మరియు దేవుని
ప్రేమవైపు నడచునది. దేవుని ప్రేమనుండి ఎవరుకూడా మినహాయింపబడలేదు. తన కుమారుని
సిలువ మరణముద్వారా, దేవుడు పాపమును, మరణమును జయించెను (చూడుము. రోమీ 8:31-39).
చెడు లేదా పాపమును ప్రేమతో జయించుటకు సవాలుగా ఉండును (చూడుము. మత్తయి 5:38-48;
లూకా 22:33-34). క్రీస్తు పరమ రహస్యములో, దేవుడు తన కరుణద్వారా గాయపడిన మానవాళిని
స్వస్థత పరచును. లోకములో దేవుని ప్రేమకు దివ్యసంస్కారమైన శ్రీసభ, యేసు ప్రేషిత
కార్యమును [సువార్తా బోధనను] కొనసాగించును, అనగా, మనము వేదవ్యాపకమునకై పంపబడు
చున్నాము. మన విశ్వాస సాక్ష్యముద్వారా, సువార్తా బోధనద్వారా, దేవుడు తన ప్రేమను ప్రదర్శిస్తూ,
అన్ని కాలములలో, ప్రతీ చోట, హృదయాలను, మనస్సులను, సంఘాలను, సంస్కృతులను తట్టి
మార్చునుగాక!
వేదవ్యాపకం అనునది దేవుని
పిలుపునకు స్వచ్చంధముగా ఇచ్చు ప్రత్యుత్తరము. అయితే, శ్రీసభలో కొలువైయున్న
క్రీస్తుతో వ్యక్తిగతముగా అనుభూతి పొందినచో మాత్రమే మన పిలుపును కనుగొనగలము,
అర్ధము చేసుకొనగలము. మనలను మనము ప్రశ్నించుకొందాం: వివాహితులుగాగాని, దైవాంకిత
జీవితములో జీవిస్తున్న వారముగాగాని, అనుదిన జీవిత సంఘటనలద్వారా, మన జీవితములోనికి
పవిత్రాత్మ సాన్నిధ్యాన్ని ఆహ్వానించుటకు, సువార్తా బోధనకై పిలుపును ఆలకించుటకు
సిద్ధముగా ఉన్నామా? ఏ సమయములోగాని, ఏ
స్థలములోనికిగాని, కరుణగల దేవునిలో మన విశ్వాసమునకు సాక్ష్యమిచ్చుటకు, యేసు
క్రీస్తులో రక్షణ సువార్తను బోధించుటకు, శ్రీసభను పెంపొందించుట ద్వారా దేవుని
పవిత్రాత్మ జీవితమును పంచుటకై పంపబడుటకు సిద్ధముగా ఉన్నామా? యేసుని తల్లియైన
మరియమ్మవలె, దేవుని చిత్తమును నెరవేర్చుటకు సంపూర్ణ సేవలో ఉండుటకు సిద్ధముగా
ఉన్నామా? (చూడుము. లూకా 1:38). “నేనున్నాను, నన్ను పంపుడు” (యెషయా
6:8) అని చెప్పుటకు అంత:ర్గత స్వేచ్చ ఎంతో అవసరము.
కరోన మహమ్మారి
సమయములో దేవుడు మనతో ఏమి చెబుతున్నాడోయని అర్ధం చేసుకోవడం శ్రీసభ ప్రేషిత
కార్యములో ఓ సవాలే! రోగము, శ్రమలు, భయము, ఒంటరితనము మనలను సవాలు చేయును. ఒంటరిగా మరణించువారి పేదరికం, అనాధలు, నిరుద్యోగులు,
ఆదాయం కోల్పోయినవారు, నిరాశ్రయులు, భోజనము లభించనివారు మనలను సవాలు చేయును. ఈ కరోన వలన సామాజిక దూరమును పాటించుట ద్వారా, ఇంటిలోనే మన
సమయాన్ని ఎక్కువగా గడుపుటద్వారా, సామాజిక సంబంధాలు, కుటుంబ బంధాలు, అలాగే దైవీక
సంబంధాలు ఎంత అవసరమో తెలుసుకుంటున్నాము. పెరుగుచున్న అపనమ్మకము,
ఉదాసీనతల నుండి బయట పడవేసి, ఇతరులతో సంబంధాలను కలుపు కొనుటపై శ్రద్ధను కలుగునట్లు
చేయులా ఈ సమయము మనకు ఉపయోగపడును గాక! ప్రార్ధనలో దేవుడు మనలను తట్టును, మన
హృదయాలను కదిలించును. ఆ ప్రార్ధన మన తోటి సహోదరీ సహోదరుల అవసరాలను మరియు సర్వ
సృష్టిపట్ల మన బాధ్యతను గుర్తించునట్లు చేయునుగాక! దివ్యపూజలో పాల్గొనడానికి కూడలేక
పోయిన సమయములో, ప్రతీ ఆదివారము దివ్యపూజలో పాల్గొనలేక పోయిన అనేక సంఘాలతో మన
అనుభవాలను పంచుకుంటున్నాము. “నేనెవరిని పంపుదును?” అన్న దేవుని ప్రశ్న మరొకసారి
మనముందు ఉంచబడుచున్నది. దీనికి ఉదారమైన, ఆమోదయోగ్యమైన “నేనున్నాను, నన్ను పంపుడు”
(యెషయా 6:8) అను మన ప్రత్యుత్తరము కొరకు ప్రభువు ఎదురు చూచుచున్నారు. పాపము, మరణముల
నుండి రక్షించుటకు, దేవుడు తన ప్రేమకు సాక్ష్యమిచ్చు వారిని ఈ లోకమునకు, సకల జాతిజనుల
యొద్దకు పంపుటకై ఎదురు చూచుచున్నాడు (చూడుము. మత్తయి 9:35-38; లూకా 10:1-12).
ప్రపంచ వేదవ్యాపక
దినమును కొనియాడుటలో, నీవు చేసే ప్రార్ధన, ధ్యానము, ఆర్ధిక సహాయము ఈ వేడుకలో
చురుకుగా పాలుగొనునట్లు చేయును. వేదవ్యాపక ఆదివారమున దివ్యపూజాబలిలో చందా రూపములో
ప్రోగుచేయబడు ధనము, ప్రపంచ మంతట, అందరి రక్షణ నిమిత్తమై, వేదవ్యాపకము చేయువారి
ఆర్ధిక, ఆధ్యాత్మిక అవసరతల సహాయార్ధమై ఉపయోగించబడును.
కన్య మరియ,
వేదవ్యాపక రాజ్ఞి, నిరాశ్రయుల ఆదరువు, కుమారుడు యేసు శిష్యురాలు, మన కొరకు
ప్రార్ధించును గాక!
రోము, పునీత జాన్ లాతరన్, 31 మే 2020, పవిత్రాత్మ పండుగ.
No comments:
Post a Comment