26వ సామాన్య ఆదివారము [YEAR A]
యెహెజ్కేలు
18:25-28; ఫిలిప్పీ. 2:1-11; మత్తయి 21:28-32
దేవుని తోటలో పని
ఉపోద్ఘాతము: క్రీస్తు
నందు ప్రియ సహోదరీ సహోదరులారా! ఈ రోజు మనం 26వ సామాన్య ఆదివారములోనికి
ప్రవేశించి యున్నాము. దేవుడు మనకు అప్పజెప్పిన
పనులను / కార్యాలను మనము చేయాలి, వానిని పరిపూర్తి చేయాలి [దేవుని చిత్తము]. ఈలోకములో
ఒక్కొక్కరము ఒక్కొక్క ఉద్దేశము కొరకు పిలువ బడినాము. మనము ఈలోకములో దుష్క్రియలుగాక
[స్వార్ధపూరిత క్రియలు], సత్క్రియలను [దేవుని చిత్తం] చేయాలి. మన క్రియలకు మనమే
బాధ్యులము! కనుక మన బాధ్యతలను మనము సక్రమముగా నెరవేర్చాలి. ఈనాటి పఠనాలు ఇదే
విషయాన్ని బోధిస్తున్నాయి. దేవుని చిత్తమును నేరవేర్చుటలో క్రీస్తే మన ఆదర్శం: “నన్ను
పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు, ఆయన పనిని పూర్తి చేయుటయే నా ఆహారము” (యోహాను
4:34). కనుక, మనము కూడా స్వార్ధముతోగాక, నిస్వార్ధ బుద్ధితో జీవించాలనేది నేటి
సందేశము.
సువిశేష
పఠనముతో మన ధ్యానాన్ని ప్రారంభిద్దాం:
ఈనాటి
సువిశేష పఠనములో “ఇద్దరు కుమారుల ఉపమానము”ను వింటున్నాము. ప్రభువు ఈ
ఉపమానమును ప్రధానార్చకులకు, పెద్దలను ఉద్దేశించి చెప్పాడు. యేసు [యేరూషలేము] దేవాలయమున
ప్రవేశించి బోధించుచుండగా, ప్రధానార్చకులు, పెద్దలు వచ్చి, “ఏ అధికారముతో నీవు ఈ
పనులు [బోధనలు, స్వస్తతలు, అద్భుతాలు] చేయుచుంటివి? నీకు ఈ అధికారమిచ్చిన వాడెవడు?
అని ప్రశ్నించారు (మత్తయి 21:23). ఈ సందర్భమున, ప్రభువు మూడు ఉపమానములనుచెప్పాడు.
అందులో మొదటిది “ఇద్దరు కుమారుల ఉపమానము.”
ఈ
ఉపమానములో, రెండు వేరువేరు వ్యక్తిత్వాలను [మనస్తత్వాలను] చూస్తున్నాము. ఒక
వ్యక్తిత్వం: ప్రధానార్చకులు, పెద్దలు; మరొకటి: సుంకరులు, జారిణులు. మొదటి కుమారుడు,
ద్రాక్షాతోటలో పని చేయమని తండ్రి పిలచినప్పుడు, మొదట అతడు “వెళ్ళుట నాకిష్టము
లేదు” అని చెప్పినను పిమ్మట తన మనస్సు మార్చుకొని వెళ్ళాడు. ఇతను బలహీనులను,
అవివేకులను, పాపాత్ములను, అన్యులను సూచిస్తున్నాడు. దేవుడు అన్యులను [మనలను] పిలువక
ముందు మొదటి కుమారుని మనస్తత్వమును కలిగియున్నారు. లోకాశలతో జీవించారు. దేవునికి
వ్యతిరేకముగా జీవించారు. మొదటగా అవిధేయించినను, దేవుని వాక్యమును [బాప్తిస్మ
యోహాను ద్వారా, ఆ తరువాత క్రీస్తు బోధనల ద్వారా] ఆలకించి, విశ్వసించి, మారుమనస్సు
పొందియున్నారు.
రెండవ
కుమారుడు మొదట “నేను వెళ్ళుచున్నాను” అని చెప్పియు, ద్రాక్షాతోటలో పనికి వెళ్ళలేదు.
ఇతను కపట వేషదారులను [తమను తాము నీతిమంతులుగా పరిగణించేవారు - యూదులు]
సూచిస్తున్నాడు. గొప్ప వాగ్దానం చేసాడు, కాని దానిని కార్యరూపం దాల్చలేదు,
పాటించలేదు. చేయాలనే ఉద్దేశము కూడా అతనికి లేకుండెను. మాటకు, చేతకు పొంతన లేదు.
చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇలాంటి వారు అబద్ధమాడువారు. ప్రభువు ఇలా అంటున్నాడు:
“సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చెను. దుర్జనుడు తన దుష్కోశము
నుండి దుర్వస్తువులను తెచ్చెను. ఏలయన, హృదయ పరిపూర్ణత నుండి నోటిమాట వెలువడును”
(లూకా 6:45).
ఇక్కడ
గమనించ వలసిన విషయం ఏమిటంటే, ఇద్దరు కుమారులు పాపాత్ములే! ఒకడు అవిధేయించాడు.
ఇంకొకడు చేస్తానన్న పనిని చేయలేదు. మొదటివాడు నోటిమాటతో తండ్రిని బాధపెట్టాడు. రెండవవాడు
తన చేతలతో బాధపెట్టాడు. అయితే, ఇచ్చట “మారుమనస్సు” అన్న మాట చాలా ముఖ్యమైనది.
మానవులమైన మనమందరం పాపం చేస్తాము. కాని, చేసిన తప్పును తెలుసుకొని మారుమనస్సు
పొంది, తప్పును సరిదిద్దుకోవాలని దేవుడు కోరుతున్నాడు. పెద్ద కుమారుడు వెళ్లనని
చెప్పినను, మారుమనస్సు పొంది వెళ్ళాడు. తద్వారా, అతను తండ్రి ఆజ్ఞను పాటించినవాడు
అయ్యాడు. చెడు నుండి మంచికి వచ్చాడు. కాని రెండవ వాడు, ఏవిధముగను, మారుమనస్సు
పొందలేదు. కనుక, మనం ఈలోకములో చేసే పనులు, కార్యాలు దేవుని ఆజ్ఞను పాటించే విధముగా
ఉండాలి.
ప్రధానార్చకులు,
పెద్దలు, పరిసయ్యులు తమ్ముతాము నీతిమంతులుగా పరిగనించుకొనేవారు. దేవుని గురించి
ఎన్నో విషయాలను ప్రజలకు బోధించేవారు. కాని, వారు చేసే పనులు అందుకు విరుద్ధముగా
ఉండేవి. దైవరాజ్యమునకు వారే వారసులు అని భావించేవారు. కాని వారు, సువార్తను
విశ్వసించలేదు. యేసును మెస్సయ్యగా [క్రీస్తుగా] అంగీకరించలేదు. హృదయ పరివర్తన
చెందలేదు. బాప్తిస్మ యోహాను బోధించిన నీతి మార్గమును వారు విశ్వసించలేదు. వారిని
గురించి ప్రభువు సామాన్య ప్రజలతో ఇలా అన్నారు: “ధర్మశాస్త్రబోధకులును,
పరిసయ్యులును మోషే ధర్మశాసనమున కూర్చొని ఉన్నారు. కాబట్టి వారి క్రియలనుగాక వారి
ఉపదేశములను అనుసరించి పాటింపుడు. ఏలయన వారు బోధించునది వారే ఆచరింపరు (మత్తయి 23:1-3).
వారి బోధనలు, ఉపదేశములు అద్భుతముగా ఉన్నాయి, కాని, బోధించిన దానిని వారు జీవించుట లేదు.
కాని, పాపాత్ములు, సుంకరులు, జారిణులు సువార్తను [యేసు] విశ్వసించారు. హృదయ
పరివర్తనము చెందారు. కనుక వీరు ముందుగా, దేవుని రాజ్యములో ప్రవేశింతురు అని
ప్రభువు చెప్పుచున్నారు.
ఈ
ఉపమానములో, కుమారుల వ్యక్తిత్వాలు వేరైనా వారికి తండ్రి ఒక్కడే! అనగా సర్వ
మానవాళికి (క్రైస్తవులు-క్రైస్తవేత్తరులు) దేవుడు [తండ్రి] ఒక్కడే అని
అర్ధమగుచున్నది. ఇరువురికి ఒకే ఆజ్ఞ ఇవ్వబడినది: “కుమారా! నేడు నీవు మన
ద్రాక్షాతోట లోనికి పోయి పని చేయుము.” తల్లిదండ్రులు తమ పిల్లలను సోమరులుగా
పెంచరాదు. మనమందరము దేవునికి వారసులము అయినప్పటికిని, మనము పని చేయవలెనని దేవుడు
ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞ ప్రతి ఒక్కరికి ఇవ్వబడుచున్నది. ఆది తల్లిదండ్రుల అవిధేయత
[పాపము] వలన మనము దేవుని [ద్రాక్షా] తోట నుండి గెంటివేయబడి, కష్ట పడి పని చేయవలసి వచ్చినది.
మరల యేసు క్రీస్తు కృప వలన, దేవుని ద్రాక్షాతోటలో పని చేసే అవకాశమును పొందియున్నాము.
దేవుని ద్రాక్షాతోటలో పనిచేయుటకు మనకు కావలసినది వినయము, విధేయత. ప్రతి
ఒక్కరము కూడా దేవుని పని [చిత్తము] చేయుటకు పంపబడి యున్నాము. తండ్రి తోటలో పని
చేయుట అనగా, మన కొరకు పని చేయటయే కదా!
దేవుడు
మనలను పిలచియున్నాడు. దేవుని పిలుపును మనం అంగీకరించాము. మనము వాగ్ధానము చేసిన
దానిని మనము కార్యరూపము దాల్చాలి. చాలామందిమి మన వాగ్దానాలను జీవించడం లేదు.
దేవుని ఆజ్ఞలను పాటించడం లేదు. దేవునిపై, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తిని చూపడము
లేదు. దేవుని రాజ్యము నుండి దూరముగా వెళ్లి పోవుచున్నాము.
మొదటి
పఠనము: మొదటి పఠనములో “ఎవరి క్రియలకు వారే బాధ్యులు” అని
దేవుడు స్పష్టం చేయుచున్నాడు. ఈ అంశముపై 18వ అధ్యాయం చర్చిస్తున్నది. పాపము
చేసినవాడు[డే] లేదా అపరాధము చేసినవాడు[డే] చచ్చును (18:4, 20). “న్యాయవంతుడు”
ఎవరనగా – దేవుని చట్టములను, విధులను చిత్తశుద్ధితో పాటించువాడు. కనుక అతడు తప్పక
బ్రతుకును. (18:5-9). అయితే, నీతిమంతుడు, వెనుదిరగక, చివరివరకు న్యాయముగా
జీవించవలెను. అతనిని పరీక్షింప ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు, ఇబ్బందులు ఎదురవుతాయి.
తుదిశ్వాస వరకు అతడు వాటికి ఎదురొడ్డి జీవించవలయును. అప్పుడు అతను జీవించును –
అనగా దేవుని రక్షణ పొందును, ప్రభువులో జీవించును. ఇచ్చట మరియ తల్లిని మనం
ఉదాహరణగా, ఆదర్శముగా తీసుకోవచ్చు. ఆమె దేవుని ప్రణాళికకు, చిత్తానికి ‘అవును’ -
“ఇదిగో నేను ప్రభువు దాసురాలను. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక!” (లూకా 1:38) - అని
చెప్పి, తన జీవితాంతము వరకు కట్టుబడి యున్నది. ఏ క్షణమున కూడా ఆమె వెనుదిరగలేదు.
దేవుని చిత్తమును, అనగా ఈలోకములో తనకు అప్పజెప్పబడిన పనిని నూరుశాతం పరిపూర్ణముగా నెరవేర్చినది.
మనకు గొప్ప ఆదర్శ తల్లి అయినది.
అలాగే,
దుష్టుడు దుష్కార్యములకు పాల్పడును కనుక చచ్చును. అనగా, దేవుని రాజ్యమును
కోల్పోవును. అతడి చావునకు అతడే బాధ్యుడు (18:10-13).
అయితే,
తన తప్పులను తెలుసుకొని, పాపము నుండి వైదొలగు వారు చావును తప్పించుకొని
బ్రతుకుదురు. దుష్టుడు, తన పాప కార్యమునుండి వైదొలగి న్యాయసమ్మతమైన మంచి పనులు
చేసిన తన ప్రాణమును కాపాడు కొనును. వ్యక్తిగత బాధ్యత ఎంతో ఉందని అర్ధమగుచున్నది.
మంచికి-చెడుకు మధ్య ఎన్నుకొను నిర్ణయం మనదే! దేవుడు మనకున్న స్వతంత్రమును
గౌరవిస్తాడు. దేవుడు మన మారుమనస్సుకై, హృదయపరివర్తనకై ఎన్నో అవకాశాలను ఇస్తున్నాడు.
వాటిని సద్వినియోగం చేసుకోవాలి.
ప్రియ సహోదరీ సహోదరులారా! మనము
వల్లించే విశ్వాస సత్యాలను మన అనుదిన జీవితములో జీవించాలి లేదా పాటించాలి.
క్రీస్తుపై మన విశ్వాసాన్ని ప్రకటిస్తూ జీవించాలి. దైవ ప్రేమను, సోదర ప్రేమ ద్వారా
జీవించాలి. ఇతరులకు బోధించే దానిని పాటించాలి. ప్రభువు మాటలను గుర్తుచేసుకుందాం:
“ప్రభూ! ప్రభూ! అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు.
కాని పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున
ప్రవేశించును. (మత్తయి 7:21). కనుక, మన బోధనలు, మాటలు, విశ్వాసం సేవారూపం లేదా కార్యరూపం దాల్చాలి.
రెండవ పఠనము: మన పనులను, క్రియలను ఎలా చేయాలి? పౌలు
ఫిలిప్పీయులకు చక్కటి ఆధ్యాత్మికమైన సలహాను ఇస్తున్నాడు: “స్వార్ధముతోగాని,
అహంభావముతోగాని ఎట్టి పని చేయకుడు. వినయాత్ములై ఇతరులను మీకంటె అధికులుగా
భావింపుడు. ప్రతి ఒక్కరు కేవలము స్వార్ధమునే చూచుకొనక, పరస్పరము ఉపకారులై ఉండవలెను”
(ఫిలిప్పీ 2:3-4). అనగా అహంకారము, వివాదాస్పదత, కలహాలు, అసూయ, వాంఛ, కక్షసాధింపులతో
ఏ క్రియ చేయకూడదు. కాగా, మన క్రియలను వినయముతో, అణకువతో చేయాలి. ఇతరులను
గౌరవించాలి. ఇతరులకు ఉపకారము చేయాలి.
స్వార్ధము చాలా భయకరమైనది.
మనలను నాశనం చేయును. స్వార్ధము అనగా స్వయం సంతృప్తి కొరకు లేదా స్వప్రయోజనం [స్వలాభం]
కొరకు అధికముగా తననుతాను ప్రేమించుకొనుట; ఇతరుల హక్కులను, భావాలను విస్మరించడం.
ఇతరులను గౌరవించక పోవడం. స్వార్ధము ‘దేవుని వాక్కు’కు వ్యతిరేకమైనది: “పొరుగువారి
మీద పగతీర్చు కొనకుడు. వైరము పెట్టుకొనకుడు. నిన్నువలె నీ పోరుగువానిని
ప్రేమింపుడు” (లేవీ 19:18). “నిన్ను నీవు ప్రేమించు కొనునట్లు నీ పొరుగువానిని
ప్రేమింపవలెను” (మత్తయి 22:39; యాకోబు 2:8). కనుక, నిస్వార్ధముతో జీవించాలనేది దేవుని కోరిక
[దేవుని వాక్కు].
క్రీస్తు ఆదర్శం [రెండవ పఠనము]: “మీరు అన్ని పనులను సణుగుకొనక, వివాదములు లేకుండ
చేయుడు” (ఫిలిప్పీ 2:14). మనం అనేకసార్లు చెప్పిన పనులను చేయము. ఒకవేళ చేసినను,
సణుగుతూ చేస్తాము. అయిష్టముగా చేస్తాము. తప్పనిసరియై చేస్తాము. కాని చేసేది ఏ
చిన్న పనియైనను, నిస్వార్ధముతో, ప్రేమతో, ఇష్టపూర్వకముగా చేయాలి.
యేసు క్రీస్తు మనకు ఆదర్శం. ఆయన
నిస్వార్ధముగా జీవించాడు. పౌలు రోమీ. 15:3లో ఇలా వ్రాసాడు, “క్రీస్తు తనను తాను
సంతోషపెట్టు కొనలేదు.” అలా చేసి ఉంటె, మనం ఇలా రక్షింప బడిన వారిగా, దేవుని
బిడ్డలముగా ఉండేవారము కాదు. స్వార్ధము దైవస్వభావము కాదు.
“ఆయన దైవ స్వభావము కలిగి
ఉన్నను, దేవునితో తన సమానత్వమును స్వార్ధబుద్ధితో పట్టుకొని వ్రేలాడలేదు. తననుతాను
రిక్తుని చేసుకొని, సేవకరూపమును దాల్చి మానవమాత్రుడుగా జన్మించాడు. అంతకంటే వినయముగలవాడై...విధేయుడాయెను”
(ఫిలిప్పీ 2:6-8).
వినయము అనగా
తననుతాను రిక్తునిగా చేసుకోవడం; తగ్గించు కొనడం; ఏమిలేని వానిగా భావించడం; తండ్రి దేవునిపై
ఆధారపడి జీవించడం; యేసు తండ్రి దేవునిపై ఆధారపడి జీవించాడు. అలాగే వినయము అనగా ఇతరులపట్ల
సేవాభావముతో జీవించడం. యేసు సేవకరూపము దాల్చి తన శిష్యుల పాదాలను కడిగాడు (యోహాను
13).
విధేయత అనగా దేవుని
చిత్తమును నెరవేర్చుటకు తనను తాను సమర్పించు కొనుట;
మరియతల్లివలె, “ఇదిగో నేను ప్రభువు దాసుడను/దాసురాలను. నీ చిత్తము చొప్పున
జరుగునుగాక” అని చెప్పడం. ఎల్లప్పుడూ దేవుని సేవకు అందుబాటులో ఉండటం.
ప్రియ
సహోదరీ, సహోదరులారా! ఆత్మపరిశీలన చేసుకుందాం. నేను [క్రైస్తవుడిగా] ఎలా జీవిస్తున్నాను?
నా అనుదిన పనులు, బాధ్యతల ద్వారా [తల్లిదండ్రులు, పిల్లలు, విద్యార్ధులు,
ఉద్యోగస్తులు, బోధకులు...], నిస్వార్ధముతో దేవుని చిత్తమును నెరవేర్చుచున్నానా?
లేదా స్వార్ధముతో జీవిస్తున్నానా? తోటివారిని ప్రేమిస్తున్నానా? గౌరవిస్తున్నానా?
సాధ్యమైన సహాయం చేస్తున్నానా? లేదా వారిని నిర్లక్ష్యం చేస్తున్నానా?
అవమానిస్తున్నానా? పేదవారిపట్ల నా దృక్పధం ఏమిటి?
దేవుని చిత్తమును తెలుసుకోవాలంటే, దేవుని వాక్యము [బైబులు] చదవాలి, ధ్యానించాలి, మన జీవితానికి అన్వయించుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలి.
జ్ఞానస్నానము పొందిన క్రైస్తవులముగా, జ్ఞానస్నాన వాగ్దానాలను [ పాపత్యజింపు, విశ్వాస ప్రమాణము...] ప్రతిరోజు జీవించాలి.
జ్ఞానవివాహ ప్రమాణాలను [కలకాలము పరస్పర ప్రేమ, బాధ్యతలు, ఒకరినొకరు ప్రేమించుట, గౌరవించుట, కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, సౌఖ్యములోను, ప్రామాణికముగా ఉందునని ఇచ్చిన మాట; పిల్లల పెంపకం...], అలాగే అనుదిన బాధ్యతలను [ఉదా: కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం...] ప్రతిరోజు జీవించాలి.
గురువులు, మఠవాసులు తమ మాటపట్టు ద్వారా చేసిన పవిత్ర వ్రతాలను [పేదరికం, బ్రహ్మచర్యము, విధేయత] ప్రతిరోజు జీవించాలి; వారి అనుదిన జీవితములో అప్పజెప్పబడిన బాధ్యతలను [ఉదా: వాక్యపరిచర్య, బోధన, గురుతర బాధ్యతలు...] పరిపూర్ణముగా, ప్రేమతో చేయాలి.
Nice msg fr tq
ReplyDelete